S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

చెలగాటం

రోజు మిసెస్ జిల్లీకి తన భర్తకి తన మీద అసూయ కలిగితే చూడాలనే కోరిక కలిగింది. ఆ విధంగా ఆమె సుఖాన ఉన్న ప్రాణాన్ని దుఃఖంలో పడేసుకుంది.
మిస్టర్ జిల్లీ తన ఆఫీస్‌లోని సెక్రటరీలలో ఒకరితో సంబంధం పెట్టుకుని ఉంటాడనే ఆలోచన కలగగానే మిసెస్ జిల్లీ ఆ సేవా సంస్థ గురించి ఆలోచించింది. పెళ్లయ్యాక మొదటిసారి జిల్లీ సాయంత్రం ఐదున్నరకి ఇంటికి రావడం మానేశాడు. అతన్ని మరో అందమైన అమ్మాయితో ఖరీదైన నైట్ క్లబ్‌లలో చూశామని మిత్రురాళ్లు ఆమెకి చెప్పారు. కొందరు భార్యలు ఇలాంటిది తమకే జరిగితే ముడుచుకుపోయి ఏడ్చేసేవాళ్లు. కాని మిసెస్ జిల్లీ తను అనుభవించే అసూయా బాధని తన భర్త కూడా అనుభవించేలా చేయాలని అనుకుంది.
దాంతో ఓ ఏజెన్సీకి ఫోన్ చేసి గిగిలో (మగ వ్యభిచారి) సేవని తీసుకుంది. అతని పేరు ఏంథోని పవర్స్. అతను మిస్టర్ జిల్లీ కన్నా అన్ని విధాలా అందంగా ఉన్నాడు. యవ్వనంలో కూడా ఉన్నాడు. అతని జుట్టు నల్లగా, మృదువుగా ఉంది. ఐదడుగుల పది అంగుళాల పొడవు ఉంటాడు. జిల్లీ ఎత్తు ఐదు అడుగుల నాలుగు అంగుళాలే. బలహీనంగా ఉంటాడు. కాని జిల్లీకి పదవి, డబ్బూ ఉన్నాయి. ఏంథోని పవర్స్‌కి అందం, స్ర్తిలని ఆకర్షించే ప్రవర్తనా తప్ప ఇంకేం లేవు.
పవర్స్ సాయంత్రాలు చక్కటి డ్రెస్‌లో ఆమె ఇంటికి ఆమెని పికప్ చేసుకోడానికి వచ్చేవాడు. ఖరీదైన రెస్టారెంట్లలో ఎలా ఆర్డర్ చేయాలో అతనికి కొట్టిన పిండి.
చివరికి ఓ రాత్రి తన భర్త ఎర్రజుట్టు అమ్మాయితో కలిసి భోజనం చేసే రెస్ట్‌రెంట్‌కి వీరిద్దరూ వెళ్లడం జరిగింది. తమ భర్త తమని గమనించే చోట కూర్చుని మిసెస్ జిల్లీ ఏంథోని పవర్స్‌తో సాన్నిహిత్యాన్ని నటించింది. వారిని చూశాక మిస్టర్ జిల్లీ ఆకలి చచ్చిపోయింది. ఆ రాత్రి ఆమెని మిస్టర్ జిల్లీ నిలదీశాడు.
‘నా మిత్రుడు బిల్ కార్టర్ చేసిన పనే చేస్తాను’ ఆమె వివరణ విన్నాక హెచ్చరించాడు.
‘కార్టర్ ఏం చేశాడు?’ మిసెస్ జిల్లీ అడిగింది.
‘తన భార్య లూసీకి ఎవరితోనో ఎఫైర్ ఉందని తెలుసుకుని, ఇంకోసారి అది కొనసాగిందని తెలిస్తే అతన్ని కాల్చి చంపేస్తానని చెప్పాడు.’
బిల్ కార్టర్ అన్నంత పనీ చేసే వాడని ఆమెకి తెలుసు. తర్వాత లూసీకి ఫోన్ చేసింది. ఆవిడ మాటల్లో తన భర్త బెదిరింపు గురించి చెప్పి, తను ఇప్పుడు జాగ్రత్తగా ఉంటున్నానని చెప్పింది.
