S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వల... ది నెట్

కథల పోటీలో
ఎంపికైన రచన
**
‘ఒరేయ్! నీకు బొత్తిగా భయం, భక్తీ లేకుండా పోతోంది..’ అంటూ మా నాన్న తరచుగా నాకు క్లాసులు పీకుతూ ఉంటాడు. నేను బుద్ధిగా విన్నట్లుగా తలాడిస్తాను. ఆ తర్వాత మన పని మనదే...
ఆ రోజు కూడా మా డాడీ సేమ్ టు సేమ్ డైలాగ్ వేసేసరికి నేను వీలయినంత అమాయకంగా ఫేస్ పెట్టి ‘ఎందుకు డాడీ అనవసరంగా ఎప్పుడూ నన్ను తిడుతూనే ఉంటారు?’ అని ఆవేదనగా ప్రశ్నించాను. లేటెస్ట్ మొబైల్ కొనుక్కోవటానికి ఆయనకు టెండరేయాలి కాబట్టి ఆ మాత్రం వినయం, విధేయత నటించక తప్పదు బాస్...
‘ఎప్పుడు చూసినా కంప్యూటర్ ముందే కూర్చుంటావు దాంట్లో ఏం చూస్తుంటావో తెలీదు. లేకపోతే టీవీ మోగుతూనే ఉంటుంది. ఇక మొబైల్ సంగతయితే చెప్పక్కర్లేదు. ఇలా అయితే నువ్వు ఎప్పుడు చదువుతావు? ఎప్పుడు పడుకుంటావ్? ఆరోగ్యం పాడయ్యాక ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదు...’
‘నాకు పర్సంటేజ్ అదీ బాగానే వస్తుంది డాడీ..’
‘నేను చెప్పేది కేవలం నీ చదువు గురించి కాదు. జీవితం గురించి. అది కంట్రోల్ తప్పిపోకముందే జాగ్రత్త పడు...’ అన్నాడు మా డాడీ సీరియస్‌గా ముఖం పెట్టి.
నాకు ఎందుకో అసలీ టార్చర్ గురించి ఈ రోజే తాడో పేడో తేల్చేసుకోవాలన్పించింది. లక్కీగా నా టైం కూడా అలానే కలిసొచ్చింది కాబట్టి మా డాడీ కూడా చక్కగా వచ్చి నా బుట్టలో పడ్డాడు...
అసలు మేటర్ ఏమిటంటే.. నా పేరు సుభాష్ చంద్రబోస్. ఏ ముహూర్తాన మా నాన్న నాకు ఆ పేరు పెట్టాడో కానీ అలానే ఉండాలంటాడు. ఆయన పిచ్చి కానీ ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో సుభాష్ చంద్రబోస్‌లాగా బ్రతకడం నాలాంటి పందొమ్మిదేళ్ల కుర్రాడికి సాధ్యం అయ్యే పనేనా? మీరే చెప్పండి?
మా నాన్న నాకు చాలా తరచుగా అంటే క్రమం తప్పకుండా క్లాసులు పీకుతూ ఉంటాడు. మనం ఏమన్నా తక్కువా చెప్పండి? ఈ చెవితో విన్నట్లుగా నటించి ఇంకో చెవిలోంచి బైటకు డిలీట్ బటన్ కొట్టేస్తాను.
ఇప్పుడు విషయం ఏమిటంటే... మా నాన్న నాకో ఛాలెంజ్ విసిరాడు...
అదేమిటంటే సంవత్సరంపాటు లవర్ని కల్సుకోకూడదు, మాట్లాడకూడదు లాంటి ఛాలెంజ్ కాదు. చాలా వెరైటీ ఛాలెంజ్ అన్నమాట... అదేంటో చెప్పనా?
ఇరవై నాలుగు గంటలపాటు... నేను ఇంటర్‌నెట్ బ్రౌజ్ చేయకూడదు.. ఫేస్‌బుక్ చూడకూడదు... మొబైల్లో మాట్లాడకూడదు... టీవీ, డీవీడీలు చూడకూడదు.. ‘ఇది చేస్తే నువ్వు గెల్చినట్లు మళ్లీ ఎప్పుడూ జీవితంలో నీ జోలికి రాను.. ‘అలా ఉండు ఇలా చెయ్’ అంటూ ఎప్పుడూ క్లాసులు పీకను. ఇది నీకు ఇష్టమేనా?’ అంటూ మా నాన్న నాతో ఛాలెంజ్ చేశాడు. నేను ఎగిరి గంతేసినంత పని చేసి ‘్ఛలెంజ్’ అంటూ మా నాన్నకు సిన్మాలో హీరో మాదిరిగా బొటనవేలు చూపించాను... నౌ ద గేమ్ స్టార్ట్స్...
* * *
ఒక్క ఇరవై నాలుగు గంటలు కంట్రోల్ చేసుకుంటే మా నాన్న టార్చర్ తప్పుతుంది. ఆఫ్ట్రాల్ ట్వంటీ ఫోర్ అవర్స్... నేనే గెలుస్తాను. మా నాన్న ఓడిపోతాడు మళ్లీ ఎప్పుడూ నా జోలికి రాడు.. ఇదే నా ధీమా.
అసలు ఈ డాడీలు ఏమనుకుంటారు మా గురించి?
ఆఫ్ట్రాల్ ఇరవై నాలుగు గంటలు మొబైల్‌లో మాట్లాడకుండా ఉండలేమనుకుంటున్నారా? స్టడీస్‌లో ఉండే టెన్షన్స్ నించి కొంచెం అవుట్‌లెట్ లాగా ఏదో ఇంటర్‌నెట్ బ్రౌజ్ చేస్తూ నయనానందం పొందుతూ ఉంటాము ఆ మాత్రానికే క్లాసుల మీద క్లాసులు పీకాలా? మొబైల్ వున్నది ఎందుకు? మాట్లాడుకోవటం కోసమే కదా... అసలీ డాడీలకి యూత్ బాధలు ఏం అర్థమవుతాయి చెప్పండి?
సర్లే.. ఇప్పుడు జరిగిపోయిన దానికి రికార్డెందుకు కానీ ఎలాగైనా ఈ పందెంలో మా డాడీని ఓడించేస్తే ఇక ఆయన నా జోలికి రాడు. క్లాసులు పీకడు... నేను ఏదో భయంకరమైన బ్యాంక్ రాబరీ చేసి తప్పించుకున్న నేరస్థుడిలాగా ముఖం పెట్టుకుని ఇంట్లో తప్పుకుని తప్పుకుని తిరగనక్కర్లేదు...
మా డాడీతో బెట్ కట్టిన ఎక్స్‌యిట్‌మెంట్‌తో రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు. ఎప్పుడో తెల్లవారుఝామున నిద్ర పట్టేసింది అలవాటు ప్రకారం ఏడున్నరకు మెలకువొచ్చింది. కళ్లు తెరవటం తెరవటం నాకు తెలీకుండానే అప్రయత్నంగా నా చేయి బెడ్ పక్కన టీపాయ్ మీదున్న మొబైల్ అందుకుంది...
రాత్రి ఎంతమంది ఫోన్ చేశారో ఏమిటో? ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్స్ తాలూకు అప్‌డేట్స్ ఎన్ని మిస్సయిపోయానో? వాట్సప్‌లో ఎవరెవరు ఛాటింగ్ చేసుకున్నారో? ఏ ఫొటోలు, వీడియోలు షేర్ చేసుకున్నారో?
టచ్ స్క్రీన్ మీద నా ఫింగర్ టచ్ అవుతూ ఉండగానే నాకు హఠాత్తుగా మా డాడీతో రాత్రి చేసిన ‘్ఛలెంజ్’ గుర్తొచ్చింది. మనస్సు ఊగిసలాడటం మొదలుపెట్టింది...
చూడాలా? వద్దా? ఠక్కుమని చూసేస్తే డాడీకేం తెలుస్తుంది? నేను ఇంకా నిద్రపోతున్నాననే అనుకుంటారు కానీ మొబైల్‌లో నెట్‌బ్రౌజ్ చేస్తున్నానని కల కనరు కదా? జస్ట్ ఫైవ్ మినిట్స్‌లో అప్‌డేట్స్, మెస్సేజ్‌లన్నీ చూసేసి రిటన్ మెస్సేజ్‌లు పెట్టేసి ఆ తర్వాత రూమ్‌లోంచి అప్పుడే నిద్రలేచిన బిల్డప్ ఇస్తూ బైటకొస్తే ఆయనకేం తెలుస్తుంది?
‘రేయ్... బుద్ధిలేని వెధవా?’ నా లోపల్నుంచి అంతరాత్మగాడనుకుంటాను నన్ను ఏదో తిట్టడం మొదలుపెట్టేసరికి నా ఎటెన్షన్ అటు డైవర్టయ్యింది.
‘ఆఫ్ట్రాల్ ట్వంటీ ఫోర్ అవర్స్ మొబైల్ లేకుండా ఉండలేనా?’ అంటూ బిల్డప్పులిచ్చావు కదరా. ఇప్పుడు ఇంకా పది నిమిషాలు కూడా గడవకముందే వెంపర్లాడిపోతున్నావేంటీ?’ అంతరాత్మగాడికి సమాధానం చెప్పడం కుదిరేపని కాదని నాకు బాగా తెలుసు. వాడు ఎప్పుడెప్పుడో మ్యాటరంతా బైటకు తవ్వుతూ ఉంటాడు. ఇతరులను దబాయించినట్లు వాడిని దబాయించడం కుదర్దు ఎందుకంటే వాడు ట్వంటీఫోర్ అవర్స్ మన లోపలే ఉండి మొత్తం అంతా గమనిస్తూ ఉంటాడు కదా! నేను పైనుంచి మెట్లు దిగి హాల్లోకి వెళ్లేసరికి మా డాడీ కాఫీ తాగుతూ టీవీ చూస్తున్నాడు. ‘గుడ్‌మార్నింగ్ డాడీ...’ అంటూ విష్ చేసి ఆయన ఎదురుగా సోఫాలో కూర్చున్నాను.
‘రాత్రి బాగా నిద్ర పట్టిందా?’ అని మా డాడీ అడిగిన ప్రశ్నకు ‘సూపర్బ్‌గా నిద్రపోయాను డాడీ...’ అన్నాను.
మా డాడీ రెప్పకొట్టకుండా టీవీలో వచ్చే వార్తలు చూస్తున్నాడు. అసలు ఈయనగారి వరస ఎలా ఉంటుందంటే దేశ ప్రధానమంత్రీ, రాష్ట్ర ముఖ్యమంత్రీ ‘నాయనా ధనుంజయరావూ (మా డాడీ పేరది) గంటగంటకీ టీవీలో వచ్చే వార్తలు శ్రద్ధగా చూసి ఆ తర్వాత మాకు రిపోర్ట్ సబ్మిట్ చెయ్...’ అని చెప్పినట్లుగా చాలా దీక్షగా టీవీలో వార్తలు చూస్తూ ఉంటాడు.
మా మమీ అయితే ప్రొద్దునే్న ఆ చాగంటి కోటేశ్వరావుగారు చెప్పే హితబోధలు తన్మయత్వంతో వింటూ ఉంటుంది ఆ టైమ్‌లో స్టవ్ మీద పాలు పొంగిపోయినా, పోపు మాడిపోయినా పట్టించుకోదు. సరిగ్గా అప్పుడే స్నానం, పూజ పూర్తి చేసుకుని మా డాడీ హాల్లోకి రాగానే టీవీ రిమోట్ ఆయన చేతిలో పెట్టేసి వంట గదిలోకి నిష్క్రమించగానే ఇక ఈయనగారు న్యూస్ ఛానెల్స్ అంతు చూస్తూ ఉంటాడన్నమాట.
‘మీ డాడీ న్యూస్ చూస్తే నీకేంటి బాధ?’ అని మీరు అడగచ్చు. సరిగ్గా అదే టైంలోనే బుస్ బుస్ మ్యూజిక్ ఛానెల్‌లో ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్’ అనే ప్రోగ్రాం వస్తూ ఉంటుంది. అందులో యాంకర్లిద్దరూ భలేభలే జోక్‌లేస్తూ మాట్లాడతారు. నేనయితే ఆ ప్రోగ్రాంకి పెద్ద ఫ్యాన్‌ని. అబ్బ ఎంత బాగా మాట్లాడతారో చెప్పలేను కానీ చూసే కొద్దీ చూడబుద్ధవుతుంది.
నాకు ఆ ప్రోగ్రాం చూసి ఇంకా కిక్కెక్కిందనుకోండి మొబైల్ తీసి వాళ్ల ప్రోగ్రాంకి ఫోన్ కొడతాను. లైవ్ ప్రోగ్రాం కదా ఎంచక్కా మన వాయిస్ వింటూ ప్రోగ్రాం చూడచ్చన్నమాట. వాళ్లు మాత్రం ‘టీవీ సౌండ్ మ్యూట్‌లో పెట్టి మాట్లాడండి’ అని మొత్తుకుంటూ ఉంటారు. నేనేమో లేదు రమేషన్నా టీవీ సౌండ్ మ్యూట్‌లోనే ఉంది’ అని వాళ్లని బకరాల్ని చేస్తానన్నమాట. వాళ్లతో మాట్లాడుతుంటే భలే కిక్కొస్తుంది.
ఒక్కోసారి వాళ్లు మనల్ని బుక్ చేసి పారేస్తారు. ‘నీకు లవర్ ఉందా?’ అని అడుగుతారు. ఏం చెప్పాలో తెలీదు. లైవ్ ప్రోగ్రాంలో ఇలా అడిగితే ఎలా సమాధానం చెబుతాం చెప్పు? మళ్లీ వాళ్లే అర్థం చేసుకున్నట్లు ‘ఓహో! పక్కన మమీ, డాడీ ఉన్నారా అందుకే చెప్పనీకి సిగ్గుపడుతున్నావురా భయ్?’ అంటారు. ఎదవ బిల్డప్ తెలిసీ అడగటం ఎందుకు మళ్లీ ఇకిలిస్తూ అడగటం ఎందుకు? కానీ ఇదంతా వాళ్లతో మాట్లాడుతూ వుంటే మస్త్ థ్రిల్లొస్తదిరా భయ్. కాకపోతే ఫోన్ బిల్లు వాచిపోద్దనుకో...
‘ఫేస్‌బుక్‌లో ఏంటీ అప్‌డేట్స్?’
నేను సీరియస్‌గా మా డాడీవైపు చూశాను. ‘ట్వంటీ ఫోర్ అవర్స్ మొబైల్ కానీ ఇంటర్నెట్ కానీ యూజ్ చేయనని మాటిచ్చాను కదా?’ అన్నాను ఏదో దేశాన్ని ఉద్ధరిస్తున్న లెవెల్లో.
‘సర్లే.. వైజాగ్‌లో తుఫానొచ్చి చాలా విధ్వంసం జరిగింది కదా నీ డొనేషన్ ఎంత?
‘డొనేషన్ ఇవ్వటానికి నా దగ్గరేముంది డాడీ?’
‘నీ పాకెట్‌మనీ... ఈ నెల నీ పాకెట్ మనీ రెండు వేలు డొనేషన్ కింద ఇచ్చేయనా. నేను నా శాలరీ నుంచి పది వేలిస్తున్నాను...’ అని ఇంకా మా డాడీ చెప్పటం పూర్తికాకముందే కిచెన్‌లోంచి మా అమ్మ ‘నా పోపుల డబ్బాలోంచి ఐదువేలు డొనేషన్..’ అంది.
‘వెరీగుడ్ మొత్తం పదిహేడు వేలు ఈ రోజే సీఎంగారి రిలీఫ్ ఫండ్‌కు డొనేషన్ కింద చెక్ పంపేస్తాను...’ అంటూ మా డాడీ హడావిడిగా ఆఫీస్‌కి బయలుదేరాడు.
నేను మనస్సులోనే కసిగా పళ్లు కొరుక్కున్నాను. ఈయనగారికేమో బ్యాంకులో లక్షలుంటాయి. ఆవిడగారి పోపుల డబ్బాలో వేలు దాస్తుంది. నాకు పాకెట్‌మనీ కింద నెలకు ఇచ్చేది ముష్టి రెండు వేలు... ఇప్పుడు అది కూడా పిజ్జాలో ఛీజ్‌లా కరిగిపోయింది.
గబగబా స్నానం పూర్తి చేసుకుని బ్యాగ్ తగిలగించుకుని కాలేజ్‌కు బయలుదేరాను.
నా రూమ్‌లోంచి బైటకొస్తుంటే టేబుల్ మీదున్న మొబైల్‌ని చూస్తుంటే షుగర్ రోగంతో బాధపడేవాడు బందరు లడ్డూల వంక ఎంత ఆత్రుతగా, ఆబగా చూస్తాడో అలాగ ఉంది నా పరిస్థితి. పోనీ ఓన్లీ థర్టీ సెకండ్స్ ఒక్కసారి చూసేస్తే ఏం కొంపారిపోతుంది? డాడీకి తెలీకుండా ఆ మాత్రం మానేజ్ చెయ్యలేనా?
‘చిట్టికన్నా ఛాలెంజ్ సంగతి మర్చిపోయావా?’ నేను అంతరాత్మగాడి మీద పళ్లు కొరుక్కుంటూ మొబైల్ నా రూమ్‌లోనే వదిలేసి కాలేజ్‌కి బయలుదేరాను. ‘టిఫిన్ తినేసి వెళ్లరా...’ అంటూ అమ్మ అరుస్తూనే ఉంది కానీ వినపడనట్లుగా ఇంట్లోంచి బైటపడ్డాను. ఎవరి మీదోతెలీదు కానీ ఏదో కసీ, కోపం.. ఈ ప్రపంచం అంతా నా మీద కూడబలుక్కుని కుట్ర చేస్తుందన్న ఫీలింగ్.
ఆఫ్ట్రాల్ మొబైల్‌లో ఇంటర్నెట్ చూస్తే పాడైపోతారా?
అయినా నేను బుద్ధి లేకుండా మా డాడీతో ఛాలెంజ్ చేయటం ఎందుకు? నా ఫ్రెండ్స్ మాదిరిగా ‘అబ్బే మొబైల్ ఎక్కువ యూజ్ చెయ్యను డాడీ. మొబైల్
వల్ల రేడియేషన్‌తో హెల్త్ పాడైపోతుందంట కదా!’ అని అమాయకంగా ఫేస్ పెట్టి డాడీని నమ్మించేస్తే సరిపోయేది. పెద్ద సత్య హరిశ్చంద్రుడి కజిన్ బ్రదర్‌లాగా ఛాలెంజ్ చేసి ఇప్పుడు లాక్కోలేక పీక్కోలేక గింజుకుంటున్నాను.
ఎందుకో తెలీదుకానీ బుజ్జిముండ ఈ రోజు మరీ మరీ బాగా గుర్తొస్తోంది.
బుజ్జిముండ అంటే నా గర్ల్‌ఫ్రెండ్ కాదు నా మొబైల్...
అసలు నా మొబైల్ ఎంత అందంగా, స్లీక్‌గా ఉంటుంది? నల్లగా నిగనిగలాడుతూ, స్టయిలిష్‌గా, లేటెస్ట్ ఆప్స్ అన్నింటితోనూ కళకళలాడుతూ, ప్రపంచం మొత్తాన్ని నా గుప్పెట్లో బంధించే సాధనంలా ఇటు ఇన్ఫర్మేషన్, మరోవైపు ఎంటర్‌టైన్‌మెంట్ ప్రసాదిస్తూ.. ఓహ్.. మొబైల్ గురించి తలుచుకుంటుంటేనే వొళ్లు పులకరించిపోతుంది అటువంటి నా ప్రియాతి ప్రియమైన మొబైల్‌తో నా ఈ ఎడబాటు ఇంకా కనీసం ఇరవై రెండు గంటలు...
మొబైల్ గురించి ఆలోచనల్లో మునిగి వున్న నన్ను చూసి ‘ఏంది తమీ రాత్రి గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవయ్యిందా పరేషాన్ లెక్కున్నావ్?’ అన్నాడు షేరింగ్ ఆటో నడుపుతున్న మల్లేష్ నవ్వుతూ. నేను ఏడ్వలేక ఎర్రి నవ్వొకటి బదులుగా నవ్వాను.
కాలేజ్ దగ్గర షేరింగ్ ఆటో దిగి నాలుగు అడుగులు వేసానో లేదో సుత్తి కోటిగాడు సీరియస్‌గా ముఖం పెట్టుకొని ఎదురొచ్చి ‘ఏందిరా నీకు మస్తు కటింగ్ లెక్కువయినయ్..’ అన్నాడు కోపంగా.
నేను ఆశ్చర్యంగా వాడి వంక చూస్తూ ‘నేనేం చేశాను?’ అని అడిగాను. ‘ఫేస్‌బుక్‌లో నా పిక్స్, వీడియోలకి లైక్‌లు కొట్టలేదు. కామెంట్స్ పెట్టలేదు.. నా మెస్సేజ్‌లు షేర్ చేయలేదు ఏమనుకుంటున్నావురా నువ్వు? ఇగో చూడు నీ పోస్టింగ్స్‌కు లైక్‌లు ఎవడు కొడతాడో చూస్తా...’ అన్నాడు పళ్లు పటపటలాడిస్తూ.
ఓర్నీ! ఇదా వీడి ఏడుపుకు కారణం? వీడు పెట్టే ఫొటోలు, వీడియోలు, మెస్సేజ్‌లు చూస్తే వాంతులు, విరోచనాలు ఏకకాలంలో అయిపోయినంత ఘోరంగా ఉంటాయి. ఏదో ఫ్రెండ్ కాబట్టి నా అప్‌డేట్స్ అన్నింటికీ లైకులు, కామెంట్స్ పెడుతుంటాడు కాబట్టి నేను అసలు చూడకుండా లైకులు కొట్టేస్తూ ఉంటాను. రాత్రి నుంచి మొబైల్ వాడటం లేదు కాబట్టి వీడి పోస్టింగ్స్‌కు లైకులు, కామెంట్స్ పెట్టటం కుదర్లేదు. అందుకే పళ్లు నూరుతున్నాడన్నమాట.
‘నీ సంగతి చూస్తా..’ అన్నట్లుగా చూపుడు వేలుతో సైగచేస్తూ నేను చెప్పేది విన్పించుకోకుండా సుత్తి కోటిగాడు క్యాంపస్‌లో ఎటో మాయం అయిపోయాడు.
నేను క్లాస్‌లో ఎంటరవ్వగానే అందరూ నా వైపు భయంకరమైన సీరియస్‌గా ముఖాలు పెట్టుకుని చూశారు. ఇందాక సుత్తి కోటిగాడి కారణంగా మ్యాటర్ అర్థం చేసుకున్న నేను వీళ్లందరి స్టేటస్ మెస్సేజ్‌లకి కామెంట్స్, లైకులు కొట్టలేదని ముఖాలు ఆ విధంగా పెట్టారని అర్థం చేసుకున్నాను.
ఆలోగా లెక్చరర్ వచ్చి లెస్సన్ మొదలుపెట్టాడు.
వినేవాడు వింటున్నాడు... నోట్స్ రాసుకునేవాడు రాసుకుంటున్నాడు. సీక్రెట్‌గా మొబైల్‌లో చాటింగ్‌లు చేసుకునే వాళ్లూ, మెస్సేజ్‌లు పంపేవాళ్లూ, ఇంటర్‌నెట్ బ్రౌజ్ చేసేవాళ్లూ, వీడియోలు చూసుకునేవాళ్లూ (ఏం వీడియోలు అని మాత్రం దయచేసి అడగద్దు) ఇలా ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉన్నారు. లెక్చరర్‌గారు మాత్రం స్థితప్రజ్ఞుడిలా తన కర్తవ్యం తాను నిర్వహిస్తున్నట్లుగా లెస్సన్ చెప్పుకుంటూ వెళుతుంటే అటు పాఠం బుర్రలోకి ఎక్కక ఇటు మొబైల్ చేతిలో లేక నా పరిస్థితి ఎలా ఉందంటే వివరంగా మీకు అర్థమయ్యేలా చెప్పటానికి నేను రైటర్ని కాదుగదా!
మొత్తానికి క్లాసులో ఉన్నంతసేపూ లెక్చర్ చెప్పే పాటం బుర్రలోకి ఏ మాత్రం డైజెస్ట్ కాలేదు. నా ఆలోచనలన్నీ మొబైల్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి... ఎన్ని మిస్డ్‌కాల్స్ ఉన్నాయో? ఎవరెవరు మెస్సేజ్‌లు చేశారో? ఫేస్‌బుక్‌లో ఏం జరిగిపోతోందో? వాట్సప్ పరిస్థితేమిటో? ