S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆమని

మంగళీభవ!’’ ఆశీర్వదిస్తున్న అమ్మమ్మ వైపు ఆశ్చర్యంగా చూసింది ఆమని. క్రొత్తగా పెళ్లయి మేనమామ యింటికివచ్చిన ఆమనికి అమ్మమ్మ ఆశీర్వాదం కూడా క్రొత్తగానే తోచింది. తమింటి వెనుకనే వున్న గుడిసెలో, ఎడమకాలితో తాగుబోతు భర్తని తంతూనే కుడిచేత్తో తన పుస్తెల తాడుని కళ్ళకద్దుకునే దృశ్యం చూస్తూ కూడా ఇలాగే ఆశ్చర్యపోయేది. పెళ్లి బంధంతో కలుపుకున్న కొత్త బంధువుల మధ్య ఒక వారం గడిపి వచ్చిన తనకి ఇలాటి ఆలోచనలు చాలానే వస్తున్నాయి. అమెరికాలో చదువుకున్న రోజుల్లో ఆనంద్‌తో స్నేహం ప్రేమగా మారింది. తరువాత ఒకే ఇంట్లో సహజీవనం చేసిన రోజుల్లో పెళ్లి ఆలోచనే రాలేదు. ఉద్యోగాలతో క్షణం తీరిక లేని రోజులు ఇట్టే గడిచిపోయాయి. నాన్న పెళ్లిమాట ఎత్తినపుడు ఆనంద్ సంగతి చెప్పింది. తన కోసమే ఇనే్నళ్ళూ బ్రతికిన నాన్న అంతర్లీనంగా ఉన్న భయాలను బయటపెట్టి సంవత్సరం పాటు ముభావంగా ఉంటూ కుమిలిపోవడం చూడలేకపోయింది. ఆనంద్ కూడా అర్థం చేసుకున్నాడు. ఆనంద్ వాళ్లమ్మ బలవంతమీద వేరే అమ్మాయిని పెళ్లిచేసుకున్నాడు. ఆనంద్ పెళ్లిజరిగిపోయాక తనూ ఈ పెళ్లికొప్పుకుంది. అంతా సవ్యంగానే ఉన్నా తనలో ఏదో ఉద్వేగం, అణచుకోలేని అలజడి, అదుపులేని అంతర్యుద్ధం. సనాతన ధర్మాన్ని కాలరాచిన తాను రాములమ్మ కంటే ఎందులో ఎక్కువ? చదువూ, భోగభాగ్యాలలోనా? నైతికంగా తనెందుకు దిగజారింది? ఇక్కడి ఆడపిల్లలు కూడా నాలాగే ప్రవర్తిస్తున్నారా? నాన్న దాచిపెట్టినా నేను వంశీతో చెప్పేయాలి. తన సహకారం లేనిదే ఆనంద్‌తో సహజీవనం జరిగేది కాదు. అయినా ఆనంద్‌తో ఏ ఇబ్బందీ ఉండకపోవచ్చును. కానీ, నా మనస్సాక్షి ఈ నిజాన్ని వంశీ నుండి దాచేందుకు ఒప్పుకోవడం లేదు. ఆలోచిస్తూనే నిద్రకొరిగిపోయింది.
***
ఆమనికి అమ్మ ప్రేమ తెలియదు. బిడ్డ పుట్టిన కొద్దిరోజులకే విడాకులు తీసుకుని వెళ్లిపోయింది. భర్త సాధుస్వభావంతో ఆమె రాజీపడలేకపోయింది. ఆమె మరెప్పుడూ వారిని కలవడానికి కూడా రాలేదు. బాగా డబ్బున్నవాడినెవరినో చేసుకుని పిల్లలతో హాయిగా ఉన్నట్లు సమాచారం. మళ్లీ అన్యాయం జరుగుతుందనే భయంతో ఒంటరిగానే తండ్రి ఆమనికి తల్లి ప్రేమను గూడా పంచాడు. ఆధునిక యుగంలో అందుబాటులోనున్నవన్నీ అందిపుచ్చుకుని స్వేచ్ఛగా పెరిగిన ఆమనికి పెళ్లి తంతు ఒక కట్టుబాటుగా అనిపించదు. మేనమామతో ఉంటున్న అమ్మమ్మగానీ, ‘లేచిపోయిన’ కోడలికి కలిగిన బిడ్డని చేరదీయని నాయనమ్మగానీ నైతిక విలువలను, సాంప్రదాయ పద్ధతులను ఆమనికి వివరించి ఎప్పుడూ చెప్పలేదు. ఆడ దిక్కులేని ఆ సంసార నౌకను ఆవలిగట్టుకు చేర్చే ప్రయత్నమే ఆమని వివాహం. అందుకే ఆమెలో అంత అంతర్మథనం.
***
తండ్రి నిజాయితీని పుణికిపుచ్చుకున్న ఆమని ‘‘బెటర్ లేట్ దేన్ నెవర్’’ అనుకుంది. తన గతాన్ని వంశీకి చెప్పెయ్యాలనుకుంది. వంశీ! నీకో నిజం చెప్పి నా భారం దించుకోవాలి. చదివి నన్నర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను. ఎదురుగా చెప్పలేని భయంకర జీవన రహస్యాన్ని నీ ముందుంచాలనే ఈ ప్రయత్నం సాహసమే అవుతుందేమో! మా ఇంటి వెనుక రెండు గుడిసెలు ఉండేవి. వాటిల్లో ఒకామె భర్త తాగుబోతు. వాడు సంపాదించే ప్రతీ పైసా తాగుడికే అయిపోయేది. అయినా ఆమె ఇళ్ళల్లో పనిచేసి కుటుంబాన్ని పోషిస్తూ తన మాంగల్యాన్ని కాపాడుకోవాలని ఆరాటపడుతూండేది. ఒకరోజున, కల్తీ మద్యంతో విగత జీవిగా మిగిలిన భర్తని నిర్లిప్తంగా చూసిన ఆమె చూపులు నాకింకా గుర్తే. కానీ, ఆ రోజు తరువాత ఆ గుడిసెలో నెలకొన్న ప్రశాంత వాతావరణం నాకెంతో సంతృప్తినిచ్చింది. ఆమె గూడా మానసికంగా, శారీరకంగా త్వరలోనే కోలుకుంది. అప్పుడు నాకు వైవాహిక బంధం వెనుకనున్న కట్టుబాట్లు అర్థరహితమనిపించాయి.
రెండవ గుడిసెలో, భర్తతో విడిపోయిన ఒక అందమైన యువతి తల్లితో కలిసి ఉండేది. ఆమెని చేసుకుంటానని ఒకడు ముందుకు వచ్చి పెద్దలని ఒప్పించి పెళ్ళయ్యాక కొడుకు పుట్టగానే మొహం చాటేశాడు. కానీ, ఆ కొడుకుని పెంచుకుంటూ ఆమె అలానే మిగిలిపోయింది. ఇవన్నీ చూస్తూ పెరిగిన నేను ఈ నాగరిక ప్రపంచంలోని నైతిక విలువలను బేరీజు వేసుకోలేకపోయాను. ఎందుకంటే నేనే పరిష్కారం దొరకని పలు సమస్యల మధ్య పెరిగాను.
నాకు పెళ్లి ఒక ప్రశ్నార్థకంగా మారింది. జవాబులేని ఆ పరిస్థితుల్లో నాకు ఆనంద్ మానవతావాది, మనసున్న మంచి మనిషి అనిపించాడు. ఇద్దరమూ పెద్దలనొప్పించే పెళ్లి చేసుకుందామని దగ్గరయ్యాము. కొన్ని రోజులు కలినే బ్రతికాము. కానీ, ఆనంద్‌ది కూడా ‘సింగిల్ పేరెంట్ కేస్’ అని నాన్న ఒప్పుకోలేదు. నాన్న మనసు వెన్నవంటిదైనా, నా కన్నీళ్ళకి కరగలేదు. నిజం చెప్పాలంటే నాలో ఏ అగ్నిజ్వాలలూ రగలలేదు. అందుకే నా మనసు వెన్నముద్దకే వోటేసింది. ఆనంద్ కూడా వాళ్ళమ్మ మాట విని అడ్జెస్ట్ అయిపోయాడు. అసలు, నా గత జీవితం గురించి మన పెళ్లికి ముందే చెప్పవలసింది. అప్పుడు లేని అలజడి కొద్దిరోజులుగా ఎక్కువైంది. కారణం.. మీ కుటుంబ వ్యవస్థ! నా తప్పుకు తల వంచేలా చేసిన మధురాతి మధురమైన మీ అమ్మా నాన్నల బంధం! ఆయన అవిటితనాన్ని కాక అంతరంగానె్నరిగి నడుచుకునే మీ అమ్మగారి ఔన్నత్యం, ఆమె ఆత్మగౌరవానికి ఆలంబనగా నిలిచిన మీ నాన్నగారి ఔదార్యం, మీ బంధువుల ప్రేమానురాగాలు, మానవత్వానికి అద్దం పట్టాయి. మీ యింట్లో ఉన్న ఈ కొద్దిరోజుల్లో మీ చెల్లి నాకు తోబుట్టువులు లేని లోటు తీర్చింది.
