S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రణక్షేత్రం 12

‘ఒకప్పుడు సినిమాల్లో నటించాలనే వచ్చాను. ప్రస్తుతం సినిమాలకు పనికివచ్చే వయసు దాటిపోయిందని నాకే అర్థమవటంతో... ఆ ప్రయత్నాలు వదిలేశాను’
‘మరి సినిమాల్లో నటించారా?’
‘ఒక్క అడుగు కూడా ఆ రంగంలోకి వెయ్యలేక పోయాను’
‘మరి మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు?’
జానకి ఏమీ మాట్లాడలేదు. ఆమె కళ్లు శూన్యంలోకి చూస్తూ ఉన్నాయి. అందులో ఎంతో వేదన కనిపించింది నాకు. ఆమె చెయ్యి తిరిగి కళ్ల మీద వేసుకుంది. తరువాత కూడా మాటలు కొనసాగించింది. ‘అన్నట్టు నీకు ఒక ముఖ్య విషయం చెప్పటం మరిచాను. ఈ పనులన్నీ చెయ్యటం కష్టం అనిపిస్తే... తేలిగ్గా డబ్బులు సంపాదించే మార్గం మరొకటి ఉంది. కేవలం ఆడవాళ్లు మాత్రమే చేయగలిగే పని. రోజూ రాత్రిపూట అరగంట కళ్లు మూసుకుంటే చాలు. కోరినంత డబ్బు వస్తుంది. కళ్లతోపాటు మనసు కూడా మూసేసుకోగలిగితే ఇంకా మంచిది. అందుకే చూడు... అందరూ పనుల కోసం బయటకు వెళ్లే సమయానికి నేను పని ముగించుకుని ఇంటికి వచ్చేశాను...’
నేను జానకి చెప్తున్న మాటలు నోరు తెరచుకుని వింటున్నాను. అప్పటిదాకా ఆమె మీద ఏర్పడిన మంచి అభిప్రాయం అసహ్యంగా మారబోతుంటే ఆమె వైపు మరోసారి చూశాను.
కళ్లకు అడ్డం పెట్టుకున్న చేతి సందుల నుండి కన్నీరు బయటకు కారుతోంది.
నేను తదేకంగా ఆమెను చూస్తున్న విషయం అర్థమయిందనుకుంటా, ‘... నన్ను కాసేపు నిద్రపోనివ్వు. రాత్రంతా నిద్రలేదు..’ దుప్పటి ముసుగు తలమీదకి లాక్కుంటూ అంది జానకి.
* * *
సినిమా ప్రపంచమే ఒక వింత లోకం అనుకుంటే, నేను ఉంటున్న హాస్టల్ మినీ సినీ లోకంలా ఉంది.
ఇక్కడ ఉన్న అందరూ సినిమానే తిని, సినిమానే శ్వాసించి బ్రతుకుతున్నట్లు కనిపిస్తారు. నోరు తెరిస్తే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన మాటలే! కళ్లు మూస్తే అవే కలలు.
అయితే ఒకటే అదృష్టం - ఎవరూ వారికి నేను పోటీ అనుకోవడం లేదు. ఆ మాటకొస్తే అక్కడ ఎవరూ ఎవరికీ పోటీ కాదు. అందరమూ రేసులో పాల్గొంటున్న గుర్రాలమే! రేసులో గుర్రాలు ఒకదానికి మరొకటి పోటీ అనుకోవు. పరుగెత్తటమే వాటి పని.
అయితే గుర్రాలకి ఒక లక్ష్యం ఉంటుంది. నిర్దేశిత ప్రాంతానికి ఏవి ముందు వెళ్తే అవి గెలిచినట్లు పరిగణింపబడతాయి.
అయితే మా మధ్య జరిగేది ఒక లక్ష్యం అంటూ లేని రేసు!
ఇక్కడ ఏ గుర్రమూ ఎప్పటికీ గెలవదు.
ఎప్పుడో ఒకసారి పొరపాటున లక్ష గుర్రాల్లో ఒక గుర్రం అన్ని అడ్డంకులూ అధిగమించి లక్ష్యం చేరుకుంటుంది. దాన్ని చూసి తామూ గెలవొచ్చని మరొక లక్ష గుర్రాలు రేసులోకి దిగుతాయి.
జానకే కాదు అక్కడ ఉన్న అందరూ పోటీలు పడి నాకు సలహాలు చెప్పారు. ఎవరి అనుభవాల నుండి వారు చెప్పారు.
అన్నిటినీ నవ్వుతూ విన్నాను నేను.
కానీ జానకి చెప్పిన సలహాలే నాకు నచ్చాయి.
అన్నీ విన్న నాకు అర్థమైంది ఒకటే - ముందు పొట్టకూటి కోసం ఏర్పాట్లు చేసుకోవాలి. తరువాతే మిగిలింది ఏదైనా...
ఈ మహా నగరంలో చేయదలచుకుంటే పనికి కొదవలేదు. చదువుకున్న వారికి ఉద్యోగాలకి కొదవ ఉందేమో కానీ, చదువులేని నాలాంటి వారు చేయగల పని ఇవ్వటానికి అందరూ తయారుగానే ఉన్నారు. ఎక్కడ చూసినా హెల్పర్లు కావాలన్న పోస్టర్లు కనపడుతూనే ఉన్నాయి.
కాకపోతే నేనే నిర్ణయించుకోలేక పోతున్నాను. పూర్తిగా పగలంతా పనిలో నిమగ్నమయితే నా అసలు లక్ష్యం దూరమయ్యే అవకాశం ఉంది. అందుకే డబ్బులు తక్కువయినా పార్ట్‌టైమ్ జాబే చెయ్యాలనుకున్నాను.
బంజారాహిల్స్, జూబిలీ హిల్స్ ఏరియాలో చాలా మాల్స్ కొత్తగా ఏర్పాటవుతున్నాయి. వాటికి పనిచేసే మనుషుల అవసరం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది.
మంచి సెంటర్లో కనిపించిన కొత్తగా పెట్టిన ఒక మాల్‌లోకి నడిచాను.
ఎదురుగా కనిపించిన ఒక వ్యక్తిని, ‘ఇక్కడ ఖాళీలేమన్నా ఉన్నాయా?’ అని అడిగాను.
అతను వెంటనే ఉన్నాయన్నట్లు తలఊపాడు.
‘ఎవరితో మాట్లాడాలి?’ అని అడిగాను.
ఆ చెప్పిన వ్యక్తే నన్ను మాల్ మేనేజర్ దగ్గరకు పంపాడు.
ఆ మేనేజర్ నన్ను ఎగాదిగా చూశాడు. వెంటనే అతని కళ్లలో ఒక మెరుపు కనిపించింది. కంటికి కాస్త నదురుగా కనిపించే లేడీ హెల్పర్లు ఏ మాల్‌లో అయినా అవసరమే! ముఖ్యంగా కాస్మెటిక్స్, జ్యుయలరీ అమ్మే సెక్షన్స్‌లో అసిస్టెంట్స్ ఆకర్షణీయంగా లేకపోతే లాభం లేదు.
బహుశా నా అందం చూసేనేమో అతను సానుకూలంగా స్పందించాడు.
‘ఇంగ్లీషు మాట్లాడటం వచ్చా?’ అడిగాడతను.
‘అర్థమవుతుంది సార్!... ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్సులో చేరాను. త్వరలో ఫ్లూయంట్‌గా మాట్లాడగలనన్న నమ్మకం ఉంది’ కాన్ఫిడెంట్‌గా చెప్పాను. హాస్టల్లో నా తోటివారు విడివిడిగా చెప్పినా అందరు చెప్పిన మాటల్లో కామన్ పాయింట్ ఒకటే! లోపల భయమున్నా బయటకు చూపకూడదు. కాన్ఫిడెంట్‌గా కనపడాలి.
‘టైమింగ్స్ ప్రిఫరెనె్సస్ ఏమన్నా ఉన్నాయా?’
‘సాయంత్రం నుండి రాత్రి వరకు పని చెయ్యటం వీలవుతుంది సార్. ఉదయం నుండి సాయంత్రం వరకు నాకు వేరే పని ఉంది’
‘వెరీగుడ్! అదే బాగా డిమాండ్ ఉండే సమయం. మాకు మనుషుల అవసరం కూడా అప్పుడే ఎక్కువ. సాయంత్రం నాలుగు గంటల నుండి మాల్ క్లోజ్ చేసే వరకు పని చెయ్యాలి. వారానికి ఒకరోజు సెలవు. నెలకి మూడు వేలు ఇస్తాను...’
‘అంతేనా?..’ నిరుత్సాహంగా అన్నాను.
‘ఇప్పుడే కదమ్మా పనిలో చేరుతున్నావు. ఇంగ్లీషు రాదని నువ్వే చెప్పావు. నెమ్మదిగా పని నేర్చుకో. నీ పనిని బట్టి జీతం కూడా పెంచుతాను. కొన్ని రకాల కాస్మెటిక్స్, జ్యుయలరీ అమ్మిన దాని మీద నీకు కమిషన్ కూడా ఉంటుంది. నిన్ను ఆ సెక్షన్‌లో వేద్దామనుకుంటున్నాను.’ అన్నాడతను.
మిగిలిన వాటి సంగతి పక్కన పెడితే ఆ మేనేజర్ మాట్లాడిన తీరు నచ్చింది నాకు.
‘ఆలోచించుకుని చెప్తాను...’ అని అతనికి చెప్పి అక్కడ నుండి బయటకు వచ్చాను.
హాస్టల్ చేరుకున్న తరువాత ఆ రాత్రి నాకు వచ్చిన ఆఫర్‌లోని మంచి చెడ్డల గురించి మిగిలిన వారితో చర్చించాను.
‘సెక్యూరిటీ పరంగా మాల్‌లో ఉద్యోగం సేఫ్...’ ఒకమ్మాయి తన అభిప్రాయం చెప్పింది.
‘హాయిగా ఏసీలో కూర్చుని పని చేసుకోవచ్చు...’ అన్నారెవరో.
‘కూర్చుని కాదు. నిలబడి...’ సరిచేశారు మరొకరు.
‘అందంగా ఉండటంతో వచ్చే లాభాలంటే ఇవే! మనలాంటి వారికి అడిగినా అలాంటి ఆఫర్ రాదు...’ ఇంకెవరో నిరుత్సాహంగా అన్నారు.
అందరి మాటలూ విన్న నేను నా అనుమానం చెప్పాను. ‘రాత్రి పని పూర్తయి బయటకు వచ్చేటప్పటికి దాదాపు పదకొండు అవుతుంది. ఆ అర్ధరాత్రి సమయంలో మన హాస్టల్‌కు రావటం ఎలాగా?... అని ఆలోచిస్తున్నాను’ అన్నాను నేను.
‘అది ఒక సమస్యే కాదు. మన కాలనీ నుండి ఆ మాల్‌లో పనిచేసేవారు చాలామంది ఉన్నారు. అందరితో కలిసి షేర్ ఆటోలో రావచ్చు..’ నా సమస్యకి సులువుగా సమాధానం దొరికింది.
అందరి ఆమోద ముద్రతో ఆ ఉద్యోగంలో చేరటానికి నిర్ణయించుకున్నాను.
ఉదయం పూట ఒక గంట ఇంగ్లీష్ స్పోకింగ్ కోర్సులో చేరాను. ఆ ఇనిస్టిట్యూట్ హాస్టల్‌కి నడిచి వెళ్లే దూరంలోనే ఉంది. నడిచి వెళ్లి రావచ్చు.
జానకి చెప్పిన వాటిలో మరొక పని చెయ్యటం మిగిలిపోయింది. అదే పోర్ట్ఫులియో తయారుచేయించుకోవటం.
దానికి కూడా హాస్టల్ ఫ్రెండ్సే సహాయం చేశారు.
‘మనలాంటి వాళ్లం ఖరీదయిన స్టూడియోలకి వెళ్తే ఆస్తులన్నీ అమ్మినా ఆల్బమ్ తయారుకాదు. అమీర్‌పేటలో ఒక ఫొటోగ్రాఫర్ ఉన్నాడు. చౌకలో చేస్తాడు. క్వాలిటీ కూడా బానే ఉంటుంది...’ ఒక అమ్మాయి సలహా చెప్పింది.
ఆ అమ్మాయి చెప్పిన సలహాని అనుసరించి అమీర్‌పేటలోని ఆ ఫొటోగ్రాఫర్ అడ్రస్ వెతుక్కుంటూ వెళ్లాను.
భయంకరంగా కంపు కొడుతున్న చెత్తతో నిండిపోయిన సందులో ఉంది ఆ స్టూడియో! ముందు తప్పు అడ్రస్‌కి వచ్చానా అనుకున్నాను. మరోసారి కన్ఫర్మ్ చేసుకున్న తరువాత సరైన అడ్రస్‌కే వచ్చానని తెలిసింది. ఆ ఫొటోగ్రాఫర్ అందరూ చెప్పినంత నైపుణ్యం కలవాడయితే అలాంటి పరిసరాల్లో ఎందుకు ఉంటాడో నాకు అర్థం కాలేదు.
నా అనుమానానికి సమాధానం కాసేపట్లో అతనే తీర్చాడు. ఎదురుగా నిలబడ్డ అతని దగ్గర నుండి వస్తున్న వాసన చుట్టూ ఉన్న చెత్త వాసనను అధిగమించే రేంజ్‌లో ఉంది. మనిషి కూడా తూలుతున్నాడు. టైమ్ చూసుకున్నాను. ఉదయం పది గంటలవుతోంది. అంత ఉదయానే్న తాగి ఉన్న అతన్ని అనుమానంగా చూశాను. బహుశా ఆ అలవాటు వల్లే ఎంత పరిజ్ఞానం ఉన్నా అతను అలా మిగిలిపోయాడని నేను గ్రహించాను.
‘ఏమి కావాలి?’ తూలుతూ అడిగాడతను.
సమాధానం చెప్పటానికి కూడా భయం వేసింది. వౌనంగా ఉండిపోయాను.
అతని వైపు సగం భయం, సగం అనుమానంతో చూస్తున్న నన్ను చూసి నవ్వాడు అతను. ‘్భయం వద్దు. నినే్నమన్నా చెయ్యాలన్నా, చేయగలిగే పరిస్థితుల్లో లేను. లోపలకు రా..!’ అన్నాడు.
లోపలకు వెళ్లి నన్ను మరోసారి అడిగాడు. ‘ఏం కావాలి?’ అని.
‘్ఫటో ఆల్బమ్!’
‘సినిమాల్లో చేరటానికా?’
‘అవును’
మరోసారి నా మొహం వైపు పరీక్షగా చూశాడు. ‘ఇక్కడకు వచ్చిన అందరికీ ఫొటోలు తీస్తాను. సినిమాల్లోకి చేరటానికి వచ్చామని ఎంతోమంది చెప్తుంటారు. నోరు మూసుకుని ఫొటోలు తీస్తాను. నా పని అది కాబట్టి. కానీ, మొదటిసారి నిజమయిన సినీ మెటీరియల్‌ని చూస్తున్నాను...’ అన్నాడు.
నా మీద నాకు అనుమానం కలిగినప్పుడల్లా ఆ దేవుడే పంపినట్లు ఎవరో ఒకరు వచ్చి నా ఆత్మవిశ్వాసాన్ని తిరిగి నింపుతుంటారు. ఈ ఫొటోగ్రాఫర్ మాటలు కూడా అలానే పని చేశాయి.
‘నేను బానే ఉంటాను. మీరే ఇలా ఉన్నారు. మరి ఫొటోలు ఎలా తీస్తారో?’
‘ఆ భయం నేను ‘ఇలా’ ఉంటే కాదు, ‘ఇలా’ లేకపోతే పడాలి...’ నవ్వుతూ అన్నాడతను.
‘ఆల్బమ్ బాగుంటేనే డబ్బులు ఇద్దువు. సరేనా!...’
ఆ మాటతో నాకు ధైర్యం వచ్చింది.
అయితే కాసేపట్లోనో, ఒక రోజులోనో పూర్తి కాలేదు ఆ పని. మొత్తం మూడు రోజులు పట్టింది. రకరకాల డ్రెస్సులు, హెయిర్ స్టయిల్సూ మార్చవలసి వచ్చింది. డ్రస్సులు అద్దెకు తేవటం నుండి హెయిర్ ఎరేంజ్ చేయించటం వరకు అతనే చూసుకున్నాడు. మేకప్ అయితే స్వయంగా అతనే చేశాడు.
మరొక మూడు రోజుల తరువాత ఆల్బమ్ తయారయిందని అతని నుండి ఫోన్ రావటంతో వెళ్లాను.
అతను ఆల్బమ్ చూపించాడు.
అందులో ఉన్నది నేనే అంటే నమ్మలేనంత అందంగా ఉన్నాయి ఆ ఫొటోలు.

వాటిని మురిపెంగా చూసుకుంటున్న నన్ను ఆప్యాయంగా చూశాడతను. ‘చూడమ్మా! ఈ చేతుల్తో ఎందరి ఫొటోలు తీశానో లెక్కలేదు. కానీ, నీలో ఏదో తెలియని ఛార్మ్ ఉంది. నిన్ను సినీ రంగం ఎలా ఉపయోగించుకుంటుందో నాకు తెలియదు. ఒకవేళ నీకు సరయిన స్థానం కల్పించకపోతే నష్టపోయేది మాత్రం నువ్వు కాదు. ఆ ఇండస్ట్రీనే!...’ అన్నాడు. అప్పటికీ, ఇప్పటికీ నేను అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ అదే!
‘మీ నోటి చలవ వలన అదే జరగాలి కానీ, మీ మేలు ఎప్పటికీ మరచిపోను’
‘ఎప్పుడో సంగతి వదిలిపెట్టు. ఇప్పుడు మరిచిపోకుండా ఉంటే చాలు’
నవ్వి, ‘ఎంత ఇమ్మంటారు?’ అని అడిగాను.
చెప్పాడతను.
మారు మాట్లాడకుండా తీసి ఇచ్చాను. నా ఆల్బమ్ తీసుకుని వెనక్కి వచ్చాను. చూసిన అందరూ ఫొటోలు చాలా బాగున్నాయన్నారు. రాత్రి ఒంటరిగా ఆ ఆల్బమ్ ఎదురుగా పెట్టుకుని నన్ను నేను చూసుకుంటూ కూర్చున్నాను. ఎంత చూసుకున్నా నాకే తనివి తీరటం లేదు.
తెల్లవారిన దగ్గర నుండి నా దినచర్యలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి.
ఉదయానే్న ఇంగ్లీషు క్లాసులకు వెళ్లటంతో మొదలుపెట్టి మధ్యాహ్నం వరకు స్టూడియోల చుట్టూ ఫొటో ఆల్బమ్ పట్టుకుని తిరిగి తరువాత పరుగులు పెడ్తూ మాల్ దగ్గరకు వెళ్లాలి.
తెలిసిన వారు ఎవరూ లేనిదే స్టూడియో గేటు ముందు గూర్ఖా కూడా లోపలకు అడుగుపెట్టనివ్వడు.
హాస్టల్లో నాతో ఉంటున్న వారు కొందరు జూనియర్ ఆర్టిస్టులుగా పని చేస్తున్నారు. వారికి పిలుపు వచ్చినప్పుడల్లా వారితోపాటు స్టూడియోలోకి వెళ్లేదాన్ని. వారు అంతవరకు తీసుకు వెళ్లగలరు కానీ ఆ తరువాత ఏమి సహాయం చేయగలరు? స్టూడియో లోపల నా గోడు ఎవరూ పట్టించుకునేవారు కాదు. పైగా ఎగతాళి చేసేవారు.
అయితే ఇలాంటి హేళనలు ఎన్నో ఎదుర్కోవలసి ఉంటుందని నాకు బాగా తెలుసు. తోటివారు చెప్పటమే కాదు, నేను కూడా ఇలాంటి నిరాశలు ఎదురవుతాయని ప్రిపేరయి ఉండటంతో ఆశ మాత్రం కోల్పోలేదు.
అదే సమయంలో మాల్‌లో నాకిచ్చిన పని చేయటంలో అలసత్వం చూపేదాన్ని కాదు. పూర్తి నిబద్ధతతో పని చేసేదాన్ని. చేరిన రెండు నెలల్లోనే నన్ను కాస్మెటిక్స్ సెక్షన్ నుండి జ్యుయెలరీ సెక్షన్‌కి పంపాడు మేనేజర్.
నీట్‌గా డ్రస్ చేసుకుని చక్కగా మాట్లాడే నేను అక్కడకు వచ్చే హై సొసైటీ కస్టమర్ల మధ్య చక్కగా ఇమిడిపోయాను. మరోపక్క నేను నేర్చుకుంటున్న ఇంగ్లీషు కూడా నా ఆత్మవిశ్వాసాన్ని పెంచి, చేస్తున్న పనిని మరింత నైపుణ్యంతో పూర్తి చేయటానికి ఉపయోగపడుతోంది.
స్టూడియోలో అవకాశం కోసం చూస్తున్న రోజుల్లో హైదరాబాద్ వచ్చేటప్పుడు ట్రైన్లో నాతో పాటు వచ్చిన ఇద్దర్లో ఒకతను కనిపించాడు. అతను నన్ను గుర్తు పట్టలేదు. అతన్ని మాత్రం నేను గుర్తు పట్టాను. నాకతని పేరు కూడా గుర్తుంది. చంద్రం అని.. కానీ అతన్ని చూడగానే అతనేమి చేస్తున్నాడో అన్న కుతూహలం కలిగింది.
షూటింగ్ క్రూతో పాటు హడావుడిగా తిరుగుతూ అనేక పనులు ఏకకాలంలో చేస్తున్న అతన్ని చూసి ఒక్క క్షణం ఈర్ష్య కలిగిన మాట వాస్తవం. కానీ, అతను ట్రాలీ బాయ్ అని తెలిసిన తరువాత పెద్దగా నవ్వాలని అనిపించింది. మా ఇద్దరి జీవితాలూ ఇలా ఎంత దూరం సమాంతరంగా ప్రయాణిస్తాయో అని అనిపించింది. ఎవరికి ముందు బ్రేక్ వస్తే వాళ్లు గట్టెక్కుతారు. రెండో వారి ప్రయాణం అలా కొనసాగుతూనే ఉంటుందేమో.
ఆ తరువాత చాలా రోజులు స్టూడియోలో ఎక్కడ షూటింగ్ స్పాట్ కనపడినా ఆ చంద్రం కనపడతాడేమో అని చూసేదాన్ని. అప్పుడప్పుడూ కనిపించేవాడు.
హఠాత్తుగా కనపడటం మానేశాడు. చాలా రోజులు కనపడతాడేమో అని ఎదురుచూసిన తరువాత కుతూహలం భరించలేక వాళ్ల క్రూలో ఎవరినో అడిగాను - చంద్రం ఎందుకు రావటం లేదని?
మానేశాడని చెప్పారు.
ముందు వికెట్ వాడిదే పడిందనుకుంటే గర్వంగా అనిపించింది.
నేను నడవాలనుకున్న దారి పూల బాట కాదని తెలుసు. నాకు సమయం ఎక్కువ లేదని కూడా తెలుసు. హీరోయిన్ కెరియర్ స్పాన్ మహా అయితే పదేళ్లు ఉంటుంది. అందులో ఎక్కువ భాగం ఎదురుచూపుల్లో కోల్పోతే ఆ తరువాత ఇక చేయగలిగింది ఏముంటుంది.
ఒక విషయం మాత్రం నయమే! నా స్వంత ఊరిలో ఉండి పిన్ని పెట్టే బాధలు పడుతూ ఆమె చెప్పిన రాయుడి లాంటి ముసలాడికి ఉంపుడుగత్తెగా పడి ఉండే కంటే ఇప్పటి నా జీవితం అద్భుతంగా ఉంది. కనీసం నా కాళ్ల మీద నేను నిలబడ్డాను. నిజాయితీగా నా సంపాదన ఏదో నేను సంపాదించుకుంటున్నాను.
ఎన్ని రకాలుగా ప్రిపేరయి ఉన్నా అప్పుడప్పుడూ ఎదురయ్యే కొన్ని సంఘటనలు చేదు మాత్రల్లా జీవితమంటే ఏమిటో నేర్పుతున్నాయి.
అనేక నెలల ప్రయత్నం తరువాత నేను ఒక డైరెక్టర్‌ని కలుసుకో గలిగాను. అతని పేరు కే.కే. అతనన్నా, అతని సినిమాలన్నా నాకు ఎంతో ఇష్టం. అంతరాంతరాల్లో అతనంటే తెలియని గౌరవం కూడా ఉండేది.
అతి కష్టం మీద అతన్ని కలుసుకున్న ఆనందాన్ని మనసులో అదుముకుని ఏదో మాట్లాడబోతుంటే, అతను విదిలించి కొడుతున్నట్లు విసుగ్గా మాట్లాడాడు. ‘ఏమిటి?...’ అంటూ.

*****************************************

-పుట్టగంటి గోపీకృష్ణ 94901 58002