S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కనబడుట లేదు

న్యూయార్క్ పోర్ట్‌లో లండన్‌కి వెళ్లే ఓ నౌక సిద్ధంగా ఉంది. ప్రయాణీకులు ఓడ ఎక్కుతున్నారు. తన భర్త జాన్ కోసం ఎదురుచూసే రూత్‌కి సిగరెట్ తాగుతూ వస్తున్న అతను కనిపించాడు.
‘ఈ ఓడ ఎంతో అద్భుతంగా ఉంది’ ఆమె ఆనందంగా చెప్పింది.
‘బయట నించి మెచ్చుకోవటం దేనికి? మనం అందులో ప్రయాణిస్తున్నాం. నా దగ్గర టిక్కెట్లున్నాయి’ అతను చెప్పాడు.
‘మన పెళ్లై ఇరవై నాలుగ్గంటలు దాటలేదు. ఇప్పుడు నాకు అంతా అద్భుతంగానే కనిపిస్తుంది’ రూత్ నవ్వుతూ చెప్పింది.
మెట్ల మీద ఓడలోకి వస్తున్న రూత్ స్వెటర్ రాడ్‌కి తగులుకుంది. అది గమనించిన యూనిఫాంలోని ఆఫీసర్ దాన్ని విడిపించాడు.
‘్థంక్స్’ చెప్పి ఆమె ముందుకి సాగింది. ఐదారుగురి వెనుక ఉన్న జాన్ తర్వాత లోపలికి వచ్చాడు. వారిద్దరూ డి-16 కేబిన్‌లోకి వెళ్లారు. లోపల ఫ్లవర్ వేజ్‌లో పూలు ఉంచుతున్న స్టివార్డెస్ వాళ్లని చూసి ‘ఎక్స్‌క్యూజ్ మీ’ అని చెప్పి బయటికి వెళ్లిపోయింది.
‘ఇక్కడ ఎక్సయిటింగ్‌గా ఉందా?’ జాన్ నవ్వుతూ అడిగాడు.
‘నెల క్రితం నీతో పరిచయమైనప్పటి నించీ నాకంతా ఎక్సయిట్‌మెంటే’
‘నెల మీద రెండు రోజులు’ జాన్ సరిదిద్దాడు. మళ్లీ చెప్పాడు.
‘నేను డబ్బుని రిసెప్షన్‌లో ఇస్తాను. దగ్గర ఉండటం మంచిది కాదు. పావుగంట తర్వాత నువ్వు మెయిన్ డెక్‌లోని బార్లో నన్ను కలు’
‘నేను నీ వెంటే వస్తాను’ రూత్ చెప్పింది.
‘వొద్దు. కాస్తంత తయారై రా. పావుగంటలో మెయిన్ డెక్ బార్‌లో నిన్ను కలుస్తాను’ చెప్పి జాన్ వెళ్లిపోయాడు.
ఆమె జుట్టు దువ్వుకుని మెయిన్ డెక్‌కి చేరుకుంది. అనేక మంది రెయిలింగ్ దగ్గర నిలబడి కింద రేవులో నిలబడి చేతులూపే వారి వంక చూస్తూ చేతులు ఊపుతున్నారు. రూత్ కూడా సరదాగా చేతులు ఊపింది. ఆమె పక్కన నిలబడ్డ ఓ ప్రౌఢ అడిగింది.
‘వారిలో నీ భర్త ఎవరు?’
‘నా భర్త, నేను కలిసి ప్రయాణిస్తున్నాం. నేను అందరికీ గుడ్‌బై చెప్తున్నాను’ రూత్ జవాబు చెప్పింది.
‘్భర్తలు త్వరగా తప్పిపోతారు జాగ్రత్త. నా పేరు కేట్’ ఆమె నవ్వుతూ చెప్పింది.
ఓడ బయలుదేరగానే రూత్ మెయిన్ డెక్‌లోని బార్‌కి వెళ్లింది. తన భర్త వచ్చేదాకా ఆర్డర్ చేయనని వెయిటర్‌తో చెప్పింది.
ఐదు నిమిషాలు. పది నిమిషాలు. పావుగంటైనా జాన్ రాకపోవడంతో లేచి రిసెప్షన్ దగ్గరికి వెళ్లింది.
‘జాన్ బోమెన్ ఎంతసేపటి క్రితం మీ దగ్గరికి వచ్చాడో చెప్పగలరా?’ అడిగింది.
‘ఆ పేరుగల వారెవరూ ఇక్కడికి రాలేదు’ ఆమె జవాబు చెప్పింది.
వెంటనే తమ కేబిన్ డి-16కి వెళ్లి తలుపు తోసింది. కానీ అది తాళం వేయబడిందని గ్రహించింది. నాలుగైదుసార్లు కొట్టి సమాధానం లేకపోవడంతో తన భర్త కోసం ఓడంతా కలియ తిరిగింది. జాన్ ఎక్కడా కనపడలేదు. తిరిగి బార్‌కి వెళ్లింది.
‘హలో! మీ భర్త తప్పిపోయాడా?’ కేట్ నవ్వుతూ అడిగింది.
ఆమె తనతో డ్రింక్ తాగమని కోరినా నిరాకరించి రూత్ సరాసరి మళ్లీ తమ కేబిన్ దగ్గరికి వెళ్లి ‘జాన్’ అని పిలుస్తూ తలుపు కొట్టసాగింది.
‘ఏమిటి సమస్య?’ తెల్లటి యూనిఫాంలోని ఓ స్టివార్డ్ అడిగాడు.
‘దయచేసి నా కేబిన్ తలుపు తెరుస్తారా?’ రూత్ అర్థించింది.
‘మీ కేబిన్ ఇది కాదు. ఏదో పొరపాటు జరిగినట్లుంది’
‘దయచేసి తెరవండి’
అతను తాళంచెవి తీసి తలుపు తెరిచాడు. లోపలికి వెళ్లి చూసి రూత్ నిశే్చష్టురాలైంది. తమ సామాను లేదు. ఫ్లవర్‌వేజ్ లేదు.
‘ఓడ రేవులో ఆగి బయలుదేరాక ఈ గది తలుపుని మళ్లీ తెరిచింది ఇప్పుడే. మీ టిక్కెట్ ఒకసారి చూపిస్తారా?’ అతను అడిగాడు.
‘టిక్కెట్లు జాన్ దగ్గరే ఉన్నాయి’
‘నేను పర్సర్‌ని తీసుకొస్తాను’ చెప్పి అతను వెళ్లాడు.
స్టివార్డ్‌తో లోపలికి వచ్చిన పర్సర్ రూత్‌ని గుర్తుపట్టి చెప్పాడు.
‘ఓ! మీరు ఇందాక మీ భర్త కోసం వచ్చారు. ఆయన పేరేమన్నారు?’
చెప్పాక అతను తనతో తెచ్చిన ప్రయాణీకుల జాబితాని తనిఖీ చేసి అడిగాడు.
‘ఆ పేరు ఈ ఓడ ప్రయాణీకుల్లో లేదు. మీ భర్త ఇంకో పేరుతో టిక్కెట్ కొని ఉండచ్చా?’
‘ఏమో! ఆ ఏర్పాట్లన్నీ ఆయనే చేశారు. మా పెళ్లి నిన్న రాత్రే అయింది. లగేజ్ టేగ్స్ రూత్ స్టాటన్ పేరు మీద ఉన్నాయి’ రూత్ చెప్పింది.
‘ పేరుతో వచ్చిన లగేజ్ నాకు గుర్తుంది. మూడు సూట్‌కేస్‌లు, ఒక స్టీమర్ ట్రంక్’ స్టివార్డ్ చెప్పాడు.
