ఆంధ్రప్రదేశ్‌

ఏ అనారోగ్యమైనా.. కరోనా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతలపూడి/పోలవరం, మార్చి 5: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వ్యాధి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రకంపనలు రేపుతోంది. ఏ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినా కరోనా అని ప్రచారం జరుగుతోంది. అలాగే ఇతర దేశాల నుండి వచ్చిన వారికి ఎటువంటి లక్షణాలు లేకపోయినా కరోనా లక్షణాలున్నాయని సందేహం వ్యక్తంచేస్తూ అధికార్లకు ఫిర్యాదుచేస్తున్నారు. అధికార్లు జరిపే పరిశీలనలో చివరకు ఏమీ లేదని తేలుతోంది. జిల్లాలోని చింతలపూడి ప్రభుత్వాసుపత్రిలో కరోనా వ్యాధిగ్రస్థురాలు చేరిందని ప్రచారం జరగడంతో గురువారం ఈ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. చింతలపూడి మండలానికి సరిహద్దులోగల తెలంగాణలోని సత్తుపల్లి ఆర్టీసీ డిపో బస్సు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరు బయలుదేరింది. అయితే బస్సులో విధి నిర్వహణలో ఉన్న మహిళా కండక్టరు జి సీతమ్మకు చింతలపూడి చేరేసరికి వాంతులయ్యాయి. దీనితో ఆమె బస్సును నిలిపి, రహదారి పక్కనే ఉన్న ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. అప్పటికే ఆమె రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. వాంతులు కూడా కావడంతో పరీక్షలు జరిపిన వైద్యులు, వార్డులో చేర్చుకుని, ఆమెకు సెలైన్ ఎక్కించి, చికిత్స చేశారు. అయితే ఆమెకు కరోనా వ్యాధి లక్షణాలున్నాయని, అందుకే ఆమెను అత్యవసరంగా ఆసుపత్రిలో చేర్చుకుని, పరీక్షలు జరిపి, వైద్యంచేస్తున్నారని ప్రచారం మొదలయ్యింది. గంటల వ్యవధిలో ఇది వైరల్‌గా మారడంతో తీవ్ర కలకలం రేగింది. కాగా ఆమెకు ఎలాంటి కరోనా వ్యాధి లక్షణాలు లేవని, జ్వరం, వాంతులు కారణంగా నీరసంగా ఉండటంతో సెలైన్ ఎక్కించామని ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రసూల్ తెలిపారు. ఆమెను ఆసుపత్రి నుండి డిశ్చార్జిచేసి, పంపామని ఆయన తెలిపారు. చికిత్స జరిగేంతవరకు బస్సును నిలిపివేయగా, అనంతరం ఆమె విధులు నిర్వహించుకుంటూ వెళ్లిపోయారు.
అలాగే ఇదే జిల్లాలోని పోలవరం మండలం కొత్త పట్టిసం గ్రామంలో దిగుమతి సుమలత అనే మహిళ రెండు రోజుల క్రితం గల్ఫ్ నుండి రావడంతో ఆమెకు కరోనా లక్షణాలున్నాయని కొందరు అధికార్లకు సమాచారమిచ్చారు. స్పందించిన పోలవరం తహసీల్దార్ నరసింహమూర్తి వైద్యాధికార్లకు సమాచారమివ్వడంతో వారు ఆమె ఇంటికి వెళ్ళి, పరీక్షలు జరిపారు. కరోనా లక్షణాలేవీ ఆమెకు లేవని తేల్చడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
*చిత్రం... చింతలపూడి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళా కండక్టరు