ఆంధ్రప్రదేశ్‌

మూడు రాజధానులకు ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 20: మూడు రాజధానుల ఏర్పాటు అంకం చివరి దశకు చేరుకుంది. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, రాజధానిపై జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ నివేదికలపై గత కొద్ది రోజులుగా ఆధ్యయనం చేసిన హైపవర్ కమిటీ సమర్పించిన నివేదికను రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించింది. సోమవారం శాసనసభ సమావేశాల ప్రారంభానికి ముందు సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన
మంత్రివర్గ సమావేశం జరిగింది. సమావేశంలో హైపవర్ కమిటీ నివేదికపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం కమిటీ చేసిన ప్రతిపాదనలపై రూపొందించిన బిల్లును వెనువెంటనే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి శాసనసభలో ప్రవేశ పెట్టారు. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు మంత్రిమండలి సమావేశం ఏర్పాటై 9.55కు ముగిసింది. అనంతరం గంటసేపు బీఏసీ సమావేశంలో శాసనసభ సమావేశాలపై చర్చించారు. ఉదయం 11 గంటల నుంచి సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాజధాని తరలింపు కోసమే నిర్వహిస్తున్న సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు లేకుండానే ముందుగా వికేంద్రీకరణకు సంబంధించిన బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ‘రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పాలనాపరమైన రాజధానులతో పాటు ప్రాంతీయ ప్రణాళిక, అభివృద్ధి బోర్డులను ఏర్పాటు చేసేందుకు నిర్దేశించిన వికేంద్రీకరణ బిల్లు-2020పై సభలో చర్చించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి వికేంద్రీకరణకు నిర్దేశించిన ఈ బిల్లు ఆమోదం పొందిన వెంటనే అమల్లోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. శాసన రాజధానిగా అమరావతి, పాలనా రాజధానిగా విశాఖ, న్యాయ రాజధానిగా కర్నూలును ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతి, విశాఖ, కర్నూలు నగరాలను మెట్రోపాలిటన్ అభివృద్ధి ప్రాంతాలుగా పరిగణిస్తారు. ‘ఏపీ మెట్రోపాలిటన్ ప్రాంత, పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థల చట్టం-2016లోని 5వ చట్టం ప్రకారం వ్యవస్థలు ఏర్పాటవుతాయి. మూడు రాజధానుల్లో రాష్ట్ర సంస్థలు, ప్రభుత్వ శాఖలు అందుబాటులో ఉంటాయి. శాసనమండలి అమరావతిలోని శాసనపరమైన రాజధానిలో అంతర్భాగంగా ఉంటుంది. రాజ్‌భవన్, సచివాలయం, ప్రభుత్వ శాఖల శాఖాధిపతి కార్యాలయాలు పాలనా రాజధాని విశాఖలో ఏర్పాటవుతాయి. ఇక శాసనాల కింద ఏర్పాటయ్యే న్యాయపరమైన సంస్థలతో పాటు రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం కర్నూలుకు తరలిస్తారు. ఇతర ప్రాంతాల్లో బెంచ్‌లను అవసరం మేరకు ఏర్పాటు చేస్తారు. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు నేపథ్యంలో తలెత్తిన గందరగోళ పరిస్థితులు, 1969 నుంచి జరిగిన తెలంగాణ ఆందోళన, 1971లో జై ఆంధ్ర ఉద్యమాల అనంతరం విభజనతో అవశేష రాష్ట్రంగా మారిందని, అన్ని ప్రాంతాల ప్రజలను సాంస్కృతికంగా, మానసికంగా సంఘటిత పరచటంలో, అభివృద్ధి ఫలాలు అందించటంలో గత ప్రభుత్వాలు వైఫల్యం చెందిన నేపథ్యంలో బిల్లుకు రూపకల్పన చేసినట్లు ఆర్థిక మంత్రి బుగ్గన వివరించారు. విభజన అనంతరం రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రాజధాని నిర్మాణంలో శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులను పరిగణనలోకి తీసుకోనందున అనేక వివాదాలకు దారి తీసిందన్నారు. ఇతర ప్రాంతాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తూ రాజధాని ప్రాంతానికే ఆర్థిక వనరులు కేంద్రీకరించటంతో అసమానతలు చోటు చేసుకుంటున్నాయని ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 13 జిల్లాల సమగ్ర అభివృద్ధి, వికేంద్రీకరణపై ప్రభుత్వం మూడు కమిటీలను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. బిల్లు ప్రకారం రాష్ట్రంలో జోనల్ వ్యవస్థ త్వరితగతిన అందుబాటులోకి వస్తుంది. జోన్లకు సంబంధించిన సరిహద్దులు నిర్ణయిస్తారు. జోన్లు, ప్రాంతీయ ప్రణాళిక , అభివృద్ధి బోర్డులు ఏర్పాటవుతాయి. ప్రభుత్వ అధికారులు జోన్ల నిర్వహణపై సమాచారాన్ని సేకరిస్తారు. జోన్‌కు సంబంధించి అభివృద్ధి ప్రణాళికలు రూపొందించటం పర్యవేక్షణ, అమలు బాధ్యతలు నిర్వహిస్తారు. ప్రతి జోన్‌లో అభివృద్ధి ప్రణాళికలపై సమీక్ష జరుపుతారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని వేగవంతం చేయటం, అందుకు అవసరమైన ప్రత్యేక సిఫార్సులను జోనల్ బోర్డు ప్రభుత్వానికి సమర్పిస్తుంది. మొత్తంగా వీటిని మూడు రాజధానుల పరిధిలో నిర్వహించే సమావేశాల్లో చర్చించిన అనంతరం అభివృద్ధి నమూనాలు, నిధుల కేటాయింపు జరుపుతారు. రాజధానులకు సంబంధించి మూడు ప్రాంతాలు వేర్వేరు సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అభివృద్ధి పరిణామాలు కలిగి ఉన్నాయి. ప్రాంతీయ అసమానతలు, నమూనా అభివృద్ధి లేకపోవటం వల్ల అశాంతికి తీస్తున్నాయని జనాభాలోని వివిధ వర్గాల మధ్య సమాన అభివృద్ధిని కోల్పోయామనే తీవ్ర భావనను కలుగజేస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. వివిధ ప్రాంతాల్లోని ప్రజల సామాజిక, ఆర్థిక, ప్రగతి ఫలాలను సమానంగా అనుభవించేలా పర్యవేక్షించేందుకు బిల్లులో అనేక అంశాలు పొందు పరిచారు. పరిమిత ఆర్థిక వనరులు, ద్రవ్య సాధనాలను దృష్టిలో ఉంచుకుని 217 చదరపు కిలోమీటర్లలో ఓ చిన్న ప్రాంతానికి (అమరావతికి) పెద్దఎత్తున నిధుల వినియోగం శ్రేయస్కరం కాదని హైపవర్ కమిటీ సూచనల ఆధారంగా బిల్లుకు రూపకల్పన జరిగింది.
'చిత్రం...అసెంబ్లీలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి