ఆంధ్రప్రదేశ్‌

మా రాజధానిని అడ్డుకోవడానికే మీ యాత్రలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: వెనుకబడిన ఉత్తరాంధ్రలో పాలనా రాజధానిని తీసుకువచ్చి అభివృద్ధికి బాటలు వేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు అవరోధం కలిగించేందుకే టీడీపీ అధినేత యాత్రలు చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు, ఆయన అనుచరులు ఉత్తరాంధ్ర పర్యటన ద్వారా అమరావతికి అనుకూలంగా తప్పుడు ప్రచారం చేసే ఎత్తుగడ వేస్తున్నారన్నారు. విశాఖలో పాలనా రాజధాని ఉత్తరాంధ్ర ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందకుండా అడ్డుకోవాలని చూస్తున్న చంద్రబాబు యాత్రను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. విశాఖలో చంద్రబాబు కాలుమోపకుండా ప్రజా సంఘాలు, స్థానికులు నిలదీయాలన్నారు. విశాఖను రాజధానిగా వద్దనడానికి కారణాలు ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. వివిధ అంశాలపై చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తుంటే, డొంకతిరుగుడు వాదాన్ని వినిపించడం అలవాటేనన్నారు. విశాఖను టీడీపీ నేతలు ఏ విధంగా దోచుకున్నదీ ప్రజలకు తెలుసని, రైతులు సాగుచేసుకుంటున్న భూముల
వివరాలను రికార్డుల్లో తారుమారు చేసి కాజేసిన చరిత్ర టీడీపీ నాయకులదేనన్నారు. ప్రజా చైతన్య యాత్రల తరువాత టీడీపీలో ఒకరిద్దరు కూడా తప్పుకుంటారన్నారు. భూ సమీకరణ కేవలం పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకేనన్న విషయాన్ని తాము మొదటి నుంచి స్పష్టంగా చెపుతున్నామని, అవసరం అయితే రూపాయి ఎక్కువ ఇచ్చైనా రైతులను ఒప్పించి భూములు తీసుకోవాలని సీఎం జగన్ చెపుతున్నారని గుర్తు చేశారు. విజయనగరం జిల్లాలో ఒక్క ఎకరం కూడా భూ సమీకరణ చేయలేదని, అటువంటిది ఏ మొహం పెట్టుకుని యాత్ర చేస్తారని ప్రశ్నించారు. టీడీపీ పాలనలో విజయనగరం ఏ విధంగానూ అభివృద్ధి చెందలేదన్నారు.2014కి ముందు విజయనగరం జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేస్తే తరువాత వచ్చిన టీడీపీ ఎందుకు పక్కనపెట్టిందని ప్రశ్నించారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు మంజూరైతే తమ పార్టీ సానుభూతి పరుల భూములు తప్పించి తాత్సారం చేశారన్నారు. ప్రజలు అమాయకులు కాదని, చైతన్య వంతులయ్యారని, అందుకే జిల్లాలో టీడీపీకి అడ్రస్ లేకుండా చేశారన్నారు. చైతన్య యాత్రలు చేసే ముందు చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు.
ట్రంప్‌తో విందు కూడా రాజకీయమే
చివరకు చంద్రబాబు జగన్‌ను విమర్శించేందుకు అంశాలు దొరక్క ట్రంప్ విందుకు పిలుపు రాలేదంటూ కొత్త రాగం అందుకున్నారన్నారు. దేశంలో 29 రాష్ట్రాలుండగా, కేవలం ఐదారుగురికి మాత్రమే ఆహ్వానాలు అందాయన్నారు. ఒడిశా, పశ్చిమబెంగాల్ సీఎంలకు కూడా ఆహ్వానం అందలేదని తెలుసుకోవాలన్నారు. ఈ అంశంలో ప్రతిపక్ష నేత అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు.
*చిత్రం...విలేఖరులతో మాట్లాడుతున్న మంత్రి బొత్స సత్యనారాయణ