ఆంధ్రప్రదేశ్‌

మిన్నంటిన లేపాక్షి సంబరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం, మార్చి 7: లేపాక్షి ఉత్సవాలు శనివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు నేతృత్వంలో లేపాక్షి పురవీధుల్లో శోభాయాత్ర సాగింది. విజయనగర సామ్రాజ్య వైభవం, లేపాక్షి చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా చేపట్టిన కార్యక్రమాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలనాటి విజయనగర సామ్రాజ్యంలో వెలసిన కట్టడాలను కళ్లకుకట్టినట్లుగా ఏర్పాటుచేసిన సభావేదిక చూపరులకు కనువిందు చేసింది. గ్రామీణ క్రీడాపోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. లేపాక్షి ఏపీఆర్‌బీసీ పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రధాన వేదిక పక్కన ఏర్పాటుచేసిన ప్రోటోవిలేజ్ ఎంతో ఆకట్టుకుంది. గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా వివిధ స్టాళ్లను ఇక్కడ ఏర్పాటు చేశారు. రాయలసీమ ప్రత్యేక వంటకాలైన జొన్న రొట్టెలు, రాగి సంగటి, ఉగ్గాని, బజ్జీలు, నాటు కోటి పులుసు, వంకాయ కూర తదితర ఆహార పదార్థాలను ప్రజలకు వడ్డించారు. మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాళ్లు, జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో గ్రామ సచివాలయం, వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతు భరోసా కేంద్రం, ఐసీడీఎస్ గ్రామీణ వంటకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉద్యాన, పట్టుపరిశ్రమ, చేనేత జౌళి, బీసీ కార్పొరేషన్, డ్వామా తదితర శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రజలు ఆసక్తిగా తిలకించారు. లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్స్ ఎంపోరియం తదితర స్టాళ్లు కూడా ఆకట్టుకొన్నాయి. దీనికి తోడు విజయనగర సామ్రాజ్యం పాలనను ప్రతిబింబిచేలా ఏర్పాటు చేసిన ప్రోటోవిలేజ్‌లోని కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, మోకులు అల్లడం, పాడి ఆవులు, పాల సేకరణ కేంద్రం, పెరటి కోళ్ల పెంపకం, సోది చెప్పడం, పురాతన దేవాలయం, గడ్డివాము, వడ్రంగి పని, కట్టెల పొయ్యి, గుండు, బండ, రోలు, నులక మంచం, చేనేత మగ్గం, రచ్చబండ, గ్రామీణ ఆటలైన చిల్లాకట్టె, చిలక జోస్యం వంటివి పెద్ద సంఖ్యలో వచ్చిన విద్యార్ధినీ, విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. అదే విధంగా గ్రామీణ క్రీడలు కబడ్డీ, ఇరుసు ఎత్తడం, రాతి గుండు, కర్రసాము, కత్తిసాము, గోలీలాట వంటి ఆటల్లో యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జానపదం, కూచిపూడి, భరతనాట్యం, కోలాటం, దేశభక్తి గీతాలు, నృత్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. లేపాక్షి వైభవాన్ని తిలకించేందుకు హాజరైన ప్రజలకు తాగునీరు, మజ్జిగ, ఉచిత భోజనం వంటి సౌకర్యాలు కల్పించారు. క్రీడాపోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరచిన విజేతలకు బహుమతులను అందచేశారు.
*చిత్రాలు.. లేపాక్షి బసవన్నను పూలతో అలంకరించిన దృశ్యం
* గ్రామీణ కళారూపాలను ప్రదర్శిస్తున్న కళాకారులు