ఆంధ్రప్రదేశ్‌

ఉచిత విద్యుత్‌కు రియల్ టైం దన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 16: వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ పథకం ద్వారా రైతులకు వీలైనంత ఎక్కువ లబ్ధి చేకూర్చేలా డిస్కంలు చర్యలు చేపడుతున్నాయి. ఉచిత విద్యుత్ సరఫరా చేసే నెట్‌వర్క్‌ను బలోపేతం చేసేందుకు ఒక రియల్ టైం పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటుచేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. విద్యుత్ సరఫరా పరిస్థితి రియల్ టైం (ఆన్‌లైన్) వెబ్ సిస్టంలో నిరంతరం పర్యవేక్షిస్తారు. సరఫరాలో ఏవైనా సమస్యలు తలెత్తితే వాటిని రియల్ టైం మానిటరింగ్ ద్వారా తెలుసుకుని సత్వర నివారణ చర్యలు చేపట్టే వీలుంటుంది. విద్యుత్ సరఫరాలో అంతరాయాలను నివారించటంతో పాటు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లతో అధిక లోడ్ సమస్యలు గమనించి వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించేలా పకడ్బందీ వ్యవస్థకు రూపకల్పన జరుగుతోంది. ఈ ప్రతిపాదిత నూతన వ్యవస్థ గురించి డిస్కం అధికారులు ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఆదివారం ఫోన్‌లో వివరించారు. విద్యుత్ సరఫరా వ్యవస్థలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీ రియల్ టైం మెకానిజం ఉండాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయానికి పంపిణీ చేసే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల ద్వారా డిస్కంలు ఏమేరకు విద్యుత్ సరఫరా చేస్తున్నాయో రియల్ టైంలో కచ్చితమైన అంచనా వేసేందుకు సదరు ట్రాన్స్‌ఫార్మర్లకు మీటరింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని కేంద్ర విద్యుత్ శాఖ రాష్ట్రాల డిస్కంలను ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. ఈ మీటరింగ్ స్టేటస్‌ను ప్రతినెలా 5వ తేదీకల్లా ఎలక్ట్రిసిటీ అథారిటీకి పంపాల్సిందిగా ఆదేశించిందని వివరించారు. వ్యవసాయ రంగానికి సరఫరా అయ్యే విద్యుత్‌ను లెక్కించేందుకు ప్రత్యేక వ్యవస్థ ఉండాలని వివిధ రైతు సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయని చెప్పారు. దీనివల్ల వాణిజ్యపరమైన నష్టాలను డిస్కంలు వ్యవసాయ విద్యుత్ ఖాతాలో వేయకుండా నివారించవచ్చని రైతు సంఘాలు విద్యుత్ నియంత్రణ మండలి ఏపీఈఆర్‌సీ బహిరంగ విచారణ వేదికలపై విజ్ఞప్తి చేసినట్లు గుర్తుచేశారు. తాము ప్రతిపాదించిన వ్యవస్థల వల్ల మరమ్మతులకు గురైన ట్రాన్స్‌ఫార్మర్లను రియల్ టైంలో గుర్తించటంతో పాటు వాటిని నిర్దేశిత వ్యవధిలో పని చేయించటం, లేదా వాటి స్థానంలో కొత్తవాటిని అమర్చటం చేయవచ్చని కేంద్ర విద్యుత్ శాఖ సూచించిందని డిస్కం అధికారులు మంత్రికి వివరించారు. వ్యవసాయ వినియోగాన్ని కచ్చితంగా అంచనా వేసేందుకు, ఎనర్జీ ఆడిట్ పక్కాగా నిర్వహించేందుకు ఇది
దోహదపడుతుందని కేంద్రం భావిస్తున్నట్లు తెలిపారు.
