ఆంధ్రప్రదేశ్‌

వైసీపీ గూటికి డొక్కా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ఇటీవల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన డొక్కా మాణిక్యవరప్రసాద్ తెలుగుదేశం పార్టీకి సైతం రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు విశాఖకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే రెహ్మాన్, ఆయన భార్య షిరీన్ రెహమాన్ తమ అనుచరులతో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వీరికి వైసీపీ కండువ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ తనపై జరుగుతున్న అసత్య ప్రచారంపై తీవ్రంగా స్పందించారు. వైసీపీలో చేరికకు కారణాలను వివరిస్తూ సహచరులు, శ్రేయోభిలాషులకు డొక్కా మాణిక్యవరప్రసాద్ లేఖ రాశారు. తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి తాను నిరాదరణకు గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో రాజకీయంగా, రాజ్యాంగ పరంగా అవమానాలు ఎదురయ్యాయని తెలిపారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తాను తాడికొండ సీటును ఆశించానని, ప్రత్తిపాడులో ఓటమి తప్పదని మొదటి నుంచి వాదించానని గుర్తు చేశారు. బాపట్ల విషయంలో కూడా అదే జరిగిందన్నారు. అయితే తనకు ప్రత్తిపాడు సీటే ఖరారు చేయటం వల్ల ఓటమి చవి చూడాల్సి వచ్చిందన్నారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో మండలి, శాసనసభ మధ్య తీవ్ర అగాథం ఏర్పడిందన్నారు. పెద్దలసభ, శాసనసభ కలిసి పనిచేస్తేనే రాష్ట్రం పురోభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. తాను ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వైసీపీకి మానసికంగా దగ్గరయ్యానని వివరించారు. మండలి సమావేశాలు వివాదాస్పదంగా జరుగుతున్నందున తన పదవికి రాజీనామా చేశానని తెలిపారు. పెద్దలసభ, శాసనసభ మధ్య సమతుల్యత
దెబ్బతిని ప్రజాస్వామ్య మనుగడకే ముప్పు వాటిల్లిందని ఇలాంటి అనిశ్చిత స్థితిలో మండలిలో భాగస్వామ్యం కారాదని నిర్ణయించుకున్నట్లు వివరించారు. కాగా కొన్ని ప్రసార మాధ్యమాల్లో తనపై అమరావతి జేఏసీ పేరుతో నీతిబాహ్యమైన ఆరోపణలు చేయించారని అలాంటి చౌకబారు విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. తాను ప్రజా సేవకే రాజకీయాల్లోకి వచ్చానని చెబుతూ పార్టీలు తనకు వేదిక మాత్రమే అన్నారు. గతంలోనే వైసీపీలో చేరాలని భావించానని, అనివార్య కారణాల వల్ల టీడీపీ తరుపున పోటీ చేయాల్సి వచ్చిందని గుర్తుచేశారు. వివిధ పార్టీల తరుపున అవకాశాలు వచ్చినప్పటికీ దూరంగా ఉన్నానని తాను ఏ స్థాయిలో ఏ పార్టీలో ఉన్నా తన వ్యవహారశైలి, తీరుతెన్నులు ప్రజలకు తెలుసన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకునే నిర్ణయాలు రాష్ట్ర ప్రయోజనాలను కాంక్షించేవిగా ఉన్నాయని ఆయనకు తన సంపూర్ణ సహకారం అందిస్తానని ప్రకటించారు.

*చిత్రాలు.. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్న డొక్కా, రెహమన్