S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

దొంగ (విలన్స్, స్కౌన్‌డ్రల్స్ అండ్ రాస్కెల్స్)

ఆ శుక్రవారం సాయంత్రం నాలుగుకి నేను ఎయిర్‌పోర్ట్ నించి మా ఇంటికి చేరుకునే సరికి సూట్లోని ఓ లావుపాటి పొట్టి వ్యక్తి మా ఇంటి తలుపు మూస్తూ నాకు కనిపించాడు. అతను పూర్తిగా అపరిచితుడు అవడంతో అతను నా ఇంట్లోకి ఎలా వెళ్లగలిగాడు, అసలు అక్కడ ఏం పని అనే ఆశ్చర్యం నాకు కలిగింది.
నా కారుని చూడగానే అతను కదలకుండా నిలబడి పారిపోడానికి దారి కోసం అటూ, ఇటూ చూశాడని నాకు అనిపించింది. కాని, అటూ ఇటూ కంచెలా సైప్రస్ చెట్లు ఉండటంతో అతనికి దారి లేదు. దాంతో నేను కారుని పోర్చ్ ముందు ఆపుతూంటే అతను కదలకుండా నిలబడి నా కారు వంక గుడ్లప్పగించి చూడసాగాడు. నేను అతనికి ముప్పై అడుగుల దూరంలో ఉండగా నవ్వాడు. అది కృత్రిమమైన నవ్వులా నాకు తోచింది.
‘ఎవరు నువ్వు? నా ఇంట్లో ఏం చేస్తున్నావు?’ గదమాయించాను.
‘ఇది మీ ఇల్లా? ఐతే మీరు జేమ్స్ లూయిస్ కాదు కదా?’ అడిగాడు.
‘నీకు నా పేరు ఎలా తెలుసు?’ ప్రశ్నించాను.
‘మీ పేరు మీ ఉత్తరాల పెట్టె మీద ఉంది మిస్టర్ లూయిస్’ అతను జవాబు చెప్పాడు.
‘సరే. నా ఇంట్లో ఏం చేస్తున్నావు?’ మళ్లీ అడిగాను.
అతను అయోమయంగా చూస్తూ చెప్పాడు.
‘కాని నేను మీ ఇంట్లోకి వెళ్లలేదు’
‘అబద్ధం ఆడక. నువ్వు నా ఇంటి తలుపుని మూయడం చూశాను’
‘లేదు సర్. మీరు పొరబడ్డారు. నేను బెల్ కొట్టి జవాబు లేకపోవడంతో తలుపు నించి వెనక్కి నడుస్తూండగా చూశారు’ చెప్పాడు.
‘నేనేం చూశానో, చూడలేదో నాకు చెప్పక. నా కంటిచూపులో లోపం లేదు. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు?’
‘నేను ఈజీ వే వేక్యూం క్లీనర్ కంపెనీ సేల్స్‌మేన్‌ని. మీరు ఒకటి కొంటారా అని అడగడానికి...’
‘నీ ఐడెంటిఫికేషన్ చూపించు’ కోరాను.
తన కోట్ జేబులో చేతిని ఉంచి వెదికి విజిటింగ్ కార్డ్‌ని తీసి నాకు ఇచ్చాడు. దాని ప్రకారం అతని పేరు మోరిస్ ట్వీడ్ అని, ఈజీ వే వేక్యూం క్లీనర్ సేల్స్‌మేన్ అని తెలిసింది.
‘నీ డ్రైవర్స్ లైసెన్స్ చూపించు’ కోరాను.
‘డ్రైవర్స్ లైసెన్సా?’ భయంగా అడిగాడు.
‘అవును. ఇది నీ ఐడెంటిఫికేషన్ కాదు’
అతనిలోని భయం అధికం అయింది.
‘ఇది చాలా ఇబ్బందికరం మిస్టర్ లూయిస్. ఈ ఉదయమే నా మనీ పర్స్‌ని పోగొట్టుకున్నాను’ మెల్లిగా చెప్పాడు.
నేను అతని కోటు పట్టుకుని వెనక్కి తలుపునకు అదిమి పెట్టాను. అతను నా పట్టులోంచి తన కోటుని విడిపించుకునే బలహీన ప్రయత్నం చేయసాగాడు. అదే సమయంలో తలుపు పిడిని తిప్పాను. తెరచుకోలేదు. ఐతే తలుపు పిడికి ఉన్న నాబ్‌ని తిప్పి మూస్తే తలుపు యాంత్రికంగా లాక్ అవుతుంది.
సగం భయం, సగం కోపంతో కూడిన కంఠంతో అతను చెప్పాడు.
‘నేనేం తప్పు చేయలేదు. నన్నిలా నిర్బంధించే హక్కు మీకు లేదు’
‘అదీ చూద్దాం’
నేను జేబులోంచి తాళం చెవుల గుత్తిని తీసి, తలుపు తాళం తెరిచి అతన్ని లోపలకి తోసి వెనకే నడిచి తలుపు మూశాను. కొద్దికాలం తలుపులు మూసి ఉంటే వచ్చే మాగుడు వాసన లాంటిది ఇంట్లో వేస్తోంది. నేను మా ఇంట్లోంచి నా వృత్తిపరమైన పని మీద న్యూయార్క్‌కి వెళ్లి ఎనిమిది రోజులైంది. పది రోజుల పని ముందుగా పూర్తవడంతో రెండు రోజుల ముందే తిరిగి వచ్చాను. నేను అతన్ని కుర్చీలోకి తోసి, కూర్చోబెట్టి గాలి కోసం ఫ్రెంచ్ డోర్‌ని తెరిచాను. తర్వాత హాల్ మొత్తం చూశాను. అన్ని వస్తువులూ ఉన్నాయి. ఖరీదైన టివి, స్టీరియో, గడియారం హాల్లో ఉన్నాయి.
‘కోటు విప్పు’ ఆజ్ఞాపించాను.
‘కోటు విప్పాలా? మిస్టర్ లూయిస్. ఇదేం బాలేదు’ అతను చిరాగ్గా చెప్పాడు.
‘విప్పు’ గర్జించాను.
అతను మారు మాట్లాడకుండా దాన్ని విప్పాడు. నేను అతని కోటు జేబులన్నీ ఖాళీ చేశాను. అరవై ఐదు డాలర్లు, చేతి రుమాలు, అనేక విజిటింగ్ కార్డులు బయటపడ్డాయి. నాకు చెందినవి ఏవీ వాటిలో లేవు. విజిటింగ్ కార్డుల్లోని మనుషుల, కంపెనీల పేర్లు వేరువేరు. నాకు ఇచ్చిన కార్డ్ డూప్లికేట్ ఇంకోటి లేదు.
‘నీ పేరేమిటి?’ అడిగాను.
‘మోరిస్ ట్వీడ్. అవన్నీ నాకు నా కస్టమర్లు ఇచ్చిన విజిటింగ్ కార్డులు. నా కార్డులు నా పర్స్‌లో ఉన్నాయి. అది ఇవాళ ఉదయం పోయిందని ఇప్పటికే మీకు చెప్పాను’
‘నీ పేంట్ జేబుల్లోవీ బయటకి తీయి’
అతను నిట్టూర్చి, లేచి నించుని మూడు క్వార్టర్లు, ఓ పది పెన్నీల నాణెం, ఓ పెన్నీ, ఓ తాళం చెవుల గుత్తీ తీశాడు.
‘మిస్టర్ లూయిస్. మీరు నన్ను అపార్థం చేసుకున్నారు. నేను దొంగని కాను. వేక్యూం క్లీనర్ కంపెనీ సేల్స్‌మేన్‌ని. మీకు చెందినవి ఏవీ నా దగ్గర లేవని మీ పరీక్షలో తేలిందిగా’
తగిన సాక్ష్యం దొరక్కపోయినా ఎందుకనో అతను దోషి అని అతని బెరుకుని చూశాక నాకు అనిపించసాగింది. అతను నా ఇంట్లోంచి బయటకి రావడం చూశాను. నాకు చెందినది ఏదో ఇతను దొంగిలించాడని, దాన్ని నేను కనుక్కోలేక పోయానని బలంగా అనిపించసాగింది. కాని ఏది అది? ఎక్కడ దాచాడు?
కోటు కోసమైనా ఉంటాడని, అతన్ని కూర్చోమని అతని కోటుని తిరిగి ఇవ్వకుండా నేను ఇల్లంతా కలియ తిరిగి చూశాను. విలువైనవి కాని, విలువ లేనివి కాని సామానంతా యథాస్థానాల్లో కనిపించాయి. ఏం పోలేదని నిశ్చయించుకున్నాక అతనికి తిరిగి కోటుని ఇచ్చేశాను. దాన్ని తొడుక్కుంటూంటే అతని మొహంలో రిలీఫ్ కనిపింది. నాకు నా మీదే అనుమానం మొదలైంది. అతను ఇంట్లోంచి బయటకి రావడం నేను నిజంగా చూశానా? లేక భ్రమ పడ్డానా?
కాని అతను భయపడటం, అతని ఐడెంటిఫికేషన్ కార్డ్ దగ్గర లేకపోవడం నాకు మళ్లీ అనుమానాన్ని కలిగించింది. ఐతే అతను నిర్దోషి అనుకుని ఆలోచిస్తే ఆ రెండూ కాకతాళీయంగా జరిగాయని, అతను నా ఇంట్లోంచి నిజానికి దేన్నీ దొంగిలించలేదని, ఒకవేళ అతను దొంగే ఐతే నేను ఇంట్లో లేనని గమనించి వచ్చాడని, దొంగతనానికి మళ్లీ వేన్‌తో రావాలని అనుకుని, సామాను చూసుకుని బయటకి వచ్చి ఉండచ్చనీ అనుకున్నాను. కాని దొంగలు ఒకే ఇంటికి రెండుసార్లు అలా రారు. అన్ని ఏర్పాట్లు చేసుకునే వస్తారు. పైగా విలువైన దేన్నైనా దొంగబుద్ధితో జేబులో వేసుకోకుండా దొంగ బయటకి నడవడు.
అతను దొంగ కానప్పుడు ప్రైవేట్ డిటెక్టివ్ అయి ఉండచ్చు. కాని నా మీద అపరాధ పరిశోధన జరపాల్సిన అవసరం ఎవరికీ లేదు. నేను ఎలాంటి నేరాలు చేయని సాధారణమైన వ్యక్తిని. నా వృత్తిని నేను నిజాయితీగా నిర్వర్తిస్తున్నాను.
‘నేను దొంగని కానని మీరు నమ్మారా మిస్టర్ లూయిస్?’ కొద్ది క్షణాల తర్వాత అతను నా వౌనపు ఆలోచనలని అర్థం చేసుకున్నట్లుగా అడిగాడు.
‘నువ్వు లోపలకి వచ్చి ఏం చేసావో చెప్పు’ ఈసారి బలహీనంగా గద్దించాను.
‘నేను ఇంతకు మునుపు ఇక్కడికి రాలేదు. మీతోనే ఈ ఇంట్లోకి అడుగుపెట్టింది, మిస్టర్ లూయిస్. నన్ను దయచేసి వెళ్లనివ్వండి. మీకు నన్నిలా నిర్బంధించే హక్కు లేదు. ఐనా పోలీసులకి మీ మీద ఫిర్యాదు చేయను’ కొద్దిగా తీవ్రంగా, కొద్దిగా బాధగా చెప్పాడు.
‘ఏం ఫిర్యాదు?’ ప్రశ్నించాను.
‘కిడ్నాపింగ్, నిర్బంధించి ఇబ్బంది పెట్టడం, భౌతిక, మానసిక హింసలు. మీరు దయచేసి పోలీసులకి ఫోన్ చేసి నేను దొంగనని ఫిర్యాదు చేయండి. నేను ఎదురు ఫిర్యాదు చేశాక ఎవరి దారిన వాళ్లం వెళ్లిపోదాం’
నాలోని అనుమానం, కోపం చప్పబడిపోయాయి. అతనికి ఎదురు ఫిర్యాదుకి అవకాశం ఉంది.
‘నేను వెళ్లచ్చా?’ అతను అడిగాడు.
నేను తల ఊపడం తప్ప ఇంకేం చేయలేకపోయాను. అతను ఇంట్లోంచి వేగంగా బయటకి నడిచాడు. ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడకుండా రోడ్ మీదకి వెళ్లి మాయం అయ్యాడు.
ఆ లావుపాటి వ్యక్తి నాకు చెందిన దేన్నో దొంగిలించాడు అనే నా నమ్మకం మాత్రం చెదరలేదు. అది ఎప్పుడో అప్పుడు నా దృష్టికి వచ్చి తీరుతుంది అనుకున్నాను.
* * *
అదేమిటో నాకు మర్నాడు ఉదయం తెలిసింది.
ఉదయం పదిం ముప్పావుకి డోర్ బెల్ మోగింది. తలుపు తెరిచి చూస్తే ఎదురుగా ఏభైలలోని ఓ జంట నిలబడి ఉన్నారు. వారు ఇద్దరూ ఆనందంగా కనపడ్డారు. గతంలో నేను వారిని ఎన్నడూ చూడలేదు.
‘మీరు మిస్టర్ లూయిస్ అనుకుంటాను?’ ఆయన అడిగాడు.
‘అవును. మీరు?’ ప్రశ్నించాను.
‘ఇటుగా వెళ్తూ ఇంటి బయట కారుని చూసి అది మీదై ఉంటుందని అనుకుని వచ్చాం. మిమ్మల్ని వ్యక్తిగతంగా కలవాలని ఆగాం’ ఆవిడ ఆనందంగా చేతిని చాపుతూ చెప్పింది.
నేను యాంత్రికంగా వారితో కరచాలనం చేశాను.
‘ఈ ఇల్లు ఎంతో బావుంది. ఇది మాకు బాగా నచ్చిందని చెప్పక తప్పదు’ ఆయన చిరునవ్వుతో చెప్పాడు.
‘నా ఇంటిని మీరు ఎప్పుడు చూశారు?’ అడిగాను.
‘నిన్ననే. మీ ఏజెంట్ దీన్ని చూపించాడు. అంత సబబైన ధరకి మీరు అమ్మినందుకు థాంక్స్’
‘సబబైన ధర ఏమిటి?’ అయోమయంగా చూస్తూ అడిగాను.
‘ఈ ఇంటికి లక్ష డాలర్లు సబబైన ధరే కదా మరి’ ఆవిడ చిరునవ్వుతో చెప్పింది.
‘ఏమిటి మీరు చెప్పేది...’
వారిని ప్రశ్నించాక నాకు తెలిసింది, నా ఏజెంట్‌లా నటించిన ఆ మోసగాడు క్రితం మధ్యాహ్నం నా తరఫున వారికి ఈ ఇంటిని చూపించాడని, అతనికి లక్ష డాలర్ల డిమాండ్ డ్రాఫ్ట్‌ని ఇచ్చారని, అతను వారికి నా సంతకాలు గల నోటరైజ్డ్ సేల్స్ అగ్రిమెంట్‌ని ఇచ్చాడని, వెంటనే పోలీసులకి ఫోన్ చేశాను.
వారి ఇంటికి వెళ్లి ఆ కాగితాలని చూశాక ఆ సంతకాలు చక్కగా ఫోర్జరీ చేయబడ్డాయని తెలుసుకున్నాను. కాని నేను అవి ఫోర్జరీవి అని కోర్టులో రుజువు చేయగలనా అనే సందేహం కలిగేంత చక్కగా నా సంతకాలని పోలి ఉన్నాయి. పోలీసులు ఓ కాగితం ఇచ్చి నేను ఎప్పుడూ పెట్టే సంతకాన్ని పెట్టమని కోరారు. వారు కోరినట్లుగా నాలుగుసార్లు సంతకం చేశాను. నేను బోగస్ ఏజెంట్‌తో చేతులు కలిపి ఈ జంట నించి లక్ష డాలర్లు కొట్టేసానని పోలీసులు అనుమానపడ్డారని నాకు వారి ప్రశ్నలని బట్టి అర్థం అయింది. ఆ సంతకాలు చూశాక వారికి అలా అనిపించడంలో ఆశ్చర్యం లేదు.
నేను ఊహించినట్లుగానే ఆ లావుపాటి వ్యక్తి దొంగే అని నాకు అర్థమైంది - ఆలస్యంగా.
అతను నా ఇంట్లోంచి ఏం దొంగిలించలేదు.
నా ఇంటినే దొంగిలించాడు.
*

మల్లాది వెంకట కృష్ణమూర్తి