‘రూత్ స్టాటన్. బి-18’ ప్రయాణీకుల జాబితా చూసి పర్సర్ చెప్పాడు.
‘బి-18 కాదు. ఇదే ఇందాక ఇందులోకే ఇద్దరం వచ్చాం’ రూత్ చెప్పింది.
‘మీరు అయోమయంలో పడి ఉంటారు. బి-16 ఎవరికీ కేటాయించబడలేదు. ఓసారి బి-18లో చూద్దామా?’ పర్సర్ ఆమెని ప్రశ్నించాడు.
బి-18 తలుపు తెరవగానే అక్కడ ఆమె లగేజ్ కనిపించింది.
‘ఇదేనా మీ లగేజ్ మిస్ రూత్?’ పర్సర్ అడిగాడు.
‘నా పేరు మిసెస్ బోమెన్. కానీ నా భర్త సామాను ఇక్కడ లేదు’ దుఃఖంగా అడిగింది.
‘ఈ కేబిన్‌కి డెలివరీకి వచ్చిన సామాను ఇదే’ స్టివార్డ్ చెప్పాడు.
‘మీరు ఆందోళనగా ఉన్నారు. డాక్టర్ని పిలుస్తాను’ పర్సర్ చెప్పాడు.
‘డాక్టర్ కాదు. నాకు కావలసింది నా భర్త. ఆయన్ని వెదకండి. నాకు తెలుసు మీరు వెదకరు. నేనే వెదుకుతాను’ ఆవేదనగా చెప్పి బయటికి పరుగుతీసింది.
* * *
కళ్లు తెరిచి చూసే రూత్‌తో యూనిఫాంలోని ఓడ ఉద్యోగి చెప్పాడు.
‘నా పేరు డాక్టర్ మేనీ’
‘నా భర్త ఏడి?’ రూత్ వెంటనే అడిగింది.
‘ఓడలో మిమ్మల్ని మీ భర్తతో కలిసి ఎవరైనా చూసారా?’ ప్రశ్నించాడు.
‘మేం కేబిన్‌లోకి వచ్చినప్పుడు లోపల ఓ స్టివార్డెస్ ఉంది’
కొద్దిసేపట్లో ఓడ ప్రయాణీకులని మెట్ల దగ్గర రిసీవ్ చేసుకున్న లోగన్, స్టివార్డెస్ అక్కడికి వచ్చారు.
‘ఈమె మీకు గుర్తుందా?’ డాక్టర్ అడిగాడు.
‘బాగా. ఓడ బయలుదేరడానికి పావుగంట ముందు వచ్చింది. ఆమె కోటు రెయిలింగ్‌కి తగులుకుంటే తీసాను. ఐతే ఆమె వెంట ఇంకో ప్రయాణీకుడు రాగా చూడలేదు’ లోగన్ జవాబు చెప్పాడు.
‘ఏన్! డి-16లో నువ్వు ఈమెని, ఈమె భర్తని చూశావా?’ డాక్టర్ ప్రశ్నించాడు.
‘లేదు సార్. డి-16 తాళం వేసి ఉంది’ స్టివార్డెస్ చెప్పింది.
‘మేం వచ్చేసరికి నువ్వు ఫ్లవర్‌వేజ్‌లో పువ్వులు పెడుతున్నావు’ రూత్ చెప్పింది.
‘మీరు పొరపడ్డారు’
‘మీరూ నమ్మడం లేదా?’ రూత్ డాక్టర్ని అడిగింది.
* * *
డాక్టర్ మేనీ రూత్‌ని కెప్టెన్ గదిలోకి తీసుకెళ్లి కెప్టెన్‌కి విషయం అంతా వివరించాడు.
‘మీ టిక్కెట్, పాస్‌పోర్ట్ చూపిస్తారా?’ కెప్టెన్ అడిగాడు.
‘అవి నా భర్త దగ్గరే ఉన్నాయి’ రూత్ చెప్పింది.
