ఆంధ్రప్రదేశ్‌

రాజధాని కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 8: రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తామంటేనే భూములు ఇచ్చామని, అమరావతి అభివృద్ధి కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసం తాము ప్రాణత్యాగానికైనా సిద్ధమని రాజధాని ప్రాంతానికి చెందిన మహిళలు పేర్కొన్నారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం సందర్భంగా రాజధాని ప్రాంత మహిళా రైతులతో విజయవాడలోని ఓ హోటల్‌లో ఆదివారం సదస్సు జరిగింది. తొలుత రాజధాని ప్రాంత మహిళ ఎ పార్వతి(67) మాట్లాడుతూ తమ భూములు రాజధానిగా అభివృద్ధి చేస్తామంటేనే ఇచ్చామని, ఇప్పుడు మూడు రాజధానులు అంటూ అమరావతిని నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదన్నారు. తుళ్లూరుకు చెందిన శైలజ మాట్లాడుతూ ఎంతోమంది మహిళలను వేధింపులకు గురిచేస్తూ అక్రమ కేసులు బనాయించి ఏడ్పించారని, ఇలాంటి సందర్భంలో మహిళా దినోత్సవం జరుపుకోవడం బాధాకరమని కన్నీరు పెట్టారు. తుళ్లూరుకు చెందిన ఎ శ్రీలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర విభజన తరువాత అమరావతి కేంద్రంగా రాజధాని ఏర్పాటు చేశారని, ఇక్కడ రాజధాని అభివృద్ధి చేస్తే రాష్ట్రం బాగుంటుందని, అలాగే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు కూడా ఉంటుందనే భూములు ఇచ్చామన్నారు. జేఏసీ కన్వీనర్ ఎ శివారెడ్డి మాట్లాడుతూ రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం, న్యాయస్థానాలు అండగా ఉంటాయని భావిస్తున్నామన్నారు. అమరావతి ఉద్యమం రాష్ట్ర సమస్యగా కాకుండా జాతీయ సమస్యగా మారుతోందన్నారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతి ఉద్యమంలో మహిళలు ముందుండి నడిపించారని, పెద్దసంఖ్యలో పాల్గొని నిరసన తెలియజేశారంటూ శుభాకాంక్షలు తెలిపారు. జేఏసీ కోకన్వీనర్ ఆర్వీ స్వామి మాట్లాడుతూ మహిళల పోరాట పటిమ చాలా గొప్పదని, రానున్నకాలంలో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు స్పష్టమైన కార్యాచరణతో సాగుదామని చెప్పారు. అనంతరం రాజధాని ప్రాంత మహిళలను అమరావతి పరిరక్షణ సమితి మహిళా విభాగం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాజధాని ప్రాంత మహిళా రైతులు, అమరావతి పరిరక్షణ సమితి మహిళా జేఏసీ సభ్యులు వీ జ్యోత్స్న, డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ శశిబాల, జేఏసీ సభ్యులు డాక్టర్ వెంకట్, వీ ప్రసాద్ పాల్గొన్నారు.
*చిత్రం...సదస్సులో పాల్గొన్న రాజధాని ప్రాంత మహిళా రైతులు