ఆంధ్రప్రదేశ్‌

రైతుకు రొక్కం.. అభివృద్ధికి భరోసా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, అక్టోబర్ 15: చెప్పినదాని కన్నా ముందుగా, మాట ఇచ్చిన దాని కన్నా మిన్నగా వైఎస్‌ఆర్ రైతు భరోసా పథకానికి మరిన్ని మెరుగులు దిద్ది రైతులకు మరింత లబ్ధిచేకూర్చాలని భావించి సహాయాన్ని రూ.13,500ల పెంచి, ఐదేళ్లపాటు రైతులకు అందించబోతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. అభివృద్ధి అనేది జీడీపీ లెక్కల్లో ఉండదని, ప్రతి రైతు కుటుంబంలో ఆనందం నెలకొనడమే నిజమైన అభివృద్ధికి కొలమానమని ఆయన పేర్కొన్నారు. మంగళవారం నెల్లూరు జిల్లా కాకుటూరు వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్‌ఆర్ రైతు భరోసా పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ ఆహార దినోత్సవానికి ఒక రోజు ముందు నెల్లూరు జిల్లా వేదికగా ఎంతో ప్రతిష్టాత్మకమైన వైఎస్‌ఆర్ రైతు భరోసా పథకానికి శ్రీకారం చుట్టామన్నారు. తన పాదయాత్రలో రైతులు పడుతున్న అవస్థలన్నీ కళ్లారా చూశానని, వాళ్ల బాధలు విన్నానని, అప్పుల బాధలు తాళలేక బలవన్మరణాలకు పాల్పడిన రైతన్నల గాథలు తనను ఎంతో కలచివేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఒక హెక్టారు కంటే తక్కువ భూమి కలిగిన రైతులు 70శాతం వరకూ ఉన్నారని, వారందరిని ఆదుకునేందుకే తాను 2017 మంగళగిరిలో జరిగిన తమ పార్టీ ప్లీనరీలో ఈ పథకాన్ని ప్రకటించానని గుర్తుచేశారు. నాడు హామీనిచ్చిన దానికన్నా ముందుగా, మరింత మెరుగ్గా రైతులకు అధిక మొత్తాన్ని అందిస్తున్నామని జగన్ స్పష్టం చేశారు. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రూ.7,500, అక్టోబర్‌లో రూ.4,000 మిగిలిన రూ.2వేలు సంక్రాంతి పండగకు రైతులకు అందించనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో 43లక్షల మంది సాధారణ రైతులు ఉన్నట్లు సాధికార సర్వేలో లెక్కలు తేల్చారని, అయితే తాము మరింత పారదర్శకంగా సర్వే చేపట్టి 51 లక్షల మంది రైతులను అర్హులుగా గుర్తించామన్నారు. వీరికి అదనంగా మరో 3 లక్షల మంది కౌలు రైతులకు కూడా సహాయాన్ని అందిస్తున్నామని, వెరసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 54 లక్షల మంది రైతులు రైతు భరోసా పథకం కింద లబ్ధిదారులుగా మారబోతున్నారని పేర్కొన్నారు. అలాగే రైతులకు పగటిపూట 9 గంటల పాటు ఉచిత విద్యుత్ అందించాలని నిర్ణయించామని, దీనిపై అధికారులతో సమీక్షిస్తే రాష్ట్రంలో 60శాతం ఫీడర్ల పరిధిలో విద్యుత్ అందించేందుకు అన్ని సదుపాయాలు ఉన్నాయని, మరో 40 శాతం ఫీడర్లలో వౌలిక సదుపాయాలు లేవని తెలిపారన్నారు. ఇందుకోసం వెంటనే రూ.1740కోట్ల నిధులను మంజూరు చేశానని, దీంతో వచ్చే ఏడాది జూలై నాటికి రాష్ట్రంలోని అందరూ రైతులకు పగటిపూట 9 గంటల పాటు నిరంతరాయంగా ఉచిత విద్యుత్ అందించబోతున్నట్లు ప్రకటించారు.
రైతులకు అందిస్తున్న భరోసా సహాయంతో పాటు ఇతర అవసరాల నిమిత్తం వడ్డీ వ్యాపారుల బారిన పడకుండా వారిని ఆదుకునేందుకు వైఎస్‌ఆర్ సున్నా వడ్డీ పథకానికి త్వరలో శ్రీకారం చుడుతున్నట్లు జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఈ ఏడాదే ఈ పథకాన్ని ప్రారంభిస్తామని, రుణం తీసుకున్న రైతులు ఏడాదిలోగా తిరిగి చెల్లిస్తే అందుకు సంబంధించిన వడ్డీని ప్రభుత్వమే బ్యాంకుల చెల్లించే ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. అలాగే గ్రామ
సచివాలయాల మాదిరిగానే ప్రతి గ్రామంలోనూ ప్రభుత్వ ఆధ్వర్యంలో రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులను అందుబాటులో ఉంచేలా దుకాణాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రతి మండల కేంద్రంలో గిడ్డంగులు, శీతలీకరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. రెండు నియోజకవర్గాలను ఒక యూనిట్‌గా తీసుకొని అక్కడ అవసరమైన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పేందుకు పరిశీలన జరుపుతామన్నారు. పంటబీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుందని, పశునష్టానికి పరిహారం కూడా అందిస్తామని హామీనిచ్చారు. తాను అధికారం కోసం రాలేదని, ప్రజలకు సేవ చేసేందుకు వచ్చానన్నారు. నెల్లూరుకు తాను రాగానే వర్షం ఆహ్వానం పలికిందని, మంచివారికి ప్రకృతి కూడా సహకారం అందిస్తుందన్నారు.
నవంబర్ 15 వరకు రైతు భరోసా
అర్హులైనప్పటికీ లబ్ధిపొందని వారు గ్రామ కార్యదర్శులు, మండల అధికారుల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, ఆన్‌లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకునేందుకు రెండు రోజుల్లో వెబ్‌సైట్ ఓపెన్ చేస్తామని స్పష్టం చేశారు. అర్హులైనప్పటికీ సహాయం అందనంత మాత్రాన చింతించక్కర్లేదని, ప్రతి బుధవారం తిరిగి అప్‌డేట్ చేస్తామన్నారు. ఇది నవంబర్ 15వ తేదీ వరకూ కొనసాగే ప్రక్రియ అని ఆయన స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్క రైతుకు వైఎస్‌ఆర్ రైతు భరోసా అందిస్తామని హామీనిచ్చారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ దేశం మొత్తం జగన్మోహన్‌రెడ్డి వైపు నేడు చూస్తోందన్నారు. గతంలో పనిచేసిన ముఖ్యమంత్రులంతా సిఇఓలుగా ఉండాలని తాపత్రయ పడ్డారని, జగన్మోహన్‌రెడ్డి మాత్రం రైతుల గుండెల్లో ఉండాలని కోరుకుంటున్నారని కొనియాడారు. వ్యవసాయ రంగాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తమకు సూచనలు, ఆదేశాలిస్తూ రైతు సుభిక్షం కోసం ఆయన కృషి చేస్తున్నారని అన్నారు.
రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి పి.అనిల్‌కుమార్‌యాదవ్ మాట్లాడుతూ గత దశాబ్దకాలంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో జలాశయాలన్నీ జలకళను సంతరించుకున్నాయని తెలిపారు. రాష్ట్రంలోని పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని హామీనిచ్చారు. అంతక్రితం వైఎస్‌ఆర్ రైతు భరోసా పథకం కింద రూ.5,510 కోట్లు చెక్‌ను అందచేశారు. అదే వేదికపై రైతుల ఖాతాలో జమచేసేందుకు ఆయన ఆమోదం తెలిపారు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి మేకతోటి సుచరిత, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, నెల్లూరు, తిరుపతి ఎంపీలు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, బల్లి దుర్గాప్రసాద్‌రావు, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, రాష్ట్ర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

*చిత్రం....రైతు భరోసా పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి జగన్