ఆంధ్రప్రదేశ్‌

ప్రజల్లో ధైర్యం నింపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 19: ప్రజల్లో భయాన్ని కాకుండా ధైర్యాన్ని నింపాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అధికారులకు పిలుపునిచ్చారు. వ్యాధి నివారణకు చర్యలు చేపడుతూనే తీవ్ర భయానికి గురిచేసేలా వ్యవహరించవద్దని సూచించారు. కరోనా వైరస్ నియంత్రణకు వివిధ కీలక చర్యలు చేపడుతున్నట్లు ప్రకటించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై గురువారం ఆయన ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా థియేటర్లు, మాల్స్, జిమ్స్, స్విమ్మింగ్ పూల్స్, ఇండోర్ అమ్యూజ్‌మెంట్ పార్కులు మూసివేయాలని ఆదేశించారు. పెద్ద ఆలయాల్లో నిత్య కైంకర్యాలు కొనసాగిస్తూ భక్తులకు దర్శనాలు నిలిపివేయాలన్నారు. చిన్న ఆలయాలు, మసీదులు, చర్చిలకు కూడా భక్తులు కొన్నాళ్లు వెళ్లడం మానుకుంటే మంచిదని సూచించారు. పెద్దసంఖ్యలో జనం గుమికూడే జాతరలు నిర్వహించకుండా మానుకుంటే మేలన్నారు. హోటళ్లు, రెస్టారెంట్లలో 2 మీటర్ల దూరం నిబంధనను పాటించేలా చూడాలన్నారు. వివాహాది శుభకార్యాలను వీలైనంత తక్కువ మందితో నిర్వహించుకోవాలని, వీలైతే రద్దు చేసుకోవాలని సూచించారు. పబ్లిక్ ప్రదేశాల్లో పెద్దసంఖ్యలో ప్రజలు గుమికూడవద్దన్నారు. ప్రజా రవాణాలో ఉన్న వాహనాల్లో నిరంతరం శుభ్రత పాటించాలని, ఎక్కువ మందిని బస్సుల్లో ఎక్కించుకోవద్దని ఆదేశించారు. నిలబడి ప్రయాణించే పరిస్థితి ఉండకూడదన్నారు. జలుబు, దగ్గు లాంటి లక్షణాలు ఉన్నవారు ప్రయాణాలు మానుకోవాలన్నారు. మార్చి 31వరకూ
ఈ నిర్ణయాలు అమల్లో ఉంటాయని చెప్పారు. వైద్య పరంగా తీసుకోవాల్సిన చర్యలపై నిపుణులైన వైద్యులతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తానని ముఖ్యమంత్రి చెప్పారు. ఇప్పటివరకూ కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, రానున్న 10రోజుల్లో అనుసరించాల్సిన ప్రణాళికపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇంటింటి సర్వే చేయించారా.. అనికూడా ఆరాతీశారు. ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లతో మ్యాపింగ్ చేయించాలని, వలంటీర్లకు యాప్ తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలన్నారు. 50 ఇళ్లకు సంబంధించిన డేటాను ఎప్పటికప్పుడు యాప్ ద్వారా తెలుసుకోవాలన్నారు. డేటా వచ్చాక వైద్య సిబ్బంది అప్రమత్తం కావాలన్నారు. ఫిలిప్పీన్స్ నుంచి 185 మంది విద్యార్థులు వచ్చారని, వారందరికీ పరీక్షలు నిర్వహించామని అధికారులు వివరించారు. కుటుంబ సభ్యులను కూడా కలుసుకునేందుకు అనుమతించ లేదన్నారు. కరోనా కారణంగా వివిధ రంగాలపై పడిన ప్రభావాన్ని కూడా ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. కరోనా ప్రభావం వల్ల మొక్కజొన్న, జొన్న ధరలు తగ్గుతున్నాయని, పండ్ల ధరలు కూడా తగ్గుతున్నాయని అధికారులు తెలిపారు. కరోనా ప్రభావం తగ్గాక ధరలు స్థిరీకరించే అవకాశం ఉందన్నారు. కరోనా భయంతో ప్రజలు ముందుగానే నిత్యాసరాలు కొనుగోలు చేస్తున్నారని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. సమీక్ష సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్నీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్, తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం...కరోనా నియంత్రణ చర్యలపై అధికారులతో సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి