S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కన్నవారలెంత ధన్యులో.. విన్నవారంత ధన్యులు! (అమృతవర్షిణి)

తాతల పేర్లు చెప్పవచ్చు. వారి తలిదండ్రుల్ని చెప్పవచ్చు. అంతకంటే, వారికన్నా ముందు తరం వారు గుర్తుండే అవకాశం లేదు. గుర్తుంచుకున్న వారు పుణ్యాత్ములు. తల్లిదండ్రుల్ని గుర్తుపెట్టుకుంటే అదే పదివేలు. అందరిలాగే జన్మించి, ఓ కళారూపాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకుని, పితామహుడై హరికథా చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని తెరిచి ‘హరికథా గానం’ ఇలా వుండాలని కొన్ని ఉన్నత ప్రమాణాలు నిర్దేశించి, లోకోత్తర ఖ్యాతి పొందడం, హరిదాసులు నిత్యం స్మరించుకోవడం, ఆయన మన తెలుగువాడవ్వడం తెలుగువారి సుకృతం. అసలు ‘తాత’ అనే పిలుపులోనే ఒక గౌరవం ఉంది. పెద్దరికం ఉంది. మహాభారతంలో భీష్మాచార్యులకు దక్కిందీ గౌరవం. కర్ణాటక సంగీతానికి పురందరదాసు పద కవిత్వానికి తాళ్లపాక అన్నమయ్య పితామహులైనట్లే, ఆదిభట్ల నారాయణదాసు హరికథా పితామహుడై..
తెనుగువారలకున్ తేట తెల్లముగ
తెలుగులో నెల్ల విద్యల దెలుపనెంతు
అన్ని విధములనన్ గాచు నాంధ్ర దేశ
మునకు నా అచ్చియున్న యప్పనముదీర్తు’
- అని చాటిన అచ్చ తెలుగు భాషాభిమాని.. ఆదిభట్ల. తెలుగువాడుగా ఆయన చేసిన శపథం ఇది. కాళిదాసాదులు పురాణ కథల్ని శ్లోకాలుగా వెలువరించారు. దాసుగారు పురాణాలలోను, కావ్యాల్లో నుండి గ్రహించిన వాటిని సంగీత, సాహిత్య నృత్య సమన్వయంతో పండిత పామరుల్ని పరవశింపచేసి, గణుతి కెక్కిన ప్రజ్ఞా దురంధరులు. మనకు హరికథకుడుగానే తెలుసు. కానీ ఆయన ఎరుగని విద్య లేదు. తెలియని భాషల్లేవు. దాసుగారి జీవిత విశేషాలు తెలిసి అర్థం చేసుకునేందుకే ఒక్క జీవితం సరిపోదు. ఆయన హరికథా గానం వెనుక పెద్ద కథే ఉంది. అందుకే వారు కారణజన్ములు.
మనిషి ఎన్నో అనుకుంటాడు. లోకంలో అందరికీ అనుకున్నవి జరగవు. అనుకోనివే ఎక్కువ జరుగుతాయి. ఒక్క మనిషి అనుకుంటే సరిపోదు. పరమేశ్వరుడు కూడా అనుకోవాలి. ఈశ్వర సంకల్పముంటే మంచైనా చెడయినా జరిగి తీరుతుంది. అది పూర్వజన్మ అనుగ్రహం కావచ్చు. లేదా ఈ జన్మదే కావచ్చు. చెప్పలేం.
ఈ భూమీద వ్యక్తులు కలకాలమూ వుండకపోయినా, పుణ్య పురుషుల జీవితాలు మాత్రం మన కళ్లెదుట సజీవంగా ఉన్నట్లే స్ఫురింప చేసేది మాత్రం ముమ్మాటికీ దైవ ఘటనే. అదే సత్యదూరమైతే, ఈ వాగ్గేయకారులూ, యోగులూ, మహాపురుషులూ మనకెప్పడో దూరమై పోయేవారు. ప్రారబ్దం ఏమో! మన ప్రక్కనే ఉన్న మేధావుల్నే మనం గుర్తించం. తల్లిదండ్రుల్నే ప్రక్కన పెట్టేసే ప్రబుద్ధులు లేరూ? కానీ ఈ పితామహుల జన్మలూ, జీవితాలూ చాలా వేరు. పితామహుడనిపించుకోవడమే వారికి పెద్ద గౌరవం. అటువంటి మహా పురుషుడు శ్రీ మదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు (1864-1945).
కళ.. కళ కోసమే అన్న భావన వుంటే భౌతికబలం తప్ప, ఆధ్యాత్మిక బలం ఉండదు. దైవ ప్రసాదమైన హరికథా గానాన్ని తెలుగులో, గీర్వాణ భాషలో, ఆంగ్లంలో, అరబ్బీలో, పార్శీలో, తమిళంలో సుందరంగా ఉపమానాలతో, నానుడులు, ఛలోక్తులతో, ఆశు కవితలతో వేలాది మందిని వశం చేసుకున్న ‘పుంభావ సరస్వతి’గా ఒక వెలుగు వెలిగిన హరికథా బ్రహ్మ... హరికథా గానాన్ని జనరంజకం చేసిన కళాతపస్వి - శ్రోతల స్థాయికి దిగిపోయిన చౌకబారు పాటా, ప్రసంగమూ కాదు, దాసు గారిది. తన పాట ఎవరైతే వింటారో, తన కౌశలాన్ని ఎవరు మెచ్చుకుంటారో అలాంటి వారు తనకంటే విద్వాంసులే అవ్వాలి. వారే మెచ్చుకోవాలి. చేసిన కృషికి హృదయ పూర్వకంగా వారెంత ఇచ్చినా అదే పదివేలు అనుకుని, హుందాగా, దర్జాగా, ఠీవిగా బ్రతికి తెలుగు జాతికి భక్తి జ్ఞాన భిక్ష పెట్టిన తేజోమయమూర్తి. హరికథ అంటే, కాలక్షేపం కోసం, ఖాళీగా కూర్చున్న వారికి చెప్పే ‘సోది’ కాదని, ‘శంభో’ అని ఖంగుమనే కంఠంతో, రామాయణ, భారత భాగవత గాథలను, తన గంధర్వ గానంతో నింపిన ప్రజ్ఞ్ధారీణుడు.
కవులకూ కవిత్వానికీ చెళ్లపిళ్ల వారు సంపాదించి పెట్టిన గౌరవ స్థానాన్ని నారాయణ దాసుగారు హరికథకు తెచ్చారు. కవులు, హరిదాసులూ వీరిద్దరికీ శిష్యులమనో, ప్రశిష్యులమనో చెప్పుకుంటూ గర్విస్తారు. వారిలో మా నాన్నగారు మల్లాది శ్రీరామమూర్తి గారొకరన్న సంగతి కొందరికే తెలుసు.
మా తాతగారి సంతానంలో సంగీత సాహిత్యాల పట్ల అభిరుచి, అభినివేశం ఏర్పడ్డది మా నాన్నగారొక్కరికే. తణుకులో ప్రసిద్ధుడైన కథకులు ముసునూరి సూర్యనారాయణతో స్నేహం కుదిరింది. సూర్యనారాయణ అఖండ ప్రతిభ కలిగిన హరిదాసు - దాసుగారి శిష్యులలో ప్రసిద్ధుడైన వాజపేయి యాజుల సుబ్బయ్యగారిదీ, మాదీ స్వగ్రామం ఉంగుటూరు (ప.గో.జిల్లా). ఒకే ఊరు వారవటంతో సుబ్బయ్యగారితో కూర్చుని హరికథల్లోని కీర్తనలు సాధన చేస్తూండేవారు. వీరిద్దరి పాట ఆ ఊళ్లో, దాసుగారు వినటం జరిగింది. గోదావరి జిల్లాల్లో దాసుగారి కథలకు మా నాన్నగారినీ పిలుస్తూండేవారు. అభ్యాసము కూసు విద్య అన్నట్లు క్రమక్రమంగా, స్వయంగా పాడే అలవాటైంది మా నాన్నగారికి. వేదాధ్యయనం, శాస్త్ధ్య్రాయనాల కంటే కూడా ‘నామ సంకీర్తన’ చాలా గొప్పదని చెప్పినవాడు నారదుడు. లోకాలకు హరికథలు చెప్పగలిగిన హరిదాసు ఒక్క నారదుడే. ఇతిహాస పురాణాగమ చరిత్ర, నైగమ షట్చాస్త్ర విషయాల మర్మాలు వివరించ గలవాడాయనే. అలాగే ఆథ్యాత్మిక పరమైన సకల వేదాంత సారాన్నీ చెప్పగలవాడూ హరిదాసే. దీనికి సాక్షి ఆదిభట్ల వారు. ఆయనలో వ్యాస వాల్మీకులిద్దరూ ఉన్నారు.
భగవంతుడి కోసం ఎక్కడెక్కడికో వెళ్లి పరిగెత్తక్కర్లా! భక్తులెక్కడ భగవన్నామం చేస్తారో అక్కడ నేనున్నట్లుగా భావించమని పరమాత్మ సాక్షాత్తూ నారదుడికే చెప్పాడు. అంతేకాదు, ‘నన్ను గురించి గానం చేసే భక్తులు నాకు ఎక్కువ ప్రేమపాత్రులని, వారి యోగ క్షేమాలన్నీ నేను స్వయంగా చూసుకుంటానని మనకో వాగ్దానం ఇచ్చేస్తే, సంస్కారం వున్నవాడు దాన్ని అందుకుంటాడు. సంగీత సాహిత్య గుణ నిధియైన నారాయణదాసు ఈ మాటే పట్టుకున్నారు. సకల జనరంజకంగా నృత్య గీత వాద్య సమ్మేళనంతో హరికథా గానాన్ని సుసంపన్నం చేసి సుమనోహర సంగీత గంగాధరుడై హరికథే తానై, తానే హరికథయై భాసిల్లారు.
దాసుగారు మొట్టమొదట విన్న ‘హరికథ’ ధృవచరిత్ర. ఆయన చిన్నతనంలో తమిళనాడు నుంచి కుప్పుస్వామి అనే హరికథకుడు విజయనగరంలో కానుకుర్తి వారింట వివాహ సందర్భంలో చెప్పిన హరికథా గానం దాసుగారి జీవితాన్ని ఓ మలుపు తిప్పేసింది. సంగీత సాహిత్య గీత వాద్య నృత్యాభినివేశాలన్నీ జన్మతః సిద్ధించడంతో తాను కూడా హరికథ చెప్పాలనుకుని, ధృవచరిత్ర తనకు తానుగా తయారుచేసుకుని ఆయన మిత్రుల మధ్య ఓ గుడిలో పాడి వినిపించారు. అంతే - క్రమక్రమంగా దాసుగారి పేరు ఊరు దాటిపోయింది. మూడు పదులు దాటకుండానే, హరికథలల్లడం ప్రారంభించారు. అవేమైనా మామూలు కథలా? సాధారణమైన గానమా?
బహుభాషా పాండిత్యం, న్యాయ, వేదాంత, వ్యాకరణ శాస్త్ర సంప్రదాయ విషయాల్లో ప్రావీణ్యత ఒక్కటే కాదు. సకల జనరంజకంగా అప్పటికప్పుడు మనోధర్మంతో సమ్మోహనంగా పాడిన గానగంధర్వుడు. ఆయన పాట ఎలా వుండేదో, ఎవరికీ తెలియకపోవచ్చు. త్యాగయ్య సంగీతం ఆయన శిష్య ప్రశిష్యుల వల్ల ఎలా తెలిసిందో, దాసుగారి సంగీతం కూడా ఆయన శిష్యుల వల్లే తెలిసింది. దాసుగారి ముఖ్య శిష్యులు నేతి లక్ష్మీనారాయణ, వాజపేయి యాజుల సుబ్బయ్య... వీరిద్దరికీ ‘యథార్థ రామాయణం’ స్వయంగా చెప్పి, ‘రామాయణ సోదరులని’ నామకరణం చేశారు. దాసుగారి బాణీ యథాతథంగా అనుసరిస్తూ రక్తిగా పాడిన మొదటి తరం హరికథకులు పప్పు అయ్యవారు, నేమాని వరహాలదాసు, రావికంటి జగన్నాథదాసు, చిట్టిమళ్ల రంగయ్య దాసు, గుడిపాటి శ్రీరామమూర్తి, పెంటపాడు సుబ్బయ్య, పుచ్చల భ్రమరదాసు (బవరదాసనేవారు), కరూరు కృష్ణదాసు, మొ. వారు. వరహాలదాసు విజయనగరం సంగీత కళాశాలలో గాత్ర సంగీత అధ్యాపకులుగా ఉండేవారు. ఈయన శిష్యుడు చొప్పళ్లె సూర్యనారాయణ. మొట్టమొదట గ్రామఫోన్ రికార్డు ఇచ్చిన హరిదాసు దాసుగారు. నేతి లక్ష్మీనారాయణ భాగవతుల పట్ల పుత్ర వాత్సల్యాన్ని చూపించి కథలు చెప్పేవారట. ములుకుట్ల సదాశివశాస్ర్తీ, అంబటిపూడి శివరామకృష్ణ, కుప్పా వీర రాఘవయ్య మొ.వారు నేతి వారి శిష్యులే. వేదనభొట్ల రమణయ్యగారు మరో ప్రముఖుడు. దాసుగారికి ప్రత్యక్ష శిష్యుడు. పరిమితమైన ఈ రాత పెద్ద జాబితా అవుతుందని శంక.
పాతూరి మధుసూదనరావు, కడలి వీరదాసు, ఇలా ఒకరా! ఇద్దరా? హరికథను ఒక సాధనంగా చేసుకుని, సమాజ శ్రేయస్సే లక్ష్యంగా, ధార్మిక జీవనానికి మార్గాలు చూపించిన హరిదాసులు హరికథలు విన్నంతకాలం గుర్తుండే వుంటారు. దాసుగారి పేరు చెప్పుకుని హరికథా గానంతో జీవితాలు గడిపిన వారెందరో వున్నారు. విజయనగరంలోని అయ్యకోనేటి పడమటిగట్టున వున్న వేణుగోపాలస్వామి ప్రాంగణంలో - ప్రారంభమైన దాసుగారి మొదటి హరికథా గానం ఆరున్నర సుదీర్ఘ దశాబ్దాలు దక్షిణాపథమంతా మారుమోగిపోయింది.
కర్ణాటక సంగీతానికి వేద ప్రమాణం కలిగించినది - త్యాగరాజ స్వామి, శ్యామశాస్ర్తీ, ముత్తుస్వామి దీక్షితుల కీర్తనలైతే, హరికథకు ఆదిభట్ల నారాయణదాసు.
వైదిక ప్రామాణ్యాన్ని కలిగించారు. అలా శిష్య ప్రశిష్య సంతతి అసంఖ్యాకంగా పెరిగినది ఆయన వల్లే. ఆ రోజుల్లో మనకు ఎక్కడా సంగీత కళాశాలల్లేవు. విజయనగరం రాజా వారి సంగీత కళాశాల ఒకటే. ఆయన మొదటి ప్రిన్సిపాల్. వయొలిన్ నేర్చుకోవటానికి విద్యార్థిగా కళాశాలకు వెళ్లిన ద్వారం వెంకటస్వామి నాయుడు అధ్యాపకుడుగా నియమింపబడిన అరుదైన సంఘటన జరిగినది ఈయన వల్లనే. సంగీత విద్వాంసుడిగా వున్న ఘంటసాల వెంకటేశ్వర్రావు పాట విని స్వయంగా ‘తంబురా’ బహూకరించినది కూడా దాసుగారే. విజయనగరం మహారాజా సంగీత కళాశాలకు దాసుగారు 1915 నుంచి 1936 వరకూ ప్రిన్సిపాల్‌గా ఉన్న ఆ రోజుల్లో ఉద్దండులైన విద్వాంసులంతా ఆ కళాశాలలోనే ఉంటూ, సంగీత ప్రపంచానికి ఆరాధ్యులవటం ఒక చారిత్రక విశేషం.
