ఆంధ్రప్రదేశ్‌

‘అమరావతి’ని ముంచేందుకే వరద సృష్టించారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఆగస్టు 20: ఆంధ్రుల రాజధాని అమరావతిని ముంచేందుకే రాష్ట్ర ప్రభుత్వం కృత్రమ వరదను సృష్టించిందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు తీవ్రమైన ఆరోపణలు చేశారు. వరద కారణంగా కృష్ణాజిల్లాలో ముంపునకు గురైన ప్రాంతాల్లో మంగళవారం చంద్రబాబు నాయుడు విస్తృతంగా పర్యటించారు. కృష్ణా కరకట్ట వెంబడి విజయవాడ తూర్పు, పెనమలూరు, పామర్రు, అవనిగడ్డ నియోజకవర్గాల్లోని ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ప్రభుత్వంపై విమర్శలు వర్షం గుప్పించారు. ప్రపంచంలోనే అత్యద్భుతమైన ఐదు నగరాల్లో సరసన అమరావతిని నిలిపేందుకు తాను ఓ ప్రణాళికాబద్ధంగా వెళితే ప్రస్తుత ప్రభుత్వం దురుద్దేశ్యంతో అమరావతిని వరద ముంపునకు గురి చేసే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. కేవలం తన మీద కోపంతో, అమరావతి మీద ఈర్ష్యతో కృత్రిమ వరద సృష్టించి అపార నష్టానికి ప్రభుత్వం కారణమైందని విమర్శించారు. విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి అద్భుతమైన రాజధాని నిర్మాణానికి తాను శ్రీకారం చుడితే జగన్ తన స్వార్థ రాజకీయాల కోసం రాజధాని నిర్మాణ పనులను నిలిపి వేశారన్నారు. ఆంధ్రుల జీవనాడి పోలవరం, రెండు తెలుగు రాష్ట్రాలకు కీలకంగా మారనున్న బందరు ఓడరేవు నిర్మాణాన్ని కూడా నిలిపి వేసిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ముందు చూపుతో నిర్మించిన పట్టిసీమను కూడా పక్కన పెట్టే పరిస్థితులు తీసుకు వచ్చారన్నారు. రాజధాని అమరావతి విషయంలో జగన్ ప్రభుత్వం దుర్మార్గపు చర్యలకు పాల్పడుతోందన్నారు. అమరావతి విషయంలో పునరాలోచన చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు 33వేల ఎకరాల భూమిని స్వచ్చందంగా ఇచ్చిన రైతుల త్యాగాన్ని కాలరాయడమేనన్నారు. ముంపు సాకు చూపి అమరావతిని పక్కన పెట్టే ఆలోచన చేస్తున్నారని దుయ్యబట్టారు. రాజధాని తరలింపును ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుంటామని హెచ్చరించారు. వరద విషయంలో సీడబ్ల్యుసీ లెక్కలను ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. రెండు మూడు లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేసి ఉంటే వరద వచ్చేది కాదు కదా అని ప్రశ్నించారు. అలా కాకుండా నీటినంతా నిల్వ పెట్టి ఒక్కసారిగా 8 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం వల్లే వరద ముంచుకువచ్చిందన్నారు. ఫలితంగా వేలాది మంది ప్రజలు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారన్నారు. లక్షలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందన్నారు. ఇప్పటికైనా అమరావతి రాజధాని విషయంలో దుర్మార్గపు ఆలోచనలు మానుకోవాలన్నారు. లేని పక్షంలో ప్రజల ఆగ్రహానికి గురి కాక తప్పదని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.
నా మీద కోపంతో ప్రజలను ముంచేశారు
నా మీద ఉన్న కోపం ప్రజల మీద చూపిస్తారా.. నా ఇంటిని ముంచేందుకు ఇంత మందిని నిరాశ్రయులను చేయాలా.. లక్షలాది ఎకరాలను వరదపాలు చేస్తారా.. జగన్ ప్రభుత్వానికి ఇది సరైన పద్ధతేనా.. అని చంద్రబాబు ప్రశ్నించారు. కృష్ణాజిల్లాలోని వరద ముంపునకు గురైన ప్రాంతాలను సందర్శించటంతో పాటు నిరాశ్రయులను, బాధితులను పరామర్శించి తోడుగా నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. అలాగే వరద కారణంగా నీట మునిగిన పంట పొలాలను చూసి ప్రతి రైతుకీ పరిహారం అందేలా ప్రభుత్వంతో పోరాడతానని హామీ ఇచ్చారు. ఎగువ రాష్ట్రాల నుండి వరద హెచ్చరికలు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే నేడు ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. వరద నీటి నిర్వహణ కూడా చేయలేని అసమర్థ ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. నా ఇంటిని ముంచే క్రమంలోనే మీ ఇళ్లను ముంచేశారని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎన్ని కుట్రలు పన్నినా తన ఇల్లు వరద నీటిలో మునగలేదన్న బాధ మంత్రుల్లో కనిపిస్తోందన్నారు. ఎక్కడిక్కడే నీటి నిల్వ ఉంచి ఒక్కసారిగా వదిలి వేయటం వల్లనే కృష్ణానదికి వరదలు వచ్చాయన్నారు. ఎగువ రాష్ట్రాల హెచ్చరికలను పరిగణలోకి తీసుకుని వరద నీటి నిర్వహణ సరిగా చేసి ఉంటే నేడు ఇంత ప్రళయం వచ్చి ఉండేది కాదన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఇంట్లో కూర్చున్న ఒక వ్యక్తి డ్రోన్‌ల ద్వారా తన ఇంటి మీద బాంబులు వేసే ప్రయత్నం చేశారని తీవ్రమైన విమర్శలు చేశారు. తనకు ఎటువంటి ప్రాణ భయం లేదని, ప్రాణం ఉన్నంత వరకు ప్రజల పక్షానే తన ప్రయాణం ఉంటుందని స్పష్టం చేశారు. పునరావాస కేంద్రాల్లో కడుపు నిండా అన్నం కూడా పెట్టలేని ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్ ప్రభుత్వమేనన్నారు. సహాయక చర్యలతో పాటు పునారావసం కూడా కల్పించలేకపోయారన్నారు. ఈ పర్యటనలో మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, విజయవాడ ఎంపీ కేశినేని నాని, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు, పెనమలూరు, పామర్రు మాజీ ఎమ్మెల్యేలు బోడే ప్రసాద్, ఉప్పులేటి కల్పన, మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ తదితరులు పాల్గొన్నారు.
చిత్రాలు.. వరద బాధితులనుద్దేశించి మాట్లాడుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు, పక్కన ఎంపీ కేశినేని, ఎమ్మెల్యే గద్దె, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్,
*వరద బాధితులను పరామర్శిస్తున్న చంద్రబాబు