S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మన లలిత సంగీతం

విన్న వెంటనే ఆనందాన్నిచ్చేది సంగీతం. సాహిత్యం ఆలోచించిన కొద్దీ అమృతమయమైన అనుభూతిస్తుంది. సంగీతానికి.. సొంపు కూర్చేది.. సాహిత్యం. సాహిత్యానికి ఇంపు కూర్చేది సంగీతం. శుద్ధమైన కర్ణాటక సంగీతానికైనా, సరళంగా వినబడే లలిత సంగీతానికైనా ఇదే లక్ష్యం. స్వతంత్రం రాకముందు మనకు రేడియో కేంద్రమంటూ లేదు.
మద్రాసు కేంద్రం నుంచే తెలుగు కార్యక్రమాలు కూడా ప్రసారమవుతూ ఉండేవి. 1938 సం.లో మద్రాస్ కేంద్రం వచ్చింది.
1939 సం.లో మల్లవరపు విశే్వశ్వరరావుగారు ‘బిల్హణీయం’ అనే సంగీత రూపకాన్ని రచిస్తే, ‘బాలకవి’ బి.వి.నరసింహారావు సంగీతం సమకూర్చారు. ఆ రూపకం మదరాసు రేడియో కేంద్రం నుండి ప్రసారమవ్వటంతో సంగీత రూపకాల ప్రస్థానం ప్రారంభమైంది.
క్రమంగా లలిత గీతాలు ప్రసారమవటం మొదలయ్యాయి. 1940 ప్రాంతంలో జరిగిన సంగతి. మదరాసు రేడియో కేంద్రం డైరెక్టర్ ఎస్.ఎన్.మూర్తిగారు, ఒక ఫిలిమ్ రికార్డింగ్ థియేటర్‌కి వెళ్లి సాలూరు రాజేశ్వరరావు, ఆర్.బాలసరస్వతి గార్లను కలిసి, ‘మీరిద్దరూ మా కేంద్రానికి వచ్చి కొన్ని లలిత గీతాలు పాడండి. మా కేంద్రం నుండి లలిత గీతాలు ప్రసారం చేయాలనుకుంటున్నాం’ అన్నారట.
హైదరాబాద్‌లో ‘దక్కను’ రేడియో కేంద్రం ఉన్నా, అది నిజాం ప్రభువుల పాలనలో వుంటూ తెలుగుకు చాలా తక్కువ ప్రాముఖ్యత ఇవ్వటంవల్ల, మద్రాసు కేంద్రమొక్కటే అలా కొన్ని తెలుగు కార్యక్రమాలను ప్రసారం చేయటం ప్రారంభించింది.
‘గీతావళి’ అనే పేరుతో లలిత సంగీత కార్యక్రమాలుండేవి. మద్రాసు లలిత సంగీత శాఖకు ఇన్‌చార్జీ డా.బాలాంత్రపు రజనీకాంతరావుగారు. శాస్ర్తియ సంగీత నిర్వాహకులుగా వోలేటి వెంకటేశ్వర్లు, లలిత సంగీత శాఖకు బాలమురళీకృష్ణ, రజని, పాలగుమ్మి విశ్వనాథంలను నియమించారు. అందరూ హేమాహేమీలే.
సుప్రసిద్ధ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వర్రావు, బాలసరస్వతీ దేవి, ఎస్.వరలక్ష్మి, సీత, అనసూయ, టంగుటూరి సూర్యకుమారి, ఎం.ఎస్.రామారావు, భానుమతి, వక్కలంక సరళ, జి.వైదేహి, కోవెల శాంత, బి.గోపాలం, రజని, మల్లిక మొదలైన అనేక మంది గాయనీ గాయకులు అప్పట్లో ఎన్నో మధురాతి మధురమైన గీతాలు పాడారు.
అలా పాడిన పాటలన్నీ తెలుగు రేడియో కేంద్రాల్లో టి.ఎస్.రికార్డులుగా (్ఘశఒషూజఔఆజ్యశ ఒళ్పూజషళ గళష్యూజూఒ) భద్రపరచబడి ఉన్నాయి.
ఉదయం వేళల్లో ఇటీవల ఈ పాటలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతూ వినటానికి నోచుకుంటున్నాయి. ఓపికతో వినే ప్రయత్నం చేస్తే, రణగొణ ధ్వనుల కాలుష్యంతో నిండిపోయిన చౌకబారు పాటలకూ, వీటికీగల తేడా ఏమిటో గమనించగలం.
ఒకప్పుడు కేంద్ర సమాచార ప్రసార శాఖామాత్యులు కేస్కర్ రేడియో కేంద్రాల్లో సినిమా పాటల ప్రసార నిడివిని తగ్గించమని ఆదేశాలివ్వటంవల్ల ఆ స్థానాన్ని లలిత గీతాలతో భర్తీ చేయమని ఆయన అభిప్రాయంగా భావించిన అధికారులు ఈ లలిత సంగీత గానానికి మొగ్గు చూపారు. ఆయా కేంద్రాల్లో లలిత సంగీత ప్రయోక్తలను నియమించారు. ఆయా భాషలలో ఆధునిక గేయాలను, భావగీతాలను రచించిన కవుల గేయాలను, రాయల్టీ పద్ధతిపై స్వీకరించేవారు.
వాటిని వివిధ లలిత సంగీత ప్రయోక్తలకిచ్చి, వాటికి సంగీతం కూర్చి, సమర్థులైన గాయనీ గాయకులచేత పాడించేవారు.
అంతేకాదు. దీని కోసం ఒక వాద్యబృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. మద్రాసు కేంద్రంగా ఈ వాద్య బృందానికి డా.బాలాంత్రపు రజనీకాంతరావు ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా, లలిత సంగీత శాఖ ప్రారంభమైంది.
సహాయకులుగా మల్లిక్ (కందుల మల్లికార్జునరావు), ఎ.నారాయణయ్యర్ (గోటు వాద్యవిద్వాంసులు), సిహెచ్.గోపాలశర్మ (వయొలిన్), సిహెచ్.కామేశ్వరశర్మ (వీణ) మొదలైన 15 మంది కళాకారులతో ఈ బృందం ఉండేది.
నిజానికి కేస్కర్ ఆదేశాలకు ముందే మద్రాసు కేంద్రంలో లలిత సంగీత సృష్టి ప్రారంభమైంది.
‘రమ్యాలోకం’ (సంగీతంలో ప్రయోగాలు) అని ఒక ప్రత్యేక కార్యక్రమం ప్రసారమయ్యేది.
రూపకల్పన చేసినది రజనీయే.
ఈ రమ్యాలోకంలో శ్రీమతులు వసుంధరాదేవి (సినీ నటి వైజయంతిమాల తల్లి) డి.కె.పట్టమ్మాళ్, టంగుటూరి సూర్యకుమారి, రావు బాలసరస్వతీ దేవి, వాద్య విద్వాంసులైన శ్రీ ఈమని శంకరశాస్ర్తీ, శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు, ఎస్.బాలచందర్, ఇంకా ఇతర వాద్య బృందం.
1950 ప్రాంతానికి రేడియో కేంద్రాలకు లలిత శాఖలు ఏర్పడటంతో లలిత గీతాలు, భావ గీతాల ప్రసారాలు పెరుగుతూ ప్రసిద్ధులైన గాయనీ గాయకులతో ఈ భావగీతాలు రికార్డు చేయటం ప్రారంభించారు. ఆకాశవాణి లలిత సంగీతం ఆడిషన్ కోసం నిర్దేశించిన నియమాలు, నిబంధనలూ ఈ గాయనీ గాయకుల సంగీత ప్రమాణాలాధారంగా, ప్రాతిపదికపై ఏర్పడినవే.
లలిత సంగీతంలో ఆడిషన్ నిర్వహించి ‘ఘంటసాల’ను ఎంపిక చేసినది డా.బాలాంత్రపు రజనీకాంతరావే. లలిత సంగీతానికి అదో స్వర్ణయుగం. శాస్ర్తియ సంగీత విద్వాంసులు సైతం ఈ పాటలను ఆసక్తిగా వినేవారు. ఒకవైపు ఘంటసాల, మరోవైపు రాజేశ్వర్రావ్, ఆర్.బాలసరస్వతి విస్తృతంగా పాటలు పాడేవారు. వీరితోపాటు ఎస్.వరలక్ష్మి (సినీ నటి), ఎ.పి.కోమల, సుమిత్ర, జి.వైదేహి, మల్లిక్, పి.సుశీల, లీల, ఎ.ఎం.రాజా, పిఠాపురం, నాగేశ్వర్రావు, బి.గోపాలం, చిత్తరంజన్ అనేకమంది మరపురాని మధురమైన పాటలు పాడారు.
లబ్దప్రతిష్టులైన కుమారి శ్రీరంగం గోపాలరత్నం, వింజమూరి లక్ష్మి, వేదవతీ ప్రభాకరరావు, వి.బి.కనకదుర్గ, ఎం.వి.రమణమూర్తి, ఎం.ఎస్.రామారావు, మోహన్‌రాజు, ఎన్‌సివి జగన్నాథాచార్యులు మొదలైన వారంతా లలిత గీతాలెన్నింటికో ప్రాణప్రతిష్ఠ చేసినవారే.
డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ పాడిన పాటలు వాటికవే సాటి.
‘నిష్టగా, దీక్షగా సంగీతం నేర్చుకుంటే తప్ప ఇటువంటి పాటలు పాడలేం సుమా!’ అనుకుంటూ శ్రోతలు ఆసక్తిగా వినేవారు.
వీరందరూ... రేడియోకి సంగీత గౌరవాన్ని ఇనుమడింపజేసిన మహానుభావులు. సాలూరి రాజేశ్వర్రావు రేడియో కోసం పాడిన పాటలన్నీ పరిశోధన చేసుకుంటూ మననం చేసుకోవలసిన ఆణిముత్యాలు - లలిత సంగీతానికి ఏం కావాలో, ఎలా పాడితే పదిమందీ వింటారో తెలిసినవారు.
రేడియో కోసం ఘంటసాల పాడిన పాటల్లో-
-పాడకే నా రాణి, పాడకే పాట
-తలనిండ పూదండ దాల్చిన రాణి
-జీవితమంతా కలయేనా
-పాడనా ప్రభూ పాడనా
మొదలైనవి రసిక జన హృదయాల్లో నిల్చిపోయాయి.
లీలతో కలిసి పాడిన, వెలిగించవే చిన్ని వలపు దీపమ్ము, ఆరుద్ర రాసిన యుగళ గీతం ‘్ఫక్కున నీవు నవ్విన చాలు’ అనే పాట చాలా ప్రసిద్ధమైనవి.
ఈ పాటలన్నీ రేడియోకు సంగీత గౌరవాన్ని తెచ్చినవే. ఆ తర్వాత కొన్ని పాటలు హెచ్‌ఎంవి కంపెనీ వారు రికార్డు చేశారు.
ఘంటసాల వంటి ‘జీవం’ కలిగిన కంఠస్వరాలు చాలా అరుదు. సినిమా సంగీతానికి దిశను, దశనూ నిర్దేశించిన గాయకుడు ఘంటసాల - తెలుగు చలనచిత్ర రంగానికొస్తే ఏదో కాలక్షేపంగా సినిమా పాటలు వినే అభిమానులకు, రసికులకూ, సంప్రదాయ సంగీతంలోని ‘రుచి’ని పంచిన నేపథ్య గాయకుడు.
ఎస్.రాజేశ్వర్రావు పాడిన ‘రజని’ గీతం ‘చల్లగాలిలో యమునా తటిపై’ ‘ఓ విభావరి’ పాటలు ‘ఘనా ఘనా గర్జింపవో’ అనే ఘంటసాల పాడిన పాట, ముందు రికార్డులుగా వచ్చాయి. ఆ తర్వాత వాటి వరుసలు నెమ్మదిగా సినిమాలలో చేరిపోయాయి.
ఈ పాటలన్నిటికీ సూత్రధారి రజని. ఘంటసాల, శ్రోతల స్థాయికి దిగిపోయి పాడలేదు. ఆయన స్థాయికి శ్రోతలే ఎదిగారు. అటువంటి గాయకుణ్ణి బ్రహ్మ మళ్లీ సృష్టిస్తాడా?
గేయం అనగానే స్ఫురించే పేరు దేవులపల్లి కృష్ణశాస్ర్తీ. సంగీత సాహిత్యాల మీద సమాన అధికారంగల వాగ్గేయకారుల తర్వాత ఒక గేయం ప్రాచుర్యం పొందాలంటే సంగీతం వాడితో సంబంధం ఉండి తీరాలని భావించిన వారిలో దేవులపల్లి వారొకరు. అందుకే ఆయన పాట వ్రాస్తున్నప్పుడు సంగీత ప్రయోక్త లేదా గాయకుడు పక్కనే ఉండేవారు.
అటువంటి వారిలో మొదటి రోజుల్లో అనసూయదేవి (సీత, అనసూయ గాయకద్వయంలో వారు) మద్రాసులో రజని, హైదరాబాద్ ఆకాశవాణిలో చేరినప్పటి నుండి పాలగుమ్మి విశ్వనాథం గారలు ప్రముఖులు.
కృష్ణశాస్ర్తీ గారనేవారట. కవిత్వం, సంగీత స్థాయికి ఎదగాలి. పాట వ్రాసే వాడికి లోపల సంగీతం ఉండి ఉండాలి. శబ్దాలంకారాలు పరిమితంగా ఉండాలి- అని.
ఈ సందర్భంలో సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు శ్రీ వోలేటి పాడిన ‘గడచేనటే సఖీ ఈ రాతిరి’ అనే పాటను గూర్చి ముచ్చటించాలి.
వోలేటి గారు హిందూస్తానీ సంగీత ప్రియుడన్న సంగతి అందరికీ తెలుసు. పాకిస్తాన్ గాయకద్వయం సలామత్ ఆలీఖాన్, నజావత్ ఆలీఖాన్ ఆలపించిన ‘పహాడీ’ రాత్రంతా ఓ రోజు వినేసి, మరునాడు కృష్ణశాస్ర్తీ గారికి ట్యూన్ ఇచ్చారు. పాటకు పల్లవి మాత్రమే సిద్ధమైంది. మరునాడు రవీంద్రభారతిలో పాడాలి.
రవీంద్రభారతి ఆడిటోరియంలో వోలేటిగారు స్టేజీ ఎక్కడానికి అరగంట ముందు మిగతా చరణాలు రాసి, చేతికిచ్చారు కృష్ణశాస్ర్తీ. అలవోకగా అద్భుతంగా పాడేశారాయన.
కొందరు గాయకులు గంధర్వాంశతో జన్మిస్తారు - పుట్టుకతోనే వారికి శృతిలయలు రెండూ పుష్కలంగా ఉంటాయి. ఎవరికైనా వయసు పెరుగుతున్న కొద్దీ గాత్రధర్మంలో మార్పు కనిస్తూంటుంది.
బాగా పాడగలిగే వయసులో వున్నప్పుడే ఆ పాటలన్నీ ఎప్పుడో రికార్డు చేశారు కాబట్టి ఈ వేళ ఆనందంగా వింటున్నాం.
ప్రతి రేడియో కేంద్రానికీ, లలిత సంగీతం పాడేవారు వందల సంఖ్యల్లో ఉన్నారు. వారిలో అత్యున్నత స్థాయిలో పాడే వారిని ఎంపిక చేసి పాడించి శాశ్వత ప్రాతిపదికపై ఆ పాటల్ని భద్రపరిచే ఏర్పాట్లు చేయవచ్చు.
ఆకాశవాణి అధికారులే ఈ పనికి పూనుకోవాలి.
ఈవేళ సినిమా పాటల కోసం రేడియోలు వినేవారు గణనీయంగా తగ్గిపోయారు. సెల్‌ఫోన్‌లలోనే వందలాది పాటలు వినగలుగుతున్నారుగా!
మంచి సాహిత్యం, హాయినిగొల్పే సంగీతం, మేళవించి పాడే పాటలు వినాలనుకొనేవారున్నారు.

చిత్రం.. బాలాంత్రపు రజనీకాంతరావు, ఘంటసాల

-మల్లాది సూరిబాబు 9052765490