S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

చేతనయిన పనులు!

రేడియోలో అవసరం కొద్దీ సైన్స్ రాశాను. చదివాను. నాతో నేనే పోటీ పడి ఏవేవో వింత పనులు చేసి ఆనందం పొందాను. విన్నవారు కూడా ఆనందంగా ఉందన్నారు. అటు
తరువాత పత్రికలలో రాయవలసిందిగా మిత్రులు ప్రోత్సహించారు.

చలం సృష్టించిన పాత్రలలో దేశికాచారి నాకెందుకో బాగా గుర్తుండిపోయాడు. నేను కూడా ఆచార్లు గాడినే గనుకనా? అయినా నా పేరు చివర ఆచార్య అన్న మాట లేదే? ఇంతకూ దేశికాచారి పాత్ర గురించిన నవల పేరు జీవితాదర్శం. ఆ మాట ఎందుకో నాకు గుర్తుండేది కాదు. ఇప్పుడు బాగా గుర్తుంది. ఎందుకంటారు? నాకూ ఓ జీవితాదర్శం ఉండాలని నేను అనుకుంటున్నానా కొంపదీసి?
అంత పెద్ద మాటలకు నాలాంటి మనుషుల బతుకుల్లో చోటు లేదు గానీ, నాకు నచ్చిన పని చేసే అవకాశం మాత్రం దొరికింది. దాన్ని నేనే అంది పుచ్చుకున్నాను. అందరిలాగా కవితలు, కథలు గాకుండా సైన్స్ రాయాలని నిర్ణయించుకున్నాను. అనువాదాలు చేయాలని కూడా అనుకున్నాను. రెండూ కొనసాగుతున్నాయి. అంతో ఇంతో మంచి పేరే వచ్చినట్టుంది.
నాకు తెలియకుండానే సైన్స్ రాయడం మొదలుపెట్టాను. పరిశోధన విద్యార్థిగా ఉండగా మిత్రుడు దేవరాజు మహారాజు ‘ఒక వ్యాసం రాయి. రేడియోలో చదువుదువుగాని’ అన్నాడు. అప్పుడు జంతు జాతులు ప్రపంచం మీద వ్యాపించిన తీరు గురించి రాశాను. ఆ తరువాత పత్రికల్లో వరుసబెట్టి రాయడం, పుస్తకాలుగా వ్యాసాలను ప్రచురించడం అన్నీ ఒకదాని వెంట ఒకటి జరిగాయి.
ప్రతి విషయాన్నీ ప్రశ్నించడం, పరిశీలించడం నాకు చిన్ననాటి నుంచీ నచ్చిన పద్ధతి. దానే్న వైజ్ఞానిక పద్ధతి అంటారని తరువాత తెలిసింది. చిత్రంగా నాకు రేడియోలో ఉద్యోగం దొరికింది. అక్కడ నా పని సైన్స్ ప్రసారాల నిర్వహణ. ఇక ‘వాలీ దేఖన్ మై చలీ’లాగ నాకు ఈ ప్రపంచం అంతా సైన్స్‌గానే అర్థం కావడం ఆనాడే మొదలయింది. నాటి నుంచి నేటి వరకు ఉద్యోగం పోయిన తరువాత కూడా సైన్స్ చదువుతున్నాను. అర్థమయింది అనిపించిన సంగతులను గురించి రాస్తున్నాను. ఒక పనిని చిత్తశుద్ధితో చేస్తుంటే, అందుకు తగిన మరిన్ని అవకాశాలు వాటికి అవే వస్తాయని నాకు నమ్మకం కుదిరింది.
రేడియోలో అవసరం కొద్దీ సైన్స్ రాశాను. చదివాను. నాతో నేనే పోటీ పడి ఏవేవో వింత పనులు చేసి ఆనందం పొందాను. విన్నవారు కూడా ఆనందంగా ఉందన్నారు. అటు తరువాత పత్రికలలో రాయవలసిందిగా మిత్రులు ప్రోత్సహించారు. కొంతకాలం తరువాత రచనలు పుస్తకాలుగా వచ్చాయి. టీవీలో కూడా సైన్సు గురించిన కార్యక్రమాలలో పాలుగొనే అవకాశాలు వచ్చాయి. మొత్తానికి సైన్స్ నా బతుకు తీరులో భాగంగా మారింది. అయితే, నాకు ముందు, నా తరువాత తెలుగులో సైన్స్ రచనలు లేవా? చాలా ఉన్నాయి. మంచి రచయితలు ఉన్నారు. వారందరి మధ్యన నాకు వేరుగా గుర్తింపు ఉండాలంటే వేరుగా ఏదో చేయాలి గదా? అందుకే రేడియోలో మొదలు అన్ని చోట్లా రచనలలో అధునాతన, సమకాలపు, భవిష్యత్తు సైన్సు రాసే పద్ధతిని పాటించాను.
తెలుగులో సైన్స్ రాసిన, రాస్తున్న వారు చాలామంది, పాత సంగతులను గురించి రాస్తారు అంటే వాళ్లంతా కోపగించుకుంటారేమో? అయినా సరే, ఆ మాట చాలావరకు నిజం! నేను మాత్రం, సంస్థలతో పోటీపడి ఆంధ్రభూమిలోనే డెయిలీ కాలం నడిపించాను. ఏనాటికి ఆనాడు సరికొత్త సైన్స్ విశేషాలను పాఠకులకు అందించాను. అందుకోసం నేను పడ్డ శ్రమ గురించి ఇవాళటి వరకూ ఎక్కడా చెప్పుకోలేదు. ఇక్కడ కూడా చెప్పను!
మరొక పత్రికలో నేను అంతకు ముందు రాసిన సైన్స్ వ్యాసాలు అందరినీ ఆకర్షించాయి. వాటిని పుస్తకాలుగా వేశారు. సమీక్ష రాసిన వారు ఒకరు, ఇవి వార్తల లాగున్నాయి. పుస్తకంగా వేస్తే దాని విలువ ఎంతకాలం నిలుస్తుంది, అని వ్యాఖ్యానించారు. నాకు నిజానికి సంతోషం అయింది. నాటికీ, నేటికీ నేను సైన్స్ రచనలను ఇంచుమించు అదే పద్ధతిలో రాస్తున్నాను. మనం చదివే అన్ని రచనలు ఉపయోగకరంగా ఉండకపోవచ్చు. ఆసక్తికరంగా ఉంటే చాలు గదా! అసలు ప్రపంచం అంటే సైన్స్, అన్న భావం ప్రత్యక్షంగా, పరోక్షంగా పాఠకులు అందరికీ పంచాలి అన్నది నాకున్న గమ్యం! అన్ని మాధ్యమాల ద్వారా ఆ పనిని నా సంతృప్తి వరకయినా చేస్తున్నానని గట్టిగా చెప్పగలను.
నేను జీవశాస్త్రం, జన్యు శాస్త్రం చదువుకున్నాను. కానీ, నా రచనలకు వాటిని పరిధిగా మాత్రం పెట్టలేదు. అర్థమయిన అన్ని విభాగాల గురించి రాస్తున్నాను. వన్య ప్రాణుల గురించి రాసింది నిజమే. కానీ, అంతే ఆనందంగా నిత్య జీవితంలో భౌతిక శాస్త్రం తెనిగింపు కూడా చేశాను. కొడవటిగంటి కుటుంబరావు గారు తెనంగు చేసిన ఈ పుస్తకాన్ని, నేను మరోసారి అనువదించాను. అదే పుస్తకాన్ని నేనే మళ్లీ తిరగరాశాను, ఈ మధ్యనే! ఏ పత్రికలోనూ ప్రచురించకుండా నేరుగా మెదడు గురించి మరో పుస్తకం కూడా వచ్చింది ఈ మధ్యన.
నాకు ఆలోచన, కార్యకారణ సంబంధాలు, హేతు పద్ధతి లాంటివి ఎంతో యిష్టం. ఈ రకం ఆలోచనలు నాకు అపరాధ పరిశోధన రచనల్లో కనిపించాయి. ఏనాటి నుంచో షెర్లక్ హోమ్స్ అభిమానిని అయ్యాను. అవకాశం వచ్చిన తరువాత షెర్లక్ నవలలు రెండు, 12 కథలు రెండు సంపుటాలుగా తెలుగులోకి అనువదించాను. ఈ క్రమంలోనే నాకు అలెగ్జాండర్ ట్యూమా ఆలోచన పద్ధతి చాలా నచ్చింది. కనుక ఆ రచయిత నవలను కూడా అనువదించాను. అగదాక్రిస్టీ, చెస్టర్‌టన్ రచనలు కూడా నాకు నచ్చినవి. వాటిని కూడా ఏదో ఒకనాడు పాఠక మిత్రులకు అందిస్తాను. వీలు ఉండాలి గానీ మరెన్నో ఆలోచింపజేసే రచనలను తెలుగులోకి తేవాలని నా ప్రయత్నం.
నాకు ‘రచయిత’ అని గాక అనువాదకుడు అని పేరు పడే ప్రమాదం ఉంది. అయనా నేను అనువాదాలు మానలేదు. మానుకోను కూడా! నిజంగా తమ ఆలోచనల వల్ల ప్రపంచాన్ని ప్రభావితం చేసిన మరి కొందరు నా రచనల్లోకి వచ్చేశారు. నాకు ముల్లా నస్రుద్దీన్ హాస్యం అంటే వల్లమాలిన ఇష్టం. నస్రుద్దీన్ కథలను తెలుగులోకి తెచ్చి చాలాకాలం అయింది. మళ్లీ ఒకసారి ఆయనను పట్టించుకోవలసిన అవసరం కనబడుతున్నది. అలాగే కేవలం మాటల కారణంగా నన్ను ఎంతగానో ఆకర్షించిన మరొక రచయిత ఖలిల్ జిబ్రాన్! ఆయన రచనలు కొన్నింటిని తెలుగు చేసి, చాలాకాలం క్రితమే నా వెబ్‌సైట్‌లో పెట్టాను. జిబ్రాన్ పుస్తకాలు చిన్నవి. వాటిలో నాలుగింటిని ఈ మధ్యనే తెలుగులోకి తేగలిగాను. సూఫీ తత్వం గురించి నేను చాలా కాలంగా చదువుతున్నాను. ఇబ్రిస్ షా పరిశోధనలు నాకు ఎంతో అవగాహననిచ్చాయి. కనుక ఆయన సేకరణల ఆధారంగా, ‘సూఫీ కథలు’ కూడా తెలుగు చేశాను. రూమీ, సాదీల గురించి కృషి కొనసాగుతున్నది.
నా దగ్గర చేరిన పుస్తకాలు చదవడానికి ఈ జీవితం సరిపోదని బాధగా ఉంటుంది. మంచి పుస్తకం ఏది చదివినా, ‘దీన్ని అందరితో పంచుకుంటే బాగుంటుంది’ అనిపిస్తుంది. ‘ఏకః స్వాదు న భుంజీత’ అని గదా. రుచికరమయిన పదార్థాన్ని ఒక్కడే తినకూడదు, అని.
రాయడం, చదవడం, సంగీతం వినడం తప్ప నాకు మరో పని చేతగాదు. తినడం కూడా చేతగాదు. అయితే చదవడం, రాయడంలోనూ, సంగీతం వినడంలోనూ ఒక పద్ధతి, ప్రణాళిక ఉంటే బాగుంటుంది కదా? నా కృషి చాలా మటుకు ప్రణాళిక ప్రకారం నడుస్తున్నది, అని నచ్చచెప్పుకోవడానికి చేసిన లౌడ్ తింకింగ్ ఇది! నచ్చకుంటే వదిలేయండి! లేదా క్షమించండి!
*

కె. బి. గోపాలం