చాలా కాలం తర్వాత ఆ రాత్రి మిస్టర్ జిల్లీ తన భార్యని ముద్దు పెట్టుకున్నాడు. మర్నాడు ఆమె ఏజెన్సీకి ఫోన్ చేసి ఇంక ఆ రోజు నించి తనకి ఏంథోనీ పవర్స్ సేవ అవసరం లేదని చెప్పింది.
కాని పవర్స్ మిసెస్ జిల్లీని అంత తేలిగ్గా వదల దలచుకోలేదు. ఆ మధ్యాహ్నం టీ టైంకి జిల్లీ ఇంటికి వచ్చాడు.
‘మీరు మా ఏజెన్సీకి నేను ఇక్కడికి వచ్చినట్లు దయచేసి చెప్పకండి. చెప్తే నా ఉద్యోగం పోతుంది. అది మా కంపెనీ నియమం. కాని మిమ్మల్ని చూడకుండా ఉండలేక పోతున్నాను’ అతని కంఠంలో జీర.
ఆమె అతని వంక ఆశ్చర్యంగా చూసింది.
‘నేను మూర్ఖుడ్ని అని నాకు తెలుసు. కేవలం వృత్తిపరంగా మిమ్మల్ని కలిసినా నేను మీతో ప్రేమలో పడ్డాను. ఎంతో మంది ఆడవాళ్లతో నాకు పరిచయం ఉన్నా ఎన్నడూ నాలో ఇలాంటిది కలగలేదు. అది నా ప్రమేయం లేకుండా జరిగిపోయింది.’
అతను ఆ లివింగ్ రూంలో ఆమె ముందు మోకాళ్ల మీద కూర్చుని ఆమె కుడి అరచేతి వెనక భాగాన్ని ముద్దు పెట్టుకున్నాడు. తక్షణం ఆమె అతన్ని లేపింది. తన వయసులో దాదాపు సగం వయసు ఉన్న అతనికి ఏభై ఏళ్ల తనతో ప్రేమా? అతనికి పిచ్చెక్కింది అనుకుంది.
ఏంథోని పవర్స్ తన ప్రేమని అనేక విధాలుగా వ్యక్తం చేస్తూంటే, అతను గట్టిగా ఏడుస్తాడని భయపడింది కూడా.
‘మిమ్మల్ని నేను నిత్యం చూడకుండా జీవించలేను. లేదా ఆత్మహత్య చేసుకుంటాను’ దీనంగా చెప్పాడు.
మిస్టర్ జిల్లీకి ఆమె అప్పటికే ఏంథోని పవర్స్‌ని ఇక కలవనని మాట ఇచ్చింది. అతను కూడా తన సెక్రటరీని ఉద్యోగంలోంచి తీసేసి, ఆమెని ఇక కలవనని తన భార్యకి మాట ఇచ్చాడు. మిస్టర్ జిల్లీ ఆ సమయంలో ఇంటికి వచ్చి తమని చూస్తే తనని అపార్థం చేసుకుంటాడు. తను మాట తప్పిందని భావిస్తాడు. అది తామిద్దరి సంబంధానికి చెరుపు చేస్తుంది. అతని వయసు తన కొడుకు వయసని, ఇది తగదని, వెళ్లమని, తన భర్త వచ్చే వేళయిందని అతన్ని ఎంత బతిమాలినా కదల్లేదు. అతను అంత తేలిగ్గా బయటకి వెళ్లడని గ్రహించాక పోలీసులకి ఫోన్ చేయాలన్న ఆలోచన కలిగింది. కాని అది తన భర్త దృష్టికి తప్పక వస్తుంది. పైగా వార్తల్లోకి తన పేరు ఎక్కచ్చని కూడా భయపడింది. అతను నిజంగా ఆత్మహత్య చేసుకోవచ్చేమో అనే ఆలోచన ఆమెని భయపెట్టింది.
అతన్ని వెంటనే వదిలించుకోవాలని అనుకుంది. తన చెక్ బుక్‌ని తీసుకుని అతని పేరు మీద వెయ్యి డాలర్లకి చెక్‌ని రాసిచ్చి చెప్పింది.
‘ఇది తీసుకుని మరెన్నడూ నాకు కనపడక’
చేతికి ఆ చెక్ రాగానే అతని దుఃఖం మొత్తం మాయమై పోయింది. కళ్లు తుడుచుకుని చెప్పాడు.
