S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఒక్క తూటా చాలు- 20

ఇంట్లో చెప్పి వెళ్లలేదా?’ ప్రశ్నించేడు రాజేష్.
‘లేదు బాబూ! మధ్యాహ్నం మూడున్నరకి బయలుదేరాడు. ఇంతవరకూ రాలేదు. ఫోన్ చేస్తుంటే అందుబాటులో లేదని జవాబు వస్తోంది. వివేక్ తల్లి, తండ్రి కంప్లైంట్ ఇవ్వడానికి పోలీసుస్టేషన్‌కి వెళ్లారు’
రాజేష్ అక్కడ నుంచి వెనక్కి తిరిగేడు. రాసమణి అనుమానపడినట్టు అతన్ని చంపేశారా? రుషికొండ బీచ్‌లోని జీడిమామిడి తోటలోకి పిలిచింది అందుకేనా? అతని బుర్రలో ప్రశ్నలు సుడులు తిరుగుతున్నాయి. కొద్దిసేపు ఆలోచించి బ్యాంకు మేనేజర్‌కి ఫోన్ చేసి ఆ రోజు సెలవు తీసుకుంటానని చెప్పేడు.
ఓ పార్లర్‌లో టిఫిన్ తిని బైక్‌లో పెట్రోలు పోయించుకుని బయలుదేరాడు. విశాలాక్షినగర్ క్రాస్ చేసి భీమిలి రోడ్డులోకి ఎంటరయ్యాడు. రుషికొండ చేరడానికి అరగంట పైనే పట్టింది. ఆ కొండ పక్కనున్న మట్టిరోడ్డులోకి తిరిగి ముందుకెళ్లాడు. కొండ వెనుక బీచ్‌ని ఆనుకుని కనిపించింది జీడిమామిడితోట. బైక్ ఓ పక్కన స్టాండ్ వేసి కీస్ జేబులో వేసుకుని చుట్టూ చూశాడు. ఆ ప్రాంతమంతా నిర్మానుష్యంగా ఉంది. ఒడ్డుకి దూరంగా సముద్రంలో నాటుపడవలు చేపల వేట సాగిస్తున్నాయి.
జీడిమామిడి తోటలోకి ప్రవేశించాడు రాజేష్. ప్రేమికులు ఏకాంతంగా గడపడానికి అనుకూలమైన చోటు అది. ఒక్కొక్క అడుగు వేస్తూ పరిసరాల్ని నిశితంగా చూస్తున్నాడు. ఒక శవం కనిపిస్తుందనే నమ్మకం అతని మనసులో గట్టిగా ఉంది. ఒకచోట ఆగి తలని నాలుగువైపులా తిప్పి గాలిపీల్చాడు. చేపల వాసన తప్ప చెడువాసన రాలేదు.
అక్కడ ఓ మనిషిని చంపడం జరిగితే సాధారణంగా సముద్రంలో శవాన్ని పడేస్తారు. నాటుపడవలో కొంతదూరం తీసుకెళ్లి రాయికట్టి నీటిలోకి నెట్టేస్తే జలచరాలు శరీరాన్ని తినేస్తాయి. అప్పుడు శవం ఆచూకీ దొరకడం కష్టం. మామూలుగా పడేస్తే ఈపాటికి శవం ఒడ్డుకి చేరేది.
నేల మీదకి ఒంగిన కొమ్మ మీద కూర్చుని ఆలోచించసాగేడు. వివేక్‌ని అక్కడకి రప్పించడానికి మరేదైనా కారణం ఉందా? హఠాత్తుగా అతని దృష్టి నేల మీద పడింది. అక్కడ ఇసుక చిందరవందరగా కనిపించింది. నొసలు ముడివేసి మరింత జాగ్రత్తగా చూశాడు. కొమ్మకి అవతల ఇసుకలో ఏదో లాక్కెళ్లిన జాడ కనిపించింది.
కూర్చున్న చోటు నుంచి లేచి ఆ జాడకి కాస్త ఎడంగా అడుగులు వేస్తూ అనుసరించాడు. ఒకచోట అంతమయిందా జాడ. అక్కడే ఆరడుగుల పొడవు, మూడడుగుల వెడల్పు నేల మీద కాస్త ఎత్తుగా కనిపించింది. దానికి అవతల ఇసుక కుప్ప ఉంది.
లోపల వివేక్ బాడీ ఉందా?
రాజేష్ శరీరం ఒక్కసారిగా జలదరించింది. తను ప్రమాదకరమైన ప్రదేశంలో ఉన్నానని గ్రహించాడు. అనాలోచితంగా తలపైకెత్తాడు. ఆ ప్రదేశానికి పైన చుట్టూ ఉన్న చెట్ల ఆకులు మాడిపోయి కనిపించాయి.
అక్కడ నుంచి గబగబా బయటకొచ్చి బైక్‌ని సమీపించాడు.
13
మూసి ఉన్న ఇంటి తలుపు కొట్టాడు యుగంధర్. కొన్ని క్షణాలు గడిచాక ఓ ముసలామె తలుపు తీసింది.
‘శంకర్ పాత్రో ఉన్నారా?’ అడిగేడు యుగంధర్.
‘లేరు?’ ముక్తసరిగా చెప్పిందామె.
‘ఎక్కడికెళ్లారు?’
తలెత్తి ఆకాశంలోకి చూసి చెప్పింది,
‘పోయి నాలుగేళ్లయింది’
‘క్షమించండి... శంకర్‌పాత్రో మీకేమవుతారు?’
‘అవన్నీ మీకెందుకు?’
‘ఏం లేదమ్మా! నేను విశాఖపట్నం నుంచి వచ్చిన పోలీస్ ఆఫీసర్ని. రాజరాజేశ్వరి మీకేమవుతుంది?’
ఆ ప్రశ్న అర్థం చేసుకోవడానికి రెండు క్షణాలు సమయం తీసుకుని ఆ తర్వాత కోపంగా అంది.
‘మా కుటుంబంలో అగ్గెట్టిపోయింది’
‘వివరంగా చెబుతారా?’
‘అవన్నీ ఇప్పుడెందుకు?’
యుగంధర్ చిన్నగా నవ్వుకున్నాడు. కొంతమంది నుంచి సమాచారం సేకరించడం అంత సులువు కాదు. వాళ్లు మానసికంగా బ్రేక్ అయితే తప్ప విషయం బయటకి రాదు.
‘రాజరాజేశ్వరి చనిపోయిందమ్మా! ఆమె బంధువుల గురించి వెదుకుతున్నాను. ఆ పని మీదే మీ దగ్గరికి వచ్చాను’
ఆమె మనసులో ఏమనుకుందో రమ్మన్నట్టు సైగ చేసి లోపలికి నడిచింది. లోపల ఓ నులక మంచం, కొద్దిగా సామాన్లు ఉన్నాయి. ఇల్లంతా పేదరికం పరచుకుని ఉంది. అతనికి మంచం చూపించింది కూర్చోవడానికి. ఆమె పక్కనే ఉన్న రేకు పెట్టె మీద కూర్చుంది.
‘రాజరాజేశ్వరి ఎప్పుడు చనిపోయింది? ఎక్కడ చనిపోయింది?’ ఆమె గొంతులో వివరాలు తెలుసుకోవాలనే ఆతృత తొంగిచూస్తోంది.
‘విశాఖపట్నంలో స్వంత ఇంట్లో అనారోగ్యంతో చనిపోయిందమ్మా! ఇది జరిగి రెండు వారాలు అవుతోంది’ చెప్పాడు యుగంధర్.
‘సాహు ఏమయ్యాడు?’
‘తెలియదమ్మా!’
‘రాజరాజేశ్వరికి పిల్లలు లేరా?’
‘లేరు...’
ఆమె కాసేపు నిశ్శబ్దంగా ఉండి ఆ తర్వాత తలూపి అంది,
‘అంతా దాని ఖర్మ. చేసుకున్న వారికి చేసుకున్నంత అంటారు పెద్దలు. ఉత్తినే అనలేదు’
‘రాజరాజేశ్వరి మీకేమవుతుంది?’ ముసలామె దారిలోకి వచ్చిందని గ్రహించి మొదటి ప్రశ్న అడిగేడు యుగంధర్.
‘అది మా బావగారి కూతురు. చదువుకోడానికి బాకురుగూడ నుంచి ఇక్కడకొచ్చింది. సంవత్సరం కూడా చదవకుండానే ఇంట్లోంచి పారిపోయింది. మా బావ అంటే రాజరాజేశ్వరి తండ్రి దేవరాజ్ మమ్మల్ని నానా మాటలు అన్నాడు’ విచారంగా అందామె.
‘ఆమె ఇంట్లోంచి ఎందుకు పారిపోయింది?’ అడిగి, ఆమె ముఖంలోని ముడతల వంక చూశాడు యుగంధర్. రాజరాజేశ్వరి చనిపోయిందన్న సంగతి తెలిసి ఆమె బాధపడుతున్నట్టు ఆ ముడుతలు మరింత చిక్కనయ్యాయి.
‘ముప్పై ఏళ్ల క్రితం బాకురుగూడ నుంచి బతుకుతెరువుకి సాలూరు వచ్చాం. గ్రామంలో మాకు గొమాంగో అనే మేనల్లుడు ఉన్నాడు. వాడికి రాజరాజేశ్వరి అంటే పిచ్చి ఇష్టం. ఆమెని పెళ్లి చేసుకుంటానని పెద్దలతో అడిగించాడు. అయితే రాజరాజేశ్వరి కంటే వాడు రెండేళ్లు చిన్నవాడు కావటంతో మా బావ పెళ్లి చెయ్యడానికి ఇష్టపడలేదు. గొమాంగో మాత్రం పట్టువిడువకుండా ఆ పిల్లని ఇబ్బంది పెట్టేవాడు. మరో దారిలేక చదివించమని రాజరాజేశ్వర్ని మా దగ్గరికి పంపేశాడు బావ’ ఆగి ఊపిరి తీసుకుని తిరిగి చెప్పసాగింది.
‘ఇక్కడ మార్కెట్లో మాకు చిన్న కూరగాయల దుకాణం ఉండేది. అక్కడ మా ఆయనకి పరిచయమయ్యాడు ఒరిస్సాకి చెందిన సాహు అనే కుర్రాడు. అతను సాలూరు పని మీద వచ్చినప్పుడల్లా మా ఇంటికొచ్చి రాత్రి ఉండేవాడు. రాజరాజేశ్వరి చాలా అందమైన అమ్మాయి. దానికి తోడు వినయ విధేయతలు కలది. ఆమె కనిపించకుండా పోయేక సాహు మళ్లీ మా ఇంటికి రాలేదు. అది వాడితో లేచిపోయిందని నిశ్చయించుకుని నోరు మూసుకున్నాం. మా ఆయన ఎవరికీ తెలియకుండా మక్కువ వెళ్లి సాహుగాడు కొంత డబ్బుతో పారిపోయాడని తెలుసుకున్నాడు. ఎవరైనా అడిగితే రాజరాజేశ్వరి ఇంటికి వెళ్లిపోయిందని చెప్పేవాళ్లం. మా బావ ఓసారి కూతుర్ని చూడటానికి వచ్చి అగ్గి మీద గుగ్గిలమైపోయేడు. అప్పటి నుంచి మా కుటుంబాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.’
‘ఇప్పుడు రాజరాజేశ్వరి తల్లిదండ్రులు బాకురుగూడలో ఉన్నారా?’
‘లేరు’
‘మరి?’
‘మూడేళ్ల క్రితం ఇద్దరూ పోయారు’ ఆమె గొంతు బొంగురు పోయింది.
‘మీరు బాకురుగూడ వెళ్లలేదా?’ కొన్ని క్షణాలు ఆగి అడిగేడు యుగంధర్.
‘లేదు. మా ఆయన పోయినప్పుడు వారికి నేను కబురు చెయ్యలేదు. అలాగే వాళ్లిద్దరూ నాలుగు నెలల తేడాలో చనిపోయినప్పుడు నాకు తెలియదు. ఆ తర్వాత మా ఊరు నుంచి ఎవరో వచ్చినప్పుడు తెలిసింది. మేము సాలూరు వచ్చిన కొత్తలో ప్రతీ ఏడాది దసరాకి బావగారి ఇంటికెళ్లి పది రోజులు ఉండి వచ్చేవాళ్లం. రాజరాజేశ్వరి వెళ్లిపోయేక పండగకి పిలవడం మానేశాడు బావ. మా ఆయన పని మీద బాకురగూడ వెళ్లినపుడు దారిలో ఎదురై తల తిప్పుకుని వెళ్లిపోయేడట. ఉండబట్టలేక ఇంటికి వెళితే మరెప్పుడూ నీ ముఖం నాకు చూపించకు అని అరిచేడట...’
కాసేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దం రాజ్యం చేసింది.
‘మీకు పిల్లలు లేరా?’ ప్రశ్నించేడు యుగంధర్.
‘ఒక్కడే కొడుకు. పని కోసం ముంబై వెళ్లి ఎనిమిదేళ్లయింది. ఇంతవరకూ వాడి నుంచి ఎలాంటి కబురు లేదు’ గద్గదంగా అందామె.
‘ఇల్లు ఎలా గడుస్తుంది?’
ఆ ప్రశ్నకి తలెత్తి యుగంధర్ కళ్లలోకి చూసి చిన్నగా నవ్వింది.
‘ఇక్కడ రైతు బజారులో కొట్టుంది. ప్రొద్దున్న ఆరు గంటలకి వెళ్లి ఆకుకూరలు అమ్మి పదకొండుకి వస్తాను. పిడికెడు బియ్యం చాలు నాకు. ఇంకెంతకాలం ఉంటాం ఈ భూమీద. నా భర్త పోతూ నా జీవం సగం తీసుకుపోయేడు. ఇప్పుడు నేనెప్పుడు పోయినా అడిగేవారు లేరు’
‘మీరు తప్ప రాజరాజేశ్వరికి బంధువులు ఎవరూ లేరన్నమాట’
తల అడ్డంగా ఊపిందామె.
‘రాజరాజేశ్వరి సాలూరు వచ్చేసరికి అయిదేళ్ల చెల్లెలు ఉంది. మా బావగారికి చాలా ఆలస్యంగా పుట్టిన రెండో సంతానం’
తెల్లబోయేడు యుగంధర్.
‘ఆమె ఎక్కడుంది?’ తేరుకుని అడిగేడు.
‘నాకు సరిగ్గా తెలియదు’
‘తెలుసుకోవడం ఎలా?’
‘బాకురుగూడ వెళితే తెలుస్తుంది’ చెప్పిందామె.
‘ఆమె పేరేంటి?’
‘సుకాంతి’
తలపంకించి తన చివరి ప్రశ్న అడిగేడు యుగంధర్.
‘సాహు ఎలాంటి వాడు?’
‘కుర్రాడు మంచాడే. బాగా సంపాదించి గొప్పవాడు కావాలనే కోరిక ఉండేది. ఒరిస్సా నుంచి గంజాయి తెచ్చి ఆంధ్రాలో అమ్ముదామని ఓసారి మా ఆయనతో అన్నాడు. అలాంటి పిచ్చి ఆలోచనలు మానుకోమని ఆయన చీవాట్లు పెట్టేరు’
ఆమెకి కృతజ్ఞతలు చెప్పి అక్కడ నుంచి వచ్చేశాడు యుగంధర్.
