ఆంధ్రప్రదేశ్‌

సున్నా వడ్డీకే రుణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 18: కౌలురైతులకు పంట రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. ప్రస్తుతం ఇస్తున్న రుణాలు ఆశాజనకంగా లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. వైఎస్సార్ నవోదయం పథకం కింద ఎంఎస్‌ఎంఈలకు ప్రధాన మంత్రి ముద్రా యోజన కింద ఇచ్చే రుణాలు, ఎస్సీ, ఎస్టీలు, మహిళలకిచ్చే రుణాల శాతం చాలా తక్కువగా ఉందని అసహనం వ్యక్తం చేశారు. సచివాలయంలో బుధవారం రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడారు. స్వయం సహాయక సంఘాల రుణాల పైనా దృష్టి సారించాలని ఆయన సూచించారు. మహిళలకు వడ్డీరేట్ల విషయంలో బ్యాంకర్లు మానవతా దృక్పథంతో స్పందించాలని స్పష్టం చేశారు. రాష్టవ్య్రాప్తంగా కేటగిరి-1లో ఉన్న 6 జిల్లాల్లో ఒకవిధంగా, మిగిలిన 7 జిల్లాల్లో మరోరకంగా వడ్డీరేట్లు ఉన్నాయన్నారు. బ్యాంక్‌లు వసూలు చేస్తున్న వడ్డీరేట్లు అధికంగా ఉన్నాయని 12.5, 13.5 శాతం వసూలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. వడ్డీరేట్ల విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్నారు. మరోవైపు ప్రభుత్వం తరపున సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో బ్యాంక్‌లు ఈ స్థాయిలో వడ్డీలు వసూలు చేయటం ఏమిటనేది ఆలోచించాలన్నారు. కడప జిల్లాలో మాదిరిగానే బ్యాంక్‌లు డిజిటలైజేషన్ ప్రక్రియను అన్ని జిల్లాల్లో అమలు చేయాలని సూచించారు. గ్రామాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తున్నామని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంత ప్రజలు పట్టణాలపై ఆధారపడే పరిస్థితిని నియంత్రిస్తున్నట్లు తెలిపారు. గ్రామ సచివాలయాలు, విలేజ్ క్లినిక్‌లు, ఇంగ్లీషు మీడియంలో బోధించే పాఠశాల, రైతు భరోసా కేంద్రాలతో గ్రామాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు మండలానికో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మాత్రమే అందుబాటులో ఉందని, ఇకపై
విలేజ్ క్లినిక్‌లు ఏర్పాటు చేయటంతో పాటు వాటిని గ్రామ సచివాలయాలకు అనుసంధానం చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిపారు. గ్రామ సచివాలయాల్లో 11మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, ఆర్‌బీకే (రైతు భరోసా కేంద్రాలు)లో ఇంటర్నెట్ కియోస్క్ అందుబాటులో ఉందన్నారు. కియోస్క్ ద్వారా తమకు కావాల్సిన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలను ఆర్డర్ చేస్తే నాణ్యతా నిర్థారణలతో రైతులకు అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ-క్రాపింగ్‌లో విలేజ్ అగ్రికల్చర్, రెవెన్యూ అసిస్టెంట్లతో వివరాలు నమోదు చేయిస్తున్నామని, ఇందుకోసం ట్యాబ్‌లు అందజేశామని తెలిపారు. ఈ వివరాలను బ్యాంక్‌లతో అనుసంధానం చేస్తామన్నారు. డిమాండ్, సరఫరాను దృష్టిలో ఉంచుకుని ఏ పంటలు వేయాలనే దానిపై రైతుకు ఆర్బీకేల ద్వారా సూచనలిస్తామని చెప్పారు. ఈ-పంటలో నమోదైన వివరాల ఆధారంగా సాగుచేస్తున్న పంటలకు తగ్గట్టుగా బ్యాంక్‌లు రుణాలు ఇచ్చేందుకు అవకాశం ఉంటుందన్నారు. అదేవిధంగా కౌలు రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలు కూడా అందుబాటులో ఉంటాయన్నారు. రెవెన్యూ అసిస్టెంట్ల ద్వారా కౌలురైతు, యజమాని ఇద్దరూ అగ్రిమెంట్‌పై సంతకం చేసి బ్యాంక్ రుణం కోసం అందజేస్తారని తెలిపారు. బ్యాంక్‌లు వారికి ఉదారంగా రుణాలివ్వాలని సూచించారు. రైతులకు పండించిన పంటకు తగిన ధర కల్పించటమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చెప్పారు. తాను ఆశించిన ధర రాకపోతే రైతులు ఆర్బీకే ద్వారా ప్రభుత్వం దృష్టికి తెస్తారని, ధరలేని పక్షంలో ప్రభుత్వమే జోక్యం చేసుకుని మార్కెట్‌లో పోటీ పెంచేలా, రైతులకు కనీస గిట్టుబాటు ధరలు వచ్చేలా చర్యలు తీసుకుంటుందన్నారు. మే 15న రైతు భరోసా అందిస్తామని ప్రకటించారు. మైక్రో ఎంటర్‌ప్రైజెస్ కోసం జూన్‌లో ఓ పథకాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. గుర్తింపు కార్డులతో రూ.10వేల చొప్పున వడ్డీలేని రుణాలు ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. చిరువ్యాపారులు, తోపుడుబండ్ల మీద వ్యాపారాలు చేసుకునేవారు చాలామంది ఉన్నారని, ఇది వారికి ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ‘మాకు కొన్ని కలలు, ఆకాంక్షలు ఉన్నాయి. వాటిని నెరవేర్చేందుకు బ్యాంకర్లు సహకరించాలి’ అని ఆయన కోరారు.
కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం ద్వారా కరవు ప్రాంతాలకు గోదావరి వరద జలాలను తరలించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టిందని ముఖ్యమంత్రి చెప్పారు. రాయలసీమ కరవు నివారణ చర్యల్లో భాగంగా వరద జలాలను తీసుకెళ్లే కాల్వలను విస్తరిస్తున్నామని, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా శ్రీకాకుళం వరకు నీరందిస్తామని వెల్లడించారు. వైఎస్సార్ హయాంలో చేపట్టిన ప్రాజెక్ట్‌లను పూర్తిచేయాల్సిన అవసరం ఉందన్నారు. వాటర్ గ్రిడ్ ద్వారా మంచినీరు అందించాలనేది లక్ష్యంగా చెప్పారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆక్వాకల్చర్ వల్ల నీరు కలుషితమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలో కిడ్నీ బాధితులు సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రజలకు వాటర్ గ్రిడ్ ద్వారా నీటిని అందించేందుకు ముందడుగు వేస్తామన్నారు. వీటికి బ్యాంకర్లు సహకరించాలని జగన్‌మోహన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో నిర్దేశించుకున్న రుణాలు, ప్రగతిని ఆంధ్రా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ జే పకీరస్వామి వివరించారు. 5వేల మంది జనాభాకు పైగా ఉన్న 567చోట్ల సీబీఎస్ బ్యాంకింగ్ సర్వీస్‌లు ప్రారంభించామని, ఐదు కిలోమీటర్ల పరిధిలో బ్యాంకింగ్ సదుపాయం లేని 229 గ్రామాలను మ్యాపింగ్ చేశామన్నారు. ఫిబ్రవరి 8నుంచి 29మధ్య జరిగిన ప్రత్యేక కార్యక్రమం ద్వారా 1.1లక్షల మంది రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు ఇచ్చామని, ఏడాదిలోగా వైఎస్సార్ కడప జిల్లాలో నూరుశాతం డిజిటల్ బ్యాంకింగ్ సదుపాయం కల్పిస్తామన్నారు. ప్రభుత్వం ప్రారంభిస్తున్న 10వేలకు పైగా రైతు భరోసా కేంద్రాల్లో బ్యాంకింగ్ సదుపాయం వుండేలా, బ్యాంక్‌మిత్రలను ఆయా కేంద్రాల్లో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లకు విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ నవోదయం పథకం ద్వారా సమస్యలు ఎదుర్కొంటున్న ఎంఎస్‌ఎంఈలకు అండగా నిలవాలన్నారు. ప్రాథమిక రంగానికి నిర్దేశించుకున్న రుణ పంపిణీ లక్ష్యం రూ. 1,69,200 కోట్లకు గాను డిసెంబర్ నాటికి రూ. 1,18,464 కోట్లు అందజేశామని తెలిపారు. ఇది 70.01 శాతంగా నమోదైందని చెప్పారు. వ్యవసాయ రంగంలో నిర్దేశించుకున్న రూ. 1,15,000 కోట్లకు గాను డిసెంబర్ నాటికి రూ. 83,444 కోట్లతో (72.56 శాతం) రుణాలుగా అందించామని వివరించారు. కౌలు రైతులకు రుణాలందించే విషయమై బ్యాంకర్లు దృష్టి సారించాలన్నారు. 2019 వార్షిక రుణ ప్రణాళికలో నిర్దేశించుకున్న లక్ష్యం రూ. 2,29,200 కోట్లు కాగా, డిసెంబర్ వరకు రూ. 1,73, 625 కోట్లు అందజేశామని తెలిపారు. ఎంఎస్‌ఎంఈలకు రూ. 36వేల కోట్లకు గాను 29,442 కోట్లు పంపిణీ చేశామన్నారు. ఎస్సీ, ఎస్టీలు, మహిళలకు స్టాండప్ ఇండియా కింద ఆర్థిక సాయం చేయాలని లక్ష్యంగా నిర్దేశించామని ఆయన వివరించారు. సమావేశంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ పకీరసామి, ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్, ఆంధ్రా బ్యాంక్ సీజీఎం కేవీ నాంచారయ్య, ఆర్బీఐ జనరల్ మేనేజర్ సుందరం శంకర్, నాబార్డ్ సీజీఎం ఎస్ సెల్వరాజ్, తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం... రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి