S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బతుకొక పండుగ ( కథల పోటీలో ఎంపికైన రచన)

ఉదయానే్న విన్న వెంకట్ మరణ వార్త నన్ను కలచివేసింది. తీవ్రమైన గుండె నొప్పి వచ్చిందట, ఆస్పత్రికి తీసుకెళ్లేలోపలే చనిపోయాడట. వెంకట్ నాకంటే రెండేళ్లు చిన్న. స్వయానా మా మామయ్య కొడుకు. రైల్వేలో పెద్ద ఉద్యోగం. రిటైరై ఇంకా ఏడాది కూడా దాటలేదు. ‘అరవై యేళ్లు మొన్ననేగా నిండాయి. చిన్న వయసేగా. అప్పుడే మృత్యువు తరుముకు రావడం ఏమిటో’ అన్నాను నా భార్య కమలతో.
‘ఒకప్పుడు వయసు డెబ్బయ్ దాటాక మిగతాదంతా బోనస్ అనుకునేవాళ్లు. ఇప్పుడు అరవై దాటినప్పటి నుంచీ అలా అనుకోవాల్సి వస్తోంది. ఐనా మన చేతుల్లో ఏముంది? ఎప్పుడు పిలుపొస్తే అప్పుడు వెళ్లక తప్పదుగా’ అంది కమల తన సహజమైన వేదాంత ధోరణిలో.
నాలో నిద్రాణమై ఉన్న భయం ఒక్కసారిగా వొళ్లు విరుచుకుని లేచి కూచుంది. పుట్టిన ప్రతి ప్రాణికీ మరణం తప్పదని తెల్సినా చావు సమీపిస్తుందని తెలిసినపుడు ప్రతి వ్యక్తీ భయపడటం సహజమేమో. నాకీ మధ్య చావు భయం పట్టుకుంది. మూడేళ్ల క్రితం రిటైరయ్యాను. ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నన్ని రోజులు అటువంటి ఆలోచనలేమీ రాలేదు. ఇప్పుడు రోజూ ఏదో ఓ సమయంలో చావు గుర్తొస్తుంది. ఇంకా ఎన్నాళ్లు బతుకుతానో.. డెబ్బయ్ వరకూ ఉంటానా అని చాలాసార్లు అనుమానం వస్తూ ఉంటుంది. అలాగని ప్రమాదకరమైన రోగాలేమీ లేవు. ఐదేళ్లుగా చక్కెర వ్యాధికి మందులు వాడుతున్నాను. రెండేళ్లుగా రక్తపోటు కూడా జతయ్యింది. ఇవి చాలవూ చావు ముందుకు రావడానికి?
ప్రతి మూడు నెలలకీ చెకప్ చేయించుకుంటున్నా. పోయిన సారి వెళ్లినపుడు ‘అవే మందులు కంటిన్యూ చేయండి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉన్నాయి. ఆహార నియమాలు మాత్రం నేను చెప్పినట్టు కచ్చితంగా పాటించండి. ఉప్పు వాడకం బాగా తగ్గించండి’ అన్నాడు డాక్టర్.
నేను సరేనని తల వూపి, సిగ్గుపడుతూనే ‘డాక్టర్‌గారూ.. ఇలా మందులు వాడుతూ ఉంటే డెబ్బయ్ వరకు బతుకుతానంటారా?’ అని అడిగాను.
‘పాతికేళ్లకు పైగా షుగరూ బీపీలున్నా కూడా మందుల ఆసరాతో బతుకుతున్న వాళ్లున్నారు. వేరే ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటే మీరు డెబ్బయి యేళ్లు దాటినా నిక్షేపంగా ఉంటారు’ అన్నాడు నవ్వుతూ.
‘వేరే ఆరోగ్య సమస్యలంటే?’ లోపల ఉబుకుతున్న భయాన్ని నొక్కి పట్టి అడిగాను.
‘ఏమైనా రావొచ్చు. ఒక్కోసారి కొన్ని రోజుల వ్యవధిలోనే సమస్య తీవ్రమై ప్రాణాంతకం కావొచ్చు. ఇటీవలి కాలంలో స్వైన్‌ఫ్లూతో ఎంతోమంది చనిపోయారు కదా. చెప్పలేం. డాక్టర్ల చేతుల్లో కూడా ఏమీ లేదు. వైద్యం చేయడం వరకే మా పని. దాని ఫలితం మాత్రం మా నియంత్రణలో ఉండదు’ అన్నాడు.
డాక్టర్ చెప్పకున్నా నా మనసులో రకరకాల జబ్బులు కోరలు సాచి కన్పించాయి. కేన్సర్ వస్తే చాలుగా.. అది మరణ శాసనమే. అంతెందుకు.. ఏ మందు బిళ్లో మింగితే అది వికటించి శ్వాస ఆడక మరణించవచ్చు. వెయ్యి మందిలో ఒక్కడికి అటువంటి విపరీతమైన రియాక్షన్ కలుగుతుందట. ఆ ఒక్కడ్నీ నేనే కావొచ్చుగా.
నేనెలా చనిపోతానోనన్న ఆలోచనలు... చావు ఏదో ఒక రూపంలో వస్తుందిగా. నాకే రూపంలో దర్శనమిస్తుందో... గుండె నొప్పిలానా.. కిడ్నీలు పాడయిపోయా.. కేన్సర్ మహమ్మారిలానా.. ఎందుకిలాంటి ఆలోచనలు వస్తున్నాయో.. ఎక్కువ కాలం బతకనని ఎందుకనిపిస్తుందో.. ఎప్పటివో పాత జ్ఞాపకాలన్నీ వస్తున్నాయి. మా అమ్మానాన్నా.. నా బాల్యం.. పెళ్లి.. నా భార్యతో గొడవలు.. అలగడాలు.. చిన్ననాటి స్నేహితులు ఎక్కడ ఉన్నారో.. వాళ్లను కల్సుకోవాలనిపిస్తుంది. నాకు మిగిలిన సమయం చాలా తక్కువనిపిస్తోంది. నేను చేయాలనుకుని వాయిదా వేసుకున్న పనులన్నిటినీ తొందరగా పూర్తి చేయాలనిపిస్తోంది. ఏదో తరుముకు వస్తున్నట్టు.. కోరలు సాచిన జాగిలమేదో వెంట పడినట్టు...
‘తీరిగ్గా కూచుంటే ఇలాంటి అర్థంలేని ఆలోచనలే వస్తుంటాయి. ఏదైనా మంచి పుస్తకం చదవండి. మన పూజ గదిలో కూచుని మీకిష్టమైన దేవుడ్ని కొలవండి. ధ్యానం చేయండి. ప్రాణాయామం చేయండి. మీకిష్టమైన స్నేహితుల్తో కబుర్లు పంచుకోండి. ఎప్పుడో వచ్చేదాని కోసం ఇప్పటి నుంచే ఆలోచించి మనసు పాడు చేసుకోవడం మంచిది కాదు’ అంది కమల.
‘శరపరంపరలా ఆలోచనలు వస్తుంటే ధ్యానమెలా సాధ్యపడ్తుంది? దేవుడి మీద ఏకాగ్రత ఎలా కుదుర్తుంది చెప్పు’ అన్నాను బాధగా.
‘ఎలాంటి ఆలోచనలు?’
‘తొందరగా చచ్చిపోతాననిపిస్తోంది’
‘్ఛ... అవేం అశుభం మాటలండీ.. ఐనా మీకలాంటి శారీరక రుగ్మతలేం లేవు. మానసికంగా ఎక్కడో ఏదో అలజడి ఉంది మీలో. నా మాటిని ఓసారి మానసిక వైద్యుణ్ణి సంప్రదించండి’ అంది.
నాకూ ఆ ఆలోచన సబబుగా అన్పించింది.
హైదరాబాద్‌లో డాక్టర్ శివశంకర్ బాగా పేరున్న సైకియాట్రిస్ట్ అని తెలుసుకుని, ఓ సాయంత్రం అతన్ని కల్సుకున్నాను.
‘ఎప్పటి నుంచి మీకలా అన్పిస్తోంది?’ అని అడిగాడు డాక్టర్.
‘కాలేజీలో చదువుకునే రోజుల్లో ఎక్కడో ఓ వాక్యం చదివాను డాక్టర్. మనం పుట్టిన క్షణమే చావు ముహూర్తం కూడా నిర్ణయించబడి ఉంటుందనీ ఆ క్షణం నుంచే ఆయుష్షు కొద్దికొద్దిగా తరగడం ప్రారంభమవుతుందని. ఎప్పుడైనా పేపర్లో అటువంటి వార్తలొస్తే వాళ్లు ఎనే్నళ్లకు చనిపోయారో లెక్కవేసుకోవటం నా అలవాటు. బహుశా నాలో మరణభయం చాలా ఏళ్లుగా నిద్రాణమై ఉండిందనుకుంటా. రిటైరైనప్పటి నుండి అది ప్రస్ఫుటంగా తెలుస్తోంది. నా వయసు వాళ్లో నాకంటే చిన్నవాళ్లో చనిపోయారని విన్నప్పుడల్లా ఆ భయం మరింత భయపెడుతోంది. నేను కూడా ఎక్కువ కాలం బతకనని బలంగా అన్పిస్తోంది’ అన్నాను.
‘ప్రాణాంతకమైన వ్యాధులున్న వాళ్లలో మరణ భయం సహజం. మీకున్న ఆరోగ్య సమస్యలు చాలా సాధారణమైనవి. ఈ రోజుల్లో షుగరూ బీపీలలు పాతిక ముప్పయ్ ఏళ్ల వాళ్లలో కూడా కన్పిస్తున్నాయి. మీరలా భయపడటంలో అర్థం లేదు. మీరు మీ భారయను తీసుకుని ఏదైనా మంచి ప్రదేశానికి వెళ్లి కొన్ని రోజులు గడిపి రండి. గాలి మార్పుంటుంది. మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి. గార్డెనింగ్ లాంటి ఏదైనా వ్యాపకం పెట్టుకోండి’ అంటూనే కొన్ని మందులు రాసిచ్చాడు. ‘మీలో డిప్రెషన్ లక్షణాలు కన్పిస్తున్నాయి. ఈ మందుల్ని ఓ నెల రోజులు వాడండి. గుణం కన్పిస్తుంది. మనసు నెమ్మదిస్తుంది’ అన్నాడు.
నెల రోజులు క్రమం తప్పకుండా డాక్టర్ రాసిచ్చిన మందులు వాడాను. నా ఆలోచనల్లో భయాల్లో ఏ రకమైన మార్పూ లేదు.
‘డాక్టర్ గాలి మార్పు కావాలన్నాడుగా. మన రెండోవాడి దగ్గరకెళ్లి చాలా రోజులైంది. మనవడు పుట్టినపుడు వెళ్లాం. ఇపుడు వాడికి రెండేళ్లు నిండి ఉంటాయి. కొడుకూ కోడలు ఎలాగూ ఇక్కడికి రారు. ఎప్పుడడిగినా పని వత్తిడనో సెలవు దొరకదనో అంటారు. మనమే వెళ్దాం. ఓ రెండు వారాలు అక్కడ గడుపుదాం. మనవడ్ని ఆడిస్తూ వాడి ముద్దుముద్దు మాటలు విన్నారంటే చాలు జీవితం మీద అనురక్తి పుట్టుకొస్తుంది’ అంది కమల.
మా పెద్దబ్బాయి అమెరికాలో సెటిలైనాడు. మూడేళ్లకోసారి చుట్టపు చూపుగా వచ్చి పల్కరించి పోతాడు. రెండోవాడు నాగపూర్లో పర్సిస్టెంట్ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. కోడలు బ్యాంక్‌లో ఉద్యోగస్థురాలు. వాళ్లకు ఇద్దరు మగపిల్లలు. పెద్దపిల్లాడికి ఐదేళ్లుంటాయి. చిన్నవాడికి రెండేళ్లు. కమల చెప్పినట్టు వాడికిపుడు మాటలు బాగా వచ్చి ఉంటాయి. నాకూ మనసు లాగింది. రిటైరై ఖాళీగా ఉన్నాను కదా. ఇక్కడుండి చేసేదేముంది? నాగపూర్ వెళ్లి కొన్ని రోజులు ఉండి వస్తే మనవళ్లతో ఆడుకున్నట్టూ ఉంటుంది.. మనసూ కుదుటపడ్తుంది అనుకున్నాను.
నాగపూర్లో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఎటు చూసినా పచ్చదనమే. ప్రతి ఇంట్లో చెట్లున్నాయి. ప్రతి ఆఫీస్‌కి విశాలమైన కాంపౌండ్ దాన్నిండా రకరకాల వృక్షాలు. స్వచ్ఛమైన గాలి ధారాళంగా దొరుకుతోంది. మా వాడి ఇంటికి దగ్గర్లో చక్కటి పార్కుంది. సాయంత్రాలు మనవళ్ళిద్దరినీ తీసుకుని పార్కుకెళ్లి ఓ గంట గడపటం నా దినచర్యలో భాగమైంది.
ఆ రోజు పార్కుకెళ్లటానికి మనవళ్లిద్దర్నీ తయారుచేస్తున్నప్పుడు కమల అంది. ‘మన కమల్‌గాడ్ని చూశారా? ఎంత పెద్ద కళ్లో.. పెదాలు కూడా చూడండి ఎంత చక్కగా గులాబి రంగులో ఉన్నాయో. అచ్చం మనబ్బాయి పోలిక. చిన్నాడేమో మన కోడలి పోలిక. ఇద్దరూ అందగాళ్లే. నాకు మాత్రం కమల్ పెళ్లి చూసేవరకు బతికుండాలని ఉందండీ. నా కోరికని భగవంతుడు తప్పక తీరుస్తాడు’
నాకు నవ్వొచ్చింది. పిచ్చిది.. ‘అప్పటివరకూ మనం బతికుంటామన్న నమ్మకం నాకు లేదు’ అన్నాను.
‘ఎందుకుండకూడదూ.. ఎనభై ఏళ్లు దాటినా హాయిగా తిరిగి తిరిగేవాళ్లు చాలామంది ఉన్నారు. నాకు యాభై యేడేళ్లేగా.. ఇంకో ఇరవై ఏళ్లు నాకు ఢోకా ఉండదనుకుంటున్నా. పెద్ద మనవడి పెళ్లే కాదు చిన్న మనవడి పెళ్లి కూడా చూసి గాని పోను’ అంది.
ఎంత నమ్మకం తనకి! నాకు మనవళ్లతో సమయం గడుపుతున్నా మనశ్శాంతిగా ఉండటం లేదు. కమల్‌కి ఎనే్నళ్లు వచ్చేవరకు బతికుంటానో? వాడికి పదేళ్లు వచ్చేలోపల చచ్చిపోతానేమో. అప్పటికి నాకు అరవై ఏడేళ్లు వస్తాయి. అసలు అప్పటివరకూ ఉంటానో లేదో.. నాకు తెలిసి మా బంధువుల్లో చాలామంది అరవై ఐదు దాటకుండానే చనిపోయారు. నేనూ అంతేనేమో.. చనిపోవడానికి పెద్ద జబ్బే చేయాలని ఏమీ లేదు. బాత్రూంలో కాలుజారి పడి చనిపోయిన వాళ్లున్నారు. రోడ్డు మీద మనం సరిగ్గా నడుస్తున్నా సవ్యంగా బండి నడపటం రాని ఏ ఆకతాయి కుర్రాడో మనల్ని ఢీకొట్టడం వల్ల అక్కడికక్కడే చనిపోవచ్చు లేదా ఆస్పత్రిలో కొన్ని రోజులు హింస పడి మరీ చావొచ్చు.
పార్కులు మనవళ్లిద్దరూ ఆడుకుంటున్నారు. నేను సిమెంటు బెంచీ మీద కూచుని జీవితంలోని నిరర్థకత గురించి ఆలోచిస్తున్నా. ఇంతేనా జీవితం? ఏముందని ఇందులో? చదువుకున్నాను. ఉద్యోగం వచ్చింది. పెళ్లి చేసుకున్నాను. పిల్లలు పుట్టారు. వాళ్లకు పెళ్లిళ్లు చేశాను. వాళ్లకూ పిల్లలు పుట్టారు. ఇపుడు ఏం మిగిలిందని.. చావు కోసం ఎదురుచూడటం తప్ప. వయసులో ఉన్నపుడు వేటికోసమైతే వెంపర్లాడానో ఇపుడవన్నీ తుచ్ఛమైన విషయాలుగా అన్పిస్తున్నాయి. జీవితమంటే ఏమిటని ననె్నవరైనా అడిగితే పుట్టుక చావుల మధ్య పడే అర్థరహితమైన ఆరాటం అని అంటాను.
