S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జ్ఞాపకాల తోటలో నవ పారిజాతాలు

హృదయంలోని శోకమే సంగీతం అంటాడు తాత్వికవేత్త కన్‌ఫ్యూషియస్. పాట పాడి పదిమందినీ మెప్పించటం ఏమీ చిన్న విషయం కాదు. దానికి పడే శ్రమ వినేవారికంటే పాడేవారికే ఎక్కువ.
శాస్ర్తియ సంగీతం పాడే గాయకుడికి లలిత సంగీతం పాడేవారు లోకువ. లలిత సంగీతం పాడేవారికి సినిమా పాటలు పాడేవారు లోకువ.
ఈ ముగ్గురూ వినే శ్రోతకు ఇంకా లోకువ. ఇష్టమైతే వింటాడు. లేదా లేచి వెళ్లిపోతాడు.
శుద్ధ సంప్రదాయ సంగీతం పాడే విద్వాంసులు సాధారణంగా లలిత సంగీతం వైపు చూడరు, తాము పాడే సంప్రదాయ సంగీతం స్థాయి పడిపోతుందనే భయంతో. కానీ ఈ రెండు బాణీల్లోనూ పాడి, పేరు తెచ్చుకున్న సమర్థులైన గాయనీ గాయకులున్నారు - దండపాణి దేశికర్, శర్కాళి గోవిందరాజన్, టి.ఎం.సౌందరరాజన్, కె.జె.జేసుదాసు వంటి వారు ప్రముఖులు. ఎం.ఎల్.వసంతకుమారి, సుబ్బులక్ష్మి వంటి గాయనీమణులు సరేసరి. కల్యాణి, కాంభోజి, ఖరహరప్రియ, భైరవి లాటి పెద్ద పెద్ద రాగాలు పాడుతూ, కర్ణాటక సంగీతాన్ని సామాన్య శ్రోత కూడా ఎంతో ఆసక్తిగా వినేలా చేసి, సినిమా పాటలకున్న క్రేజ్ తెచ్చిన గడసరి గాయకుడు డా.మంగళంపల్లి బాలమురళీకృష్ణ.
సుమధురమైన కంఠంతో గమకశుద్ధిగా, వేలాది పాటలు పాడి, సినిమాకు సంగీత గౌరవం తెచ్చిన గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు.
ఈ ఇద్దరి గానంలోనూ ఒక సామ్యత ఉంది. కీర్తన పాడినా, రాగాలాపన చేసినా, పద్యం పాడినా, ఇద్దరి కంఠాల్లోనూ ‘అ’కారమే వినిపిస్తుంది. ఇతరమైన ఏ వికారాలూ కనిపించవు. వినిపించవు.
ఇద్దరికీ ఇదే ప్లస్ పాయింట్. ఈ ఇద్దరి కంఠాలూ ఘంటానాదం లాంటివే. ఇద్దరిలోనూ లాలిత్యం, మాధుర్యం, స్పష్టత, ఉచ్చారణ, ఘనత్వం.. అన్నీ సమానంగా వున్నాయి. వీరు పాడే పాటలో ప్రతి అక్షరమూ హాయిగా వినిపిస్తుంది.
మన తెలుగు చిత్రాల నిర్మాణం ఇంత వేగంగా లేదు ఒకప్పుడు - ఆచి, తూచి తీస్తూండేవారు.
1950-60 ప్రాంతాలలో ఎన్నో డబ్బింగు చిత్రాలుండేవి. అవే ఎక్కువగా వస్తూండేవి.
హోమివాడియా వారు బసంత్ పిక్చర్స్ బ్యానర్‌పై ‘శ్రీరామ భక్త హనుమాన్’ ‘రామాయణం’ లాంటి అనేక చిత్రాలు హిందీ, తమిళం, తెలుగు భాషలలో తీశారు. కొన్ని పాటలు తెలుగులో ఘంటసాలే పాడారు.
శ్రీశ్రీ, ఆరుద్ర పాటలు రాసేవారు. కేవలం పెదవుల కదలికను గమనిస్తూ రాసిన పాటలవి.
‘మహాదేవి’ చిత్రంలో ఓ పాటనుకుంటా. ‘సుఖపడుటే సుఖమై, పరుగిడు నీ జన్మం.. శోకాలు తెచ్చేనోయ్ తెలుగోడా’ అని ‘సరస్వతి’ రాగంలో ఈ పాట ఘంటసాల పాడారు. ఏదో కీర్తన విన్నట్లుంటుంది. ‘మది తెలిచెదనే కోరిక తలచెదనే మధురము కాదా సీతారామ నామము’ అనే పాట (శ్రీరామ భక్త హనుమాన్ చిత్రానికి) కూడా ఘంటసాలే పాడారు. భాష ఏదైనా పాట విషయంలో ఎవరూ రాజీపడలేదు. ఏమా పాటలు? ఏమా మాధుర్యం?
అలాగే జింబో, జింబో నగర ప్రవేశం అనే జంగిల్ చిత్రాలు తీశారు - హిందీ, తమిళం, తెలుగు భాషల్లో.. విజయభాస్కర్ పామర్తి లాంటి సంగీత దర్శకులు అమృతప్రాయమైన ఆర్కెస్ట్రాతో పాటలు పాడించారు. ‘ముగ్గురు సోదరులు’ ‘వీరప్రతాప్’ ‘వీరఖడ్గం’ ‘అనగనగా ఒక రాజు’ లాంటి ఎన్నో డబ్బింగు చిత్రాలు, అప్పట్లో మన ప్రాంతంలో ఎన్నో చోట్ల విజయవంతంగా ప్రదర్శింపబడి, వెళ్లిపోతూండేవి - వినాలనిపిస్తే ఆ పాటలు ఒక్క రేడియోలో తప్ప మరెక్కడా అవి వినబడేవి కావు - ఇప్పుడు లభ్యంకావు.
అల్లరిచిల్లరిగా పాడటంగానీ, వెకిలితనంగానీ ఆ పాటల్లో కనిపించేది కాదు. ఒక్కసారి, వరుసగా, ఈ వేళ వస్తున్న పాటలు ఓ పాతిక వినేసి, ఒక్క పాత పాట వినండి, చాలు. అంతకు ముందు విన్న పాటలో సాహిత్యం ఏమైనా పొరపాటున గుర్తుంటుందో లేదో!
ఎప్పుడో, రామాయణ కాలంలో కుంభకర్ణుణ్ణి నిద్ర లేపేందుకు రకరకాల వాద్యాలతో వింతవింత ధ్వనులతో రాక్షసులందరూ ఆయన నెత్తిమీద కూర్చుని బాదేసేవారట.
సుఖంగా, వినవలసిన పాటకు ఈ వేళ అంతటి వాద్యఘోష ఎందుకో అర్థంకాదు.
సంగీతానికి ఓ సౌలభ్యం ఉంది. ‘ఇలా పాడాలనిగానీ, ఇలా ఎందుకు పాడుతున్నావు అని గానీ’ ఎవరూ అనరు. అనుకోరు.
పంచరంగులను అద్దుకుని కనువిందు చేసే సీతాకోక చిలుకకు ఎన్నో దశలు దాటితేగానీ ఆ రూపు రాదు.
పాట కూడా అంతే - పరిపక్వ స్థితి వస్తేగానీ పాడలేరు - పరిణతి లేకుండా పాడించనూ లేరు. పాట నాభిలోంచి రావాలి. పెదవులపై ఆడిస్తూ పొడిపొడిగా పాడటం కాదు.