‘నిన్న రాత్రి మీ పెళ్లి ఎక్కడైంది?’ ఆమె వేలికి వెడ్డింగ్ రింగ్ లేకపోవడం గమనించిన కెప్టెన్ అడిగాడు.
‘మేము హైవేలో వచ్చే దారిలో ఏదో ఊళ్లో, ఓ చర్చ్ చూసి అప్పటికప్పుడు అనుకుని పెళ్లి చేసుకున్నాం’
‘ఓడ బయలుదేరే ముందు మీ భర్త మిమ్మల్ని వదిలి దిగిపోయి ఉండచ్చుగా?’ కెప్టెన్ ప్రశ్నించాడు.
‘ఉండచ్చు. కానీ అతను ఎప్పటికీ అలా చేయడు’
‘ఆట్టే దూరం లేదు కాబట్టి పడవలో పంపితే మీరు న్యూయార్క్‌కి వెళ్లిపోతారా?’ కెప్టెన్ అడిగాడు.
‘వెళ్లను. నా భర్త నన్ను విడిచి ఓడ దిగి వెళ్లి ఉండడు’
ఆమె విసురుగా బయటికి వెళ్లిపోయింది.
‘మీ చేతిలో ఓ మానసిక రోగి ఉంది’ కెప్టెన్ చెప్పాడు.
‘ముందుగా నాకు అన్ని విషయాలు తెలియాలి. మన న్యూయార్క్ ఆఫీస్‌కి ఫోన్ చేసి నేను రూత్ స్టాటన్‌కి చెందిన అన్ని వివరాలు తెలుసుకుంటాను’ డాక్టర్ మేనీ చెప్పాడు.
ఆ రాత్రి రూత్‌కి ఓ పట్టాన నిద్ర పట్టలేదు. అకస్మాత్తుగా కేబిన్‌లోని ఫోన్ మోగింది. రిసీవర్ అందుకుంది.
‘రూత్! నేను జాన్‌ని’ తన భర్త కంఠం వినపడింది.
‘ఓ! జాన్! ఎక్కడున్నావు?’ ఆదుర్దాగా అడిగింది.
‘దాక్కున్నాను. వాళ్లు నన్ను పట్టుకోకూడదు. మనిద్దరం గొప్ప ప్రమాదంలో చిక్కుకున్నాం. అదంతా నీకు తర్వాత చెప్తాను. నేను చెప్పేదల్లా ఎవర్నీ నమ్మద్దని. ఒక్కర్ని కూడా. రేపు రాత్రి మళ్లీ ఫోన్ చేస్తాను’
కాల్ కట్ అవడంతో ఆమె ఆపరేటర్‌కి ఫోన్ చేసి ఆ కాల్ ఎక్కడి నించి వచ్చిందని అడిగింది.
‘నేను మీకు ఏ కాల్ కనెక్ట్ చేయలేదు. అది ఎక్కడినించో నేను తెలుసుకోలేను’
రిసీవర్ పెట్టేసిన కొద్దిసేపటికి డాక్టర్ మేనీ రూత్ కేబిన్‌లోకి వచ్చాడు.
‘మీ భర్త ఓడలో లేడు. ఆయన పేరు మీద టిక్కెట్ కూడా లేదు. ఓడ మొత్తం నిపుణులైన సిబ్బంది వెదికారు. ఉంటే కనపడేవాడు’ మేనీ చెప్పాడు.
‘అది అబద్ధం. ఐదు నిమిషాల క్రితమే జాన్ నాకు ఫోన్ చేసి మాట్లాడాడు’
‘అది కలై ఉండచ్చు. ఫాగ్ హార్న్ విని మెలకువ వచ్చి ఉండచ్చు’
‘కానీ నేను నిద్రపోలేదు’
‘మీకు నిద్ర చాలా ముఖ్యం. ఊహలు మన మనసు మీద చాలా ట్రిక్స్ ప్రయోగిస్తాయి. మీ జీవితంలో ఈ మధ్య ఏదైనా ముఖ్యమైన సంఘటన జరిగిందా?’