హరికథకులలో నారాయణదాసు గారిలా సన్మాన సత్కారాలు పొందిన వారు గానీ, వందలాది శిష్యుల్ని తయారుచేసిన వారు గానీ మన ఆంధ్రదేశంలోనే కాదు ఇతర ప్రాంతాల్లో ఎక్కడా లేరంటే అతిశయోక్తి కాదు. బహు భాషావేత్తగా నారాయణదాసుగారి ఔన్నత్యానికి కారణాలు అనేకం. వాటిలో ప్రధానమైనది... ఆయనకు తెలుగు భాష మీద వున్న విపరీతమైన అభిమానం. అచ్చ తెలుగులో అత్యంత సరళమైన మాటలల్లి పద్యాలు, పాటలను రచించారు. అత్యంత మనోహరంగా పాడగలగడమే ముందుగా చెప్పుకోవాలి. ఆయన రాసిన స్వతంత్ర గ్రంథాలు వేటికవే సాటి. నవరస తరంగిణి, జగజ్జ్యోతి, తారకం, రుబాయత్‌లు, అనేక శతకాలు, నాటకాలు, ప్రబంధాలు వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాలి. 90 రాగాలతో చేసిన దశ విధ రాగ కుసుమ మంజరి విశిష్ట రచన. హరికథా లోకానికి దాసు గారందించినవి గజేంద్ర మోక్షము, మార్కండేయ చరిత్రము, రుక్మిణీ కళ్యాణం, హరిశ్చంద్రోపాఖ్యానమాదిగా పాతికకు పైగా వున్నాయి. ఆయన అచ్చ తెలుగు మాటలు.. న భూతో న భవిష్యతి.
సింహాచల క్షేత్ర దేవుడి అచ్చ తెలుగు పేరు
రెంట త్రాగుడు తిండి మెట్టంటు వేల్పు
రెంట త్రాగుడు - ఏనుగు, రెంట త్రాగుడు తిండి- సింహము ॥
‘గౌరప్ప పెండ్లి’ అనే అచ్చ తెలుగు హరికథలోని రచనలకు పెట్టిన పేర్లు.
వసంత - ఆమని రవళి, శ్రీరాగం - కలిమి రవళి, కేదారగౌళ - పొలముగౌరు రవళి, దర్బారు - దొరకొలువు రవళి, ఖమాస్ - కమ్మెచ్చు రవళి, కాంభోజి - గురువెంద రవళి, తోడి - పెండ్లామె రవళి.
అలాగే... త్రిశ్రజాతి ఏక తాళానికి - మూడు కురుచుల కొలగల చప్పట్లు. - అంటే 3 క్రియల తాళం
చతురస్ర జాతి ఏక తాళానికి నాలుకురచల కొలగల చప్పట్లు (4 క్రియలు)
దాసుగారు లయ బ్రహ్మ. పంచముఖి, షణ్ముఖి, ద్విముఖి తాళ ప్రదర్శన ఆయన ప్రత్యేకత.

తెలుగు భాషాభిమానులకు ఆనందం కలిగించే ఈ అచ్చ తెలుగు పేర్లు వింటే, మన తెలుగు భాష ఇంత గొప్పదా? అని గర్వంగా చెప్పుకునేలా చేస్తాయి.
లలిత సహస్ర నామావళి - ‘తల్లి విన్కి’
విష్ణు సహస్ర నామావళి - ‘వెన్నుని వేయి పేర్ల వినకరి’
నీతి కథలకు - ‘నూరుగంటి’
భగవద్గీత - ‘వేల్పు మాట’
మన్కి మిన్కు - ఆయుర్వేద విషయాలు
సీమ పల్కు - అచ్చ తెలుగు నిఘంటువు.
ఛందస్సులోని వృత్తాలకు దాసుగారు పెట్టిన పేర్లు:
చంపకమాల - తుమ్మెదకంటు
ఉత్పలమాల - కలవదండ
మత్త్భేము - ఏనుగు చెరలాట
శార్దూలము - బెబ్బులి చెరలాట
మత్తకోకిల - గండుకెంపుకంటి
గద్యం - మాట
పీఠిక - కుదురు
ఆంగ్ల భాషా పదాలతో తెలుగు భాష ఎంతో సహకరించారని చెపుతూ వుండేవారు. కర్ణాటక సంగీతాన్నీ, హిందూస్థానీ బాణీని మేళవించి, ఔత్తరాహికులను విస్మయపరిచిన హరికథకుడు ఒక్క దాసుగారే. ఇది ఎవరికీ అంతుపట్టని విషయమంటూండేవారు. నారాయణదాసు గారికంటే వయస్సులో పెద్దైన బాలాజీదాసు కూడా హరికథా గానంలో దిట్ట అంటూండేవారు.
మైసూర్ దర్బార్‌లో మహారాణీ కోరికపై కథాగానం చేయడం, మహారాజా వారి కోరికపై ‘హిందుస్థానీ భైరవి, బేహాగ్’ రాగాలు గ్రామఫోన్ రికార్డులు కూడా ఇచ్చారు. ఉంగుటూరులో సుబ్బయ్య గారింట్లో శ్రద్ధగా కూర్చుని మా తండ్రి నేర్చినవి సుమారు 50 కీర్తనలుంటాయి.
దాసుగారి హరికథలలోని పల్లవులన్నీ వేటికవే సాటి. మా చిన్నతనంలో నేర్చుకున్న కీర్తనలింకా గుర్తే నాకు.
1.రామా రఘుకుల వారిథి సోమ, 2.కన్నవారలెంత ధన్యులో.., 3.నను గన్న తల్లి ఓ నలువరాణీ..., 4. వారణాసీ వారణాసీ, 5. సుజనా వన మోదా, సర్వజగన్నాథా, 6. పెండ్లికూతురు, పెళ్లికొడుకుల్ వెలయు సొగసు భళిరా!, 7. నౌమితే చరణ..., 8. నిదానముగ నీ పదారవిందము.
రాజోలు తాలూకా తాటిపాకలో కొచ్చెర్లకోట రామరాజు గారనే వయొలిన్ విద్వాంసుడు ఎడమచేత్తో కమాన్ పట్టుకుని వాయించేవారట. రామరాజు సోదరుడు రామదాసు గారింట్లో ఏదో వివాహ సందర్భంగా దాసుగారి ‘రుక్మిణీ కళ్యాణం’ హరికథకు తాను కూడా వెళ్లినట్లు, సహకార గానం చేసినట్లు, మా నాన్నగారు చెప్పారు. అంతే కాదు, ఆవేళ దాసుగారు హరికథా గానాన్ని ‘నరహరి భజన నోటనరా నోటనరా.. నోటనకుంటే వినరా’ - అనే కీర్తనతో ప్రారంభించారట.
పిఠాపురం రాజావారు, రాజమహేంద్రవరంలో న్యాపతి సుబ్బరామపంతులు, కందుకూరి వీరేశలింగం పంతులు, వడ్డాది సుబ్బారాయుడు, మైసూర్ మహారాజు జయరామ రాజ ఒడియార్, సి.ఆర్.రెడ్డి లాంటి ప్రముఖులంతా దాసుగారికి సన్నిహితులే. ముఖ్యమైన విషయం - బరంపురంలోని జయంతి కామేశంపంతులు. దాసుగారి పేరు లోక విదితమవడానికి ప్రధాన కారకులు.
సామాన్యులకు అసమానుడు. హరిదాసుకు పితామహుడు, కవులకు మహాకవి, నర్తకులకు నందీశ్వరుడు, నటులలో మహానటుడు, భక్తులకు భాగవతుడు, వేదాంతులకు ఆదిశంకరుడు. వెరసి అపర సరస్వతీ అవతారమూర్తి ఆదిభట్ల. నా తండ్రిగారి మాటల్లో.. దాసుగారికి ప్రథమ గురువన తగ్గ వ్యక్తి టేకుమళ్ల గోవిందరావు. సింహాద్రి అయ్యప్ప వ్యాకరణ గురువు. భాషాంతీకరణంలోని మెళకువలు నేర్పినది.. భాగవతుల హరిశాస్ర్తీ. ఆంగ్ల భాషలో పట్టు సాధించటంలో మల్లాజోస్యుల వెంకన్నగారు ఎంతో సహకరించారని చెపుతూ వుండేవారు.
దాసుగారితో జీవితాంతమూ వెన్నంటి వున్న ఆయన అన్న పేరన్నగారిని మనసారా తలచుకోవాలి. కథాగానంలో పాలూ నీరులా కలిసిపోయిన వారిద్దరూ సమాన గౌరవాన్ని పొందారనటంలో ఆశ్చర్యం లేదు. ఈవేళ సంగీత కచేరీలలో తంబురా అనేది కనిపించదు. మశూచి సోకి మరణానికి చేరువైన మనుమడు సూర్యనారాయణ అనారోగ్యాన్ని అమ్మవారి ఉపాసనతో తనవైపు తిప్పుకున్న ఆదిభట్లవారు అందనంత తీరాలకు వెళ్లిపోయారు. మనుమడి ఆరోగ్యం కోసం ఆయన చేసిన త్యాగం నిరుపమానం.
ఆ రోజుల్లో ‘తంబురా శృతి’తో సహకార గానం చేసిన పేరన్నగారి పేరు, దాసుగారితో సమానంగా వినపడేది. హరికథకు టిక్కెట్టు పెట్టుకుని విన్న రోజులవి. ఇరుప్రక్కలా ఇద్దరు వైణికులు, మృదంగం, శ్రుతి మాధుర్యంతో నిండిన రెండు తంబురాలు, ఆజానుబాహుడైన నారాయణదాసుగారు, వెనుక పేరన్నగారూ, మేఘ గంభీర ధ్వనితో ‘శంభో’ అని పాటందుకునే ఆ సన్నివేశాన్ని నాన్నగారు కళ్లకు కట్టినట్లు చెప్తూండేవారు. మాయ లేకుండా బ్రతుకుతూ, మనుషుల మధ్య అంతరాలను చెరిపేసిన బంగారం లాంటి రోజులవి - నిర్మలమైన గాలీ, మర్మం లేని జీవితాలు గడిపిన వాతావరణంలో చెప్పేవాడికి కూర్చుని వినే శ్రోతలు లోకువ కాదు. విన్న వాళ్లందర్నీ ఉద్ధరించేందుకే పుట్టిన మహా పురుషులు. సూర్య చంద్రులూ, నక్షత్రాలూ, భూమ్యాకాశాలు, అప్పుడూ ఇప్పుడూ ఒక్కటే. మార్పేమీ లేదు - వచ్చిన మార్పంతా మనిషికే...
‘సురస’ హనుమంతుణ్ణి మింగినట్లు, సినిమాలు ఈ జానపద కళారూపాలను మ్రింగేసాయి - హరికథలు, బుర్రకథలు పురాణాలు లేవు. దిక్కుతోచని స్థితిలో సహజమైన కళాకారులు కాస్తా కనుమరుగై పోతున్నారు. ముందూ, వెనుకా, ఎక్కడకు వెళ్లినా మన చుట్టూ సినిమాలే మోహరించి కూర్చున్నాయి. జీవితం కాస్తా యాంత్రికమై పోయింది. మనకున్న ఆయుః ప్రమాణంలో ఏ ఒక్క క్షణమయినా మనస్సును దైవాధీనం చేస్తే ‘మీరు నా వారవుతారు. మీ సంగతి నేను చూసుకుంటానని’ మాట ఇచ్చాడు పరమాత్మ. ‘అలా నడిస్తే ఎన్ని నిబంధనలున్నా, కొన్ని సడలించి ఇంతకంటే ఓ మెట్టు పైకి లాగుతాను సుమా!’ అని కూడా చెప్పాడు. దీనికి, మనం స్మరించుకుంటున్న, ఇదిగో ఈ మహాపురుషులే ఉదాహరణ. రాసేది ఉత్తమ సాహిత్యమై, పాడేది ఆదర్శవంతమైన సంగీతమైతే... దైవ సంకల్పం అనివార్యం కాక మానదు. సత్యమై వారి కీర్తి అజరామరమై నిల్చిపోతుంది. *

- మల్లాది సూరిబాబు 9052765490