ఉచిత విద్యుత్ రైతుల హక్కు
అయితే రైతులకు మేలుచేసే, నాణ్యమైన విద్యుత్ సరఫరాకు దోహదపడే ఎలాంటి ప్రయత్నమైనా తాము స్వాగతిస్తామని మంత్రి బాలినేని స్పష్టం చేశారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పొందడం రైతుల హక్కుగా ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. వ్యవసాయాన్ని ఒక లాభసాటి ఆర్థిక వనరుగా మార్చడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు మార్చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. ఇందులోభాగంగా వ్యవసాయానికి అగ్ర ప్రాధాన్యత ఇవ్వటంతో పాటు భవిష్యత్‌లో రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు ఉచిత విద్యుత్ పథకాన్ని శాశ్వతం చేయాలనే యోచనతో ప్రభుత్వం ఉందన్నారు. విద్యుత్ రంగం తీవ్ర ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సమయంలోనూ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి అత్యంత ప్రజారంజకమైన టారిఫ్ ఆర్డర్‌ను విడుదల చేసిందని ఏపీఈఆర్‌సీ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డిని మంత్రి అభినందించారు. ఏ నెల విద్యుత్ వినియోగం ఆధారంగా ఆ నెల విద్యుత్ బిల్లు చార్జీలు వసూలు చేయటం అనే నూతన విధానం చరిత్రాత్మకమైందని అభివర్ణించారు. దీనివల్ల రాష్ట్రంలోని మొత్తం 1.45 కోట్ల గృహ వినియోగదారుల్లో 99శాతం మంది లబ్ధి పొందుతారని చెప్పారు. అంతేకాక రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా గృహ వినియోగదారులకు కూడా టారిఫ్‌లో రాయితీ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందని, ఇందుకోసం రూ. 1707.07 కోట్ల భారం భరించనుందని తెలిపారు. నెలకు 500 యూనిట్ల కంటే ఎక్కువ వినియోగించే గృహ వినియోగదారులు రాష్ట్రంలో ఒక శాతం కంటే తక్కువ ఉన్నారని, వారికి మాత్రమే కొద్దిపాటి చార్జీల పెంపుదల ఉంటుందని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వ ఐదేళ్ల సబ్సిడీ నామమాత్రం
ఇదిలావుంటే వ్యవసాయానికి రూ. 10,060.65 కోట్లు సబ్సిడీ అందించటం ద్వారా ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకుందని మంత్రి బాలినేని చెప్పారు. వాస్తవానికి 2014-19 మధ్య ఐదేళ్ల కాలంలో గత ప్రభుత్వం కేవలం రూ. 12,634.26 కోట్లు మాత్రమే వ్యవసాయ సబ్సిడీగా విడుదల చేసిందని తెలిపారు. విద్యుత్ సంస్థల నష్టాలు 2014 మార్చి 31నాటికి 7069.25 కోట్లు ఉండగా డిసెంబర్ 2019 నాటికి 33,419.53 కోట్లకు చేరాయని డిస్కంల అధికారులు తెలిపారు. మూలధన వ్యయం, నిర్వహణ వ్యయం కూడా అనేక రెట్లు పెరిగిందన్నారు. దీనిపై మంత్రి బాలినేని స్పందిస్తూ గత ప్రభుత్వం అధిక ధరలకు పునరుత్పాదక విద్యుత్ కొనుగోలు చేయటం వల్ల విద్యుత్ సంస్థలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయని, దీంతో నష్టాల పాలయ్యాయని ఆరోపించారు. ఇలాంటి ఆర్థిక ఒడిదుడుకులు ఉన్నప్పటికీ తమ ప్రభుత్వం వ్యవసాయ, గృహ వినియోగదారులకు భారీగా సబ్సిడీ అందించేందుకు వెనుకాడలేదని స్పష్టం చేశారు. నవరత్నాలు అమల్లో భాగంగా విద్యుత్ శాఖలో వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్టు చెప్పారు. అలాగే చౌక విద్యుత్ సాధనలో భాగంగా ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి బాలినేని వివరించారు.
విద్యుత్ రంగ బలోపేతమే లక్ష్యం
ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ విద్యుత్ సంస్థలు చేసే ప్రతి ప్రయత్నం రాష్ట్రంలో ఆ రంగాన్ని బలోపేతం చేయటంతో పాటు నష్టాలను తగ్గించటం కోసమేనని అన్నారు. అలా వచ్చిన ప్రయోజనాలను వినియోగదారులకు బదలాయించాలనేదే తమ లక్ష్యమని చెప్పారు. ఏపీ ట్రాన్స్‌కో జేఎండీలు కేవీఎన్ చక్రధర్‌బాబు, పీ వెంకటేశ్వరరావు, ఏపీఈపీడీసీఎల్ సీఎండీ నాగలక్ష్మి సెల్వరాజన్, ఎపీఎస్పీడీసీఎల్ సీఎండీ హెచ్ హరనాథరావు, సీపీడీసీఎల్ సీఎండీ జే పద్మ జనార్ధన్‌రెడ్డి, తదితరులు సమీక్షలో పాల్గొన్నారు.