గాయకులు వారంతట వారే తెలుసుకుని సరిదిద్దుకోగల లోపాలు సహజంగా కొన్నీ, ఎదుటివారు గమనించే దోషాలు మరికొన్నీ ఉంటాయి. ‘స్వీయ లోపము నెరుగటే పెద్ద విద్య’ అంటాడు వేమన. ‘చిక్కు’ అంతా దీనితోనే. సంగీత జ్ఞానమేమీ లేని శ్రోతకు సైతం అపశృతి దోషం ఇట్టే తెలిసిపోతుంది. అందుకే రసికులు మెచ్చే సంగీతమే పెరుగుతుంది. నాకు తెలిసిన కొచ్చర్లకోట సూర్యప్రకాశరావనే మ్యూజిక్ కంపోజర్ ఒకాయన ఉండేవారు. ప్రసిద్ధ రంగస్థల నటుడూ, శ్రీకృష్ణ పాత్రధారిగా ఆ రోజుల్లో అందరికీ పరిచయమైన కొచ్చర్లకోట సత్యనారాయణకు సోదరుడు. రంగస్థల నాటకాలకు సంగీతం అందించిన దైతా గోపాలానికి సమకాలీనుడు. ప్రసిద్ధమైన పాటలు, పాటల సృష్టికర్తల గురించి చెప్తూ, అనిల్ బిశ్వాస్, వసంత్ దేశాయ్, నౌషద్, ఖేమ్‌చంద్ ప్రకాష్, చిత్రగుప్త, సి.రామచంద్ర, సలిల్ చౌదరి, శంకర్ జైకిషన్, ఓంప్రసాద్ నయ్యర్ (ఓపి నయ్యర్) ఈ సంగీత దర్శకుల పాటలు వింటే తెలుస్తుంది. ‘మెలొడీ’ అంటే ఏమిటో. వినేవారందరికీ, సంగీతాభిరుచినీ ఆసక్తినీ కల్గించినవారు.
సంగీతంలో ఇవ్వగలిగినదంతా ఇచ్చేశారు. మనకేమీ మిగల్చలేదు అనేవారు. హెచ్‌ఎంవి రికార్డింగ్ కంపెనీ కలకత్తాలో కేంద్రంగా 1931 నుంచి కొన్ని వేల రికార్డులు విడుదల చేసింది. వాటిలో సినిమా పాటల సంఖ్యే ఎక్కువ. వివిధ సంగీత బాణీలు, వివిధ విద్వాంసుల గానం ఈ కంపెనీ వల్ల వెలుగులోకి వచ్చాయి. 1952 - 1994 సం.ల మధ్య కాలంలో రేడియో సిలోన్ నుంచి ‘బినాకా గీత్ మాలా’ అనే ఓ మహత్తర కార్యక్రమం ప్రసారమవుతూ ఉండేది. లక్షలాది శ్రోతలు పిచ్చిగా వినేవారు ఈ కార్యక్రమాన్ని.
హిందీ సినిమా పాటలన్నీ ప్రజాబాహుళ్యంలో చొచ్చుకుపోవటానికిదే కారణం. జనరంజకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి అఖండమైన ఖ్యాతిని సొంతం చేసుకున్న వ్యాఖ్యాత పేరు అమీన్ సయానీ.
1954 సం.లో ‘టాక్సీ డ్రైవర్’ చిత్రంలో తలత్ మొహ్మద్ పాడిన ప్రసిద్ధ గీతం ‘జాయేతొ జాయె కహాఁ’ అప్పట్లో అది టాప్‌గా నిల్చిన పాట - ఈ పాట వీలుంటే వినండి.
‘పాండురంగ మహాత్మ్యం’ చిత్రానికి ఘంటసాల, సుశీల పాడిన ‘నీవని నేనని తలచితిరా’ అనే పాట గుర్తుకు తెచ్చుకుని వింటే హిందీ పాటల బాణీల ప్రభావం మన వాళ్లపై ఎంతగా ఉండేదో ఊహించగలం. హెచ్‌ఎంవి రికార్డుల్లో కుక్క వింటున్న బొమ్మ చూసే వుంటారు. హే అంటే హజఒ ఘఒఆళూ యేజషళ -గ్రామఫోన్ రికార్డు మీద కుక్క ఆసక్తిగా వింటున్న సంగీతం.. ఒక ప్రముఖ హిందుస్థానీ సంగీత విద్వాంసునిది. ఆయన పెంపుడు కుక్క అది.
తాటియాకు పందిళ్లు వేసి, ఐదు రోజులపాటు వివాహ వేడుకలు జరిపే వారొకప్పుడు. ఒకటికి రెండుసార్లు ఇళ్లకు వెళ్లి బొట్టు పెట్టి భోజనాలకు రమ్మని ఆహ్వానించేవారు. వివాహ భోజనం అంటే ఏమిటో, షడ్రసోపేతమైన విందు భోజనం అంటే ఎలా ఉంటుందో తెలిసేది ఆ రోజుల్లో. ‘ఎవరో తరుముకుని’ వస్తున్నట్లు హడావిడిగా ఫాస్ట్ఫుడ్ నిలబడి, తినేందుకు అలవాటుపడ్డ జనానికి ఆ రుచి ఎలా తెలుస్తుంది? ఈ వేళ పాటల రుచి కూడా ఇలాగే ఉంది. ఎంత ముద్దో! ఎంత సొగసో! ఎవరి వల్ల వర్ణింపతగునే! ఎంతవారలైనా గానీ, (కామ)చింతాక్రాంతులయ్యేరు!’..
