ఆంధ్రప్రదేశ్‌

రాజధాని నిర్మాణానికి మిగిలేది 7,240 ఎకరాలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 20: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం రైతుల నుంచి 33వేల ఎకరాలు సేకరించినప్పటికీ ప్రభుత్వానికి మిగిలేది సుమారు 7,240 ఎకరాలు మాత్రమే. భూసేకరణ, భూమి వినియోగానికి సంబంధించి సంపూ ర్ణ అవగాహన లేక కొంతమంది పలు రకాలుగా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారంటూ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనల నుంచి పుట్టిన ఓ అద్వితీయమైన పథకం ల్యాండ్ పూలింగ్. నూతనంగా నిర్మించే రాజధాని నగరం గజిబిజి గందరగోళంగా ఉండకూడదు. అందుకు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాల్సి ఉందనేది ప్రభుత్వ వాదన. రాజధాని అంటే కార్యాలయాల కట్టడాలే కాదు, విశాలమైన రహదారులు, భారీ భవంతులు, పచ్చని పచ్చికబయళ్లు, ఆహ్లాదకరమైన వాతావరణంతో సామాజిక, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలవాలి. జీవకళలతో విలసిల్లే సజీవ నగరంగా ఉండాలి. సమాచార విప్లవం ద్వారా అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే విధంగా విద్య, వైద్య, ఆరోగ్య సంస్థలతోపాటు వైజ్ఞానిక కేంద్రాలకు నిలయంగా ఉండాలి. కొత్త రాజధానిపై ప్రజలకు ఎన్నో ఆకాంక్షలు ఉన్నాయి. వాటన్నింటిని ప్రతిబింబించే విధంగా ప్రపంచ స్థాయిలో నవీన నగరాన్ని తీర్చిదిద్దవలసి ఉందని చంద్రబాబు పదే పదే వివరణ ఇస్తున్నారు. తన ఆలోచనను రైతులు అర్థం చేసుకున్నందునే వారు స్వచ్ఛందంగా భూములు ప్రభుత్వానికి ఇచ్చారన్నారు. ఆ భూమిలో కొంతభాగం విశాలమైన రహదారులతో కూడిన ప్లాట్లుగా ప్రభుత్వం రైతులకే ఇచ్చి వేస్తుందన్నారు. సుమారు 35 లక్షల మంది జీవించేలా అన్ని హంగులతో నగరం నిర్మించవలసి ఉంది. నిబంధనల ప్రకారం రహదారులు, రైలుమార్గాలు, డ్రైనేజీ వ్యవస్థ, పార్కులు, గ్రీన్‌బెల్ట్ వంటి వాటితోపాటు పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, ఆస్పత్రులు, క్రీడా ప్రాంగణాలు వంటి సామాజిక అవసరాలకు కొంత భూమి వినియోగించాలి. మాస్టర్ ప్లాన్‌లో భాగంగా రాజధానిలో ఆరు లైన్ల, నాలుగు లైన్ల రోడ్లు నిర్మించాలి. ఇవన్నీపోగా ప్రభుత్వానికి సుమారు 7,240 ఎకరాలు మాత్రమే మిగులుతుందనేది ప్రభుత్వ వాదన.
ప్రధాన రాజధాని నగర ప్రాంతం మాత్రం 55వేల ఎకరాలలో 217.23 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంటుంది. రాష్ట్ర పరిపాలనా భవనాలు అన్నీ ఇక్కడే ఉంటాయి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల భవనాలను కూడా ఇక్కడే నిర్మిస్తారు. వీటికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే తాత్కాలిక సచివాలయ నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించారు. సీడ్ క్యాపిటల్‌లో ప్రధానమైన స్టార్టప్ ప్రాంతం నిర్మాణానికి స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో టెండర్లు కూడా పిలిచారు.
సిఆర్‌డిఎ విడుదల చేసిన వివరాల ప్రకారం గుంటూరు, కృష్ణా జిల్లాలలో ఉన్న మొత్తం రాజధాని ప్రాంత విస్తీర్ణం 8,603.32 చదరపు కిలోమీటర్లు. గుంటూరు జిల్లాలోని 26 మండలాలలో 3,787.97 చదరపు కిలోమీటర్లు ఉండగా, కృష్ణా జిల్లాలోని 30 మండలాలలో 4,815.35 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంది. ఇందులో కేంద్ర ప్రణాళిక ప్రాంతం (సెంట్రల్ ప్లానింగ్ ఏరియా) 857 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. దీని పరిధిలోకి మంగళగిరి, తూళ్లూరు, తాడేపల్లి, ఇబ్రహీంపట్నం, విజయవాడ అర్బన్, విజయవాడ రూరల్, పెనమలూరు మొత్తం ఏడు మండలాలు వస్తాయి.