S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఒక్క తూటా చాలు 23

రాజరాజేశ్వరి ఒంటరి జీవితం వెనుక ఉన్న అనుమానాలు మొత్తం తొలగిపోయాయి. తన దర్యాప్తు వివరాలు కలెక్టర్‌కి వివరించేడు యుగంధర్. రాజరాజేశ్వరి చెల్లెలు సుకాంతి విశాఖపట్నంలో ఉందని తెలిసింది కాబట్టి మరోసారి పేపరు ప్రకటన ఇస్తే ఫలితం ఉంటుంది, ఈ లోపు తను దర్యాప్తు కొనసాగిస్తానని చెప్పాడు.
* * *
సాయంకాలం నాలుగైంది.
చిన్నపిల్లల హాస్పిటల్ దగ్గర ఆగింది ఆటో. రాసమణితోపాటు పసిబిడ్డతో రమణిమాల కూడా దిగింది. ఇద్దరూ లోపలికి నడిచారు. రిసెప్షన్‌లో పేరు రాయించి ఫీజు చెల్లించి టోకెన్ తీసుకుంది రాసమణి. అప్పటికే ఓ ఏభై మంది పేషెంట్స్ ఉన్నారు.
బాగా వెనుక ఖాళీగా ఉన్న కుర్చీల్లో కూర్చున్నారిద్దరూ.
‘రాజేష్‌ని రమ్మనాల్సింది...’ రమణిమాల అంది.
‘ఎందుకు?’ చురుగ్గా చూసింది రాసమణి.
‘ముద్దు చేసినప్పుడే చంక ఎక్కమన్నారు. మన చుట్టూ తిరుగుతున్నప్పుడే మగాడ్ని వాడుకోవాలి’ నవ్విందామె.
‘పనికిమాలిన సలహాలు చెబుతావు’
‘అదేం కాదు కాని నాకు అతన్ని చూడాలని ఉంది’
‘అందరిలాగే రెండు చేతులు, రెండు కాళ్లు ఉంటాయతనికి’
‘కావచ్చు. కాని ఎలాంటి స్వలాభం లేకుండా నీకు మంచి చెయ్యాలనే ఆలోచన ఉంది అతని దగ్గర. అలాంటి మనుషులు అరుదుగా మాత్రమే కనిపిస్తారు. ఆ మనిషిని చూడాలని కోరుకోవడంలో తప్పేం లేదుగా...’
రాసమణి మాట్లాడలేదు. రాజేష్ గురించి ఆలోచించకూడదని అనుకున్నా రమణిమాల రోజులో ఒక్కసారైనా గుర్తు చేస్తుంది. జీవితంలో నేర్చుకున్న పాఠానికి భిన్నంగా ఓ మనిషి తారసపడేసరికి తనలాగే ఆమె కూడా ఆశ్చర్యపడిందని గ్రహించింది. పెళ్లి చేసుకుని హాయిగా జీవించాల్సిన ఓ యువకుడికి ఇబ్బందులు కలగకూడదని ఆమె ఆలోచన.
..... ....
ఇద్దరి మధ్య వౌనం కొనసాగింది.
ఇంతలో టోకెన్ నెంబర్ పిలవడంతో కూతుర్ని తీసుకుని కన్సల్టింగ్ రూము వైపు కదిలింది రాసమణి.
* * *
‘కాలొచ్చింది.. నేను వెళుతున్నాను’ బయటకి నడుస్తూ చెప్పింది రమణిమాల.
ఆమె వెళ్లాక తలుపు మూసి గడియ పెట్టింది రాసమణి. ఉదయం ఆరుకి తిరిగొస్తుంది రమణిమాల. వచ్చిన తర్వాత అపార్ట్‌మెంట్ నుంచి బయలుదేరి తిరిగొచ్చిన దాకా మొత్తం రన్నింగ్ కామెంట్రీ వినిపిస్తుంది. దురుసు మనిషిలా కనిపిస్తుంది కాని చాలా మెత్తని మనసు ఆమెది. ఎవరికైనా కష్టం వస్తే చూడలేదు. దేవుడు అన్యాయం చెయ్యకపోతే మంచి గృహిణిగా స్థిరపడేది.
ఆలోచిస్తూ మంచం మీద వాలిందామె.
అపార్ట్‌మెంట్ దగ్గర నుంచి రమణిమాలని తీసుకుని కారు వెళ్లిన రెండు నిముషాలకి స్కూటర్ మీద వచ్చాడు షరీఫ్. సిగరెట్ వెలిగించుకుని బలంగా రెండు దమ్ములు లాగాడు. అప్పటికే కడుపులో చేరిన మద్యం నరాల్లో ప్రవహిస్తూ ఉండటంతో శరీరం కొద్దిగా తూలుతోంది. లాసన్స్ బే కాలనీలో ఓ మధ్య సందులోని అపార్ట్‌మెంట్ సముదాయం కావడంవల్ల నిర్మానుష్యంగా ఉంది.
సిగరెట్ కాల్చడం పూర్తి చేసి లోపలికి నడిచి లిఫ్ట్ ఎక్కాడు. అది నాల్గవ అంతస్తులో ఆగాక తలుపు తెరచుకుని బయటకొచ్చాడు. తడబడుతున్న అడుగులతో ఫ్లాట్ ముందు ఆగి కాలింగ్‌బెల్ నొక్కాడు. మరోసారి నొక్కాక లోపలి నుంచి రాసమణి అడిగింది.
‘ఎవరు?’
‘షరీఫ్‌ని..’ చెప్పాడు.
‘ఇప్పుడెందుకొచ్చావ్?’
‘అర్జంట్ పనొచ్చింది’
‘ఏమిటో చెప్పు?’
‘బయట నుంచి చెప్పేది కాదు. మనం వెంటనే అపార్ట్‌మెంట్ ఖాళీ చెయ్యాలి. లేకపోతే ప్రమాదం’
రాసమణి తలుపు తీసింది.
విసురుగా లోపలికి ప్రవేశించి తలుపు మూసి బోల్టు పెట్టి వంకరగా నవ్వి చెప్పాడు.
‘నీ కోసమే వచ్చాను’
‘ఏం తల తిరుగుతోందా?’ కోపంగా అందామె.
‘ఈ రోజు నా కోరిక తీర్చుకోవడానికి వచ్చాను...’ అంటూ కదిలేడు.
రాసమణి నిలబడిన చోటు నుంచి ఒక్క అంగుళం కూడా కదల్లేదు. నిశ్చలంగా అతన్ని చూస్తూ చెప్పింది.
‘నీకు రోజులు దగ్గర పడ్డాయి’
‘ఏం చూసుకునే నీ పొగరు. ముఖంలో అందముందనా? ఒంట్లో మెరుపుందనా?’ ఓ రెండడుగులు వేశాడు.
అప్పుడు కదిలింది రాసమణి. దిండు కింద నుంచి కత్తి తీసింది.
‘నీ నక్క తెలివితేటలు నాకు తెలుసు. ఈ రోజు రమణిమాల బయటకు వెళుతున్నప్పుడే నువ్వొస్తావని ఊహించాను. ఇక్కడ నిన్ను చంపినా నేరం కాదు’
‘తప్పుగా ఆలోచిస్తున్నావ్... నీ అంతు చూస్తాను’ అరిచేడు షరీఫ్.
‘ముందు ఇక్కడ నుంచి బయటకు నడు. తర్వాత నా అంతు చూడొచ్చు. లేదంటే నీ అంతు నేను చూస్తాను’ స్థిరంగా అంది రాసమణి.
ఆమె అంత ధైర్యంగా తనని ఎదిరిస్తుందని ఊహించక పోవడంతో దెబ్బ తిన్నాడు.
‘కోరి కష్టాలు తెచ్చుకుంటున్నావ్...’ అని విసురుగా తలుపు తెరచి బయటకు నడిచాడతను.
మరుక్షణం తలుపు మూసి బోల్టు వేసింది రాసమణి. అప్పటికే ఆమె ముఖం పాలిపోయింది.
