S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గెలిచేదెవరు? మనతో నిలిచేదెవరు?

అమెరికా శే్వతసౌధంలోకి
అడుగుపెట్టే కొత్త అధ్యక్షులు ఎవరు?
ఏ రాజకీయ అనుభవం లేని ఓ వ్యాపార దిగ్గజం, బుల్లితెరపై రియాల్టీ షో నిర్వాహకుడు, డెభ్బై ఏళ్ల రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలిచి సంచలనం సృష్టిస్తారా?
అపార రాజకీయ అనుభవం, గతంలో శే్వతసౌథంలో ప్రథమ మహిళగా గడపిన డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి, 69 ఏళ్ల హిల్లరి క్లింటన్ నెగ్గి, తొలి మహిళా అధ్యక్షురాలిగా పగ్గాలు చేపడతారా?
ఏది జరిగినా సంచలనమే.
* * *
అమెరికా అధ్యక్ష పీఠానికి జరుగుతున్న ఎన్నికలను ప్రపంచం యావత్తూ ఆసక్తిగా గమనిస్తోంది.
అమెరికా విధానాలు ప్రపంచ దేశాలపై చూపనున్న ప్రభావమే ఇందుకు కారణం.
ఈ వారం జరుగనున్న ఎన్నికలలో విజేత ఎవరైనా అక్కడి ఎన్నికల ప్రచార తీరు మాత్రం దారుణ పరాజయం పాలైంది. తన బలమేమిటో, తన విధానమేమిటో, వివరించి అర్థవంతమైన రాజకీయ చర్చ ద్వారా ప్రజల మనసులను గెలుచుకునే పద్ధతి నుంచి పక్కకు తప్పుకుని వ్యక్తిగత దూషణలతో అభ్యర్థులు సాగించిన ప్రచారం జనానికి వెగటు పుట్టించింది. వ్యక్తిగత దూషణలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఎన్నికల ప్రచారం హోరెత్తింది. అవినీతి ఆరోపణల మొదలుకొని ఈ ఎన్నికలలో రిగ్గింగ్, హింస చెలరేగే అవకాశం ఉందంటూ పంచాయతీ ఎన్నికల స్థాయి అనుమానాలు, భయాలు వ్యక్తం చేసే వరకు అగ్రరాజ్య ఎన్నికల ప్రచారం వెళ్లిపోయింది. అధ్యక్ష పదవికి జరుగుతున్న రేసులో ఉన్న డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ వీరిద్దరిలో ఎవరు గెలిచినా స్వల్ప తేడాతో మాత్రమే గెలుస్తారని ఎన్నికల సర్వేలు తేల్చి చెబుతున్నాయి. ఇద్దరిపై వచ్చిన విమర్శలు చూశాక ఎవరు గెలిస్తే మాత్రం ఒరిగేదేమిటన్న వైరాగ్యం ఓటర్లను ఇప్పటికే ఆవహించింది.
వ్యాపారానుభవం తప్ప రాజకీయ అనుభవం లేని ట్రంప్ నోటి దురుసుతనం, మహిళల పట్ల ఆయన వైఖరిని ప్రతిపక్షం చాకిరేవు పెడితే, రాజకీయ అనుభవం ఉండి మాత్రం అధికారిక సమాచారాన్ని అధికారిక ఈమెయిళ్ల ద్వారా కాకుండా స్వంత ఈ మెయిల్ ద్వారా పంపడం దేశద్రోహం కాక మరేవౌతుందంటూ హిల్లరీపై రిపబ్లికన్ పార్టీ ఆరోపణలు సంధించింది. అంతేకాదు డెమోక్రాట్ల పాలనలో అమెరికా అప్పుల కుప్పగా మారిందనీ, ఉపాధి అవకాశాలు హుఫ్‌మంటూ ఎగిరిపోయాయనీ ట్రంప్ ఆరోపణ. ఇదీ అగ్రరాజ్య ఎన్నికల కథ. ఇందులో మరో ఉపాఖ్యానమూ ఉంది. స్వేచ్ఛ, స్వాతంత్య్రం, అగ్రరాజ్యంగా తన స్థానం నిలుపుకోవడం వంటి అంశాలపై దృష్టి సారించే అమెరికా ఎన్నికలలో ఈసారి ట్రంప్ స్థానికులకు అవకాశాలన్న నినాదాన్ని లేవనెత్తి స్థానిక అమెరికన్లను ఆకర్షించడానికి ప్రయత్నించారు. వలసలతోనే బలపడిన అమెరికాలో ఇలాంటి నినాదమేమిటన్న వ్యాఖ్యలూ వినిపించాయి. డెమొక్రాట్లకు నల్లజాతి వారి ఓట్లు పడేట్టు చేయడానికి ఒబామా దంపతులు రంగంలోకి దిగితే, ఉపాధి అవకాశాల నినాదంతో యువతకు చేరువ కావడానికి ట్రంప్ ప్రయత్నించారు. హిల్లరీ గెలిస్తే రెండు శతాబ్దాల అమెరికా ప్రజాస్వామిక చరిత్రలో అధ్యక్ష పగ్గాలు అందుకునే తొలి మహిళ అవుతారు.
మనకేంటి?
అమెరికా ఎన్నికలలో ఎవరు గెలిస్తే భారత్‌తో సంబంధాలు ఎలా ఉంటాయన్న ఆసక్తికర చర్చ సహజంగానే ఉంటుంది. అయితే అధికారంలో ఉన్న అభ్యర్థి పార్టీ విధానాల కన్నా ఎప్పటికప్పుడు మారే అమెరికా స్వీయ వ్యూహాత్మక ప్రయోజనాలే ఆ దేశ విధానాలను నిర్ణయిస్తుంటాయని గత అనుభవాలను పరిశీలిస్తే తెలుస్తుంటుంది. ఆ వెలుగులోనే భారత - అమెరికా సంబంధాలు ఎలా ఉండబోతాయన్న దానిని అంచనా వేయడం భావ్యంగా ఉంటుంది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన అనంతరం ఈ ఏడు దశాబ్దాల చరిత్రలో అమెరికాలో 12 మంది అధ్యక్షులు అధికారంలో ఉన్నారు. వీరిలో ఆరుగురు డెమొక్రటిక్ పార్టీ వారైతే, మరో ఆరుగురు రిపబ్లికన్ పార్టీకి చెందినవారు. డెమోక్రటిక్ పార్టీ నుంచి హ్యారీ ట్రూమన్, జాన్ ఎఫ్. కెన్నడీ, ఎల్.బి.జాన్సన్, జిమీకార్టర్ (జూనియర్), బిల్ క్లింటన్, ఒబామాలు అధ్యక్షులైతే, ఐషన్ హోవర్, రిచర్డ్ నిక్సన్, రోనాల్డ్ రీగన్, జార్జి హెచ్.డబ్ల్యు బుష్, బుష్ (జూనియర్)లు రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్షులయ్యారు.
కొరుకుడు పడని భారత్
1945-53 మధ్య అమెరికా అధ్యక్షుడిగా డెమొక్రటిక్ పార్టీకి చెందిన ట్రూమన్ అధికారంలో ఉన్న సమయంలోనే ఇక్కడ బ్రిటీష్ వలస పాలన నుంచి భారతదేశం స్వాతంత్య్రాన్ని సాధించుకుంది. ప్రధానిగా పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ బాధ్యతలు స్వీకరించారు. 1949లో ప్రధాని నెహ్రూ అమెరికా సందర్శించారు. అయినా రెండు దేశాల మధ్య సానుకూల సంబంధాలేమీ ఏర్పడలేదు. వలస పాలన నుంచి విముక్తమైన దేశం కనుక ఇండియా, తాను చెప్పినట్టు నడుచుకుంటుందన్న భావనలో ఉన్న అమెరికాకు ఇండియా వైఖరి కొరుకుడు పడలేదు. నాటి సోవియట్ యూనియన్‌ను అదుపు చేయడానికి అమెరికా అనుసరించిన వ్యూహాత్మక ఎత్తుగడలకు భారత్ దూరంగా ఉండడం అమెరికాకు మింగుడు పడలేదు.
పాకిస్తాన్‌తో చెలిమి
దక్షిణాసియాలో భారత శక్తిని అంచనా వేసిన అమెరికా ఆ తర్వాత 1954లో రిపబ్లికన్ ఐషన్ హోవర్ హయాంలో పాకిస్తాన్‌కు ఆయుధాల సరఫరాకు అంగీకరించింది. అమెరికా - పాకిస్తాన్‌ల మధ్య కుదిరిన పరస్పర రక్షణ సహాయ ఒప్పందం ఈ ప్రాంతంలో కొత్త సమస్యలు తెచ్చిపెట్టింది. అది భారత్ - అమెరికాల మధ్య సంబంధాలకు అడ్డంకిగా నిలిచింది. సోవియట్ యూనియన్‌ను ఎదుర్కోవడానికి ఇండియాను ఉపయోగించుకోవాలన్న అమెరికా ఆశలు నెరవేరలేదు. దీనితో పాక్‌ను పెంచి పోషించి ఇండియా ప్రాబల్యానికి గండి కొట్టాలని అమెరికా భావించింది. అందుకు అనుగుణంగానే నాటి రిపబ్లికన్ ఐషన్ హోవర్ నిర్ణయాలు తీసుకున్నారు. పాక్‌కు మిలిటరీ సాయం వల్ల భారత అమెరికా సంబంధాలు మరింత దెబ్బతినకుండా నష్ట నివారణ చర్యలు ప్రారంభించిన హోవర్, నాటి ప్రధాని నెహ్రూకు రాసిన లేఖలో, పాకిస్తాన్‌కు ఆయుధాలు సరఫరా చేసింది ఇండియాకు వ్యతిరేకంగా కాదని చెప్పారు. ఒకవేళ పాకిస్తాన్ కట్టుతప్పి ఇండియాకు వ్యతిరేకంగా దురాక్రమణకు ఈ ఆయుధాలు ఉపయోగిస్తే అప్పుడు భారత్ విజ్ఞప్తిని సానుభూతితో మన్నించి సహాయపడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పుకున్నారు. పాక్‌తో ఆయుధ ఒప్పందం కుదుర్చుకున్న సంవత్సరంలోనే అమెరికాలోని మిగులు ఆహార ఉత్పత్తులను ఇతర దేశాలకు సరఫరా చేయడానికి వీలు కల్పించే అగ్రికల్చరల్ ట్రేడ్ డెవలప్‌మెంట్ అసిస్టెన్స్ యాక్ట్‌ను అమెరికా అమలులోకి తెచ్చింది. దీనినే పబ్లిక్ లా 480 లేదా పి.ఎల్. 480 అన్నారు. దీని కింద మనకు ఆహార ఉత్పత్తులను ఇవ్వడానికి అమెరికా ముందుకు వచ్చింది. కరవుతో ఇబ్బందులు పడుతున్న ఇండియాకు ఆహార ఉత్పత్తులు అందించడం ద్వారా తన మాట వినేట్టు చేసుకోవడం, రెండోది తన మిగులు వ్యవసాయ ఉత్పత్తులను వదిలించుకోవడం లక్ష్యంగా ఇది సాగింది. ఈ నేపథ్యంలోనే ఆ తర్వాత ఆహార ఉత్పత్తుల సరఫరాకూ పేచీలు పెట్టి అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకునేలా చేయాలని అమెరికా పన్నిన వ్యూహాన్ని భారత్ సాగనివ్వలేదు. పాక్‌కు ఆయుధాలు, మనకు ఆహార ఉత్పత్తుల సరఫరా వెనుక అమెరికా వ్యూహాన్ని భారత్ సరిగానే అర్థం చేసుకోగలిగింది. ఆ తర్వాత ఆహార ఉత్పత్తులలో స్వావలంబనకు చర్యలు చేపట్టింది.
ఆ తర్వాత డెమోక్రట్ జాన్ ఎఫ్ కెన్నడీ అధికార పగ్గాలు చేపట్టారు. 1962లో భారత్ చైనా యుద్ధం సంభవించినపుడు, ఈ యుద్ధంలో చైనాను నియంత్రించడం అవసరమని భావించిన అమెరికా భారత్‌కు పరిమిత ఆయుధాలు, ఆర్థిక సాయానికి ముందుకు వచ్చింది. 1964లో డెమోక్రట్ ఎల్.బి.జాన్సన్ అధికారంలోకి రాగానే విశాఖలో ఎరువుల కర్మాగారం ఏర్పాటుకు రుణం అందించేందుకు ముందుకు వచ్చారు. వరుసగా రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చిన డెమోక్రట్లతో రెండు దేశాల మధ్య సంబంధాలు బాగుంటాయనుకుంటున్న తరుణంలో 1965లో భారత్ - పాకిస్తాన్ యుద్ధం సంభవించింది. డెమోక్రట్ జాన్సన్ పాకిస్తాన్‌కు సానుకూలంగా వ్యవహరించారు. ఇంతకు ముందే అమెరికా నుంచి సమకూర్చుకున్న ఆయుధాలను భారత్‌పై పాకిస్తాన్ ఉపయోగించింది. ఆ రకంగా గతంలో పాక్‌కు ఆయుధాలు సమకూర్చే సమయంలో రిపబ్లికన్ ఐషన్ హోవర్ భారత్‌కు ఇచ్చిన హామీ గాలికి ఎగిరిపోయినట్టయింది. అధ్యక్షుడు డెమొక్రటిక్ పార్టీకి చెందిన ఎల్.బి.జాన్సన్ కూడా పాక్‌ను నిలువరించే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. అంతేకాదు 1967లో నాగా తిరుగుబాటు నాయకుడు ఫిజో అమెరికాలో తలదాచుకోవడం రెండు దేశాల సంబంధాలలో ఇబ్బందికర పరిస్థితిని కలిగించింది.
అధికారంలో ఎవరున్నా...
భారత స్వాతంత్య్రానంతరం తొలి రెండు దశాబ్దాలలోనే అమెరికాతో సంబంధాల విషయంలో భారత్ ఎన్నో పాఠాలు నేర్చుకుంది. దక్షిణాసియాలో ఆయుధాల సరఫరాకు పాకిస్తాన్‌ను, ఆర్థిక, వ్యాపార కార్యకలాపాలకు ఇండియాను వాడుకునే విధానాన్ని అమెరికా చక్కగా పెంచి పోషించిందన్నది తేలిపోయింది. ఇందులో అమెరికా అధ్యక్షులుగా ఏ పార్టీ వారున్నా పెద్ద తేడా ఏమీ లేదు. 1969-74 మధ్య రిపబ్లికన్ పార్టీకి చెందిన నిక్సన్ అధికార పగ్గాలు చేపట్టిన తొలి నాళ్లలో భారత్ - అమెరికా సంబంధాలు సజావుగానే కనిపించాయి. కానీ జమ్మూ కాశ్మీర్ విషయంలో అమెరికా పాకిస్తాన్‌ను వెనకేసుకు రావడం మానలేకపోయింది. 1968 నాటి అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పిటి)పై భారత్‌తో సంతకం చేయించాలని అమెరికా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బంగ్లాదేశ్ విముక్తి పోరాటం సమయంలో రిపబ్లికన్ నిక్సన్ పాక్‌కు మద్దతు నివ్వడమే కాకుండా ఆ దేశానికి నైతిక మద్దతుగా అమెరికాకు చెందిన సెవెన్త్ ప్లీట్‌ను బంగాళాఖాతంలో సన్నద్ధంగా ఉంచారు. 1971 నవంబర్‌లో నిక్సన్‌తో ఇందిరాగాంధీ సమావేశమై ఉపఖండంలో పరిస్థితులను చర్చించినా నిక్సన్ పాక్ వైపే మొగ్గు చూపారు. నిక్సన్ తర్వాత అధికారంలోకి వచ్చిన అధ్యక్షుడు గెరాల్డ్ ఫోర్డ్ కూడా రిపబ్లికన్ పార్టీకి చెందినవారే. ఫోర్డ్ అధికారంలోకి రాగానే భారత్ - అమెరికాల మధ్య ఆర్థిక, వాణిజ్య, శాస్త్ర, సాంకేతిక అంశాలకు సంబంధించి సంయుక్త కమిషన్‌ను ఏర్పాటు చేశారు. 1974 మే లో భారత్‌లో తొలి అణు పరీక్ష నిర్వహించిన వెంటనే పాక్‌కు ఆయుధ సరఫరా విషయంలో అంతకు ముందు విధించిన ఆంక్షలను అమెరికా సడలించి ఆయుధ సరఫరా కొనసాగించింది.
1977లో అధికారంలోకి వచ్చిన డెమొక్రాట్ జిమ్మి కార్టర్ హయాంలోనే భారత్‌లోనూ అధికార మార్పిడి జరిగింది. తారాపోర్ అణు విద్యుత్ కర్మాగారానికి శుద్ధిచేసిన యురేనియం సరఫరా చేయాల్సిందిగా భారత్ కోరినా అణు రక్షణల విషయంలో భారత్ వాదనలు కార్టర్‌ను సంతృప్తి పరచలేక పోయాయి. అమెరికా నుంచి తగినంత యురేనియం సరఫరా లేకపోవడంతో ఆ తర్వాత మన దేశం ఫ్రాన్స్‌తో ఒప్పందం చేసుకోవలసి వచ్చింది. డెమొక్రట్ జిమ్మికార్టర్ హయాంలోనే హిందూ మహాసముద్రంలో డిగాగోర్షియా స్థావరాన్ని పూర్తి చేసుకుంది. ఇది రిపబ్లికన్ నిక్సన్ విధానాలకు కొనసాగింపు మాత్రమే. భారత్‌తో సహా హిందూ మహాసముద్ర దేశాలన్నీ దీనిని వ్యతిరేకించినా అమెరికా దీనిని పట్టించుకోలేదు.
సోవియట్ పతనం, సరళీకృత విధానాల శకం...
’80వ దశకంలో భారత్ అమెరికాల మధ్య వాణిజ్య బంధం విస్తరించింది. రిపబ్లికన్ రీగన్ హయాంలో అమెరికా జాయింట్ వెంచర్లను భారత్ స్వాగతించింది. రాజీవ్‌గాంధీ హయాంలో ఇరు దేశాల మధ్య అంతరిక్ష రంగంలో సహకారం కుదిరింది. 1989లో వి.పి.సింగ్ అధికారంలోకి రాగానే, జనతాపార్టీ హయాంలో వెలుపలకు వెళ్లిన పెప్సిని దేశీయ మార్కెట్‌లోకి అనుమతించారు.
1991 జూన్‌లో పి.వి.నరసింహారావు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్ అమెరికా సంబంధాలు కొత్త పుంతలు తొక్కాయి. దీనికి కారణం మన దేశం సరళీకృత ఆర్థిక విధానాలకు తలుపులు తీయడమే. అప్పుడు అమెరికా అధ్యక్షుడుగా రిపబ్లికన్ సీనియర్ బుష్ అధికారంలో ఉన్నారు. అప్పటికే సోవియట్ యూనియన్ పతనం కావడంతో అమెరికాకు భారత్‌తో అంతా లాభమే తప్ప నష్టం ఏదీ కనిపించలేదు. ఇక అక్కడి నుంచి భారత్‌ను ఒక మంచి మార్కెట్‌గా అమెరికా చూడడం మొదలుపెట్టింది.
1998లో వాజ్‌పేయి ప్రభుత్వ అధికారంలో ఉన్న సమయంలో అమెరికాలో డెమొక్రటిక్ పార్టీకి చెందిన బిల్‌క్లింటన్ అధ్యక్షుడిగా ఉన్నారు. 1998లో భారత్ స్వీయ రక్షణ కోసం అణు సామర్థ్యాన్ని సంతరించుకునే పరీక్ష నిర్వహించుకుంటే క్లింటన్ ప్రభుత్వం వెంటనే భారత్‌పై ఆర్థిక ఆంక్షలను విధించింది. అసలు దక్షిణాసియాలో భారత్ అణు పరీక్ష నిర్ణయాన్ని తీసుకోవడం వెనుక అసలు కారణం పాకిస్తాన్, చైనాల దుందుడుకు చర్యలన్న వాస్తవాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా భారత్‌పై ఏకపక్షంగా ఆర్థిక ఆంక్షలను క్లింటన్ సర్కారు అమలు చేసింది కానీ ఇదంతా గతం.
కొత్త సహస్రాబ్దిలో మారిన వైఖరి...
రెండు వేల సంవత్సరం తర్వాత నుంచి ప్రపంచవ్యాప్తంగా శర వేగంతో పలు మార్పులు సంభవించాయి. ఆర్థిక అంశాలు ప్రాధాన్యతను సంతరించుకోవడంతోపాటు అంతర్జాతీయంగా ఉగ్రవాద పెనుభూతం వివిధ దేశాలను ముప్పుతిప్పలు పెడుతోంది. ఉగ్రవాదంపై ఉమ్మడిపోరు అన్నది వినడానికి బాగానే ఉన్నా, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశాలను ఏకాకి చేయడం అంత సులభంగా కనిపించడంలేదు. దీనికి కారణం గతంలో ఈ దేశాలు ఎవరి మద్దతుతో ఎదిగాయో అందరికీ తెలిసిందే. సోవియట్ యూనియన్ పతనం అనంతరం చైనా ఆర్థికంగా సైనిక పరంగా బలపడుతూ వస్తోంది. చైనా ప్రపంచ మార్కెట్లను చుట్టుముట్టేస్తున్నది. పాకిస్తాన్ ఉగ్రవాద పడగ నీడన కాలక్షేపం చేస్తున్నది. కొన్ని దశాబ్దాలుగా పాక్ వెంట నడిచినట్టే ఇప్పుడూ నడుస్తామంటే అమెరికా సమాజం అంగీకరించే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితులలో అమెరికా విశ్వసించదగ్గ నేస్తం భారత్. పటుతర ప్రజాస్వామిక పునాదులపై సుసంపన్న వారసత్వంతో గొప్ప ఆర్థిక శక్తిగా ఎదగనున్న భారత్‌తో బంధం అమెరికాకు అన్ని రకాల ప్రయోజనకరం. ప్రధాని నరేంద్రమోదీ చెప్పినట్టు భారత్ సాఫ్ట్‌వేర్ ఎగుమతులలో దూసుకుపోతుంటే, పొరుగున ఉన్న పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తోంది. కనుక అమెరికాలో ఎవరు అధికారంలోకి వచ్చినా గతంలోలా పాకిస్తాన్‌ను నమ్ముకుని ముందుకు సాగే పరిస్థితి లేదు. అలాగే భారత్‌తో వాణిజ్య బంధం ఉభయులకూ శ్రేయోదాయకం.
భారత్‌ను కాదనగల స్థితి ఏదీ...
ఎన్నికల వేళ అమెరికన్ ఓటర్లను ఆకర్షించడానికి స్థానికత అంశమో లేక ఇతరేతర భావోద్వేగ అంశాలు చర్చకు రావచ్చు గాక దక్షిణాసియాలో భారత్‌ను ఇబ్బంది పెట్టే నిర్ణయాలు ఎవరు తీసుకున్నా అవి వారికే చేటు చేస్తాయని గత ఏడు దశాబ్దాల చరిత్ర తెలియజేస్తోంది. చైనా దూకుడుకు కళ్లెం వేయాలన్నా, ఉగ్రవాద శక్తులకు ముకుతాడు పడాలన్నా అది భారత్ వంటి దేశంతో కలిసి నడవడంతోనే సాధ్యం. ఏడు దశాబ్దాలు పాక్‌తో చెలిమి చేసినా అమెరికాకు మిగిలిందేమిటో అమెరికన్ సమాజం ఇప్పటికే బాగా గుర్తించింది. ఆర్థిక మహాశక్తిగా త్వరితగతిన ఎదుగుతున్న భారత్ గతంలో ఎన్నడూ లేనంత అనుకూల పరిస్థితిలో ఉన్న వాస్తవాన్ని ప్రపంచ దేశాలు గుర్తించాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో విజయం సాధించి హిల్లరీ అధికారాన్ని చేపట్టినా, లేక ట్రంప్ పాలనా పగ్గాలు చేపట్టినా భారత్ ప్రయోజనాలకు వచ్చే ఢోకా ఏదీ ఉండబోదని గుర్తించాలి.
ఎన్నడూ లేని రీతిలో ఇప్పుడు ప్రపంచ దేశాలు అమెరికా ఎన్నికలపై దృష్టి సారించాయి. వలసలు, సరిహద్దులు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు, తుపాకీ సంస్కృతి తీవ్రవాదంపై డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దీనికి కారణం. వేగంగా ఎదుగుతున్న చైనా, మారుతున్న అంతర్జాతీయ సమీకరణలు అమెరికాకు చికాకు తెప్పిస్తున్న వేళ జరుగుతున్న ఈ ఎన్నికల ఫలితాలపై అందుకే ఆసక్తి రేగుతోంది. ఇంతకీ అమెరికా అధ్యక్ష పీఠంపై ఎవరుంటే మనకు లాభం? భారత్‌ను కాదని అమెరికా కొత్త అధ్యక్షులు పావులు కదపగలరా? తీవ్రవాదం విసిరిన సవాళ్ల మధ్య మనను కాదని పోరాటం చేయడం వారికి సాధ్యమేనా? స్వీయప్రయోజనాలే లక్ష్యంగా అడుగులువేసే అమెరికా ధోరణి మన ప్రయోజనాలను ఏ మేరకు కాపాడుతుందన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.

విజేత ఎవరు?
* అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈసారి ఎన్నడూలేని రీతిలో ఆసక్తి రేపాయి. నవంబర్ 8న ఈ ఎన్నికలు జరగనున్నాయి. అమెరికా 45వ అధ్యక్షుడు, 48వ ఉపాధ్యక్షుని కోసం ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రైమరి, కాకసస్ ఎన్నికలు పూర్తయి, ఇప్పుడు ఎలక్టోరల్ కాలేజ్ ఎన్నికలు జరుగనున్నాయి.
* ఎప్పటిలా ఈసారి కూడా ప్రధానంగా డెమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీల మధ్యే ప్రధాన పోటీ జరగబోతోంది. కానీ రంగంలో మరికొన్ని చిన్నాచితకా పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు. అధ్యక్షపదవికి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా హిల్లరీ క్లింటన్, ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా వర్జీనియా సెనేటర్ టిమ్ కెయిన్ పోటీ పడుతూండగా వారికి పోటీగా రిపబ్లికన్ పార్టీ తరపున డొనాల్డ్ ట్రంప్, ఇండియానా గవర్నర్ మైక్ పెన్స్ బరిలో ఉన్నారు. గ్రీన్ పార్టీ తరపున మాజీ ఫిజిషియన్ జిల్‌స్టీన్, లిబరటేరియన్ పార్టీ తరపున న్యూమెక్సికో మాజీ గవర్నర్ గారీ జాన్సన్ సహా మరో 24మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు.
* ఈ ఎన్నికల్లో ట్రంప్ నెగ్గితే ఇప్పటివరకు అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైనవారిలో అతిఎక్కువ వయస్సున్న వ్యక్తిగా రికార్డు నమోదవుతుంది. అదే క్లింటన్ ఎన్నికైతే అమెరికా చరిత్రలో తొలిమహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించినట్లవుతుంది.
* ట్రంప్ ప్రచారంలో ప్రాంతీయ, జాతి, వర్ణ, మత విద్వేషం రెచ్చగొట్టేలా వాదనలు కొనసాగాయి. మహిళలను కించపరిచేలా మాట్లాడి వివాదాల్లో చిక్కుకున్నారు. ఆహార్యం, భావవ్యక్తీకరణ, భాష విషయంలో ట్రంప్ ధోరణి విమర్శలపాలైంది. పన్ను ఎగవేతపై దీటైన జవాబివ్వలేకపోయారు. మెక్సికోతో సరిహద్దు గోడ, ముస్లింలకు అమెరికాలో ప్రవేశం, రష్యాతో చెలిమికి తహతహలాడటం, ఐసిస్, మధ్యప్రాచ్యంపై విపరీత ధోరణులు చాలామందికి నచ్చని అంశాలు. అయితే మహిళలపై వ్యాఖ్యలు తప్ప మిగతా అంశాలన్నీ దేశీయంగా, ఆమెరికా స్వాభిమానులను, శే్వతజాతీయులను ఆకట్టుకున్నాయన్న అంచనాలున్నాయి. ఇవి అనూహ్యంగా ఆయనకు మేలు చేస్తాయని భావిస్తున్నారు.
* అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే ‘డిబేట్’లలో (మూడుసార్లు నిర్వహించారు) హిల్లరీ క్లింటన్ స్పష్టమైన ఆధిక్యం సాధించారు. రాజకీయ అనుభవ లేమి ట్రంప్‌కు మైనస్‌పాయింట్‌గా మారింది. అయితే తొలి డిబేట్‌లోకన్నా రెండు, మూడు డిబేట్‌లలో ట్రంప్ చెప్పుకోదగ్గరీతిలో పుంజుకున్నారు. అయితే క్లింటన్ ఆధిక్యత కొనసాగింది. ఆదాయపన్ను ఎగవేతపై స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోవడం ట్రంప్‌కు సమస్యే.
* మధ్యతరగతి, యువత, నల్లజాతీయులు, మహిళల మద్దతు తప్పక లభిస్తుందన్న ఆశలు హిల్లరీక్లింటన్ శిబిరానికి ఉన్నాయి. ఈమెయిల్స్ నిర్వహణ వివాదంలో ఆమె తన పొరపాటును ఒప్పుకున్నారు. కానీ అది తెలిసి చేసిన తప్పుగా ట్రంప్ గట్టిగా చేస్తున్న విమర్శకు దీటైన జవాబివ్వలేకపోతున్నారు. ఎన్నికల వేళ ఎన్ని విమర్శలు చేసుకున్నా ఫలితాలు వచ్చాక వాటిని ఆమోదించడం, అంగీకరించడం అమెరికా ప్రజాస్వామ్యంలో శతాబ్దాలుగా వస్తున్న సంప్రదాయం. కానీ తాను ముందే ఏ విషయం చెప్పనని, గెలిస్తే ఫలితాలను ఆమోదిస్తానని, ఓడితే ఏం చేస్తానన్నది సస్పెన్స్ అని ట్రంప్ చేసిన వ్యాఖ్య దుమారాన్ని రేపాయి.
* అమెరికాలో ప్రధాన పత్రికలు, టీవీ ఛానళ్లు రిపబ్లికన్ పార్టీకి వత్తాసు పలికే పత్రికలు సైతం ఈసారి అతడి విధానాలను తూర్పారపట్టాయి. సొంత పార్టీనుంచే గట్టి విమర్శలను ఎదుర్కొంటున్న ట్రంప్ అయివారిపైన, కానివారిపైనా నోరుపారేసుకుంటున్నారు.
* అమెరికా ఎన్నికల్లో ఎన్నడూ లేని రీతిలో ఈసారి వ్యక్తిగత, నిందాపూర్వక, దిగజారుడు ఆరోపణలతో ఇరుపక్షాలు విమర్శలు గుప్పించాయి. తలకట్టు, ఆరోగ్యం, లైంగిక అంశాలు, భార్యభర్తలు, కుటుంబం ఇలా అన్ని అంశాల్లోనూ విచ్చలవిడిగా విమర్శించుకున్నారు. ఇది జుగుప్సాకరమైన రీతిలో సాగడం గమనార్హం.
* ఈ ఎన్నికల వేళ హిల్లరీ, ట్రంప్ ఒకేఒక్కసారి పరస్పరం గౌరవపూర్వకమైన వ్యాఖ్యలతో ఆకట్టుకున్నారు. రెండవ డిబేట్ సందర్భంగా ప్రత్యర్థిలో మీకు నచ్చిన గుణం ఏమిటన్నదానికి ఇద్దరూ నిజాయితీగా చేసిన వ్యాఖ్యలు ఓ కొసమెరుపు. పోరాడేతత్వం హిల్లరీ సొంతమని ట్రంప్ అంటే, అతడికి చక్కటి పిల్లలు ఉన్నారని, వారే అతడి బలమని హిల్లరీ వ్యాఖ్యానించారు.
* హిల్లరీకి మద్దతుగా ప్రస్తుత అధ్యక్షుడు ఒబామా దంపతులు ప్రచారంలో పాల్గొంటున్నారు. కానీ ట్రంప్ తరపున చెప్పుకోదగ్గ (ఆ పార్టీ) స్థాయి నేతలు పాల్గొనడం లేదు. అన్ని అంశాలూ హిల్లరీని విజయంవైపు నడిపిస్తాయని చెబుతున్నా, ట్రంప్‌ను కంపు అని చాలామంది విమర్శిస్తున్నా కచ్చితంగా ఫలానావారే గెలుస్తారని ఎవరూ విశ్వాసంతో చెప్పలేకపోవడమే ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల విశేషం.
*
నువ్వా? నేనా?
ఒపీనియన్ పోల్స్, వివిధ సర్వేల ప్రకారం ప్రైమరీ ఎన్నికల వేళ నువ్వానేనా అన్నరీతిలో ట్రంప్, హిల్లరీల మధ్య కొనసాగిన పోటీ ఆసక్తికలిగించింది. డిబేట్లు పూర్తయ్యేసరికి హిల్లరీకి స్పష్టమైన ఆధిక్యం వచ్చింది. ట్రంప్‌కన్నా హిల్లరీ కనీసం 5-12 పాయింట్ల ముందంజలో ఉంది. కానీ నవంబర్ 1 నాటికి వచ్చిన సర్వే ప్రకారం వారి మధ్య పోటీ రసవత్తరంగానే ఉంది. హిల్లరీక్లింటన్ ట్రంప్‌పై కేవలం 1 నుంచి 2 పాయింట్లు మాత్రమే ముందంజలో ఉన్నట్లు తేలింది. గతంలో ఆమె పదవిలో ఉన్నప్పుడు అధికారిక సమాచారాన్ని సొంత ఈమెయళ్ల ద్వారా పంపినట్టు వచ్చిన ఆరోపణలపై మళ్లీ దర్యాప్తు చేస్తామని ఎఫ్‌బిఐ ప్రకటించటంతో హిల్లరీ ఆధిక్యం బాగా తగ్గిపోయంది. ఈ పరిణామం డెమొక్రటిక్ పార్టీకి ఆందోళన కలిగిస్తోంది. తాజా సర్వే ప్రకారం హిల్లరీ, ట్రంప్ కన్నా ఒక్క శాతంలోపే ఆధిక్యంలో ఉన్నారు. నిజానికి ట్రంప్ స్వల్ప ఆధిక్యం సాధించినట్లు వార్తలు వచ్చాయ. అసలు డిబేట్లకు సంబంధించిన ప్రశ్నలు హిల్లరీకి ముందే అందాయని వస్తున్న ఆరోపణలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయ. మరో రెండు మూడు రోజుల్లో జరిగే పరిణామాలు అసలు విజేతను నిర్ణయస్తాయ.

-రేవూరు ఉమామహేశ్వరరావు