S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రామాయణం.. మీరే డిటెక్టివ్ 11

ఆశే్లష మళ్లీ ఆ ఆదివారం హరికథ వినడానికి రామాలయానికి వెళ్లాడు. ఆయన చెప్పసాగాడు.
‘ఇవాళ ముప్పై తొమ్మిదో సర్గ నుంచి నలభై రెండో సర్గ దాకా చెప్తాను. విశ్వామిత్రుడు రామలక్ష్మణులకి గంగావతరణం గురించి చెప్తున్నాడు.
దేవతల మాటలు విని బ్రహ్మదేవుడు వారితో ఇలా చెప్పాడు.
‘సమస్త భూమికి యజమాని అయిన వాసుదేవుడు కపిలుడిగా తపస్సు చేస్తున్నాడు. అతని కోపాగ్నికి సగరుడి కొడుకులు బూడిద అవగలరు. వారు భూమిని తవ్వడం వల్ల తక్కువ ఆయుష్షుతో మరణిస్తారని విధి ఏనాడో నిర్ణయించింది. రామా! భూమిని తవ్వే సగర కుమారులు భూమిని ఓసారి చుట్టి వచ్చినా వారికి యాగాశ్వం కనపడకపోగా పిడుగు లాంటి శబ్దం వినిపించింది. తమ తండ్రి దగ్గరికి వెళ్లి గుర్రం కనపడలేదని చెప్పారు. సగరుడు కోపంగా వాళ్లతో ‘తవ్విన చోటే మళ్లీ తవ్వి, గుర్రాన్ని దొంగిలించిన వాడిని పట్టుకున్నాకే తిరిగి రండి’ అని చెప్పాడు.
‘ఆ ప్రకారం అరవై వేల మంది తిరిగి పాతాళానికి చేరుకున్నారు. వారికి తూర్పు దిక్కున తల మీద భూమిని మోసే భద్రం అనే కొండంత ఏనుగు కనిపించింది. దానికి వారు ప్రదక్షిణం చేసి, పూజించి పాతాళంలోకి చొచ్చుకుపోయి దక్షిణ దిక్కుని తవ్వారు. దక్షిణాన వారికి మహాపద్యం అనే ఏనుగు, పశ్చిమ దిక్కున సౌమనసం, ఉత్తరం వైపు విరూపాక్షం అనే కొండంత ఏనుగులు కూడా భూమి మీద తలలని మోస్తూ కనిపించాయి. అవి అలసటతో అప్పుడప్పుడూ తలలని కదిలిస్తే భూకంపాలు వస్తాయి. వాటిని తాకి, ప్రదక్షిణం, పూజా చేసి ఈశాన్య దిక్కులో భూమిని తవ్వడం కొనసాగించారు. చివరికి గడ్డి మేస్తూ తిరిగే గుర్రాన్ని చూసి సంతోషించారు. కపిల రూపంలోని మహావిష్ణువుని చూసి కోపంతో గునపాలు, నాగళ్లు, చెట్లు, రాళ్లతో ఆ కపిలుడి మీదకి దాడి చేశారు. తాము సగరుడి కొడుకులమని, ఆయన యాగానికి చెందిన గుర్రాన్ని దొంగిలించాడని చెప్పగానే ఆయన కోపంతో వారిని తక్షణం బూడిదై పొమ్మని శపించాడు.
‘రఘునందనా! తమ కొడుకులు చాలాకాలం తిరిగి రాకపోవడంతో సగరుడు తన మనవడు అంశుమంతుడిని పిలిచి అతని పినతండ్రుల జాడని, యాగాశ్వాన్ని దొంగిలించిన వారి జాడని కనిపెట్టి రమ్మని, బాణాలు, అంబులు తీసుకెళ్లి నమస్కరించాల్సిన వారికి నమస్కరిస్తూ, అడ్డుపడే వారిని చంపుతూ పనిని పూర్తి చేసుకువచ్చి యజ్ఞం కొనసాగేలా చేయమని కోరాడు.
అంశుమంతుడు తన పినతండ్రులు తవ్విన దారిలోనే వెళ్లాడు. దైత్య, దానవ, పిశాచ, పతగోరగులని చూసి వారిని పూజించాడు. ఆ నాలుగు ఏనుగులని పూజించి అడిగితే, ‘గుర్రంతో తిరిగి వెళ్తావు’ అని అవి ఆశీర్వదించాయి. అవి చెప్పిన దారిలో వెళ్లి తన పినతండ్రుల బూడిద కుప్పలని చూసి దుఃఖించాడు. యజ్ఞాశ్వం కూడా అతనికి కనపడింది. వారికి తర్పణాలు వదలడానికి చూస్తే ఎక్కడా నీరు కనపడలేదు. అతనికి తన పినతండ్రుల మేనమామ గరుత్మంతుడు కనిపించి చెప్పాడు.
‘అంశుమంతా! ఏడవకు. నీ పినతండ్రుల మరణం వల్ల లోకం సంతోషిస్తోంది. కపిలుడు బూడిద చేసిన వీరికి మామూలు నీళ్లతో తర్పణం సరికాదు. హిమవంతుడి పెద్ద కూతురు గంగానదీ నీటితో జలతర్పణం చేయి. అందువల్ల ఈ అరవై వేల మందీ స్వర్గానికి చేరతారు. ఈ గుర్రాన్ని తీసుకెళ్లి మీ తాత యజ్ఞాన్ని జరిపించు’
అంశుమంతుడు గుర్రంతో సగర చక్రవర్తి దగ్గరికి వెళ్లి గరుత్మంతుడు చెప్పింద వివరించాడు. ఆయన కొడుకుల మరణానికి దుఃఖించి, యజ్ఞాన్ని పూర్తి చేసి నగరంలోకి ప్రవేశించాడు. గంగా నదిని స్వర్గం నించి ఎలా దింపాలో ఆయనకి బోధపడలేదు.
‘సగరుడు మూడు వేల సంవత్సరాలు రాజ్యం చేసి మరణించాక అంశుమంతుడు రాజయ్యాడు. కొంతకాలం తర్వాత రాజ్యభారాన్ని కొడుకైన దిలీపుడికి ఇచ్చి అంశుమంతుడు హిమాలయాల్లోని తపోవనంలో ముప్పై రెండు వేల సంవత్సరాలు తపస్సు చేసి స్వర్గస్థుడయ్యాడు. దిలీపుడికి కూడా గంగని భూమికి తెచ్చే దారి దొరకలేదు. తండ్రిలా ధర్మంగా ముప్పై వేల సంవత్సరాలు రాజ్యాన్ని పాలించాక తన ముత్తాతలైన సగర కొడుకులకి గంగ నీటి తర్పణం చేయలేదనే మనోవ్యధతో దిలీపుడు తన కొడుకు భగీరథుడ్ని రాజుగా చేసి మరణించాడు. భగీరథుడికి పిల్లలు పుట్టలేదు. గంగని స్వర్గం నించి భూమికి తేవాలనే నిశ్చయంతో రాజ్యాన్ని మంత్రులకి అప్పగించి గోకర్ణ క్షేత్రానికి గ్రీష్మ ఋతువులో నెలకోసారి మాత్రమే ఆహారం తీసుకుంటూ, రెండు చేతులు పైకెత్తి పంచాగ్నుల మధ్య నిలబడి తపస్సు చేశాడు.
‘్భగీరథుడు అలా ఐదు వేల సంవత్సరాలు తపస్సు చేశాక బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమని చెప్పాడు. ‘తన ముత్తాతల భస్మరాసులని గంగా జల తర్పణంతో స్వర్గానికి చేరేలా మొదటి వరంగా ఇవ్వమని, రెండో వరంగా తనకి సంతానం కలిగి ఇక్ష్వాకు వంశం ఎన్నటికీ నశించకూడదని’ కోరాడు. బ్రహ్మదేవుడు ఆ రెండు వరాలని ఇచ్చి చెప్పాడు.
‘స్వర్గం నించి కిందకి జారే గంగని భూమి ఆపలేదు. అందుకు శివుడు మాత్రమే సమర్థుడు’
బ్రహ్మదేవుడు గంగతో కూడా ఆ విషయం మాట్లాడి దేవతలతో స్వర్గానికి వెళ్లాడు. (బాలకాండ సర్గ 40-42)
హరిదాసు ఆ రోజుకి ఆ కథ పూర్తి చేసి రామలక్ష్మణులకి, హనుమంతుడికి హారతి ఇచ్చాక కొందరు శ్రోతలు ఆయన చెప్పిన కథలోని కొన్ని తప్పులని ఎత్తి చూపారు. ఆ ఏడుగురు శ్రోతలు చెప్పిన ఆ తప్పులని మీరు పట్టుకోగలరా?

మీకో ప్రశ్న
పంచాగ్ని తపస్సు అంటే ఏమిటి?
**

కిందటి వారం రామాయణ కథలో తప్పులు
1.ఈశ్వరుడు తన భార్యతో క్రీడించింది ఏడాది కాదు. వందేళ్లు.
2.ఉమాదేవి దేవతలని ‘మీకు సంతానం కలగకుండు గాక!’ అని కాక, ‘మీకు మీ భార్యలతో సంతానం కలగకుండు గాక!’ అని శపించింది.
3.ఈశ్వరుడు తన భార్యతో తపస్సు కోసం వెళ్లింది హిమాలయాల్లోని పశ్చిమ హిమాలయాలకి.
4.ఈశ్వర రేతస్సు మలం నించి తగరం, సీసం ఇలా అనేక ధాతువులు కూడా పుట్టాయి.
5.కుమారస్వామి భక్తుడు మరణించాక స్వర్గలోకానికి కాక స్కంద లోకానికి వెళ్తాడు.
6.సగరుడు మొదటి భార్య పేరు కేశి కాదు. కేశిని.
7.ఈశ్వరుడి దగ్గరకి వెళ్లి కాదు. దేవతలు, పాములు, గంధర్వులు, అసురులు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి ప్రార్థించారు.

**
మీకో ప్రశ్నకి జవాబు
సగరుడి తండ్రి పేరేమిటి? అసితుడు

మల్లాది వెంకట కృష్ణమూర్తి