ఆంధ్రప్రదేశ్‌

కోనసీమలో కొబ్బరి ఫుడ్ ప్రాసెసింగ్ కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 3: రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యానవన పంటల సాగులో వినూత్న మార్పులు తీసుకురావాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో హార్టీకల్చర్, సెరీకల్చర్, రైతు భరోసా కేంద్రాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. రాష్ట్రంలో ఉద్యానవన పంటలు, ఉత్పత్తి, ఎగుమతులపై అధికారులు వివరించారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో సాగవుతున్న పంటలు, మార్కెటింగ్‌పై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అరటి, చీనీ, టమోటా, మామిడి, ఉల్లి, కొబ్బరి మార్కెటింగ్‌కు సంబంధించి ప్రతి ఏడాదీ ఏదో రూపంలో రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధరలులేక రోడ్డున పడుతున్నారని, ఈ విషయంలో రైతులకు మేలు జరిగేలా శాశ్వత పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు. ఈ పంటల ఆధారంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అవి ఏర్పాటయ్యే లోగా కోల్డ్‌స్టోరేజ్ సదుపాయాన్ని పెంచుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఏటా ఒక పంటను లక్ష్యంగా నిర్దేశించుకుని మార్కెటింగ్‌కు ఇబ్బందులు లేకుండా కార్యాచరణ అమలు చేయాలన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ, అనుబంధ ఉత్పత్తులపై యూనిట్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఇంకా వివిధ మార్గాల్లో ఆయా పంటలు పండిస్తున్న రైతుల్ని ఆదుకోవాలని వివరించారు. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటైన తరువాత వ్యవసాయం, ఉద్యానవన పంటల సాగులో వినూత్న మార్పులు తీసుకు రావాలన్నారు. ఏయే వంగడాలు సాగు చేయాలనే విషయమై రైతు భరోసా కేంద్రాల ద్వారా అవగాహన కల్పించాలని ఆదేశించారు. కోనసీమ ప్రాంతంలో కొబ్బరి ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని అరటి, అనుబంధ ఉత్పత్తులపై పైలెట్ ప్రాజెక్ట్ చేపట్టాలని నిర్దేశించారు. వ్యవసాయ ఉత్పత్తుల కోసం శాశ్వతంగా సర్ట్ఫికేషన్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఫుడ్ పార్క్ ఏర్పాటు దిశగా అడుగులు వేయాలన్నారు. అరటి అనుబంధ ఉత్పత్తులపై దృష్టి సారించాలన్నారు. పులివెందులలో ఏర్పాటు చేయనున్న వ్యవసాయం, అనుబంధ సంస్థల్లో, అరటి ఉత్పత్తులపై ఒక సంస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. సోలార్ కోల్డ్ స్టోరేజీల ఏర్పాటుపై అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మండలం, నియోజకవర్గం యూనిట్‌గా తీసుకుని ఇలాంటివి చేపట్టాలన్నారు. కొబ్బరి, ఆయిల్‌పాం తోటలపై విస్తరిస్తున్న తెల్లదోమ నివారణపై సమావేశంలో చర్చించారు. ప్రస్తుతం తెల్లదోమ నియంత్రణలో ఉన్నట్లు అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. దీనిపై విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తామని అవసరమైన పురుగు మందులు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ఈ ఏడాది 50వేల టన్నుల పండ్ల ఉత్పత్తుల ఎగమతి లక్ష్యంగా నిర్దేశించుకున్నామని వివరించారు. రైతు భరోసా కేంద్రాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఇప్పటి వరకు 3300 కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయని, మరో 3018 కేంద్రాలను త్వరలో ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. వ్యవసాయ సిబ్బందికి ట్యాబ్‌లు అందజేసినట్లు చెప్పారు. ఈ- క్రాపింగ్ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పంటలకు ప్రకటించిన మద్దతు ధరలపై పోస్టర్లను గ్రామ సచివాలయాలకు పంపారా.. లేదా అనే విషయమై అధికారులను ముఖ్యమంత్రి వివరణ అడిగారు. ప్రతి గ్రామ సచివాలయంలో పంటలకు ప్రకటించిన మద్దతు ధరల పోస్టర్‌ను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా అందించే విత్తనాల్లో నాణ్యతా ప్రమాణాలు ఉండాలన్నారు. మే నెలలో రైతు భరోసాకు సిద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. రైతు భరోసా, అమ్మఒడి పథకాల కింద పెండింగ్‌లో ఉన్న కొద్దిపాటి దరఖాస్తులకు సంబంధించి వెంటనే వెరిఫికేషన్ పూర్తిచేసి, అర్హులైన వారికి వెంటనే నగదు అందించాలన్నారు. ఖరీఫ్ కోసం రైతులు సన్నద్ధమవుతున్నారని ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రసాయన ఎరువులు తగ్గించి, సేంద్రియ ఎరువుల వినియోగం పెరిగేలా రైతుల్ని చైతన్య పరచాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు లేకుండా సకాలంలో చెల్లింపులు జరపాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
*చిత్రం... అధికారులతో సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి