ఆంధ్రప్రదేశ్‌

ఇంత దారుణమా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 15: కరోనా వైరస్ సాకుతో రాష్ట్రంలో ‘స్థానిక’ ఎన్నికలను వాయిదా వేయటం దారుణమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఎన్నికలు నిలిపివేస్తే కరోనా ఆగుతుందా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చెప్పుచేతల్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు ఎన్నికలు నిలిపివేస్తూ మరోవైపు కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ అధికారులను బదిలీ చేసే అధికారం ఎవరిచ్చారని నిలదీశారు. ఆదివారం గవర్నర్‌తో భేటీ అనంతరం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో తొలిసారిగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి విలేఖరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా
నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని, నెల్లూరులో ఒకే ఒక్క పాజిటివ్ కేసు నిర్థారణ కాగా, ప్రస్తుతం ఆ రోగి కూడా కోలుకున్నాడని గుర్తు చేశారు. వైరస్ వ్యాప్తిపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో కానీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కానీ సమీక్ష జరపకుండా వైద్య, ఆరోగ్య శాఖ సీనియర్ ఫంక్షనరీస్ సమాచారం మేరకు ఎన్నికలను వాయిదా వేయటం దుర్మార్గమని ఖండించారు. ఎన్నికల కమిషనర్, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఒకే సామాజిక వర్గం కనుకే వివక్షత ప్రదర్శించారని ఆరోపించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రమేష్‌కుమార్‌ను అప్పట్లో ఎన్నికల కమిషనర్‌గా నియమించుకున్నారని, దీనివల్ల ఈసీ పక్షపాత వైఖరితో విచక్షణ కోల్పోయి నిర్ణయాలు తీసుకున్నారని ధ్వజమెత్తారు. అధికారులు కుల, మత, ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా పనిచేస్తేనే ప్రజల్లో గౌరవం ఉంటుందన్నారు. ఎన్నికల ప్రక్రియ నోటిఫికేషన్ నాటి నుంచి పూర్తయ్యేవరకు విచక్షణతో పనిచేయాల్సి ఉంటుందని, వాయిదా వేసిన తరువాత చిత్తూరు, గుంటూరు కలెక్టర్లు, ఎస్పీలను తప్పించటం అప్రజాస్వామికమన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకు గాను 151 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చామని, 9నెలల తమ పాలనతో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలతో క్లీన్‌స్వీప్ చేసేలా ఆదరించారని తెలిపారు. రమేష్‌కుమార్ బుర్రలో స్పష్టత ఉండాలని విమర్శించారు. విచక్షణాధికారం అనే పదాన్ని ఇటీవలి కాలంలో ముందుకు తేవటం అలవాటుగా మారిందని సీఎం వ్యాఖ్యానించారు. పేదలకు ఇళ్లపట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయిస్తే కలెక్టర్లు, అధికారులకు మెమోలు జారీ చేయటంతో పాటు ఇళ్లస్థలాల ప్రక్రియను పూర్తిగా ఆపేయాలని ఉత్తర్వులివ్వటం అమానుషమన్నారు. స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజారిటీ సాధిస్తోందని, 9వేల పైచిలుకు ఎంపీటీసీ స్థానాలకు గాను 2వేలకు పైగా ఏకగ్రీవంగా విజయం సాధించిందని తెలిపారు. ఈ శుభవార్త ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్‌కు దుర్వార్తగా మారిందన్నారు. దీన్ని జీర్ణించుకోలేని చంద్రబాబు దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారని తెలిసి రమేష్‌కుమార్ ఎన్నికలు నిలిపివేస్తూ నాలుగు పేజీల ఉత్తర్వులు జారీ చేశారని ఆక్షేపించారు. ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు ఎన్నికల సంఘం కార్యదర్శికి కూడా తెలీకుండా గోప్యంగా ఉంచారని ఆరోపించారు. ‘ఎవరో స్క్రిప్ట్ రాశారు. అది ఈసీ వద్దకు వచ్చింది. రమేష్‌కుమార్ చదువుతున్నారు’ అని దుయ్యబట్టారు. పంచాయతీ ఎన్నికలు మొదలైనప్పటి నుంచి చంద్రబాబు అండ్ కో నానాయాగీ చేస్తున్నారని మండిపడ్డారు. రాష్టవ్య్రాప్తంగా 10వేల 243 ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయని, వీటికి 54వేల 594 మంది నామినేషన్లు వేస్తే కేవలం 43చోట్ల మాత్రమే చెదురుమదురు ఘటనలు జరిగాయన్నారు. 2794 మున్సిపల్ వార్డులు, డివిజన్లకు గాను 15వేల 185 మంది నామినేషన్లు వేశారని, 14చోట్ల స్వల్ప సంఘటనలు మాత్రమే చోటుచేసుకున్నాయని వివరించారు. రాష్ట్ర పోలీస్ శాఖ ఎన్నికల నిర్వహణలో నిజాయితీగా పనిచేసిందని ప్రశంసించారు. ఇంతకు ముందెన్నడూ గొడవలు లేకుండానే పంచాయతీ ఎన్నికలు జరిగాయా.. అని ప్రశ్నించారు. చంద్రబాబు రాక్షసక్రీడకు పాల్పడుతున్నారని, అందుకు ఎన్నికల కమిషనర్ వత్తాసు పలుకుతోందని ఆరోపించారు. స్థానిక ఎన్నికల్లో గొడవలు, అల్లర్లు తెలుగుదేశం పార్టీ సృష్టేనని విమర్శించారు. 8చోట్ల హత్యాయత్నం కేసులు నమోదు చేశారని, శాంతిభద్రతల అంశంలో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించారని కితాబిచ్చారు. ఇంతకుముందు జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఏకగ్రీవాలు సాధించలేదా.. అని ప్రశ్నించారు. ఏకగ్రీవాలు కొత్తకాదని, పార్టీల గాలిలో క్లీన్‌స్వీప్ అవుతుంటాయని స్పష్టం చేశారు. గత 9నెలల్లో ప్రజలు హర్షించదగిన పాలన అందించామని, మేనిఫెస్టోలో ఏం చెప్పామో ప్రతి పనీ కార్యరూపం దాల్చేలా అన్నింటినీ నెరవేర్చామని చెప్పారు. ఈ పరిస్థితుల్లో వైసీపీ స్థానిక ఎన్నికల్లో పూర్తి మెజారిటీ సాధిస్తుంటే ఓర్వలేక నిందలు మోపుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు వ్యవస్థలను ఉపయోగించి రాజకీయాలను దిగజార్చుతున్నారని ధ్వజమెత్తారు. మార్చి నెలాఖరులోగా ఎన్నికలు నిర్వహిస్తే 14వ ఆర్థిక సంఘం నిధులు సుమారు రూ. 5వేల కోట్లు రాష్ట్రానికి వస్తాయని, ఎన్నికలు జరక్కపోతే మురిగిపోతాయని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా నిధులు ఎందుకు పోగొట్టుకోవాలనే ఉద్దేశంతో పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమైందని చెప్పారు. చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కాలేదనే కుట్రతో ఎన్నికలు వాయిదా వేస్తే తెలుగుదేశం పార్టీ పరిస్థితి మెరుగవుతుందనే భావనతో నిర్ణయం తీసుకున్నారని, దీనివల్ల మెరుగవటం కంటే ఇంకా ఎక్కువ దిగజారుతుందనేది గ్రహించాలన్నారు. వచ్చే ఏడాది కూడా పంచాయతీ ఎన్నికలు జరక్కపోతే నిధులు వెనక్కు మళ్లుతాయని, ఇది ధర్మమేనా అనేది ఆలోచించాలన్నారు. ఎన్నికల కమిషనర్ ఏకపక్ష నిర్ణయాలను గవర్నర్‌కు వివరించామని, పరిస్థితి ఇదేరకంగా ఉంటే పైస్థాయికి తీసుకెళ్లేందుకు వెనుకాడబోమని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.
*చిత్రం... విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి