S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎంపిక

కథల పోటీలో
ఎంపికైన రచన
**
గోధూళి వేళ... దూరం నుంచి ఆలమందలు తిరిగి వస్తున్న దృశ్యం మేడ మీద నిలబడి చూస్తోన్న శాంతికి అస్పష్టంగా కన్పిస్తోంది. కనుచూపు మేరలో ఆవరించి వున్న పొలాలు.. పడమటి కొండల చాటుకు వేగంగా వెళ్లిపోతున్న సూర్యుడు... దూరంగా, కాలిబాట మీద వస్తూన్న ఎడ్లబండి.
‘మా పల్లె అందాలను చూస్తున్నావా శాంతీ..?’ వెనక నుంచి వినబడ్డంతో వెనుదిరిగి చూసింది శాంతి. ఆమె బావ రాంబాబు నిలబడి వున్నాడు.
‘అంతగా చూడ్డానికి ఇక్కడేముంది? ఇదేమన్నా పెద్ద సిటీనా ఏంటి? ఏదో ఉబుసుపోకకు ఇక్కడ నిలబడ్డానంతే..’ అంది శాంతి. రాంబాబు మరదలి మాటల్ని సీరియస్‌గా తీసుకోకుండా నవ్వి వెళ్లిపోయాడు.
అత్తమ్మ వాళ్లుండే పల్లెటూరికి రావడానికి శాంతికి ఏ మాత్రం ఇష్టం లేకపోయినా... ‘వాళ్ల ఊరిలో ప్రతి సంవత్సరం జరిగే పండగ కాదిది. తొమ్మిది సంవత్సరాల తర్వాత ఊరి అమ్మవారి పండగ చేస్తున్నారట. అక్క స్వయంగా వచ్చి పిలిచింది. నాకేమో సెలవు దొరికేలా లేదు. మీ అమ్మను వెళ్లమంటే నచ్చడం లేదు. అంచేత నువ్వూ, తమ్ముడూ తప్పనిసరిగా వెళ్లి రండి...’ అని తండ్రి మరీమరీ చెప్పడంతో తమ్ముణ్ణి తీసుకొని రాక తప్పలేదు.
ఉన్న రెండ్రోజులూ అత్తయ్య, బావలు ఎంత ఆప్యాయంగా చూసుకున్నా శాంతికి ఎందుకో ఆ పల్లెటూరి వాతావరణం.. ఆ మనుషులు తనకి సరిపడరన్నట్టుగా అనిపించింది.
ఇంటికి తిరిగొచ్చి రెండ్రోజులు గడిచాక శాంతి తండ్రి రాఘవయ్య మాట్లాడాలంటూ శాంతిని కూర్చోబెట్టాడు.
‘రాంబాబు బావ మంచోడమ్మా.. నీకు వరసకు బావ అవుతాడని చెప్పడం లేదు. నిజంగా వాడి మనసు మంచిది. అంతేకాదు నిన్ను అమితంగా ఇష్టపడుతున్నాడు కూడా. నిన్న మా అక్క ఫోన్ చేసి మీ ఇద్దరి పెళ్లి విషయం ఏదో ఒకటి తేల్చమని మరీమరీ చెప్పింది. ఆవిడ కూడా వున్న ఒక్కగానొక్క కొడుకు పెళ్లి చేసేస్తే బాధ్యత తీరిపోతుందని చూస్తోంది. నీ చదువు మరో సంవత్సరమే వుంది గాబట్టి పెళ్లయ్యాక అక్కణ్ణుంచి కాలేజీకి వెళ్లి వస్తూ అయినా చదువు పూర్తి చెయ్యొచ్చని అంది. అలా కాదు.. చదువు పూర్తయ్యేదాకా ఆగాలని నువ్వంటే నిశ్చితార్థం ఇప్పుడు చేసుకుని సంవత్సరం ఆగిన తర్వాతే పెళ్లి చేద్దామని అంది. లేదూ మనకి వేరే అభిప్రాయం ఉంటే కొడుక్కి వేరే సంబంధాలు చూసుకుంటాను అంటోంది..’ చెప్పాడు రాఘవయ్య.
శాంతి వౌనం వహించింది. బావ మంచోడు. ఆ సంగతి తనకు తెలుసు. కానీ.. పల్లెటూళ్లో ఉంటాడు. అగ్రికల్చరల్ బిఎస్సీ చేసి వారసత్వంగా వచ్చిన పొలం చూసుకుంటున్నాడు. అతనికి పల్లెటూళ్లో ఉండటమన్నా... వ్యవసాయం చెయ్యడమన్నా ఇష్టమని తనకు తెలుసు. ఆ ఊరు, ఆ పొలం వదిలిరాడన్న సంగతి కూడా తెలుసు. ఈ కాలంలో వ్యవసాయం చేసేవాణ్ణి పెళ్లి చేసుకోవడం..? అందునా తను ఇంజనీరింగ్ చేస్తోంది. మెరిట్ స్టూడెంట్ కాబట్టి అది పూర్తయితే కచ్చితంగా ఏదో ఒక జాబ్ వస్తుందని ఆశిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో బావని చేసుకుని పల్లెటూరికి వెళ్లి అక్కడ కాపురం చెయ్యడం...? ఆమె ఆలోచిస్తోంది ఈ విషయం మాత్రమే కాదు.. యశ్వంత్ గురించి కూడా..! యశ్వంత్ ఓ బ్యాంక్‌లో పని చేస్తున్నాడు. అతను తన క్లాస్‌మేట్ అన్నయ్య. తనంటే ఇష్టపడుతున్నాడు కూడా. తనక్కూడా నచ్చితే పెద్దవాళ్లతో మాట్లాడతానన్నాడు. ఆ విషయమే తండ్రితో ఎలా చెప్పాలా... అని సతమతమవుతోంది.
‘నీకు అభ్యంతరమేమైనా ఉంటే చెప్పమ్మా... నీ ఇష్టాన్ని కాదని బలవంతంగా పెళ్లి చెయ్యను కదా...!’ మళ్లీ అన్నాడు రాఘవయ్య.
‘చెప్పెయ్యాలి.. ఇప్పుడే చెప్పేయ్యాలి’ శాంతి మనసు గుబగుబలాడింది. తటపటాయించకుండా ఉన్న విషయం చెప్పేసింది. యశ్వంత్ గురించి చెప్పాక అంది ‘బావ మీద నాకు అయిష్టం అని కాదు గానీ బావని చేసుకుని ఆ పల్లెటూళ్లో సెటిలయిపోవడం నాకిష్టం లేదు నాన్నా.. ప్రేమాగీమా లాంటి పెద్ద పదాలు చెప్పదల్చుకోలేదు కానీ యశ్వంత్ మంచి ఉద్యోగం వున్నవాడు. సొంత ఇల్లు.. కాస్తో కూస్తో ఆస్తిపాస్తులు కూడా ఉన్నవాడు... చెడ్డ అలవాట్లేమీ లేనివాడు.. అన్నిటికీ మించి ప్రేమిస్తున్నాను.. నన్ను ప్రేమించు అంటూ పిచ్చిమాటలు చెప్పకుండా నీకు నచ్చితే మీ పెద్దవాళ్లతో మాట్లాడతాను అని మర్యాదగా అడిగిన సంస్కారం ఉన్నవాడు.. అంచేత మీ అంగీకారం ఉంటే అతణ్ణే చేసుకోవాలనుకుంటున్నాను’
రాఘవయ్య ఆలోచనలో పడిపోయాడు. చివరికిలా అన్నాడు ‘నువ్వు చెప్పినవన్నీ నిజమే కావచ్చమ్మా... కానీ నువ్వు చెప్పిన లక్షణాలన్నీ మీ బావకు కూడా ఉన్నాయి. అదీగాకుండా చిన్నప్పణ్ణుంచీ వాడి స్వభావం ఎలాంటిదో నాకు బాగా తెలుసు. మంచి మనిషి... సహనపరుడు. మనం బంధువులం కూడా కాబట్టి మా అక్క నిన్ను కోడలిగా కాకుండా సొంత కూతుర్లాగా చూసుకుంటుందనే నమ్మకం ఉంది. నువ్వు చెప్పిన మనిషి నిజంగా మంచివాడే కావచ్చు. కానీ ఒక మనిషి మంచితనం, వ్యక్తిత్వం ఎలాంటివనేది సమస్య వచ్చినప్పుడే తెలుస్తుందమ్మా.. కొద్ది పరిచయంతో అతని గురించి నాకు అంతా తెలిసిపోయింది అనుకోవడం తప్పు. బావని చేసుకుంటే పల్లెటూళ్లో ఉండవలసి వస్తుందనే ఒక్క కారణం చెప్పావు. కానీ పల్లెటూరికి కూడా కంప్యూటర్లు, ఇంటర్నెట్‌లు పాకిపోయిన కాలం ఇది. అయినా పక్కనే సిటీ ఉంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు సినిమాకో, షికారుకో సిటీకి రావొచ్చు... వెళ్లొచ్చు. సరే.. ఇదంతా ఎందుకు? బావని చేసుకోవడం నీకు ఇష్టం లేకపోతే నువ్వన్నట్టే ఆ అబ్బాయితో మాట్లాడదాంలే... నిజంగా అది మంచి సంబంధమే అయితే రాంబాబుకి వేరే సంబంధాలు చూసుకోమని మా అక్కతో చెప్పేద్దాం...’
రాఘవయ్య అలా అన్నాడే గానీ బావని తను చేసుకోనని చెప్పడం, మంచి సంబంధం, దగ్గర సంబంధం వదిలేసుకోవలసి రావడం, ఎవరో ముక్కూ మొహం తెలీని మరో సంబంధానికి వెళ్లడం ఆయనకి ఏ మాత్రం ఇష్టం లేకుండా ఉందనీ, కేవలం తన మనసు నొప్పించడం ఇష్టం లేకనే ఆ విధంగా రాజీ పడుతున్నాడని శాంతికి స్పష్టంగా తెలుస్తూనే ఉంది. కానీ ఆమె మనసు మాత్రం యశ్వంత్‌ని చేసుకుంటే మంచిదన్న అభిప్రాయానికే మొగ్గుతోంది.
అనుకున్నట్టుగానే ఓ రోజు యశ్వంత్‌ని రాఘవయ్యకి పరిచయం చేసింది శాంతి. ఆయన యశ్వంత్‌తో మాట్లాడి కుటుంబ వివరాలు అవీ తెలుసుకున్నాడు. అప్పటికీ ఆయనకి ఆ సంబంధం మీద పెద్దగా మొగ్గు లేకపోయినా కూతురి ఇష్టానికి తలవంచి వేరే సంబంధాలు చూసుకోమని అక్కకి కబురు పంపించాడు.
కాలం కొన్ని సమస్యల్ని సృష్టిస్తుంది. మరికొన్ని సమస్యల్ని పరిష్కరిస్తుంది. కొన్నింటిని సరళం చేస్తే మరి కొన్నింటిని క్లిష్టం చేసేస్తుంది. ఏదేమైనా చాలాసార్లు మనం అనుకున్నవి అనుకున్నట్టుగా జరగనివ్వకపోవడం దాని ప్రత్యేకత!
సరిగ్గా అలాంటి అనుకోని ఆపదే ఆ కుటుంబానికి రాఘవయ్య మరణం రూపంలో వచ్చి పడింది. ఎప్పుడూ పెద్దగా అనారోగ్యం బారిన పడని ఆయన హఠాత్తుగా గుండెపోటుతో మరణించాడు. ఇది ఆ కుటుంబంలో ఓ పెద్ద కుదుపు. తల్లి సర్వం కోల్పోయినట్టుగా భావిస్తే శాంతికీ, ఆమె తమ్ముడికీ తమ వెనకుండి అన్నీ తానై నడిపించే ఒక పెద్ద ఆధారం పోయినట్టుగా అనిపించింది. కుటుంబంలో అన్నీ సక్రమంగా జరిగేట్లుగా చూసే నాన్న చనిపోవడం వల్ల తమ బ్రతుకులు అస్తవ్యస్తమవుతాయేమో అన్న భయం కూడా కలిగింది.
