ఆంధ్రప్రదేశ్‌

విజృంభిస్తున్న మావోయస్టులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 30: ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టు కార్యకలాపాలు పెరుగుతున్నాయి. బాక్సైట్ తవ్వకాలపై ప్రభుత్వ వైఖరి, పోలవరం ప్రాజెక్టు అంశం నేపథ్యంలో ఎపి, ఒడిశాలో బలోపేతమయ్యే దిశగా మావోయిస్టులు వ్యూహరచన చేస్తున్నట్టు కేంద్ర ఇంటిలిజెన్స్ విభాగం సమాచారం. గతేడాది ఎపిలో మావోయిస్టు కార్యకలాపాలు 94 శాతం పెరిగినట్టు కేంద్ర ఇంటిలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. బాక్సైట్, పోలవరం అంశాలను బూచిగా చూపి రెండు రాష్ట్రాల్లోనూ గిరిజనులను ఆకర్షించడం ద్వారా బలోపేతమయ్యే విధంగా మావోయిస్టు కేంద్ర కమిటీ వ్యూహరచన చేస్తున్నట్టు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మావోయిస్టు కేంద్ర నాయకత్వం ఆంధ్ర, ఒడిశా బోర్డర్‌లో పట్టుకోసం ముమ్మరంగా యత్నిస్తున్నట్టు ఇంటిలిజెన్స్ అంచనా వేస్తోంది. ప్రస్తుతం పోలీసు వ్యవస్థకు అందుబాటులో ఉన్న సమాచార వ్యవస్థను మావోయిస్టులు ట్రాప్ చేస్తున్నట్టు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. పోలీసుల వద్దనున్న వైర్‌లెస్ సమాచార వ్యవస్థను మావోయిస్టులు సులభంగా ట్రాప్ చేసే అవకాశం ఉందని గుర్తించారు. దీనివల్ల మావోయిస్టుల ఏరివేతకు చేపట్టే కూంబింగ్ ఆపరేషన్, వారి స్థావరాలను గుర్తించే విషయంలో పోలీసుల వ్యూహం ముందుగానే పసిగడుతున్నట్టు గుర్తించారు. దీనివల్ల మావోయిస్టులు తప్పించుకోవడం లేదంటే దాడి చేయడం వంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నట్టు అంచనావేస్తున్నారు. మావోయిస్టుల వ్యూహాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలంటే ఎపి, ఒడిశా సరిహద్దుల్లో పటిష్టవంతమైన సమాచార వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. సెల్ సమాచార వ్యవస్థ అందుబాటులోకి వస్తే మావోయిస్టు కదలికలను గుర్తించడం సులభం అవుతుందన్నది కూడా పోలీసు వ్యూహంగా తెలుస్తోంది. దీనిలో భాగంగా విశాఖపట్నం, విజయనగరం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థను పటిష్టపరిచేందుకు సెల్ టవర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం మారుమూల అటవీ ప్రాంతాల్లో సెల్ టవర్లను ఏర్పాటు చేయడం ద్వారా పోలీసుల వ్యూహాన్ని మావోయిస్టులు పసిగట్టలేరని భావిస్తున్నారు. ఇప్పటికే మారుమూల అటవీ ప్రాంతాల్లో కొన్ని సెల్ టవర్లు ఉన్నప్పటికీ, వీటిని మరింత విస్తృతం చేయాలని నిర్ణయించారు. మావోయిస్టు దుశ్చర్యల్లో ధ్వంసమైన ఆస్తులకు బీమా సదుపాయం లేకపోవడమే ప్రైవేటు సంస్థల అనాసక్తికి కారణం. ఏజెన్సీలో సెల్ సర్వీసులు అందించేందుకు ప్రైవేటు సంస్థలు ముందుకు రాకపోవడంతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్ ద్వారా లోటును భర్తీ చేయాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా నాలుగు జిల్లాల పరిధిలో 53 సెల్ టవర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. విశాఖ ఏజెన్సీలో 12 టవర్లు, విజయనగరం జిల్లాలో 26, తూర్పుగోదావరిలో 10, పశ్చిమ గోదావరి ఏజెన్సీలో 5 సెల్ టవర్లను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే 30 ప్రాంతాల్లో సెల్ టవర్ల ఏర్పాటు దాదాపు పూర్తి కావచ్చింది. అయితే కొత్తగా ఏర్పాటు చేసే సెల్ టవర్లను భద్రత పరంగా ఇబ్బంది లేని ప్రాంతాల్లోనే ఏర్పాటు చేయనున్నారు. భద్రత కారణంగానే విశాఖ జిల్లా జికె వీధి మండలం జెర్రెల, జి మాడుగుల మండలం మద్దిగరువు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సిన టవర్లను పెదబయలు మండలం రూడకోట, చింతపల్లి మండలం రాళ్లగడ్డకు మార్చారు. ఇటు సొంత సమాచార వ్యవస్థను పటిష్ట పరచుకోవడంతో పాటు మావోయిస్టులు వీటిని ఉపయోగిస్తే వారి ఉనికిని తెలుసుకోవడం పోలీసు వ్యూహంగా తెలుస్తోంది.