‘నాలుగు నెలల క్రితం మా నాన్న మరణించారు. నా వాళ్లంతా నా చిన్నప్పుడే పోయారు. నాకున్నదంతా మా నానే్న’ రూత్ చెప్పింది.
‘మీరు ఎప్పుడైనా సైకియాట్రిస్ట్‌ని చూశారా?’ మేనీ ప్రశ్నించాడు.
‘జాన్ నా ఊహ అని మీరు భావిస్తున్నారని నాకు తెలుసు. అతను ప్రమాదంలో చిక్కుకున్నాడు. నన్ను హెచ్చరించడానికే ఫోన్ చేశాడు. కానీ మీరు నమ్మడంలేదు’
‘మీకో సలహా. మిగతా ప్రయాణీకుల్లా మీరు సరదాగా గడపండి. లేదా కెప్టెన్ మిమ్మల్ని మానసిక రోగిగా భావించచ్చు. అది మంచిది కాదు’ సలహా ఇచ్చాడు.
* * *
‘మీ పేషెంట్ ఎలా ఉంది?’ కెప్టెన్ డాక్టర్ మేనీని అడిగాడు.
‘్ఫర్వాలేదు’
‘జాగ్రత్త. మానసిక రోగిని అందరి మధ్య ఉంచడం నాకు ఇష్టం లేదు’ కెప్టెన్ హెచ్చరించాడు.
‘ఆమె ఇటీవలే పెద్ద ఎదురుదెబ్బ తిన్నది. ఆమెకి సహాయం చేయాలని అనుకుంటున్నాను. మీ అనుమతితో వైర్లెస్ ద్వారా న్యూయార్క్‌లోని బ్యూరో ఆఫ్ మిస్సింగ్ పర్సన్స్‌కి ఆమె భర్త కనపడటం లేదని ఫిర్యాదు చేయాలనుకుంటున్నాను’ మేనీ చెప్పాడు.
‘దేనికి?’ కెప్టెన్ అడిగాడు.
‘జాన్ బోమెన్ ఎక్కడున్నాడో తెలుసుకోవాలని. ఆమె అబద్ధమాడుతోందని నేను అనుకోవడం లేదు. విషయం పూర్తిగా తెలుసుకోవాలని అనుకుంటున్నాను’
‘డాక్టర్ మేనీ! మీరు అందమైన మొహం ప్రభావంలో పడిపోయారా? మీరు షిప్ సర్జన్ తప్ప డిటెక్టివ్ కాదని గుర్తుంచుకోండి.. ఆమె బాధ్యత మీదే. జాగ్రత్తగా కనిపెట్టి ఉండండి’
* * *
మర్నాడు ఉదయం తన భర్త కోసం రూత్ అనేకచోట్ల వెతికింది. కోరితే కార్గో సెక్షన్ తలుపు తెరిచారు. ‘జాన్’ అని పిలుస్తూ లోపలంతా వెదికింది. అతను కనపడలేదు. ఒంటరిగా కేబిన్‌లో ఉంటే, తను పిచ్చిదని గదిలో పెట్టి తాళం వేస్తారనే భయంతో రింగ్ లాంటి రకరకాల ఆటల్లో గడిపింది.
ఆ రాత్రి తన భర్త ఫోన్ కోసం కేబిన్‌లో ఆదుర్దాగా ఎదురుచూసింది. కానీ ఫోన్‌కాల్ రాలేదు.
* * *
మళ్లీ తెల్లారింది. డాక్టర్ మేనీ దగ్గరికి కేట్ వచ్చి చెప్పింది.