విశాఖ జిల్లాలో పాడేరు, మాడుగుల, చోడవరం వంటి ప్రాంతాలు గంజాయి రవాణాకి ప్రసిద్ధి. చుట్టుపక్కల ఏజెన్సీ గ్రామాల్లోని మారుమూల కొండల మీద రహస్యంగా పండించిన గంజాయిని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల వాళ్లు వచ్చి కొంటారు. అలాగే ఒరిస్సాలో గిరిజనులు గంజాయి అధికంగా పండిస్తారు. చౌకగా లభించే ఆ గంజాయి కొనుగోలు చేసి ఏజెంట్‌కి అప్పగిస్తారు. అతను అడవుల్లోని అడ్డదారుల ద్వారా తూర్పుగోదావరి అన్నవరం, తుని చేరుస్తారు. అలా వచ్చిన సరకుని ఇతర రాష్ట్రాలకు పంపుతారు స్మగ్లర్లు.
ఈ ప్రాంతాల పోలీసు, ఎక్సైజ్ స్టేషన్లలో బలరామ్ సాహు మీద గంజాయి స్మగ్లింగ్ కేసు నమోదయిందేమో తెలుసుకోవాలి. ఈ ఆలోచన వచ్చాక మరుక్షణం సాలూరులోని పోలీసు వైర్‌లెస్ స్టేషన్‌కి చేరుకుని విశాఖపట్నం కంట్రోలు రూమ్‌కి మెసేజ్ పంపించాడు సమాచారం తెలుసుకోమని.
ఇంతలో యుగంధర్ సెల్ మోగింది.
‘నేను..’ సాలూరు ఇన్‌స్పెక్టర్ గొంతు ఉత్సాహంగా వినిపించింది.
‘ఏమైంది?’ అడిగేడు యుగంధర్.
‘మీరు ఊహించినట్టే జరిగింది. చెవి కమ్మెలకు ఆశపడి నిద్రపోయేక తీసుకుందామని ఇంట్లో ఓ గదిలో పిల్లని దాచింది మేనత్త. కమ్మెలు తీస్తున్నపుడు పిల్ల మేలుకుంది. అంతకు ముందే పిల్లని వెతకడానికి బంధువులతో కలిసి తనూ వెళ్లింది. తన గురించి చెబితే పరువు పోతుందని అర్ధరాత్రి గెడ్డ దగ్గరికి తీసుకెళ్లి పీకకోసి తుప్పల్లో పడేసింది. అదంతా చూసిన భర్తకి భయంతో జ్వరం వచ్చింది. మర్నాడు పిల్ల ఏమైందో చూడటానికి వెళ్లిన మేనత్తకి మూలుగు వినిపించింది. అటుగా వెళుతున్న మనుషులు తనని ఆ తుప్పల దగ్గర చూసేసరికి తప్పనిసరై కేకలు పెట్టింది’
‘చెవి కమ్మెలు, పీక కొయ్యడానికి ఉపయోగించిన కత్తి దొరికాయా?’
‘మొగుడు చూపించాడు’
‘గుడ్‌వర్క్...’ మెచ్చుకున్నాడు యుగంధర్.
‘ఈ రాత్రికి వేరే కార్యక్రమాలు పెట్టుకోవద్దు. మీకు పార్టీ ఇస్తున్నా...’ ఇన్‌స్పెక్టర్ అన్నాడు.
‘సారీ.. నేను అర్జంటుగా రాయగడ వెళ్లాలి. మీరు విశాఖపట్నం వచ్చినప్పుడు కలుద్దాం’ చెప్పాడు యుగంధర్.
* * *
(మిగతా వచ్చే వారం)

-మంజరి 9441571994