ఒక రాత్రి తను లేనప్పుడు తాగొచ్చి బలవంతంగా రమణిమాలని అనుభవించాడని తెలుసు. అంతేకాదు, అతను వచ్చినప్పుడల్లా తన వంక ఆకలిగా చూడటం గమనించింది. అతను వస్తాడని ఊహించి జాగ్రత్త పడింది. మనిషి మాంసం రుచి మరిగిన పులిలాంటి వాడు షరీఫ్. అతన్ని తప్పించుకోవడం అంత తేలిక కాదు.
అప్పుడు గుర్తొచ్చాడు రాజేష్!
15
ఆ రోజు సోమవారం.
పోలీసు కమీషనర్ కార్యాలయం దగ్గర జనం ఎక్కువగా ఉన్నారు. ప్రతీ సోమవారం ఉదయం పది నుండి పనె్నండు వరకూ ప్రజల నుండి ఫిర్యాదులు తీసుకుంటాడు కమీషనర్. అంతేకాకుండా పనె్నండు నుంచి ఒంటి గంట వరకూ ‘డయల్ యువర్ కమీషనర్’ కార్యక్రమం ఉంటుంది. ఎక్కడ నుంచైనా ఎవరైనా నేరుగా కమీషనర్‌తో మాట్లాడొచ్చు.
రిసెప్షన్‌లోని వ్యక్తి కమీషనర్ని కలవడానికొచ్చిన వారి వివరాలు రాసుకుంటున్నాడు. విజిటర్స్ కోసం వేసిన కుర్చీలు నిండిపోవడంతో కొంతమంది నిలబడ్డారు.
సరిగ్గా పది గంటలకి వచ్చాడు కమీషనర్. ఒక్కసారిగా అక్కడ హడావుడి నెలకొంది. కమీషనర్‌తోపాటు డిప్యూటీ కమీషనర్, అసిస్టెంట్ కమీషనర్ కూడా ఆఫీసు గదిలోకి వెళ్లారు. ఓ పది నిమిషాల తర్వాత కాలింగ్ బెల్ మోగింది. తను రాసుకున్న లిస్టు ప్రకారం అరవై దాటిన వ్యక్తిని కమీషనర్ రూములోకి పంపాడు రిసెప్షనిస్టు. గదిలోని ముగ్గురు అధికార్లకి నమస్కారం చేశాడు ఆ వ్యక్తి.
‘చెప్పండి...’ కమీషనర్ అన్నాడు.
‘నేను రిటైర్డ్ టీచర్ని సార్! డాబా గార్డెన్స్‌లో ఓ ఇంట్లో అద్దెకుంటున్నాను. మంచినీటి కొళాయి వద్ద మాటలు తేడా వచ్చి ఇంటి ఓనర్ కొడుకు నా మీద చెయ్యి చేసుకున్నాడు. పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. ఇంటి ఓనర్ డబ్బు ఖర్చు పెట్టి అతని భార్య పట్ల అసభ్యంగా ప్రవర్తించానని ఎదురు కేసు పెట్టించాడు. నా కేసు విత్‌డ్రా చేసుకోకపోతే అరెస్ట్ చేసి రిమాండ్‌కి పంపుతానని స్టేషన్ ఎస్సై బెదిరిస్తున్నారు. మీరే న్యాయం చెయ్యాలి...’ చెప్పాడు ఆ వ్యక్తి.
అతని నుండి ఫిర్యాదు కాగితం తీసుకుని దాని మీద ఏదో రాసి డి.సి.పి. ముందుకి తోశాడు కమీషనర్. తర్వాత ఆ వ్యక్తితో చెప్పాడు.
‘ఎంక్వయిరీ చేసి చర్య తీసుకుంటాను. మీరు నిశ్చింతగా ఇంటికి వెళ్లండి’
ఓ గంటసేపు ఆ కార్యక్రమం నిర్విరామంగా జరిగింది. విజిటర్స్ లేకపోవడంతో ఆ ముగ్గురికి కాఫీ తెచ్చాడు ఆర్డర్లీ.
గ్రీవెన్స్ సెల్ ప్రజలకి ఎంతవరకు ఉపయోగపడుతున్నదనే విషయం పక్కనపెడితే ప్రజల నుండి వచ్చే ఫిర్యాదుల ద్వారా పోలీసు సిబ్బంది పనితీరు అర్థమవుతోంది. గతంలో స్పెషల్ బ్రాంచ్ మీద ఆధారపడి అంచనా వేసేవారు. దాని ద్వారా వచ్చే సమాచారంతో కొంతవరకే నిజం ఉండేది. ఇప్పుడు నేరుగా ప్రజల నుండే వస్తోంది సమాచారం. ఏ అధికారి ఎలాంటి వాడో, సిబ్బంది ఎలా పనిచేస్తున్నారో ఎవర్నీ అడగాల్సిన పని లేదు.
అదే సమయంలో యుగంధర్ లోపలికి ప్రవేశించి సెల్యూట్ చేశాడు.
‘కూర్చో... నీ దర్యాప్తు ఎంతవరకు వచ్చింది?’
తన ఇనె్వస్టిగేషన్ గురించి వివరించడానికి అరగంట పట్టింది యుగంధర్‌కి. ఆ ముగ్గురు చాలా ఆసక్తిగా విన్నారు. సరిగ్గా అప్పుడే కమీషనర్ ముందున్న ల్యాండ్‌లైన్ రింగయింది.
‘హల్లో.. పోలీసు కమీషనర్ స్పీకింగ్!’ రిసీవర్ అందుకుని చెప్పాడు.
‘నా పేరు రాజేష్ సార్!’ అటు నుంచి వినిపించింది.
‘చెప్పండి’
ఓ క్షణం నిశ్శబ్దం తర్వాత ఆ గొంతు చెప్పింది.
‘విశాఖపట్నం సిటీలో హైటెక్ వ్యభిచారం జరుగుతోంది సార్!’
కమీషనర్ నొసలు ముడిపడింది.
‘సిటీలో ఎక్కడ?’ అడిగేడు.
‘డబ్బు చెల్లించి చిరునామా చెబితే ఎక్కడకయినా అమ్మాయిల్ని పంపుతారు. యువతులే కాదు, యువకులు కూడా ఉన్నారు..’
‘ఇదంతా మీకెలా తెలిసింది?’
‘తెలుసుకున్నాను సార్! ఈ మధ్య ఓ యువకుడ్ని హత్య చేశారని నా అనుమానం. కొన్ని సాక్ష్యాలు సంపాదించాను’
‘అయితే మీరో పని చెయ్యండి. కంట్రోలు రూమ్‌లోని క్రైం బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ని కలవండి. ఈ కేసు అతనే చూస్తున్నాడు. ఆ ఇన్‌స్పెక్టర్‌కి నేను చెబుతాను’ చెప్పి ఫోన్ పెట్టేశాడు కమీషనర్. వెంటనే కాలింగ్ బెల్ నొక్కాడు. ఆఫీస్ ఆర్డర్లీ వచ్చాక చెప్పాడు.
‘క్రైం బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ని రమ్మను’
ఆ గదిలో నిశ్శబ్దం అలముకుంది. కమీషనర్ ముఖంలోని సీరియస్‌నెస్ చూసి ఎవరూ మాట్లాడే ప్రయత్నం చెయ్యలేదు. ఓ రెండు నిమిషాల తర్వాత మఫ్టీలోని ఎస్సై ఒకతను వచ్చి కమీషనర్‌కి సెల్యూట్ చేశాడు. అతను ర్యాంకర్ అని చూడగానే అర్థమవుతోంది.
‘మీ ఇన్‌స్పెక్టర్ ఎక్కడ?’ అడిగేడు కమీషనర్.
‘పది గంటలకి ఆఫీస్‌కి బయలుదేరినప్పుడు స్ట్రోక్ వచ్చిందట సార్! సెవెన్ హిల్స్‌లో అడ్మిట్ చేశారట. డ్రైవర్ ఫోన్ చేశాడు’
‘మీరు వెళ్లలేదా చూడటానికి?’