ఒంటరిగా పెద్ద భవంతిలో పెరిగిన నాకు మీ చిన్న ఇల్లు చాలా విశాలంగా తోచింది. మీకు మా అమ్మ గురించి, నాన్న చెప్పే ఈ పెళ్లి కుదిర్చినా, నా గత జీవితం చెప్పకపోవడం చాలా పొరపాటే. పరిమళభరితమైన మీ తోటలో నేనూ ఓ మల్లెనై వికసించాలనే నాన్న ఆరాటం! మొదటినుంచీ అమ్మ చేసిన పాపం నన్ను నీడలా వెంటాడకుండా నా మార్గాన్ని సుగమం చేయాలనే నాన్న ప్రయత్నించారు. కానీ, నాకు తప్పుగా తోచక వివాహ బంధాన్ని నిర్లక్ష్యం చేసి మలినపడ్డాను. నా జీవితం పంజరంలో చిలుకలా సాగిపోయింది. బయటి ప్రపంచంతో దాదాపుగా సంబంధం లేకుండా నాన్న జాగ్రత్త తీసుకునేవారు. అమ్మ గురించి ఇరుగూ పొరుగూ అడిగే ప్రశ్నలకు నేను ఏడుస్తూ ఉంటే నాన్న చూడలేక తనలోనే అందర్నీ చూసుకునేలా నా చుట్టూ ఒక గిరి గీసి ఓవర్ ప్రొటెక్ట్ చేశారు. నా స్నేహితులూ చాలా తక్కువగా ఉండేవారు. నాలోని భావప్రకటనకు అందనంత దూరంలో వాళ్ళుండేవారు.
నేను జీవితంలో చాలా మిస్సయ్యాను. ఆనంద్ కూడా సింగిల్ పేరెంట్, సింగిల్ చైల్డ్ కేస్ అనే నాన్న వద్దన్నారు. నాన్న ప్రేమ తప్పించి తెలియని నాకు ఆనందతో పరిచయం కొత్త లోకాలను చూపింది. పురాతన ధర్మమనుకుని పెళ్లితంతుని లెక్క చేయక సహజీవనం చేసిన నాకు అది ‘‘సనాతన ధర్మం అంటే నిన్న ఉండినది, నేడు ఉన్నది, రేపు ఉండేది’’ అనీ, మీ పవిత్రమైన ఇంటిలో పాదం మోపిన తరువాత తెలిసింది. పాప ప్రక్షాళన కోసం నా గతాన్ని నీ పాదాలపై పరచి క్షమాభిక్షనర్ధిస్తున్నాను. మీ పూదోటలో మొగలిరేకునై శాశ్వత సౌరభాలను మీ అందరికీ అందిస్తానని హామీ ఇస్తున్నాను. మా అమ్మలాకాక, మీ వంశవృక్షపు కొమ్మల్లో కొమ్మనై మీ వంశాంకురాలకు తీయని మకరందం లాంటి మాతృప్రేమను పంచుతానని మాట ఇస్తున్నాను. నా పాప పంకిలాన్ని కడిగి మీ యింటి ముంగిటనున్న ముత్యాల ముగ్గులో ఓ ముత్యంలా స్వచ్ఛంగా మెరవాలని మనసారా కోరుకుంటున్నాను. యువతరంలోని విశృంఖల శృంగార జీవితాలకు స్వస్తిపలికేలా నేనూ ఒక ప్రచార కర్తగా పనిచేయాలనుకుంటున్నాను. అందుకు మీ సహకారం ఉంటుందని ఆశిస్తున్నాను. ననే్నమీ అందలం ఎక్కించనక్కరలేదు. అందమైన జీవితాన్నిస్తే చాలు.
కళంకితమైన పాత జ్ఞాపకాలను ఈ కాళరాత్రిలో వదిలి నులివెచ్చని బాలభానుని కిరణాలలో ఓ కిరణంలా మీ కుటుంబంతో కలిసి ఆదర్శప్రాయమైన నా నూతన జీవన గమ్యంలోని తొలి అడుగు వేయాలనే ఆశతో.. ఆర్తిగా అర్థిస్తూ... ఆమని.
***
వంశీ అలవాటు ప్రకారం ఉదయం ఆరు గంటలకే మెయిల్ బాక్స్ ఓపెన్ చేశాడు. రాత్రి రెండు గంటల సమయంలో వచ్చిన రెండు మెయిల్స్‌లో ఒకదానికి ఫొటో అటాచ్‌మెంట్ ఉన్నాయి. తన క్లోజ్‌ఫ్రెండ్ రేవంత్ న్యూజెర్సీ నుండి పంపిన మెయిల్ ముందుగా ఓపెన్ చేశాడు. ఫొటోల్లో ఆమనితో వేరెవరో అబ్బాయి! కంగారుగా రేవంత్ మెయిల్ చదివాడు. ‘‘వంశీ! నీనుండి రహస్యం దాచలేకపోతున్నాను. నీకేద్రోహం జరగకూడదు.. నీవు భవిష్యత్తులో ఎవరికీ తలదించకూడదు.. కొన్ని నిజాలు నిప్పులా కాలినా మీమధ్య ముందు ముందు ఏ అపోహలూ అడ్డురాకూడదని ఆశిస్తున్నాను. ఈ ఫొటోలు నా ఫ్రెండ్ రెండేళ్ళ క్రితం పంపి, తాము త్వరలోనే ఒకింటి వారమవుతున్నట్లు చెప్పినప్పటివి. కానీ, ఎందుకనో ఒక సంవత్సరం క్రితం తన పెళ్లికి పంపిన ఈ కార్డులో ‘సుమా’ బదులుగా సౌమ్య ఉంది. నేను తప్పుగా విన్నాననుకున్నాను. నీవు పంపిన పెళ్లి ఫొటోల్లోని ఆమని, నేను చూసిన సుమా ఒకరేనని చూశాక నీ ఈ-కార్డు చదివాను. ‘‘సుమా వారి కుమార్తె ఆమని’’ అని ఉన్నది. అంటే నా ఫ్రెండ్ మిస్ సుమాగా చెప్పిన ఆమని నీ భార్యని తెలిసి నీకు తెలిస్తే మంచిదని ఈ ఫొటోస్ అటాచ్ చేస్తున్నాను’’. ఆసాంతం చదివిన వంశీ దీర్ఘాలోచనలో పడ్డాడు. గజిబిజిగా గదిలో పచార్లు చేశాడు.
రెండవ మెయిల్ ఆమని నుండి అని తెలిసినా ఏదో నిర్లిప్తత! అయినా చదవసాగాడు.. ఆమెలోని పశ్చాత్తాపం, నిజాన్ని దాచిపెట్టలేని నిజాయితీ ఆమనిని క్షమించమన్నాయి. రేవంత్ మెయిల్ని డిలీట్ చేసి బెడ్‌రూమ్‌వైపు నడిచాడు.
ఆమని కలలో ఓ అందమైన అడవిలో ఒంటరిగా తిరుగాడుతూంది. ప్రతి చెట్టూ విరగబూసి నేలకి ఎన్నో రంగుల్ని పులిమింది. అవన్నీ దారంలేని పూలదండల్లా నేలమీద రంగవల్లుల్ని తీర్చాయి. ఆమె గుండెల రెక్కలు అంబరంలోని చుక్కల సోపానాల్ని దాటి వెనె్నల పందిట్లో సేదతీరాలని మనసు ఉవ్విళ్ళూరుతూంది. ఆమె కోరిక తీర్చకుండానే తూరుపు సింధూరం సింగారించుకుంది.
మాయని మచ్చలా మిగిలిపోతుందనుకున్న ఆమె గతాన్ని మాడ్చేస్తూ సూర్యుని తీక్షణమైన కిరణాలు ఆమనిని నిద్రలేపాయి. ఎదురుగా వంశీ చిరునవ్వుతో ‘‘‘నీ మెయిల్ చదివాను. సూర్యభగవానుని సాక్షిగా నూతన జీవితానికి నాంది పలుకుదాం’’ అంటూ చేతులు చాచాడు.
*

- ముసునూరు ఛాయాదేవి

- ముసునూరు ఛాయాదేవి