* * *
‘శాంతీ... ఇదుగో మీ నాన్నగారి డెత్ సర్ట్ఫికెట్ తీసుకున్నాను. లీగల్ హైర్ సర్ట్ఫికెట్‌కు కూడా అప్లై చేశాను. అదీ ఓ వారంలో వచ్చేస్తుంది...’ చేతిలో సర్ట్ఫికెట్ శాంతికిస్తూ అన్నాడు యశ్వంత్.
శాంతి అతడి వైపు కృతజ్ఞతగా చూసింది. నాన్న చనిపోయిన తర్వాత ఇతడి తోడ్పాటే గనుక లేకుంటే తను చాలా డిప్రెషన్‌కి లోనయి ఉండేది. తమ్ముడు డిగ్రీ సెకండియర్ చదువుతున్నాడన్న మాటేగానీ ఇంట్లో అన్ని పనులూ ఎప్పుడూ నానే్న చూసుకోవడం వల్ల వాడికి కూడా ఏమీ తెలీదు. పెదకర్మ వరకూ జరిగిన కార్యక్రమాల్లో కూడా యశ్వంత్ అండగా ఉండి నడిపించాడు.
మరో నెల గడిచాక యశ్వంత్ ఓ అప్లికేషన్ తెచ్చి శాంతికిచ్చాడు.
‘ఏమిటిది..?’ అడిగిందామె.
‘మీ నాన్నగారు గవర్నమెంట్‌లో అసిస్టెంట్ ఇంజనీర్‌గా చేస్తూ సర్వీస్‌లో ఉండగానే చనిపోయారు కదా.. పద్ధతి ప్రకారం మీ అమ్మగారికి ఫేమిలీ పెన్షన్‌కి అప్లై చేశాం. అదే విధంగా ఆయన సర్వీసులో ఉండగా పోయారు కాబట్టి మీ కుటుంబంలో ఒకరికి గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఆ విషయం నీకు చెప్పాను కదా.. దానికి సంబంధించిన అప్లికేషనే ఇది...!’
‘ఓహ్.. అదా! వివరాలన్నీ నావి నింపావేమిటి..?’
‘అవును. ఆయన సంతానంలో పెద్దదానివి నువ్వే కాబట్టి నీ పేరే ఇవ్వాలి. నువ్వు ఇంజనీరింగ్ లాస్టియర్లో ఉన్నావు. జాబ్‌లో జాయినయ్యాక సెలవు పెట్టయినా ఎగ్జామ్స్ రాయొచ్చు...’
‘నేను ఆలోచిస్తున్నది అది కాదు యశ్వంత్. ఈ ఉద్యోగం నేను తీసుకుంటే తర్వాత తమ్ముడి భవిష్యత్ ఏమిటి...? నాన్న వున్నప్పుడైతే ఫర్వాలేదు.. కానీ నేను పెళ్లి చేసుకొని వెళ్లిపోతే తర్వాత తమ్ముడి సంగతి ఏమవుతుంది? అమ్మకొచ్చే అరకొర పెన్షన్‌తోనే అంతా సాగిపోదు కదా.. వాడికి ఈ ఉద్యోగం వస్తే హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. వాడు కూడా ఉద్యోగంలో ఉండగానే ఏదో రకంగా లీవ్ పెట్టి డిగ్రీ కంప్లీట్ చెయ్యొచ్చు... ఇంకా పై చదువులు చదవాలన్నా ప్రైవేట్‌గా చదువుకోవచ్చు..’
‘అదేమిటి శాంతీ అలా అంటావు..? మీ తమ్ముడికి బోలెడు వయసుంది. ముందు ముందు ఉద్యోగం సంపాదించుకోకపోడు. ప్రస్తుతం ఇంటికి పెద్దకూతురిగా నీ పేరే పరిగణనలోకి తీసుకుంటారు. ఇప్పుడు మామూలుగా ఏదో క్లరికల్ పోస్ట్ ఇచ్చినా గానీ ముందు ముందు ప్రమోషన్లు ఉంటాయి. అదీగాక నీ ఇంజనీరింగ్ పూర్తయితే నువ్వు పనిచేసే డిపార్ట్‌మెంట్‌లోనే టెస్టులు రాసి పాసై ఇంజనీరింగ్ పోస్టులోకి వెళ్లే అవకాశం ఉంది. ముందు ముందు నీ భవిష్యత్ చాలా బాగుంటుంది’
‘నేను నా భవిష్యత్ గురించి ఆలోచించడం లేదు యశ్వంత్.. ఇంజనీరింగ్ పూర్తి చేశాక నేను ఏదో ఒక జాబ్‌కు ట్రై చేసుకోవచ్చు. జాబ్ రాకపోయినా కొంపలు మునిగిపోయేదేమీ లేదు. ఎలాగూ నువ్వు మంచి జాబ్‌లోనే ఉన్నావు కదా.. ఈ ఉద్యోగం తమ్ముడికి వస్తే వాడి లైఫ్ సెటిలవుతుంది. వాడు కూడా డిగ్రీ కంప్లీట్ చేసుకుంటే ఇంజనీరింగ్ లైన్లో కాకపోయినా అడ్మినిస్ట్రేషన్ సెక్షన్‌లో అయినా వాడికి ప్రమోషన్లు రాకపోవు... అదీ నా ఆలోచన..!’ స్థిరంగా చెప్పింది శాంతి.
‘అయితే నువ్వే అంతా నిర్ణయించేశావన్నమాట. అయినా నువ్వుండగా మీ తమ్ముడికి జాబ్ ఎలా ఇస్తారనుకున్నావ్..?’ కాస్త కఠినంగా అడిగాడు యశ్వంత్.
‘ఇస్తారు. సంవత్సరం వరకూ ఆ పోస్టుకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఏ లిటిగేషన్ లేకుండా వాడికి జాబ్ రావాలంటే నేను సంవత్సరం లోపు పెళ్లి చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు మరింత నా పేరును పరిగణనలోకి తీసుకోరు. పెళ్లైన అమ్మాయి వేరే కుటుంబానికి చెందిందిగానే గవర్నమెంట్ రూల్సు కూడా చెప్తున్నాయి. అదీగాక శవం లేచిన ఇంట్లో సంవత్సరం తిరక్కుండా శుభకార్యం జరిగితే మంచిదని పంతులుగారు కూడా చెప్పారు. ఆ విధంగా అన్ని సమస్యలు చక్కబడతాయి..’ ప్రశాంతంగానే చెప్పింది శాంతి.
‘ఓహో... అన్ని వివరాలూ కనుక్కునే వున్నావన్నమాట. అయితే సంవత్సరం లోపుగా మనం పెళ్లి చేసుకోవాలా?’ ఎంత దాచుకున్నా యశ్వంత్ గొంతులో అసహనం దాగలేదు.
‘అవును.. అందుకు నీకు అభ్యంతరం ఏమిటి..?’ సూటిగా అడిగింది శాంతి.
యశ్వంత్ సమాధానం చెప్పలేదు. విసురుగా అక్కణ్ణుంచి లేచి వెళ్లిపోయాడు.
అతడేదో కోపంలో అలా వెళ్లిపోయాడనీ.. నెమ్మదిగా నచ్చజెప్పవచ్చనీ అనుకుంది శాంతి. కానీ కాబోయే భార్యకు వచ్చే గవర్నమెంట్ ఉద్యోగాన్ని వదులుకోవడం అతనికే మాత్రం ఇష్టం లేదనీ, ఈ ఛాన్సును వదులుకుని తర్వాతెప్పుడో ఆమెకి వస్తుందో రాదో తెలియని ఉద్యోగం గురించి ఆశించడం అవివేకమని భావిస్తున్నాడనీ, ఒకవేళ తర్వాత ఆమెకు ఉద్యోగం వస్తుందని అనుకున్నా ఇప్పుడొచ్చేది గవర్నమెంట్ ఉద్యోగం గనుక దీన్ని వదులుకోవడం అస్సలు ఇష్టం లేదనీ ఆమెకి త్వరలోనే అర్థమైంది. ఆ ఉద్యోగం తను తీసుకోకపోతే అతడు తనను వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాడని అర్థం చేసుకుంది.
శాంతికి తండ్రి చెప్పిన మాట గుర్తొచ్చింది. కొద్దిపాటి పరిచయంతోనే ఒక మనిషిని పూర్తిగా అంచనా వేయడం కష్టమనీ, సమస్య వచ్చినప్పుడే మనిషి తాలూకు మంచితనం, వ్యక్తిత్వం తెలుస్తాయన్న ఆయన మాటలోని సత్యం ఆమెకిప్పుడు పూర్తిగా అవగతమైంది. యశ్వంత్ ఇన్నాళ్లూ తనకు తోడుగా నిలిచి సహాయం చేస్తున్నాడంటే ప్రేమించిన అమ్మాయికి కష్టం వచ్చినప్పుడు బాసటగా నిలబడే వ్యక్తిత్వం వున్నవాడు అనుకుంది గానీ అవకాశవాదిగా ఆలోచిస్తున్నాడనీ, మనీమైండెడ్ మనిషి అనీ ఆమె ఊహించలేదు.
* * *
‘అయితే ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావ్..?’ జరిగిన విషయమంతా తెలుసుకున్న ప్రాణ స్నేహితురాలు లత అడిగింది.
శాంతి శుష్కంగా నవ్వింది. ‘ఏం చేస్తాను? ఓ పాఠం నేర్చుకున్నానని అనుకుంటాను. అమ్మకు సంబంధాలు చూడమని చెప్పాను. సంవత్సరం తిరిగేలోపు పెళ్లి చేసుకుని తమ్ముడి ఉద్యోగానికి లైన్ క్లియర్ చేద్దామనుకుంటున్నాను... అన్నట్టు నువ్వు కూడా నా కోసం మంచి సంబంధం ఏదైనా ఉంటే చూడు..’
‘అది కాదే.. మీ బావకు నువ్వంటే ఇష్టమే కదా... మీ అత్తకు కూడా నువ్వు వాళ్లింటికి కోడలిగా రావడం ఇష్టమే. అలాంటప్పుడు ఆ సంబంధమే ఎందుకు చేసుకోగూడదు? మీ అమ్మతో చెప్తే మీ అత్త, బావలతో మాట్లాడుతుంది కదా...’ సూచనగా అంది లత.
‘ఇప్పుడే యశ్వంత్ అవకాశవాదం గురించి చెప్పాను. నువ్వేమో నన్ను అవకాశవాదిగా మారమంటున్నావు. ఈ సంబంధం నాకు ఇష్టం లేదనీ, వేరే సంబంధాలు చూసుకోమనీ నాన్న వున్నప్పుడే అత్తయ్యకు కబురు పెట్టారు. ఇప్పుడు ఇలా అయిందని మళ్లీ వాళ్లని అడగమంటావా...?’
‘తప్పేముందే...? అప్పుడేదో యశ్వంత్ నైజం తెలీక ఆ విధంగా అనుకున్నావు. అలాగని మీ బావ మీద నీకు అయిష్టమేమీ లేదన్నది నీకూ తెలుసు. వాళ్లకూ తెలుసు. పల్లెటూరిలో ఉండాల్సి రావడం అనేది పెద్ద విషయం కాదు. జరిగిన సంగతి తెలిస్తే ఇదంతా మనసులో పెట్టుకోకుండా మీ బావ నిన్ను అంగీకరిస్తాడని అనుకుంటున్నాను. ఎందుకంటే అతని సంస్కారం మీద, మంచితనం మీద నాకు నమ్మకం ఉంది...’
‘ఇద నమ్మకానికి సంబంధించిన విషయం కదా లతా...! ఆ విధంగా చెయ్యడానికి నా మనసంగీకరించటం లేదు. ఒకవేళ వాళ్లు ‘వాడెవడో వద్దనేసరికి ఇప్పుడు మేం కనిపించామా..?’ అని ఒక్క మాట అన్నారంటే నా తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా అర్థంకాని పరిస్థితి వస్తుంది...’
శాంతి అలా మాట్లాడటంతో లత మరింకేమీ తర్కించలేదు.
* * *
కాస్త రిలీఫ్‌గా ఉంటుంది.. అలా సినిమాకెళ్లి వద్దామంటే లత మాట తోసెయ్యలేక ఆమెతో పాటు బయల్దేరింది శాంతి. సినిమా అయ్యాక ‘పద... కాస్త అలా నడుచుకుంటూ వెళ్లి సెంటర్లో ఆటో ఎక్కుదాం...’ అని లత అనడంతో నడుచుకుంటూ వస్తున్నారు.
ఎదురుగా వస్తున్న మనిషిని చూసి అనుకోకుండానే ఉలిక్కిపడింది శాంతి. ఆమె బావ రాంబాబు ఎదురుగా నడుచుకుంటూ వస్తున్నాడు.
‘ఏదో పని మీద వచ్చుంటాడు. ఇప్పుడతని కంట పడ్డమెందుకు..?’ అనుకొని తప్పించుకుంటూ వెళ్లిపోదామనుకుంటుండగా రాంబాబు వీళ్లను చూడనే చూశాడు. ‘బావున్నావా శాంతీ... అత్తయ్య కులాసాగా ఉందా..?’ అంటూ దగ్గరికొచ్చి పలకరించాడు. శాంతికి మాట్లాడక తప్పలేదు.
కుశల ప్రశ్నలయ్యాక ‘ఇంక వస్తాను బావా...’ అంటూ బయల్దేరబోయింది శాంతి.
‘శాంతీ... నీతో చిన్న విషయం మాట్లాడాలి...’ అన్నాడు రాంబాబు.
‘సరే.. ఈ పక్కనే పార్కు ఉంది. వెళ్లి మాట్లాడుకోండి. మధ్యలో నేనెందుకు...? నేను వెళ్తాను శాంతీ... మాట్లాడ్డం అయ్యాక నువ్వు ఆటో ఎక్కెయ్...’ అంటూ శాంతి సమాధానం కోసం ఎదురుచూడకుండా వెళ్లిపోయింది లత.
శాంతికి తప్పలేదు. ఇద్దరూ పక్కనే ఉన్న పార్కుకు వెళ్లి ఓ బెంచీ మీద కూర్చున్నారు.
‘శాంతీ... జరిగిన విషయమంతా నాకు తెలుసు. నువ్వు నాతో ఇంతకు ముందులా మాట్లాడ్డానికి ఇబ్బంది పడుతున్నావని కూడా తెలుసు. కానీ నా మనసులో అదేం లేదు. జీవితంలో అన్నీ మనం ఊహించినట్టే జరగకపోవచ్చు. కానీ ఒక్క విషయం మాత్రం నీతో చెప్పాలి. ఇప్పటికి కూడా నిన్ను చేసుకోవడం నాకిష్టమే... అదీ నీకు ఇష్టమైతేనే సుమా..’ సూటిగా చెప్పాడు రాంబాబు.
‘బావా..?!’ ఆశ్చర్యంగా చూసింది శాంతి.
