ఆంధ్రప్రదేశ్‌

విచారకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 27: బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న జగన్మోహనరెడ్డి అసెంబ్లీలో శాసనమండలిని రద్దు చేస్తూ తీర్మానం చేయడం అత్యంత విచారకరమని, దీనిని తాము ఖండిస్తున్నామని ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తాను ప్రతిపాదించిన మూడు రాజధానుల బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపారన్న అక్కసుతోనే మండలిని రద్దు చేస్తూ తీర్మానం చేశారని ఆరోపించారు. సోమవారం మంగళగిరి సమీపంలోని ఎన్‌టీఆర్ భవన్‌లో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో శాసనసభలో మండలి రద్దు తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదించడం తదనంతర పరిణామాలపై చంద్రబాబు మాట్లాడారు. మండలిని రద్దు చేసే అధికారం అసెంబ్లీకి లేదని ఆయన అభిప్రాయపడ్డారు. కేవలం రద్దు తీర్మానాన్ని చేసే అధికారమే అసెంబ్లీకి ఉందని తెలిపారు. ఉన్నత ఆశయాలతో ఏర్పడిన శాసనమండలిని రద్దుచేయడం సరికాదని, ఎంతో ముందుచూపుతో రెండు సభల ఏర్పాటుకు రాజ్యాంగ రూపకర్తలు అవకాశం కల్పించారని పేర్కొన్నారు. పెద్దల సభ అవసరం లేదని, విద్యావంతులు, మేధావులంతా శాసనసభలోనే ఉన్నారని ముఖ్యమంత్రి అనడంపై చంద్రబాబు స్పందించారు. వైసీపీ ఎమ్మెల్యేలంతా నేరస్థుల ముఠా అని, వారికున్న ఎమ్మెల్యేల్లో 86 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, అటువంటి నేరస్తుల ముఠాను మేధావులతో పోల్చడం దురదృష్టకరమన్నారు. రాజధానిపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను పునఃసమీక్షించాలని, ప్రజల అభిప్రాయాలను సైతం తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే మూడు రాజధానుల అంశాన్ని శాసనమండలి చైర్మన్ సెలక్ట్ కమిటీకి పంపారని వివరించారు. అయితే తన అహాన్ని దెబ్బ తీశారన్న అక్కసుతో ఏకంగా మండలినే రద్దు చేయమంటున్నారని ఇంతకన్నా దుర్మార్గం మరొకటి లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల పది రాష్ట్రాలు శాసనమండలిని పునరుద్ధరించాలని కోరాయని టీడీపీ అధినేత గుర్తుచేశారు. శాసనసభలో ఆమోదించిన బిల్లులను మండలిలో అడ్డుకుంటున్నారన్న వైసీపీ నేతల వ్యాఖ్యల్లో ఏ మాత్రం నిజం లేదని స్పష్టంచేశారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ తెచ్చింది తామేనని, ఈ బిల్లుపై కేవలం సవరణలను మాత్రమే కోరామన్నారు. ఆంగ్ల మాధ్యమాన్ని టీడీపీ వ్యతిరేకించిందంటూ లేనిపోని ఆరోపణలు సృష్టించి ప్రజలను తప్పుదారి పట్టించేలా చేశారని, అయితే
మాతృభాషను కాపాడుకోవాలని మాత్రమే స్పష్టం చేశామన్నారు. మాధ్యమాన్ని ఎంచుకునే అవకాశం తల్లిదండ్రులకు కల్పించాలని బిల్లులో సవరణలు సూచించామన్నారు. శాసనమండలి నిర్వహణకు ఏటా 60 కోట్ల రూపాయలు ఖర్చవుతోందని ముఖ్యమంత్రి జగన్ చెప్పడాన్ని చంద్రబాబు ఖండించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇంటి సౌకర్యాల నిమిత్తం ముఖ్యమంత్రి జగన్ సుమారు 40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని ఆరోపించారు. ప్రతి అంశాన్నీ రాజకీయంగా ఆలోచిస్తున్న వైసీపీ ప్రభుత్వ పెద్దలు చివరకు మండలి తీర్మాన రద్దుకు సంబంధించి నిర్వహించిన ఓటింగ్‌లోనూ నాటకాలు ఆడారని మండిపడ్డారు. మొదట శాసనసభలో సభ్యులను లెక్కించిన స్పీకర్ 121 మంది ఉన్నట్లు చెప్పారని, అయితే తర్వాత 133 మంది ఉన్నట్లు చెప్పి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేశారన్నారు. మండలిలో వికేంద్రీకరణ బిల్లును ఆమోదించుకోవాలని అన్ని ప్రయత్నాలు చేశారని, 22 మంది మంత్రులు మండలిలో ఉండి ఎన్ని అడ్డదారులు తొక్కారో అందరికీ తెలుసన్నారు. మండలి చైర్మన్ షరీఫ్‌ను అన్ని విధాలా ఇబ్బందులు పెట్టారని, కేసులు, ఆర్థిక ఇబ్బందులతో ఉన్న ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలను ఇబ్బందులు పెట్టిన విషయం వాస్తవం కాదా? అంటూ నిలదీశారు. ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాథ్‌రెడ్డి, డొక్కా మాణిక్య వరప్రసాద్‌ను ప్రలోభపెట్టింది వాస్తవం కాదా? అంటూ ప్రశ్నించారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్సీల్లో చాలా మందికి కోట్లాది రూపాయలు ఇస్తామని ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం చేసి, ఇప్పుడు విలువల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ‘ మీ ప్రలోభాలకు లొంగకుండా ఉన్న మా ఎమ్మెల్సీలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని, రాష్ట్ర ప్రయోజనాలు, భావితరాల భవిష్యత్తు కోసం వారు నిలబడ్డారు’అని బాబు ప్రశంసించారు. విలేఖరుల సమావేశంలో గతంలో మండలిపై దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు.

*చిత్రం... విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతున్న చంద్రబాబు