S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నమ్మకస్తురాలు ( విలన్స్, స్కౌన్‌డ్రల్స్ అండ్ రాస్కెల్స్)

పోలీసుస్టేషన్లోని లెఫ్టినెంట్ బ్రాండన్ తన దగ్గరికి వచ్చిన ఆవిడ వంక చూశాడు. సుమారు నలభై ఐదేళ్లున్న ఆవిడ ఒంటి మీది దుస్తులు చిరిగి ఉన్నాయి. ఓ చవక మనీ పర్స్‌ని బ్రాండన్‌కి చూపించి చెప్పింది.
‘ఇది నాకు దొరికింది. ఎవరికి ఇవ్వాలి?’
‘నాకే’
దాన్ని అందుకుని అందులో ఉన్న ఐదు డాలర్ల నోట్లని తీసి లెక్కపెట్టాడు. సరిగ్గా వంద డాలర్లు ఉన్నాయి.
‘ఇది నాకు దొరికింది. పాపం చాలా డబ్బు. ఎవరో పారేసుకున్నారు’
ఆవిడ అంత డబ్బుని తన జీవితంలో చూసి ఉండదని బ్రాండన్‌కి అనిపించింది. అతను సార్జెంట్‌ని పిలిచి చెప్పాడు.
‘ఈవిడ స్టేట్‌మెంట్ తీసుకుని ఫారాలు ఫిలప్ చేయి’
‘మీ పేరు?’ సార్జెంట్ ఆమెని తన బల్ల దగ్గరికి తీసుకెళ్లాక అడిగాడు.
‘మేరియా’
‘వృత్తి?’
‘ప్రస్తుతానికి ఏ పనీ లేదు. ఇళ్లల్లో మెయిడ్‌గా పని చేసిన అనుభవం చాలా ఉంది’
‘చిరునామా?’
ఆమె చెప్పిన చిరునామా సేక్రిమెంటో నగరంలో స్పేనిష్ భాష మాట్లాడే బీదవాళ్లు ఉండే ప్రాంతం.
‘నేను బీదదాన్ని. పైగా విధవరాల్ని. ఉద్యోగం లేదు. ఆస్తిపాస్తులు కూడా లేవు’ చెప్తూ ఆవిడ ఆ ఫాం మీద సంతకం చేసింది.
‘ముప్పై రోజుల్లోపల ఈ పర్స్‌ని తమది అని ఎవరూ క్లెయిమ్ చేయకపోతే ఇది మీది అవుతుంది. దీని యజమాని ఇందులోనివి వివరంగా చెప్పగలగాలి. కాబట్టి ముప్పై రోజుల తర్వాత ఏమైందో వచ్చి కనుక్కోండి’ సార్జెంట్ సూచించాడు.
‘ఇది ఎవరిదో కనుక్కుని వాళ్లకి అందజేస్తేనే సంతోషిస్తాను’
‘ఆ ప్రయత్నం ఎటూ చేస్తాను. వాళ్లు మీకు కొంత బహుమతి కూడా ఇవ్వచ్చేమో?’
‘్థంక్ యూ. కాని నాకు బహుమతి కన్నా ఉద్యోగం దొరికితే బావుండును’
అక్కడే ఉన్న టక్సన్ డైలీ దినపత్రికకి చెందిన ఓ రిపోర్టర్‌కి బ్రాండన్ మేరియా నిజాయితీ గురించి చెప్పాడు.
మర్నాడి దినపత్రికలో నిరుద్యోగైన విధవరాలు వంద డాలర్లు దొరికితే పోలీసుస్టేషన్లో ఇవ్వడం గురించి మొదటి పేజీలో బాక్స్ ఐటంగా వచ్చింది.
మధ్యాహ్నానికల్లా లెఫ్టినెంట్ బ్రాండన్‌కి ఆ డబ్బు తమదని అనేక ఫోన్‌కాల్స్ వచ్చాయి. మేరియాకి ఉద్యోగం ఇస్తామని కూడా కొందరు చెప్పారు. బ్రాండన్ స్వచ్ఛందంగా మేరియా తరఫున వాటిని పరిశీలించి వేవర్లీ అనే బ్రహ్మచారి డాక్టర్ దగ్గర ఆవిడని హౌస్ మెయిడ్‌గా కుదిర్చాడు. అతనికి మంచి ప్రాక్టీస్ ఉంది.
నమ్మకం గల పనిమనిషి కోసం వేవర్లి కొంత కాలంగా వెదుకుతున్నాడు. ధనవంతుల కాలనీలో అతనికో ఖరీదైన ఇల్లుంది. తన దగ్గర ఉద్యోగంలో ఉన్నంతకాలం మేరియాకి ఓ గది, మంచి జీతం, ఉచిత వైద్య సహాయం ఇవ్వడానికి అతను అంగీకరించాడు.
ఆ ఉద్యోగం దొరికినందుకు మేరియా చాలా సంతోషించింది. ఆ ఇల్లు పెద్దది, కొత్తది. తోటమాలి కూడా ఉన్నాడు. ఆవిడ రుచిగా వండుతుంది. బ్రేక్‌ఫాస్ట్ తప్ప డాక్టర్ లంచ్‌కి రాడు. రాత్రిళ్లు ఇంట్లో అరుదుగా తింటాడు. అతను సదా బిజీగా ఉండే మనిషి. ఆవిడకి అడ్వాన్స్‌గా జీతం ఇవ్వగానే యూనిఫాం, కేప్, ఏప్రన్లని కొనుక్కొంది. కారణం వేవర్లీ తరచు ధనవంతులైన రోగులకి, మిత్రులకి ఇంట్లో కాక్‌టెయిల్ పార్టీలు ఇస్తూంటాడు. త్వరలోనే అతనికి గతంలో లాగా పార్టీలోని భోజనం కోసం కేటరర్ల మీద ఆధార పడక్కర్లేదని అర్థమైంది. మేరియా చేసే కెనపే అతిథులందరికీ అభిమాన వంటకంగా మారింది. అతిథులు మాట్లాడుకోవడానికి త్వరలోనే మేరియా ఓ టాపిక్ ఐంది. వేవర్లీ ఇంట్లో మేరియా జీవితం ఆనందంగా సాగుతోంది.
త్వరలోనే మేరియాకి వేవర్లీ శృంగార జీవితం ఇద్దరు మహిళల మధ్య విభజింప బడిందని అర్థమైంది. వారిలోని సింథియా వయసు ఇరవై మూడు. ధనవంతురాలు. షెల్లీ వయసు ముప్పై మూడు. ఆమె రాంసే భార్య. ఏభై ఏళ్ల రాంసే తన భార్యతో గడిపే సమయం తక్కువ. కాబట్టి ఫేమిలీ డాక్టరైన వేవర్లీతో సంబంధం పెట్టుకుంది.
మేరియా ఈ సంగతులన్నీ గ్రహించినా నిశ్శబ్దంగానే ఉండిపోయింది. అతను చివరకి సింథియానే పెళ్లి చేసుకుంటాడని అనుకుం. మేరియా షెల్లీ వైపే ఉంది. కారణం ఆమె తనకి, తన ఉద్యోగానికి ప్రమాదకారి కాదు. కాని సింథియా వేవర్లీని పెళ్లి చేసుకుంటే తనని తొలగించే ప్రమాదం ఉంది.
ఓసారి వారిద్దరి సంభాషణని మేరియా విన్నది.
‘మేరియా గొప్ప బహుమతి. సరైన, నిజాయితీ గల సేవకురాలు’ షెల్లీ చెప్పింది.
‘నిజాయితీ గల సేవకురాలా? అసాధ్యం. ఈ రోజుల్లో ఎవరూ నిజాయితీపరులు కారు’ సింథియా దాన్ని ఖండించింది.
మేరియా ఆ సంభాషణని విననట్లే నటిస్తూ కెనపేలని వడ్డించింది.
‘షెల్లీ చెప్పింది నిజం. నేను వెదికే పనిమనిషి సరిగ్గా మేరియానే’ డాక్టర్ చెప్పాడు.
బల్ల మీది ఖాళీ ప్లేట్లని తీసుకుని మేరియా వంట గదిలోకి వెళ్లిపోయింది.
డాక్టర్ వేవర్లీ ప్రాక్టీస్ ప్రారంభించినప్పుడు షెల్లీ పలుకుబడి, మిత్రులు వల్ల అతని ప్రాక్టీస్ పుంజుకుంది. అందుకు షెల్లీ అంటే అతనికి కృతజ్ఞత ఉంది. అతిథులంతా వెళ్లాక కూడా షెల్లీ రాత్రి అక్కడ ఎక్కువసేపు గడిపినా ఆ విషయం బయటకి పొక్కదనే నమ్మకం వారిద్దరికీ మేరియా విషయంలో ఉంది.
* * *
ముప్పై రోజులు గడిచాయి.
‘నువ్వు పోలీసుస్టేషన్‌కి వెళ్లి ఆ వంద డాలర్ల గురించి కనుక్కుని రా. అవి నీ కోసం ఎదురు చూస్తున్నాయనే ఆశిస్తాను. ఒకవేళ అలా కాకపోతే బోనస్‌గా ఆ డబ్బు నేనే ఇస్తాను’ డాక్టర్ వేవర్లీ ఆవిడకి గుర్తు చేశాడు.
మర్నాడు మేరియా పోలీసుస్టేషన్‌కి వెళ్లింది. బ్రాండన్ ఓ ఫాం మీద ఆవిడ సంతకం తీసుకుని, అదే చవక పర్స్‌ని ఇచ్చి చెప్పాడు.
‘ఎవరూ ఇది తమదని సరిగ్గా చెప్పలేక పోయారు. ఏ నోట్లు ఎన్ని ఉన్నాయో అంతా తప్పు చెప్పారు. కాబట్టి చట్టరీత్యా ఈ డబ్బు మీది. ఉద్యోగం ఎలా ఉంది?’
‘మీరు మంచి చోటే ఉద్యోగం ఇప్పించారు. ఇంతదాకా నేను చేసిన అన్ని ఉద్యోగాల్లోకి ఇది బావుంది. థాంక్స్’
వేవర్లీ ఇంట్లో ఆవిడకి ఎలాంటి ఇబ్బందీ లేకుండా సాగిపోతోంది. ఇంటి సరకుల కోసం వేవర్లీ ఆవిడకి కొంత డబ్బుని ఇచ్చాడు. త్వరలోనే ఆవిడ తను కొన్న యూనిఫాం వదులు అవడంతో కొత్త యూనిఫాంని కొన్నది. హెయిర్ డ్రెస్సింగ్ చేయించుకుంది.
‘మేరియా! నీ భర్త గురించి ఎన్నడూ చెప్పలేదు. ఆయన పేరేమిటి?’ ఓ రోజు వేవర్లీ అడిగాడు.
‘వాన్’
‘అందగాడా?’
‘అవును’
‘నీకు ప్రస్తుతం బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడా?’
‘లేడు’
‘ఐతే ఈ రాత్రి బయటకి వెళ్లు. నీకో బాయ్‌ఫ్రెండ్‌ని సంపాదించుకో. నీకు జీతం తృప్తిగా ఉందా? లేక పెంచాలా?’
‘జీతం సరిపోతోంది. కాని సింథియాకి నేనంటే ఇష్టం లేదు’
‘్భయపడకు. నీ ఉద్యోగం పోదు’ హామీ ఇచ్చాడు.
జీవితంలో చాలా చూసిన మేరియా తన బేంక్ అకౌంట్‌లో డబ్బు పడితే కాని ఏదీ నమ్మదు. వేవర్లీ మంచివాడే. కాని సింథియా కాదు. వారానికి ఓసారి వేవర్లీ బీదల హాస్పిటల్‌లో ఉచితంగా వైద్యం చేస్తూంటాడు. అది సింథియాకి నచ్చదు. అతను ఓ పనె్నండేళ్ల బీద మెక్సికన్ కుర్రాడికి ఓ చిన్న ఆపరేషన్‌ని ఉచితంగా చేసినప్పుడు సింథియా చెప్పిన మాటలని మేరియా విన్నది.
‘బీదల హాస్పిటల్లో నువ్వొక్కడివే సర్జన్‌వి కావు. ఆ ఆపరేషన్‌కు నీకు ఎంత వచ్చి ఉండేదో తెలుసా?’
* * *
ఉదయం తొమ్మిది గంటలకి వేవర్లీకి ఆపరేషన్ ఉంది. హాస్పిటల్‌కి ఫోన్ చేసి తను తొమ్మిదికి హాస్పిటల్లో ఉంటానని కన్‌ఫాం చేశాడు. ఎనిమిదిం పావుకి లివింగ్ రూంలోకి వెళ్లాడు. బ్రేక్‌ఫాస్ట్ టేబిల్ మీద సిద్ధంగా లేదు. ఎప్పటిలా మేరియా ఎనిమిదికి బ్రేక్‌ఫాస్ట్ సిద్ధం చేయలేదు. తర్వాత వంట గదిలోకి వెళ్లాడు. ఇల్లంతా తిరిగి చూశాడు. కాని మేరియా ఎక్కడా కనపడలేదు. ఆమె తనకి చెప్పకుండా ఎక్కడికి వెళ్లిందా అని ఆశ్చర్యపోయాడు. ఆలోచించే సమయం లేక హాస్పిటల్‌కి వెళ్లిపోయాడు.
హాస్పిటల్ నించి ఇంటికి రెండుసార్లు ఫోన్ చేసినా మేరియా రిసీవర్ ఎత్తలేదు. ఆ రాత్రి ఇంటిని బయట నించే చూసి లోపల దీపాలు వెలగకపోవడంతో మేరియా ఇంట్లో లేదని గ్రహించాడు. లోపలకి వెళ్లి ఆవిడ ఏదైనా ఉత్తరం రాసి పెట్టి జరూరు పని మీద వెళ్లిందేమోనని వెదికాడు. ఎక్కడా అది లేదు. కొన్ని క్షణాలు ఆలోచించి లెఫ్టినెంట్ బ్రాండన్‌కి ఫోన్ చేసి, మేరియా ఇంట్లోంచి మాయం అయిన సంగతి చెప్పాడు.
పది నిమిషాల్లో బ్రాండన్ ఇంట్లోకి వచ్చాడు. అతను అడిగాడు.
‘మీ ఇద్దరూ గొడవ పడ్డారా?’
‘లేదు’
‘ఆవిడ బంధువుల వివరాలు తెలుసా? ఎవరైనా ఆవిడ కోసం ఇంటికి ఫోన్ చేసేవాళ్లా?’
‘లేదు. తెలీదు.’
‘మీ మాటలకి ఆవిడ బాధ పడి ఉంటుందా?’
‘లేదు. అలాంటిది ఏమీ లేదు’
‘మరి మీకు చెప్పకుండా ఎందుకు వెళ్లిపోయింది?’
‘అదే నాకు చిత్రంగా ఉంది’
బ్రాండన్ రిపోర్ట్ తీసుకుని గుమ్మం దాకా వెళ్లాక ఆలోచనగా ఆగాడు. అలా జరిగి ఉండదన్నట్లుగా తల అడ్డంగా ఊపి బయటకు నడిచాడు. కాని అంతలోనే మళ్లీ లోపలకి వచ్చి వేవర్లీతో చెప్పాడు.
‘మీ ఇంట్లో విలువైనవన్నీ ఉన్నాయా? ఓసారి చూడండి’
‘్ఛ! మేరియా అలాంటిది కాదు’
‘అని నాకు కూడా తెలుసు. ఐనా పోలీస్ బుద్ధి. చూడండి’
వేవర్లీ అయిష్టంగానే ఇంట్లోని విలువైన వస్తువులు అన్నిటినీ తనిఖీ చేసి చెప్పాడు.
‘అన్నీ ఉన్నాయి’
‘మీ డబ్బు ఎక్కడ ఉంచుతారు?’
‘బుక్ షెల్ఫ్‌లో. అక్కడ ఉంచినట్లు మేరియాకి తెలీదు’
‘ఓసారి చూడండి’
పుస్తకాల షెల్ఫ్‌లోని ఓ పుస్తకంలా కనిపించే పెట్టెని తెరిచి చూశాక వేవర్లీ మొహం పాలిపోయింది.
‘ఏమైంది?’
‘నా లాకర్ తాళం చెవి పెట్టె మాయం అయింది’
‘అందులో ఎంతుంది?’
‘లక్ష డాలర్ల విలువైన నగలు, నగదు’
బ్రాండన్ వెంటనే రప్పించిన నిపుణుడు ఓ ఫొటోఫ్రేం వెనకాల ఉన్న ఆ లాకర్ని తెరిచాడు. అది ఖాళీ! వెంటనే బ్రాండన్ మొహం పాలిపోయింది.
‘్ఛ! స్వయంగా నేనే ఓ దొంగని మీ ఇంట్లో పనిమనిషిగా ప్రవేశపెట్టానని నాకు తెలీదు’ బాధగా చెప్పాడు.
‘మేరియా దొంగని నేను నమ్మలేకపోతున్నాను. ఇంకేదో జరిగి ఉండాలి’ వేవర్లీ నమ్మకంగా చెప్పాడు.
‘మరి మేరియా, ఆ విలువైన సొత్తు ఎలా ఏకకాలంలో మాయం అయ్యాయి? సందేహం లేదు. ఇది మేరియా పనే’ బ్రాండన్ చెప్పాడు.
ఆ రెంటికీ సంబంధం ఉండదనే వేవర్లీ నమ్మాడు.
ఐదారు నెలల పాటు బ్రాండన్ మేరియా గురించి ఎంత పరిశోధన చేసినా ఆవిడ ఎక్కడ ఉందో కనుక్కోలేక పోయాడు.
చిరిగిన దుస్తులు ధరించిన ఆవిడ టేంపాలోని ఓ పోలీసుస్టేషన్‌కి వెళ్లి తనకి దొరికిందని వంద డాలర్లు గల ఓ పాత పర్స్‌ని కెప్టెన్‌కి ఇచ్చింది. ఆ నోట్లు గతంలో ఆ పర్స్‌లో ఉన్నవే తప్ప మారలేదు.
‘టేంపా బస్‌స్టేషన్‌లో నాకు ఈ పర్స్ దొరికింది. దీని యజమాని ఎవరో తెలుసుకుని అతనికి అందజేయండి’ ఆవిడ కోరింది.
బీదరాలిలో నిజాయితీ ఉండటం కెప్టెన్ డ్వయర్‌కి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. కొన్ని ఫారాల మీద ఆవిడ సంతకం తీసుకున్నాడు.
ఎప్పట్లానే మర్నాడు స్థానిక దినపత్రికలో ఆ వార్త వెలువడింది. మిసెస్ జూనియన్ నిజాయితీ మెచ్చిన ఎంతోమంది ఆవిడకి ఉద్యోగం ఇవ్వడానికి ముందుకు వచ్చారు. డ్వయర్ తనే స్వయంగా ఓ ఉద్యోగాన్ని ఎంపిక చేశాడు.
అతను వెదికి ఉంటే ఆవిడ హేండ్‌బేగ్‌లో సేక్రిమెంటో నించి టాహోకి వచ్చిన బస్ టిక్కెట్ కనిపించేది. ఇంకా అలాంటి, ఆవిడ సావనీర్లుగా దాచుకున్న డజనుకి పైగా బస్ టిక్కెట్లు కూడా కనిపించేవి.
*

(హెలెన్ నీల్సన్ కథకి స్వేచ్ఛానువాదం)

మల్లాది వెంకట కృష్ణమూర్తి