‘నిజమే. మీరు నాతో లేచి వచ్చేస్తే ఇంతటి ఐశ్వర్యవంతమైన జీవితాన్ని గడపలేరు. నా పడక గదికన్నా మీ బాత్‌రూమే పెద్దది.’
అతను వెళ్లాక ఆమె రిలీఫ్ ఫీలైంది. ఐదు నిమిషాల తర్వాత మిస్టర్ జిల్లీ ఇంటికి వచ్చాడు.
* * *
ఇంకోసారి తను ఏంథోని పవర్స్‌ని కలుస్తానని మిసెస్ జిల్లీ అనుకోలేదు.
కొన్ని వారాల తర్వాత ఏంథోని పవర్స్ మళ్లీ అదే సమయానికి ఆమె ఇంటికి వచ్చాడు. అతను సన్నబడ్డాడు.
‘మీ వల్ల నేనా ఉద్యోగాన్ని మానేశాను. మిమ్మల్ని మర్చిపోయే ప్రయత్నం చేశాను కాని నా వల్ల కావడం లేదు. మీది మా అమ్మ వయసే ఐనా మీలో అమ్మని చూడలేక పోతున్నాను’ ఆమె చేతిని అందుకుని చుంబిస్తూ చెప్పాడు.
ఆమె హడలిపోయింది. తన భర్త ఏ క్షణంలోనైనా రావచ్చు. ఇన్ని వారాలుగా తమ మధ్య సంబంధం కొనసాగుతోందని మిస్టర్ జిల్లీ అనుమానిస్తాడని భయపడింది. అతనికి ఇంకో చెక్ రాసిచ్చి వదిలించుకుంది.
మూడు వారాల తర్వాత మిసెస్ జిల్లీ తన భర్తతో ఓ ఖరీదైన రెస్ట్‌రెంట్‌కి వెళ్లింది. భోజనం చేస్తూంటే ఏంథోని పవర్స్ ఓ కొత్తామెతో కనిపించాడు. అతను ఆవిడతో కలిసి భోజనం చేస్తూంటే తన ఉద్యోగాన్ని ఏంథోనీ వదలడం అబద్ధం అని మిసెస్ జిల్లీ అనుకుంది. అతన్ని చూడనట్లే నటించింది. తనని అతను చూశాక ఇక మళ్లీ తన దగ్గరికి వచ్చేందుకు మొహం చెల్లదని భావించింది. కాని మిసెస్ జిల్లీ అంచనా తప్పింది.
అతను మర్నాడు రాత్రి ఎనిమిదిన్నరకి ఆమె ఇంటికి వచ్చాడు. బిజినెస్ డిన్నర్‌కి వెళ్లిన ఆమె భర్త ఏ క్షణంలోనైనా తిరిగి రావచ్చు.
‘మళ్లీ ఎందుకు వచ్చావు?’ కోపంగా అడిగింది.
‘మీ మీద గల ప్రేమ ఓ పట్టాన నశించేది ఐతేగా? నా మీద ఏం మంత్రం వేశారు?’ దీనంగా చూస్తూ అడిగాడు.
‘ఆ మంత్రం ఏదో ఆమెనే వేయమను’ కఠినంగా చెప్పింది.
‘ఆమే? ఆమె ఎవరు?’
‘నిన్న రాత్రి బ్లూ డైమండ్ రెస్ట్‌రెంట్‌లో నీతో భోజనం చేసిన ఆమె’
‘ఓ! నిన్న మీరు అక్కడికి వచ్చారా? నేను చూడనే లేదు. చూస్తే మా అమ్మని పరిచయం చేసి ఉండేవాడిని. ఆవిడకి మన గురించి చెప్పాను. మా అమ్మకి కేన్సర్. రెండు మూడు నెలలు మించి ఉండదని డాక్టర్ చెప్పారు’
పర్స్‌లోంచి ఆవిడ ఫొటోని తీసి చూపించాడు. అతని మాటల్లో నిజాయితీ ధ్వనించింది. అతన్ని తను అపార్థం చేసుకున్నందుకు మిసెస్ జిల్లీ బాధపడింది.
‘బయటకి నడు’ ఆజ్ఞాపించింది.
అతను వినకపోతే బట్లర్‌ని పిలిచి చెప్పింది.
‘మన అతిథిని గుమ్మం దాకా సాగనంపిరా’
పది నిమిషాల తర్వాత ఏంథోని పవర్స్ నించి ఫోన్ వచ్చింది.
