ఆంధ్రప్రదేశ్‌

సుడి‘గండం’లో పోలవరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఆగస్టు 18: సమీప కాలంలో పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వాల మధ్య వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఒక విధంగా చెప్పాలంటే పోలవరం ప్రాజెక్టు రాజకీయ సుడిగుండంలో చిక్కుకుందని తెలుస్తోంది. గత ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ ప్రస్తుత ప్రభుత్వం టెండర్లను తిరిగి తోడేందుకు చేపట్టిన చర్యలతో మొత్తం ప్రాజెక్టు లక్ష్యానికే దూరంగా మారిన వైనం కన్పిస్తోంది. ఈ నేపధ్యంలో పోలవరం రీటెండర్లా లేక, రివర్స్ పనులా అన్నట్టుగా తయారైంది. పోలవరం ప్రాజెక్టు అధారిటీ (పీపీఎ) వారిస్తున్నప్పటికీ ప్రభుత్వం రీటెండర్లకు సమాయత్తమైంది. రీటెండర్ల కారణంగా అంచనా వ్యయం తడిసి మోపెడయ్యే పరిస్థితి కన్పిస్తోంది.
ఇప్పటికే నవయుగ సంస్థ కాంట్రాక్టును ప్రభుత్వం రద్దు చేసి రివర్స్ టెండర్లకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. టెండర్ల పూర్తి చేసి నవంబర్ నుంచి పనులు మొదలు పెడతామని ప్రభుత్వం పేర్కొంటోంది. అయితే ఈ వ్యవధిలో టెండర్ల ప్రక్రియలో టెక్నికల్ బిడ్, ప్రైస్ బిడ్ తెరిచిన తర్వాత సామర్ధ్య పరిశీలన, బ్యాంకు గ్యారంటీలు తదితర వ్యవహారాలన్నీ పూర్తి చేసుకుని వర్కు ఆర్డర్ ఇచ్చేలోపు పుణ్యకాలం పూర్తయి పోతుందంటున్నారు. ఎలాగూ వరదల సీజన్ కాబట్టి ఇప్పటి వరకు సరిపెట్టుకున్నప్పటికీ నవంబర్ నాటికైనా ఈ కార్యకలాపాలన్నీ పూర్తయ్యేందుకు సమయం సరిపోదని నిపుణులు అంటున్నారు. ఈ నేపధ్యంలో టెండర్ల ప్రక్రియే చాలా ఆలస్యమయ్యేలా ఉందని, ఇక పనులు చేపట్టేందుకు ఎంత కాలం పట్టనుందో, ఇప్పటికే హెడ్ వర్క్సుకు సంబంధించి 71 శాతం పనులు పూర్తయినప్పటికీ ఇక మిగిలిన పనులను చేపట్టేందుకు రివర్స్ టెండర్లా, లేక రివర్స్ పనులో అర్ధం గాని పరిస్థితులు చోటు చేసుకున్నాయి. జల వనరుల శాఖ అధికారులు ఆదివారం కూడా రివర్స్ టెండర్లకు సంబంధించిన పనుల్లో తలమునకలయ్యారు. సుమారు రూ.4987 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులు చేపట్టేందుకు రివర్స్ టెండర్లు పిలిచారు. ఇది కేవలం పవర్ హౌస్‌తోపాటు హెడ్ వర్క్సు మాత్రమే.
ప్రధాన కాలువల మిగుల పనులకు సంబంధించి అంచనాలు తయారు చేస్తున్నారు. త్వరలో వీటికి కూడా టెండర్లు పిలవనున్నారు. పాత అంచనాల వల్ల టెండర్లు అంత త్వరగా క్లోజ్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. పీపీఎ నుంచి అయితే కేంద్రం నుంచి మళ్లీ చెప్పే వరకు ఆగాలని, రివర్స్ టెండర్లకు వెళ్లవద్దని లేఖ కూడా రాశారు. నవయుగ సంస్థను తప్పుకోవాలని జల వనరుల శాఖ లేఖ రావడంతో తమకు రావాల్సిన బిల్లులన్నీ క్లియర్ చేసి ముందుకెళ్ళాలని నవయుగ నుంచి సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. ఈ మేరకు రివర్స్ టెండర్లకు వెళ్లినట్టు తెలిసింది. ప్రస్తుతం 2015-16 ఎస్‌ఎస్‌ఆర్ మాత్రమే అమలులో ఉంది. ఆ రేట్ల ప్రకారమే రివర్స్ టెండర్లు పిలిచారు. అయితే పవర్‌హౌస్‌ను కూడా హెడ్ వర్క్సులో ఒకే ప్యాకేజీగా టెండర్లు పిలవడం జరిగింది కాబట్టి 2015-16 రేట్ల ప్రకారమైనా కాంట్రాక్టుదారులు ముందుకొచ్చేందుకు అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రీటెండర్లు పిలిస్తే అంచనా వ్యయం పెరుగుతుందని పీపీఎ ముందుగానే హెచ్చరించింది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఖాతరు చేసినట్టు కనిపించడం లేదు.
ప్రస్తుతమంతా రివర్స్ టెండర్లపైనే దృష్టి కేంద్రీకరించిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఖర్చు చేసిన నిధులను రాబట్టే విషయంలో మాత్రం అంతగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. తాజా ఎస్‌ఎస్‌ఆర్ ప్రకారం ప్రాజెక్టు అంచనా వ్యయం ముందుగా ఖరారైతే టెండర్లు ఖరారైనప్పటికైనా సకాలంలో ప్రాజెక్టు జోరందుకునేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి.
కానీ ఇటువంటి పరిస్థితి ఏదీ కన్పించడం లేదు. ప్రస్తుతం ప్రభుత్వం దృష్టంతా రివర్స్ టెండర్లపైనే తప్ప సకాలంలో నిధులు రాబట్టి, నిర్ధేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలనే ఆలోచన అంతగా ఉన్నట్టు కనిపించడం లేదని విమర్శలు చోటుచేసుకున్నాయి. గత ప్రభుత్వం ప్రాజెక్టులపైనే దృష్టి పాలన అంతగా పట్టించుకోకపోవడం వల్ల వెనుకబడి పోయామనే ఆరోపణలు మూటగట్టుకుంటే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంపై కక్షసాధింపుతప్ప మరో లక్ష్యం కన్పించడం లేదనే ఆరోపణల మధ్య చిక్కుకుంటోందని తెలుస్తోంది.
పోలవరం ప్రాజెక్టుకు జూన్ 15 వరకు రూ.16876.93 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. జాతీయ ప్రాజెక్టుగా నిర్ణయించిన తర్వాత చేసిన ఖర్చు రూ.11741.06 కోట్లు. పీపీఏ నుంచి ఏపీకి ఇప్పటి వరకు రూ.6,727.26 కోట్లు విడుదలయ్యాయి. పీపీఏ నుంచి ఇంకా రూ.5,013.80 కోట్లు రియంబర్స్ చేయాల్సి ఉంది. ఏదేమైప్పటికీ ప్రాజెక్టు నిర్మాణం మాత్రం లక్ష్యానికి దూరమేనని తెలుస్తోంది.