‘రూత్ భర్త మాయం అయ్యాడని అంటోందని విన్నాను. కాని ఆమె పిచ్చిదని నా అనుమానం. ఓడ బయలుదేరబోయే ముందు చేతులూపింది. ఎవరు వీడ్కోలుకి వచ్చారని అడిగితే, ఎవరూ లేరని తన భర్త ఓడలోనే ఉన్నాడని చెప్పింది’
‘ఆ సమయంలో ఆమె ఆనందంగా ఉందా?’ డాక్టర్ మేనీ ప్రశ్నించాడు.
‘బాగా. బహుశా తన భర్తకే వీడ్కోలు చెప్తూండాలి’
* * *
ఓడ కెప్టెన్ తన వైర్లెస్‌కి సమాధానంగా వచ్చిన రేడియో గ్రాంని డాక్టర్ మేనీకి చదివి వినిపించాడు.
‘స్టీల్ మేగ్నట్, కోటీశ్వరుడైన రాబర్ట్ స్టేటన్ నాలుగు నెలల క్రితం మరణించాడు. దాంతో అతని కూతురు రూత్ మానసికంగా బాగా అలజడి చెందింది. ఫిలడెల్ఫియా నించి ఆమె న్యూయార్క్‌కి వెళ్లింది. జాన్ బోమన్‌ని ఆమె పెళ్లి చేసుకున్న సంగతి ఎవరికీ తెలీదని ఆ కంపెనీ యం.డి. నించి సమాచారం వచ్చింది. ఆమెకి పెళ్లి కాలేదని ఇప్పటికైనా నమ్ముతారా డాక్టర్?’
‘ఇవాళ రాత్రి ఆమెని భోజనానికి పిలిచాను. ఈ విషయం తెలుసుకుంటాను’ డాక్టర్ చెప్పాడు.
‘ఇతర ప్రయాణీకులకి ఇబ్బంది కలగకుండా’ కెప్టెన్ హెచ్చరించాడు.
‘ఇంతదాకా ఆమె ఎవర్నీ ఎలాంటి ఇబ్బందీ పెట్టలేదు’ డాక్టర్ మేనీ గుర్తు చేశాడు.
* * *
ఆ రాత్రి ఓడలోని ఓ రెస్ట్‌రెంట్లో భోజనం చేశాక డాక్టర్ మేనీ ఆమెని తన హాస్పిటల్‌కి తీసుకెళ్లి ఓ కాగితం అందించి చెప్పాడు.
‘ఈ రేడియోగ్రాం ఇందాకే వచ్చింది’
ఫిలడెల్ఫియాలోని స్టేటన్ ఐరన్ అండ్ స్టీల్ కార్పొరేషన్ అధ్యక్షుడు ఆల్బర్ట్ స్టేటన్ నాలుగు నెలల క్రితం మరణించాడు. తన తండ్రి మరణంతో డిస్ట్రబ్ అయిన రూత్ ఆరోగ్యం చెడి చికిత్స పొందింది. ఐదు రోజుల క్రితం ఫిలడెల్ఫియా నించి న్యూయార్క్‌కి బయలుదేరింది. ఆమె హౌస్ కీపర్‌కి కానీ, డాక్టర్‌కి కానీ జాన్ బోమన్ పరిచయం లేదు. ఆమెకి పెళ్లి కాలేదని మాకు రూఢీగా తెలుసు. హోలిస్టర్, మేనేజింగ్ డైరెక్టర్.
‘నిజం చెప్పండి’ ఆమె దాన్ని చదివాక మేనీ అడిగాడు.
‘మా పెళ్లి అవడం నిజమే. కానీ ఓ కారణంగా ఆ విషయం ఎవరికీ చెప్పలేదు’ రూత్ ఆందోళనగా చెప్పింది.
‘ఏమిటా కారణం?’
‘అది నేను చెప్పలేను’
‘ఓడ బయలుదేరినప్పుడు మీరు ఎవరికి చేతులూపారు?’
‘మీకెలా తెలుసది?’