‘మీరు నాకు ఇచ్చిన చెక్కుల ఫొటో కాపీలు మీ వారికి చూపించి మన మధ్య స్నేహం కొనసాగుతోందని చెప్తాను. అలా జరగకూడదంటే మీరు నాకు గతంలోలా చెక్స్ ఇస్తూండాలి’ చెప్పాడు.
ఆవిడ మరోసారి హడలిపోయింది. చేతులు వణికాయి. మరో వెయ్యి డాలర్లకి చెక్ రాసి అతను చెప్పిన చిరునామాకి పోస్ట్ చేసింది. ఏంథోనీ పవర్స్ ఇక జీవించి ఉండకూడదని మిసెస్ జిల్లీ నిశ్చయించింది.
* * *
మర్నాడు ఉదయం మిసెస్ జిల్లీ బిల్ కార్టర్‌కి ఫోన్ చేసి చెప్పింది.
‘ఈ రోజు నేను మిస్టర్ జిల్లీ తొలిసారి కలిసిన రోజు. పదిహేడేళ్ల క్రితం ఇదే రోజు కలిశాం. ఆ సందర్భంగా మధ్యాహ్నం చిన్న పార్టీ ఇస్తున్నాను. దానికి హాజరయ్యేది మాకు అతి దగ్గర మిత్రులైన మీ దంపతులే. లూసీని తీసుకుని దయచేసి దానికి హాజరు కాగలరా? మీకు వేరే ఎంగేజ్‌మెంట్ లేదు కదా?’
‘ఉంది. కాని అది మళ్లీ తిరిగి రాని ప్రత్యేక సందర్భం కాబట్టి తప్పక వస్తాం. కాని మీరు లూసీకి కూడా ఫోన్ చేసి ఆహ్వానిస్తే బావుంటుంది.’
‘కాని లూసీని సర్‌ప్రైజ్ చేద్దామని అనుకుంటున్నాను. మీరు ఆఫీస్ నించి లంచ్ టైంలో ఇంటికి వెళ్లి మీ భార్యకి ఏం చెప్పకుండా మధ్యాహ్నం ఒకటిన్నరకి బ్లూ డైమండ్ రెస్ట్‌రెంట్‌కి తీసుకురండి. అలాగే నా భర్తనీ సర్‌ప్రైజ్ చేస్తాను’
‘సరే. అలాగే’ కార్టర్ ఒప్పుకున్నాడు.
ఆ తర్వాత మిసెస్ జిల్లీ ఓ ఫోన్ చేసింది. మళ్లీ పాత కస్టమర్ నించి ఫోన్ రావడంతో ఏజెన్సీ మేనేజర్ సంతోషించాడు.
‘తప్పకుండా. మీరు కోరిన ఏర్పాటు చేస్తాను’ మిసెస్ జిల్లీ సూచనలన్నీ రాసుకుని చెప్పాడు.
ఆ తర్వాత ఆవిడ ఓ పుస్తకం చదివే ప్రయత్నం చేసింది. కాని ఆందోళనతో, ఉత్కంఠతో తన మనసు నిలవలేదు.
సాయంత్రం మిస్టర్ జిల్లీ ఆఫీస్ నించి తిరిగి వచ్చాక చెప్పాడు.
‘ఘోరం జరిగిపోయింది’
‘ఏమైంది?’ అడిగింది.
మధ్యాహ్నం బిల్ కార్టర్ ఆఫీస్ నించి తన ఇంటికి వెళ్లేసరికి లూసీ ప్రియుడు అతని కంట పడ్డాడు. తక్షణం బిల్ అతన్ని కాల్చి చంపాడు’ అతను విషాదంగా చెప్పాడు.
మర్నాడు దినపత్రికలో ఆ వివరాలు వచ్చాయి. ఏంథోనీ పవర్స్ అనే ఎక్స్ ఆర్ట్ ఏజెన్సీ మనిషిని, లూసీని చూసి అనుమానపడి బిల్ కార్టర్ అతన్ని కాల్చి చంపాడు. ఏంథోనీ పవర్స్ చాలామంది స్ర్తిలని బ్లాక్‌మెయిల్ చేసేవాడని కూడా తెలుస్తోంది. *

(మేరి ఎల్ రోబీ కథకి స్వేచ్ఛానువాదం)

మల్లాది వెంకట కృష్ణమూర్తి