అసలు చావంటే ఏమిటి? మరణానుభవం ఎలా ఉంటుంది? చావు తర్వాత మళ్లా పుట్టుక నిజమేనా? మరో లోకం నిజంగా ఉందా? లేదనుకుంటా. చావు తర్వాత ఏమీ ఉండదు. ఏమీ మిగలదు. అంతా శూన్యం. ఈ ప్రేమలూ, మమకారాలూ, అనుబంధాలూ, భవబంధాలూ ఏవీ ఉండవు. అలా అనుకోగానే చప్పున భయమేసింది. ఆలోచనల్లోంచి బైటపడి మనవళ్లు ఏం చేస్తున్నారా అని చూశాను.
పెద్దోడు జారుడుబండ మీద జారుతున్నాడు. వాడి వెనక ఓ ముసలతను కూడా జారుతున్నాడు. అతని వీపుకి ఆనుకుని జారుతూ చిన్న మనవడు కిలకిలా నవ్వుతున్నాడు.
‘చాలా బావుంది కదా. మళ్లా జారుదామా?’ అంటూ ఆ ముసలతను పిల్లలిద్దర్నీ తీసుకుని జారుడుబండ మెట్ల వైపు కెళ్తున్నాడు. పిల్లల్తో చనువుగా మాట్లాడుతున్న అపరిచిత వ్యక్తిని చూడగానే భయమేసి లేచి పిల్లల దగ్గరకెళ్లాను.
నేను పిల్లల్ని పొదివి పట్టుకోగానే అతను పసిపిల్లాడిలా నవ్వి ‘మీ మనవళ్లా.. చాలా అందమైన పిల్లలు. మీరూ రాకూడదూ.. జారుడుబండ మీద జారుతుంటే చాలా బావుంటుంది కదా. నా చిన్నప్పుడైతే అలసిపోయే వరకు జారుడుబండని వదిలేవాణ్ణి కాదు’ అన్నాడు.
నాకు ఆసక్తి లేదని చెప్పి పిల్లల్ని తీసుకువస్తుంటే ‘కనీసం పిల్లల్నయినా ఆడుకోనివ్వండి’ అన్నాడు.
నేను అతనికి సమాధానమివ్వకుండా మనవళ్లిద్దర్నీ ఉద్దేశించి ‘ఇప్పటివరకూ ఆడుకుంది చాలు. పదండి ఇంటికెళ్దాం’ అన్నాను. పిల్లలిద్దరూ నిరాశగా మొహాలు పెట్టారు.
‘కాళ్లు నొప్పెడుతున్నాయి తాతయ్యా. కొద్దిసేపు కూచుందామా ప్లీజ్’ అన్నాడు కమల్.
ముగ్గురం మళ్లా సిమెంటు బెంచీ మీద కూచున్నాం. ఆ ముసలతను జారుడు బండ మీద జారుతూ రెండు చేతుల్నీ గాల్లో వూపుతూ తెగ సంబరపడిపోతున్నాడు.
అతని వయసు డెబ్బైకి పైనే ఉంటుందనుకుంటాను. జుట్టంతా తెల్లగా ఉంది. ముందు రెండు పళ్లు ఊడి ఉండటంవల్ల నవ్వినపుడు ఆ సందులోంచి గాలి బైటికి వస్తూ వింత శబ్దం చేస్తోంది. మనిషి సుమారు ఎత్తుతో సన్నగా రివటలా ఉన్నాడు.
అక్కడున్న రెండు ఉయ్యాలల మీద పిల్లలు ఊగుతున్నారు. ఒక ఉయ్యాల మీంచి పిల్లలు దిగంగానే ఆ ముసలతను ఆ అవకాశం కోసమే ఎదురుచూస్తున్నట్టు జారుడు బండ వదిలేసి వేగంగా ఉయ్యాలని సమీపించి దాని మీద కూచున్నాక విజయగర్వంతో మిగతా పిల్లల వైపు చూసి చిద్విలాసంగా నవ్వాడు. ఆ వయసులో అంత వేగంగా నడవడం అతనికెలా సాధ్యపడిందో.. బహుశా ఏ అనారోగ్యాలూ దరిచేరని శరీరమేమో.
అతన్ని మరింత నిశితంగా గమనించసాగాను.
అతను ఊగుతూ కేరింతలు కొడ్తున్నాడు.. అచ్చం పక్క ఉయ్యాల మీద ఊగుతున్న పిల్లల్లానే..
నేను లేచి మనవళ్లతోపాటు నడుస్తూ వెనక్కి తిరిగి చూశాను.
అతను ఊగుడు బల్ల మీద కూచుని అటువైపు కూచుని ఉన్న ఇద్దరు పిల్లలతో ‘గట్టిగా నొక్కండి. నేను గాల్లో తేలిపోవాలి’ అంటూ పెద్దగా నవ్వుతున్నాడు.
మరునాడు పార్కుకి వెళ్లగానే నా కళ్లు అతని కోసం వెతుక్కున్నాయి. నేను వెళ్లి కూచున్న ఓ పావుగంట తర్వాత వచ్చాడతను. నన్ను చూసి పలకరింపుగా నవ్వుతూ చేయి వూపాడు. ఆ తర్వాత వేగంగా నడవడం మొదలుపెట్టాడు. కన్ను మూసి తెరిచేలోపల ఓ చుట్టు చుట్టి మళ్లా నడుస్తున్నాడు. నాలుగైదు చుట్లు చుట్టాక గడ్డిలో కూచుని కొద్దిసేపు సేద తీర్చుకున్నాడు. తర్వాత ఓ పది నిమిషాల సేపు పద్మాసనం వేసుకుని కూచుని కళ్లు మూసుకుని ధ్యానం చేశాడు.
అది పూర్తి కాగానే హుషారుగా లేచి పిల్లల్తో సమానంగా ఆడుకోవడం మొదలెట్టాడు.
నా మనవళ్లతోపాటు పక్క ఉయ్యాల మీద ఊగుతూ ‘మీరూ రాకూడదూ... మనిద్దరం వూగుడు బల్ల ఆడుదాం. పిల్లలయితే నా బరువుని పైకి లేపలేక పోతున్నారు’ అన్నాడు నవ్వుతూ.
‘నాకు షుగరూ బీపీ రెండూ వున్నాయి. మీ అంత ఆరోగ్యవంతుణ్ణి కాదు’ అన్నాను.
అతను వూగడం ఆపి పెద్దగా నవ్వాడు. ‘నేను ఆరోగ్యంగా ఉన్నానంటారా? భలేవారే. గత పదిహేనేళ్లుగా నాకూ బీపీ షుగరూ ఉన్నాయి. ఐదేళ్ల క్రితం గుండె నొప్పి వస్తే డాక్టర్లు మూడు స్టంట్లు వేశారు. ఈ మధ్య కిడ్నీల సమస్య కూడా తోడయింది’ అంటూ నవ్వాడు.
ఓ వారం దాటాక అతనితో పరిచయం పెరిగి ఇద్దరం సిమెంటు బెంచీ మీద కూచుని కబుర్లు చెప్పుకునేవరకు వచ్చింది. అది కూడా అతను తనివితీరా పిల్లల్తో పోటీపడి ఆడుకున్నాకే నా పక్కకొచ్చి కూచునేవాడు.
‘మీకెనే్నళ్లు’ అని అడిగానో రోజు.
‘డెబ్బయ్ రెండు’ అంటూ విరిగిన ముందు పళ్లలోంచి గాలి బైటికి వచ్చేలా నవ్వాడు.
‘మీరేమీ అనుకోనంటే ఓ ప్రశ్న అడగనా? నాకైతే జీవితం చివరి దశకొచ్చిందన్న ఆలోచనల్తో మనశ్శాంతి కరువైంది. మీకు మృత్యువు గురించి ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా?’
‘ఎందుకు రాదూ... రోజూ రాత్రిళ్లు చావులాంటి నిద్రలోకి జారిపోయి ఉదయం మేల్కొని జీవిస్తుంటా కదా’
‘నేనడిగేది ఆ నిద్ర గురించి కాదు.. శాశ్వత నిద్ర గురించి’
‘దాని గురించి ఆలోచించడానికేముంది? ఏదో ఓ రోజు అది రాక తప్పదుగా. ఆలోచించినంత మాత్రాన రాకుండా ఆగిపోదుగా’ అంటూ నవ్వాడు.
‘మరి మీకు చనిపోతానేమోనన్న భయం వేయదా?’
‘బతికే ఉన్నాగా.. మరి భయమెందుకు?’
‘ఇప్పుడు కాదు.. చావు ముంచుకొచ్చినపుడు’
‘చనిపోయాక ఇక దేనికి భయం? బతుకు ఓ అనుభవమైతే చావు కూడా మరో అనుభవం. బతుకుని ఓ ఉత్సవంలా ఓ పండుగలా అనుభవించిన వ్యక్తి చావుని కూడా సంతోషంగా కౌగిలించుకుంటాడు. నేను నా జీవితాన్ని అలానే ఆస్వాదిస్తాను. అలాగని నేను బాగా డబ్బున్నవాణ్ణి అనుకుంటున్నారేమో. ఇక్కడికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ ఫ్యాక్టరీలో దాదాపు ముప్పై ఏళ్లు పనిచేసి రిటైరయ్యాను. ఉన్నంతలో నా జీవితాన్ని మనసారా అనుభవించాను. ఆరేళ్ల క్రితం నా భార్య చనిపోయింది. ఇద్దరాడపిల్లలు. పెళ్లిళ్లు చేసుకుని బాంబేలో స్థిరపడ్డారు. నాకు తోచిందేదో వండుకుని తింటాను. డాక్టర్లు రాసిచ్చిన మందులు వేసుకుంటాను. మేల్కొని ఉన్న ప్రతి క్షణాన్ని సంతోషంతో నింపుకోడానికి ప్రయత్నిస్తుంటాను’ అన్నాడతను.
‘ఇన్ని జబ్బుల్తో ఈ వయసులో అదెలా సాధ్యం?’ అని అడిగాను.
‘దీనికి వయసుతో సంబంధం లేదు. అక్కడ హాయిగా గెంతుతూ ఆడుకుంటున్న పిల్లల్ని చూశారా.. వాళ్ల మనసూ శరీరంతోపాటు ఉయ్యాల ఊగుతోంది. ఆ పసి మనసుని భద్రంగా కాపాడుకుంటే చాలు. ఏ భయమూ దరి చేరదు. బతుకు అందమైన నవ్వులా మురిసిపోతుంది. నేను మేల్కొని ఉండే సమయాన్నంతా సంతోషంగా గడిపేస్తాను. రాత్రి పడుకోబోయే ముందు తృప్తిగా పడుకుంటాను. ఉదయం నిద్రలేచాక పండుగలా జరుపుకోడానికి మరో రోజు నా జీవితంలో ఉన్నందుకు సంబరపడిపోతాను. జీవితంలోని ప్రతి క్షణాన్ని వసంతంతో నింపేసి నాకు రాబోయే శిబిరం గురించిన ఆలోచన రావడానికి అవకాశమెక్కడుంది’ అంటూ మరోసారి పసిపాపలా నవ్వాడు.
నా మనసు అలజడికి లోనవుతోందని కమల చెప్పినపుడు మా అబ్బాయి నన్ను దగ్గరలో వున్న ఓ స్వామీజీ ఆశ్రమానికి పిల్చుకెళ్తానని చెప్పాడు. స్వామీజీ ఏమైనా ఉపదేశమిస్తే నా మనసు శాంతిస్తుందని వాడి ఆలోచన.
ఆ ఆశ్రమానికెళ్లకుండానే స్వామీజీ నాకు ఉపదేశం ఇచ్చినట్టు అనిపించింది అతని మాటలు వింటుంటే...
అబ్బాయి దగ్గర రెండు వారాలుందామని వచ్చిన నేను రెండు నెలలు ఉండిపోయా. ఈ రెండు నెలల్లో అతని సాహచర్యంలో ఎనె్నన్ని జీవిత పాఠాలో... అతని పక్కనే మరో ఉయ్యాల మీద వూగుతున్న నాకు శరీరమే కాదు మనసు కూడా దూదిపింజలా మారి గాల్లో తేలుతున్నట్టు.. అనిర్వచనీయమైన భావన... బతుకుని ఓ ఉత్సవంలా జరుపుకోవడం ఎలానో తెలిశాక నా మనసులోని అలజడి, భయపెట్టే ఆలోచనలు తగ్గాయి. నేనిపుడు నా జీవితంలోని ప్రతి క్షణాన్ని వసంతంతో నింపేసుకుంటున్నా... ఇక శిశిరానికి చోటెక్కడుంది? *

సలీం