‘చెప్పండి. అది నా ప్రశ్నకి సమాధానం కాదు’
‘ఎవరికీ కాదు. అందరికీ’
‘మీ భర్తకా?’
‘కాదు. ఆయన ఓడలోనే ఉన్నారు. నాకు ఫోన్ చేశారు కూడా’ ఆవేదనగా చెప్పింది.
‘అది మీ ఊహని అప్పుడే చెప్పాను’
‘కాదు. జాన్ ఓడలోనే ఉన్నాడు’
‘ఉంటే మీకు బదులు కెప్టెన్‌కి ఫోన్ చేయచ్చుగా? ఆయన రక్షిస్తాడుగా? మీ భర్త మరణం వల్ల ఎవరికి మేలు జరుగుతుంది? లేదా మీ మరణం వల్ల’ డాక్టర్ మేనీ ప్రశ్నించాడు.
‘నాకు పరిచయంలేని ఓ వ్యక్తికి’
‘ఎవరా వ్యక్తి?’
‘మా నాన్న సవతి సోదరుడి కొడుకు. పేరు ఫ్రెడ్. అతనెప్పుడూ ఏదో ఓ చెడ్డ పని చేస్తూంటే నానే్న కాపాడేవాడు. నాలుగు నెలల క్రితం ఫ్రెడ్ ఫిలడెల్ఫియాకి వచ్చి మా నాన్నతో వాదించడం విన్నాను. మా నాన్న మరణం తర్వాత ఆయన స్టీల్ కంపెనీ నాకు వస్తుందని తెలిసి ఫ్రెడ్ మా నాన్నని బెదిరించాడు. దాదాపు కొట్టుకునేంత పని అయ్యాక ఫ్రెడ్ వెళ్లిపోయాడు. కొద్దిరోజుల తర్వాత మా నాన్న మరణించాడు. మా పెళ్లయ్యాక జాన్‌కి ఇది చెప్పాను’
‘జాన్‌కి చెప్పడం వల్లే ఇదంతా జరుగుతోందా?’ డాక్టర్ మేనీ ప్రశ్నించాడు.
‘కానీ మీరు జాన్ నా ఊహ అనుకుంటున్నారు కదా?’
* * *
ఆ రాత్రి పదకొండున్నరకి రూత్ కేబిన్‌లోని ఫోన్ మోగింది. జాన్ నించి. అతను చెప్పేది ఉత్కంఠగా విని చెప్పింది.
‘అలాగే. వెంటనే లైఫ్ బోట్స్ దగ్గరికి వస్తున్నాను’
వెంటనే శాలువా కప్పుకుని ఆమె హడావిడిగా బి డెక్ నించి సన్ డెక్‌కి వెళ్లింది. పొగమంచు వల్ల అంతా అస్పష్టంగా ఉంది. జాన్ చెప్పిన చోట ఆమెకి కనిపించాడు. అతన్ని కౌగిలించుకుని ఆవేదనగా చెప్పింది.
‘ఓ జాన్! ముందు మన కేబిన్‌కి వెళ్లాం పద. నువ్వు ఓడలో ఉన్నావంటే ఎవరూ నమ్మక నన్ను పిచ్చిది అనుకుంటున్నారు’
‘జరిగిందంతా నా ఏర్పాటే. నేను వేసిన పథకం ప్రకారమే అంతా సాగింది. మానసికంగా డిస్ట్రబ్ అయిన నువ్వు ఓడ రేవులో కనపడకపోతే సముద్రంలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నావని అందరూ భావిస్తారు. నీ తదనంతరం స్టీల్ కార్పొరేషన్ నాకే వస్తుంది. మేరేజ్ సర్ట్ఫికెట్ చాలు దానికి’ చెప్పి జాన్ ఆమెని రెయిలింగ్ వైపు లాక్కెళ్లాడు.
