ఆంధ్రప్రదేశ్‌

సీమలో భానుడి భగభగలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం: రాయలసీమలో భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. గడచిన వారం రోజులుగా మండుతున్న ఎండలతో జనం విలవిలలాడుతూ ఉండగా రెండు మూడు రోజుల నుంచీ పగటి ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోతున్నాయి. అనంతపురం జిల్లాలో ఆదివారం అత్యధికంగా 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. దీంతోప్రజలు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఇలా ఒక్క అనంతపురం జిల్లాలోని 43 మండలాల్లో 40 డిగ్రీల కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. కర్నూలు జిల్లాలోని కల్లూరులో అత్యధికంగా 41.5 డిగ్రీలు, కర్నూలు నగరంలో 41.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. కర్నూలు జిల్లా కోసిగిలో డిగ్రీ విద్యార్థి సురేష్ (19) వడదెబ్బకు మృతిచెందాడు. కడప జిల్లాలో సైతం గడచిన నాలుగైదు రోజులుగా సూర్య తాపంతో ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ఆదివారం సైతం భానుడి భగభగలతో కడప ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
వృద్ధ దంపతుల
ఆత్మహత్య
రావులపాలెం, మార్చి 20: తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో ఆదివారం ఇద్దరు వృద్ధ దంపతులు ఆత్మహత్యచేసుకున్నారు. కళాశాల గ్రౌండ్‌లో పురుగుల మందుతాగి అపస్మారక స్థితిలో పడివున్న వీరిరువురిని పోలీసులు ఆసుపత్రికి తరలించగా, చికిత్సపొందుతూ మృతిచెందారు. వివరాలిలావున్నాయి... ఇదే జిల్లాలోని ముమ్మిడివరం గ్రామానికి చెందిన అనుపిండి వెంకటశాస్ర్తీ అనే పుల్లయ్య (60), వెంకటలక్ష్మి (55) దంపతులు రావులపాలెం డిగ్రీ కళాశాల మైదానంలో పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో పడివుండగా ఆదివారం తెల్లవారుజామున వాకింగ్‌కు వచ్చిన వారు గుర్తించారు. 108 అంబులెన్సుకు సమాచారం అందించారు. అలాగే పోలీస్ ఫిజికల్ టెస్టు కోసం ఆ సమయానికి అక్కడే ఉన్న పోలీసులు స్పందించి, వారిని అంబులెన్సులో కొత్తపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించి కొద్దిసేపటికే ఇరువురూ మృతిచెందారు. వీరి పెద్ద కుమారుడికి వివాహం కాలేదు. చిన్న కుమారుడు ఫణికుమార్ రెండున్నరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం కామేశ్వరరావు హైదరాబాద్‌లోను, ఫణికుమార్ సూరత్‌లో ఉంటున్నారు. కొన్నాళ్ల క్రితం వరకు అకౌంటెంట్‌గా పనిచేసిన వెంకటశాస్ర్తీకి ప్రస్తుతం జీవనోపాధి కరవైంది. ఆర్థిక ఇబ్బందులు పెరిగిన నేపథ్యంలో శాస్ర్తీ దంపతులు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని, కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని రావులపాలెం ఎస్‌ఐ పివి త్రినాథ్ తెలిపారు.
ఆరు రకాల వ్యాక్సిన్లతో హెక్స్ వ్యాలెంట్
శాంత బయోటెక్ చైర్మన్ డా. వరప్రసాద్
తిరుమల, మార్చి 20: చంటి పిల్లలకు మెరుగైన ఆరోగ్యం కోసం భారతదేశంలో మొట్టమొదటిసారిగా హెక్స్ వ్యాలెంట్ వ్యాక్సిన్‌ను కనుగొన్నామని శాంత బయోటెక్ సంస్థ చైర్మన్ డాక్టర్ వరప్రసాద్ తెలిపారు. ఆదివారం ఉదయం ఆయన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఆలయం వెలుపల ఆయన విలేఖరులతో మాట్లాడుతూ చంటిపిల్లలకు పద్దెనిమిదిసార్లు వేసే 6 రకాల వ్యాక్సిన్‌లకు బదులు హెక్స్ వ్యాలెంట్ అనే వ్యాక్సిన్‌ను తయారుచేశామన్నారు. దీనిని మూడుసార్లు పిల్లలకు వేస్తే పోలియో, రోటా వైరస్ వంటి 6 రకాల వ్యాక్సిన్‌లకు ఇది సమానమని చెప్పారు. మన వ్యవస్థలోని లోపాల వల్లే మేధావుల ప్రయోగాలు వెలుగులోకి రావడం లేదన్నారు. హెక్స్ వ్యాలెంట్ వ్యాక్సిన్‌ను ఇతర దేశాల్లో భేషుగ్గా వాడుతున్నారని, మన దేశంలో అందుబాటులోకి రావాలంటే ఇంకా కొంత సమయం పడుతుందని అన్నారు.
పోలవరం నిర్వాసితుల సమస్యపై
28న చలో అసెంబ్లీ
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, మార్చి 20: పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోరుతూ మార్చి 28న చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు. పోలవరం సమస్యలపై ప్రచురించిన గోడపత్రికను విజయవాడ దాసరి నాగభూషణరావు భవన్‌లో ఆదివారం విడుదల చేసారు. ఈ సందర్భంగా కె.రామకృష్ణ మాట్లాడుతూ పోలవరం ముంపునకు గురయ్యే భూములకు పట్టిసీమ తరహాలో ఎకరాకి రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
గతంలో ప్యాకేజీ ఇచ్చిన వారికి కూడా పై తరహాలోనే అన్ని రకాల భూములకు, అందరికీ నష్టపరిహారం ఇవ్వాలని, డి.పట్టా భూములకు, పోడు భూములకు, ప్రభుత్వ భూములకు సమానంగా అన్ని కుల, వర్గ భేదాలు లేకుండా నష్టపరిహారం ఇవ్వాలన్నారు. కొత్తగా కుటుంబ సర్వే చేయించి ప్రతి కుటుంబానికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద రూ.10 లక్షలు ఇవ్వాలని, పుల్ రిజర్వు లెవల్ (ఎఫ్‌ఆర్‌ఎల్) 3 కిలోమీటర్ల వరకు ముంపు ప్రాంతంగా గుర్తించి నష్టపరిహారం ప్రకటించాలన్నారు. పోలవరం నిర్మాణంలో ఉపాధి కోల్పోతున్న లాంచీ వర్కర్లకు ఆర్‌ఆర్ ప్యాకేజీ వర్తింప చేయాలన్నారు. ఒకపక్క పోలవరం పనులు వేగవంతమవుతున్నాయని అదే క్రమంలో నిర్వాసితుల ప్యాకేజీ పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నదని రామకృష్ణ ఎద్దేవా చేశారు. ఇప్పటివరకు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇతర మంత్రులెవ్వరూ విలీన మండలాల్లో ఎవరూ పర్యటించలేదనీ, విలీన మండలాల గిరిజన ప్రజల సమస్యలు వర్ణనాతీతంగా ఉన్నాయని ఆయన విమర్శించారు. రెవెన్యూ పరిపాలన కుంటుపడిందని, ఇన్‌చార్జి వ్యవస్థతో పరిపాలన సాగిస్తున్నారన్నారు. మార్చి 28న జరిగే చలో అసెంబ్లీ (హైదరాబాద్) కార్యక్రమానికి విలీన మండలాల ప్రజలు పెద్దఎత్తున తరలి రావాలని రామకృష్ణ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణ మూర్తి, కార్యదర్శి వర్గ సభ్యులు రావుల వెంకయ్య, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల కార్యదర్శులు తాటిపాక మధు, డేగా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

సాగర్ జలాశయానికి 3143 క్యూసెక్కుల నీటి చేరిక
విజయపురిసౌత్, మార్చి 20: శ్రీశైలం జలాశయం నుండి నాగార్జున సాగర్ జలాశయానికి ఆదివారం 3143 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. దీంతో ప్రస్తుతం సాగర్ జలాశయం నీటిమట్టం 508.30 అడుగులకు చేరుకుంది. ఇది 128.8027 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుండి ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో సాగర్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జంటనగరాల తాగునీటి అవసరాల నిమిత్తం 1200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 810.80 అడుగుల వద్ద నిలకడగా ఉంది. ఇది 34.7430 టీఎంసీలకు సమానం.

శ్రీవారికి బంగారు శంఖాల వితరణ
తిరుమల, మార్చి 20: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి రూ.50 లక్షల విలువచేసే 2 బంగారు శంఖాలను ఆదివారం ఓ భక్తుడు విరాళంగా అందజేశారు. జిఎంఆర్ కంపెనీ అధినేత అల్లుడైన బొమ్మిడాల శ్రీనివాస్ ఆదివారం శ్రీవారి దర్శనార్థం వచ్చిన ఆయన 1.5 కిలోల బరువు గల రెండు బంగారు శంఖాలను టిటిడి ఇఒ డాక్టర్ డి సాంబశివరావుకు అందించారు. వీటిని శుక్రవారం వేకువజామున శ్రీవారికి నిర్వహించే అభిషేక సేవలో వినియోగించనున్నారు.

గో సంరక్షణకు టిటిడి కృషి
ప్రశంసనీయం: తొగాడియా

తిరుమల, మార్చి 20: గోసంరక్షణ కోసం టిటిడి చేస్తున్న కృషి ఎంత ప్రశంసించినా తక్కువేనని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షులు ప్రవీణ్ తొగాడియా అన్నారు. ఆదివారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొనేందుకు వచ్చిన ఆయనకు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం పలకగా అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల ఆయన విలేఖరులతో మాట్లాడుతూ అంతరించిపోతున్న పశుజాతిని సంరక్షించేందుకు గోశాలలను ఏర్పాటుచేసి రక్షిస్తున్న టిటిడిని ప్రశంసించారు. ప్రస్తుతం భారతదేశంలో 14 రకాల ఆవులు ఉన్నాయని, వాటిలో ఒంగోలు ఆవులు అంతరించిపోతున్నాయని వాపోయారు. ఈ జాతి ఆవులను రక్షించేందుకు టిటిడి కృషి చేస్తోందని అన్నారు. ఇందులో భాగంగా ఒంగోలు ఆవులను రక్షించాలని కేంద్రానికి వినతిపత్రం అందించడమే కాకుండా, తనవంతు బాధ్యతగా పలమనేరులోని టిటిడి గోశాలలో వీటికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం అభినందనీయమని అన్నారు. అనంతరం టిటిడి బోర్డు సభ్యుడు భానుప్రకాష్ మాట్లాడుతూ ఒంగోలు జాతి ఆవులను సంరక్షించేందుకు టిటిడి రాష్ట్ర ప్రభుత్వానికి వినతిపత్రాన్ని సమర్పించిందని, వారు కేంద్రానికి విన్నవించారన్నారు. టిటిడి పలమనేరులోని 450 ఎకరాల్లో నిర్వహిస్తున్న గోశాలలో ఒంగోలు ఆవుల కోసం ప్రత్యేకంగా గోశాలలను నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు.