ఆంధ్రప్రదేశ్‌

ఈ-పంటలతో మరో మలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: రాష్ట్రంలో ఈ-పంటల విధానం వ్యవసాయ రంగంలో మరో కీలక మలుపు కానుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. ఈ-పంట వల్ల బీమా రిజిస్ట్రేషన్, వ్యవసాయ ఉత్పత్తులకు తగిన ధరలు లభించేందుకు ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకునే వీలు కలుగుతుందన్నారు. ఈ-పంట విధానాన్ని బ్యాంక్‌లకు అనుసంధానం చేయడం ద్వారా సకాలంలో రుణాలు లభ్యం కావటానికి, వేసిన పంటలకు తగ్గట్టుగా రైతులు రుణం పొందటానికి ఉపయోగపడుతుందని చెప్పారు. నాలుగు కీలక బాధ్యతలను రైతుభరోసా కేంద్రాలు నిర్వహించేలా దిశానిర్దేశం చేశారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మంగళవారం సీఎం జగన్‌తో వ్యవసాయ, రెవెన్యూ అధికారులు సమావేశమయ్యారు. ఈ-పంటల విధానాన్ని అధికారులు ముఖ్యమంత్రికి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. గతంలో జరిగిన సమావేశాలను పరిగణనలోకి తీసుకుని ఆండ్రాయిడ్ ఆధారిత అప్లికేషన్ రూపొందించామని తెలిపారు. గ్రామ సచివాలయాల్లో అగ్రికల్చర్ సహా ఇతర అనుబంధ రంగాల బాధ్యతలు నిర్వర్తిస్తున్న అసిస్టెంట్లు ఈ-పంట రిజిస్ట్రేషన్ పరిశీలిస్తారని, వ్యవసాయంతో పాటు ఉద్యానవన, సెరీకల్చర్, పశుదాణాకు సంబంధించిన పంటలు కూడా ఈ రిజిస్ట్రేషన్‌లో ఉంటాయన్నారు. పంటలతో పాటు వెరైటీలను కూడా అప్లికేషన్‌లో పొందుపరుస్తున్నట్లు తెలిపారు. సాగుచేస్తున్న పంట మొదటిదా, రెండు, మూడు
లేదా చేపలు పెంచుతున్నారా? ఉద్యానవన పంటలు వేస్తున్నారా? ఈ పంటల్లో అంతర పంటగా మరేదైనా సాగు చేస్తున్నారా? సమగ్ర వివరాలన్నీ అప్లికేషన్‌లో పొందుపరిచామని సీఎం దృష్టికి తెచ్చారు. రబీ సీజన్లోఈ అప్లికేషన్ ప్రయోగాత్మకంగా పరిశీలన జరిపామన్నారు. వెబ్‌ల్యాండ్ నమోదు సందర్భంగా గతంలో రైతులు ఇబ్బందులకు గురయ్యారని, ఈసారి అలాంటి సమస్యలు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సాగుచేసే ప్రతి రైతు ఈ-పంట కింద రిజిస్టర్ అయ్యేలా చూడాలన్నారు. ఈ-పంట కింద వివరాల నమోదు డేటా బ్యాంక్‌లతో అనుసంధానం చేయాలని, దీనివల్ల సాగుచేసిన పంటలకు తగిన రీతిలో రుణాలు పొందే అవకాశం ఉంటుందన్నారు. రైతులు ఏ పంటలు వేశారనేది ముందుగానే తెలుస్తుంది కనుక సంబంధిత ఉత్పత్తులకు మార్కెట్‌లో ఎలాంటి ధరలు లభిస్తున్నాయో పర్యవేక్షణ చేయటంతో పాటు రైతులు నష్టపోతున్న పరిస్థితుల్లో ప్రభుత్వమే జోక్యం చేసుకుని మార్కెట్‌లో పోటీ పెంచేందుకు రైతుభరోసా కేంద్రాల ద్వారా ప్రయత్నాలు చేస్తుందన్నారు. రైతులు సాగుచేస్తున్న పంటలకు సంబంధించి ముందుగానే కనీస గిట్టుబాటు ధరలు ప్రకటించి ఆ ధర కంటే తక్కువకు రైతులు అమ్ముకునే పరిస్థితిని నియంత్రించేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. రెవెన్యూ, వ్యవసాయ శాఖలు సంయుక్త బాధ్యతగా ఈ-క్రాపింగ్ చేపట్టాలని, దీనిపై స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసిజర్లను రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి వివరించారు. ఈ-క్రాపింగ్ చేసే సమయంలోనే బోర్ల కింద సాగవుతున్న భూములను కూడా గుర్తించాలని, డేటాలో అన్ని విషయాలను పొందుపరచాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు.
రైతుభరోసా కేంద్రాలకు విధివిధానాలు
రైతుభరోసా కేంద్రాల ద్వారా ఏ పంటలు సాగుచేయాలనే విషయమై రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వటంతో పాటు మెరుగైన సాగు పద్ధతుల్లో ఈ కేంద్రాలు శిక్షణ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. సేంద్రీయ, సహజ వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. నాణ్యతతో కూడిన విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు పంపిణీ అయ్యేలా చూడాలని, దీంతోపాటు ఈ-పంట కింద వివరాలు నమోదు చేయాలన్నారు. డిమాండ్, సప్లయిని దృష్టిలో ఉంచుకుని వేయాల్సిన పంటలపై రైతులకు తగిన సూచనలివ్వాలని, ఆ వివరాలను గ్రామ సచివాలయాల్లో పొందుపరచాలని నిర్దేశించారు. నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు రైతులకు అందుబాటులో ఉంచటంలో రాజీపడవద్దని, ఒక ప్రతిష్టాత్మక సంస్థతో థర్డ్ పార్టీ కింద నాణ్యతా నిర్థారణ పరీక్షలు కూడా చేయించాలని స్పష్టం చేశారు. రైతుభరోసా కేంద్రాల్లో ఏర్పాటు చేయనున్న కియోస్క్‌లో ఉంచాల్సిన వివరాలు, డేటాపై శ్రద్ధ చూపాలన్నారు. ఫలానా సమస్య వల్ల పంట దెబ్బతింటోందని రైతు నివేదించిన 24గంటల్లోగా పరిష్కారం చూపాలన్నారు. ఇందుకోసం ఏర్పాటు చేస్తున్న కాల్‌సెంటర్ అత్యంత సమర్థవంతంగా పనిచేయాలని, కాల్‌సెంటర్‌ను అత్యాధునిక పరిజ్ఞానంతో రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. సమావేశంలో వ్యవసాయ, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.