నిర్ఘాంతపోయిన రూత్ ఏం జరుగుతోందో అర్థమై గట్టిగా అరవసాగింది. తక్షణం డాక్టర్ మేనీ వచ్చి రూత్‌ని జాన్ నించి విడిపించడానికి పెనుగులాడాడు. ఆ పోట్లాటలో జాన్ కుడి కాలుకి చుట్టుకున్న తాడు చివర సముద్రంలోకి లాగబడటంతో అతను అరుస్తూ సముద్రంలోకి పడిపోయాడు. తనని రక్షించిన డాక్టర్ మేనిని రూత్ వణికిపోతూ కౌగిలించుకుంది.
* * *
‘అలాంటి వాడ్ని ప్రేమించిన నేనెంత గుడ్డిదాన్ని’ డాక్టర్ మేనీతో రూత్ ఏడుస్తూ చెప్పింది.
‘డిప్రెషన్‌లో ఉన్న మీకు ఓ వ్యక్తి సాయం అవసరం కాబట్టి మిమ్మల్ని తేలిగ్గా బోల్తా కొట్టించగలిగాడు. నన్ను నమ్మండి. జాన్ గురించి నాకు బాగా తెలుసు’ డాక్టర్ మేనీ చెప్పాడు.
‘మీకెలా తెలుసు?’
‘జాన్ అసలు పేరు బ్రాడ్లీ. అతను కూడా మా ఓడ సిబ్బందిలో ఒకడు. అందువల్లే జాన్ ఎవరికీ దొరకకుండా యూనిఫాంలో తేలిగ్గా దాక్కోగలిగాడు’
‘మీరు బి-16లో దిగడం నిజమే. స్టివార్డెస్ ఏన్ బ్రాడ్లీ ప్రియురాలే. అతనికి సహకరిస్తూ అబద్ధం చెప్పిందని మాకు తెలీదు. ఆమె మొత్తం అంగీకరించింది. మీకు నా క్షమాపణలు మిస్ రూత్’ ఓడ కెప్టెన్ చెప్పాడు.
‘క్షమాపణ అవసరం లేదు. నా పీడ కల ముగిసింది’
‘ఓడ తీరం చేరగానే స్టివార్డెస్‌ని పోలీసులకి అప్పగిస్తాం. బ్రాడ్లీ కేబిన్‌లో మీ పాస్‌పోర్ట్, టిక్కెట్, మేరేజ్ సర్ట్ఫికెట్ దొరికాయి. నా తరఫున, నా సిబ్బంది తరఫున సారీ. మీరు పిచ్చివారని నేను నమ్మింది అబద్ధమైనందుకు ఎంతో సంతోషిస్తున్నాను. గుడ్‌నైట్’
కెప్టెన్ వెళ్లిపోగానే డాక్టర్ మేనీ చెప్పాడు.
‘‘మీది చాలా చిన్న జీవితం. మీకు ఇంకా ఎన్నో మంచి రోజులు ఉన్నాయి. ఈసారి సరైన నిర్ణయాన్ని తీసుకుని పెళ్లి చేసుకోండి’
‘డాక్టర్ పాల్ మేనింగ్టన్! ఇన్ని రోజులు మీరు ఎంతో సహనంగా నన్ను అర్థం చేసుకుని నాకు చేయూతని ఇచ్చారు. ఇది ఒక్క డాక్టర్‌కే కాక ఏ భర్తకైనా ఉండాల్సిన మంచి లక్షణం. మీకు పెళ్లయిందా?’ రూత్ అడిగింది.
‘ఓడలో కెప్టెన్ పెళ్లి జరిపిస్తే అది చట్టబద్ధమైంది అవుతుంది. ఆ విషయం ఈ రాత్రంతా ఆలోచించి నిర్ణయం తీసుకోండి’ వంగి ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టుకుని మేనీ నవ్వుతూ చెప్పాడు.
*
(జాన్ డిక్సన్ కార్ కథకి స్వేచ్ఛానువాదం)

మల్లాది వెంకట కృష్ణమూర్తి