‘అవును శాంతీ.. ఇందులో పెద్దగా ఆశ్చర్యపడ్డానికి ఏమీ లేదు. అన్ని విధాలా నీకు తగినవాడని భావించి నువ్వు యశ్వంత్‌ని ఎంపిక చేసుకున్నావు. అంతే తప్ప నువ్వతనే్నదో గాఢంగా ప్రేమించేసి అతన్తో తిరిగి అతను లేకపోతే జీవితమే లేదనుకునేంత పిచ్చి భ్రమలో ఏమీ లేవని నాకు తెలుసు. నీ అంచనాలకు తగినవాడు కాదని తేలడంతో అతన్ని చేసుకోవాలనే ఆలోచనకు ఫుల్‌స్టాప్ పెట్టేశావు. సరైన నిర్ణయమే తీసుకున్నావు. అలాగే నేను కూడా నువ్వు నా జీవిత భాగస్వామివైతే బాగుంటుందని అనుకున్నాను. ప్రేమ గీమ అనే పెద్ద మాటలు చెప్పను గానీ నువ్వంటే నాకు ఇష్టం. చిన్నప్పట్నుంచి మనిద్దరం ఒకరికొకరు తెలుసు. మా అమ్మకు కూడా నువ్వంటే ఎంతో ఇష్టం... అదీగాక ఏ విషయాన్నైనా సూటిగా చెప్పే నీ తత్త్వం నాకు నచ్చుతుంది... చదువు, అందం, సంస్కారంతోపాటు బంధుత్వం కూడా ఉంది కాబట్టి నువ్వు నా భార్యవైతే బాగుంటుందని నేను అనుకున్నాను. నీ ఎంపిక తప్పని తేలింది. కానీ నా ఎంపిక సరైనదే అని ఇప్పటికీ నేను అనుకుంటున్నాను. అందుకే నువ్విష్టపడితే మనిద్దరం పెళ్లి చేసుకుందాం అంటున్నాను.. మీ నాన్నగారి జాబ్‌ను మీ తమ్ముడికే వచ్చేలా చేద్దాం.. ఒకవేళ పల్లెటూళ్లో ఉండడమే నీకభ్యంతరమైతే అందరం ఇక్కడికే వచ్చేద్దాం. ఊరు ఇక్కడికి మరీ దూరమేం కాదు కాబట్టి అక్కడికి వెళ్లి పనులు చూసుకొని రావడం నాకు పెద్ద కష్టమేమీ కాదు...’ చెప్పాడు రాంబాబు.
శాంతి ఏమీ మాట్లాడుకుండా అలా చూస్తూ ఉండిపోయేసరికి ‘నువ్వు ఇప్పటికప్పుడే చెప్పాల్సిన పనేమీ లేదు శాంతీ... బాగా ఆలోచించుకున్న తర్వాతే నీ నిర్ణయం చెప్పు...’ అన్నాడు.
‘అవసరం లేదు బావా... పల్లెటూళ్లో ఉండడానికి నాకేమీ అభ్యంతరం లేదు’ నెమ్మదిగా అంది శాంతి.
రాంబాబు మనసు ఆనంద తరంగమైంది. తామిద్దరి మధ్య వచ్చిన కమ్యూనికేషన్ గేప్‌ని నివారించగలిగితే అన్నీ చక్కబడతాయని ఊహించి తనకు ముందుగానే సమాచారమిచ్చి ఈ విధంగా ఇద్దర్నీ కలిపిన లతకు అతడు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు.
* * *
గోధూళి వేళ... కనుచూపు మేరలో పరచుకున్న పచ్చదనం... దూరం నించి తిరిగి వస్తున్న ఆలమందలు... పడమటి కొండల్లోకి జారిపోతున్న సూరీడు... మేడ మీద నిలబడి చూస్తున్న శాంతికి ఆ దృశ్యం ఎంతో కనువిందుగా అనిపించింది. అది వరకు కనిపించని అందాలేవో ఇప్పుడు మురిపిస్తూ అలరిస్తున్నాయి.
‘ఏం చూస్తున్నావు శాంతీ...?’ బావ మాట వినిపించడంతో వెనక్కి తిరిగి చూసింది.
‘ఈ సూర్యాస్తమయం.. పచ్చని పొలాలు... ఈ ప్రకృతి అన్నీ ఎంతో అందంగా ఉన్నాయి బావా... ఆస్వాదిస్తున్నాను’ నవ్వుతూ అంది శాంతి.
‘ఓహో... అమ్మాయిగారు పల్లెటూరి అందాలను ఇప్పటికి కానీ గుర్తించలేదన్న మాట’ కవ్వింపుగా అన్నాడు.
సమాధానం చెప్పకుండా నవ్వింది శాంతి. ‘అవును బావా.. ఈ పల్లెటూరి అందాలే కాదు.. అంతకంటే ఎన్నో రెట్లు అందమైన నీ మనసును కూడా గుర్తించలేకపోయాను.. ఇప్పుడే కదా ఆ అందం, ఆనందం ఏమిటో చవి చూస్తున్నాను’ మనసులోనే అనుకుందామె.

ఎం.రమేష్‌కుమార్
దేవాంగుల వీధి, ఇంటి నెం.26-160
నెల్లిమర్ల-535217. విజయనగరం జిల్లా
94924 54678

ఎం.రమేష్‌కుమార్