‘లంచ్ టైమ్‌లో వెళతాను సార్!’
అతన్ని పంపేసి ఓ క్షణం ఆలోచించాడు కమీషనర్.
‘యుగందర్! ఇప్పుడు నువ్వు అర్జంట్‌గా వెళ్లి పెందుర్తిలో జాయిన్ కావాల్సినంత అవసరం ఏమీ లేదు. ఓ ముఖ్యమైన కేసులో మనకి సాక్ష్యం చిక్కబోతున్నది. ఓ మనిషి సమాచారం ఇవ్వడానికి క్రైం బ్రాంచ్‌కి రాబోతున్నాడు. అందుకని వెంటనే వెళ్లి క్రైం బ్రాంచ్ ఛార్జి తీసుకో...’ చెప్పాడు.
మరి కొన్ని నిమిషాల తర్వాత ఆ గది నుంచి బయటకొచ్చాడు యుగంధర్. కమీషనర్ కార్యాలయ ఆవరణలోనే ఉంది కంట్రోలు రూము. అటు నడిచి కంట్రోల్ రూమ్ మెట్లెక్కి క్రైం బ్రాంచ్‌లోకి ప్రవేశించాడు. అంతకు ముందు కమీషనర్ దగ్గరకొచ్చిన ఎస్సై యుగంధర్‌కి సెల్యూట్ చేశాడు.
యుగంధర్ బదులుగా తలూపి కుర్చీలో కూర్చుని అడిగాడు.
‘ఇక్కడ మీరెంత కాలం నుంచి పని చేస్తున్నారు?’
‘నాలుగేళ్ల నుంచి చేస్తున్నాను సార్!’ చెప్పాడతను.
‘సిటీలో జరుగుతున్న హైటెక్ వ్యభిచారం గురించి మన దగ్గర ఏదైనా సమాచారం ఉందా?’
‘ఇంటర్వ్యూ ద్వారా అమ్మాయిల్ని, అబ్బాయిల్ని సెలెక్ట్ చేస్తున్నారని కనుక్కున్నాం సార్! అలాంటి ఇంటర్వ్యూకి ఓ ఇన్‌ఫార్మర్ని పంపాం. కాని ఆ ప్రయత్నం ఫెయిలైంది’
‘్భపతి అనే మనిషి పేరు ఎప్పుడైనా విన్నారా?’
‘లేదు సార్!’
రెండు క్షణాలు ఆలోచించి చెప్పాడు యుగంధర్.
‘మన క్రైం రికార్డులో భూపతి పేరు ఉందేమో చూడాలి. ఆ పేరు మీద ఎంతమంది ఉన్నారో, వారి నేర చరిత్ర ఏమిటో నాకు కావాలి...’
‘అలాగే సార్!’ చెప్పి, అతను బయటకు నడిచి కంప్యూటర్ రూములోకి వెళ్లాడు.
గతంలో ప్రతీ స్టేషన్‌లో నేమ్ ఇండెక్స్ మెయింటెన్ చేసేవారు. అల్ఫాబెటికల్ ఆర్డరులో నేరస్థుల వివరాలు నమోదు చెయ్యడం వలన కావాల్సిన పేరు వెదకడం సులభమయ్యేది. అయితే ప్రతీ స్టేషన్‌కీ వెళ్లి ఆ రికార్డు చూస్తే తప్ప కమిషనరేట్ పరిధిలోని నేరస్థుల వివరాలు దొరికేవి కావు. కాని ఇప్పుడు మొత్తం నేరస్థుల వివరాలు కంప్యూటర్‌లో ఫీడ్ చెయ్యడంవల్ల ఓ పేరు గల వ్యక్తి నేర చరిత్ర తెలుసుకోవడం చాలా తేలిక.
సమాచారం ఇవ్వడానికి రాబోయే వ్యక్తి గురించి ఎదురు చూడసాగేడు యుగంధర్.
* * *

(మిగతా వచ్చే వారం)

-మంజరి 9441571994