‘అత్తమీద కనులాసకు దాసులై - సత్త్భాగవత వేఘలైరి
దుత్త పాల రుచి తెలియు సామ్యమే - ధురీణుడౌ త్యాగరాజ నుతుడెంత ముద్దో’ అంటారు త్యాగయ్య. సుగుణాభిరాముడైన రాముణ్ణి వర్ణిస్తూ
అత్తమీద కనులాసకు.. (అత్త= అంటే లక్ష్మీదేవి) డబ్బుకు దాసోహం అనేవారు పైకి ఆడంబరంగా కనిపిస్తారు. అంతశ్శుద్ధీ, భక్తీ ఉండదు. అంతా తెలిసినట్టు నటిస్తారు. పాలకుండకు పాల రుచి తెలియదు. తెడ్డుకి వంటకం రుచి తెలియదు. సంగీతం కూడా అంతే. ‘అద్భుతమైన స్వరాలు పలికించే వాద్యాల నడుమ వెకిలి పాటలు వినటంలా? సినిమా అనేది కళ. వ్యాపారం కళ కాదు. కళను వ్యాపారంగా మార్చాలనుకుంటే వ్యాపారం మిగలదు.
వ్యాపార ధోరణి వున్నవాడు కళను కళగా చూడడు. పెట్టుబడిగానే చూస్తాడు. ఇప్పుడు తెలుగు సినిమా సంగీతానికి పట్టిన దౌర్భాగ్యం ఇదే. గత కాలమె మేలు, వచ్చు కాలము కంటెన్ అన్నాడో కవి. తెలుగు సినీ సంగీత రంగంలో భావ సముద్రమై, రాగరంజితమై పాటలకు మకరంద మాధుర్యాన్ని నింపేసిన సాలూరి రాజేశ్వర్రావు లాంటి వారేరి? ఈవేళ? సుసర్ల దక్షిణామూర్తి, మాస్టర్ వేణు, పెండ్యాల, ఘంటసాల వంటి వారెవరైనా వున్నారా? ఈవేళ?
అటు సినీ నిర్మాతలకు, దర్శకులకు, ఇటు ప్రేక్షకులకూ ఉత్తమ సంగీతాభిరుచిని కలిగించిన సంగీత దర్శకులలో మేటియైన సాలూరి రాజేశ్వర్రావును గుర్తుకు తెచ్చుకుందాం. నటుడుగా ప్రవేశించి కొన్ని చిత్రాలలో నటించినట్లు కొందరికే తెలుసు. అప్పట్లో లలిత గీతాల ఆవిర్భావానికి రాజేశ్వర్రావే ఆద్యుడు. ఆర్.బాలసరస్వతీదేవితో ఆయన పాడిన పాటలనేకం. గ్రామఫోన్ రికార్డులిచ్చారు కూడా. ప్లేబాక్ లేని రోజుల్లో పాడగలిగిన వారినే సినిమాల్లోకి తీసుకునే రోజులవి. 1930లో ‘కృష్ణలీలలు’ చిత్రంలో ఆయన కృష్ణుడు. రంగస్థల నటుడు వేమూరి గగ్గయ్య అందులో నటించిన మరో నటుడు.
కలకత్తాలో న్యూ థియేటర్స్‌లోని వాతావరణం, పంకజ్ మల్లిక్, సిహెచ్.ఆత్మా, ఆర్.సి.బొరావ్ వంటి వారి సంగీతాన్ని బాగా వొంటబట్టించుకున్న ఘనుడు. ముఖ్యంగా ఆ రోజుల్లో ప్రసిద్ధ గాయకుడు, నటుడు కె.ఎల్.సైగల్ సంగీత రీతుల్ని బాగా విన్న అనుభవం ఉంది.
వాద్య బృంద నిర్వహణలోని మెళకువలు గ్రహించిన మేధావి.
1941లో బాలాంత్రపు రజనీకాంతరావు మద్రాసు రేడియో కేంద్రంలో వున్నప్పుడు ప్రసారమయిన ఆయన మొదటి సంగీత రూపకానికి (చండీదాసు) మధ్య మధ్యలో, వినిపించే వాద్యబృంద సంగీతాన్ని ఆయనే కంపోజ్ చేశారని రజనీయే చెప్పారు.
సంస్కారవంతంగా చేయబడిన పాటలు, అవి వినగలిగే సంస్కారం, రసజ్ఞత కలిగిన శ్రోతలనే వెదుక్కుంటూ వుంటాయి.
రాజేశ్వర్రావు తండ్రి సన్యాసిరాజు మంచి కవి, గాయకుడూ కూడా. సుస్వరంతో, నాదసుధారసాన్ని నింపిన ఘంటసాల, సుశీల, లీల వంటి గాయకులు దొరకటంవల్ల, రాజేశ్వర్రావు పాటలన్నీ మధురసాలు చిలుకుతూ శ్రోతల హృదయాలలో చిరస్థాయిగా నిల్చిపోయాయి. మోహన, కల్యాణి, ఖమాస్, కాపీ వంటి రాగాలలోని సొగసులను నిండైన బాణీలలో నింపేసి మధురమైన కంఠాలలో పలికించి, ధన్యుడైన సంగీత రసికుడు రాజేశ్వర్రావు.
ఈ పాటలు మీరు ఎప్పుడు విన్నా, అదే తొలిసారిగా విన్న అనుభూతి కలగటానికి కారణం, ఆ పాటలను అల్లుకున్న రాగ సౌందర్యం. ఈ వేళ మనం వింటున్న పాటలకు సంగీత జ్ఞానం విధిగా ఉండవలసిన అవసరం లేదేమో!? అనిపిస్తుంది. బీటు మీద దృష్టి పెడ్తే ఆ రూటే మారిపోతుంది. ఇంక సునాదానికీ, సుస్వరానికీ చోటెక్కడ?
శబ్ద సౌందర్యం తెలిసిన కవులు, రాగ సౌందర్యం తెలిసిన సంగీత దర్శకులు కలిసి అందించిన ఆనాటి మధుర గీతాలు విన్నప్పుడల్లా వారిని గుర్తుచేస్తూనే ఉంటాయి.
పరిణతి చెందిన గాయకుల కంఠాల్లో వొదిగిపోయిన కొన్ని పాటలు విని ఆనందించాలే తప్ప, ప్రజ్ఞ వుంది గదాయని, అనుకరించి పాడే ప్రయత్నం చేస్తే, ఒక్కొక్కసారి పాటనూ, ఆ పాట పాడిన గాయకుడి స్థాయినీ, దిగజార్చిన వారవుతారు. హనుమంతుడి ముందు కుప్పికంతులేసినట్లే.
కంఠస్థం చేసి పాడే పాటగాళ్లకు సంగీత గురువుల అవసరం వుండదు. వారు అదృష్టవంతులు. శాస్ర్తియ సంగీత జ్ఞానం లేకపోయినా సినిమా పాటలు పాడటం కష్టం కాదని తీర్మానం చేసే గాన భాస్కరులున్నారు. వీరివల్ల మన పిల్లలకు మేలు కంటే కీడే ఎక్కువ.
సంగీతంలో విశేషంగా కృషి చేసిన జ్ఞానంతో పాడిన పాటలను లోతుగా అధ్యయనం చేయాలి. ఆ స్థాయిలో సంగీత జ్ఞానాన్ని సంపాదించే ప్రయత్నం చేయాలి. వారిని అనుసరించాలి. అనుకరణ అక్కరకు రాదు.
‘తా చెడ్డకోతి వినమంతా చెరిచినట్లే’ అనుకరిస్తూ పాడితే పాటల సంఖ్య పెరుగుతూ పోతుందేగాని, అదే సంగీతమవ్వదు.
*

చిత్రం... సాలూరి రాజేశ్వరరావు

- మల్లాది సూరిబాబు 9052765490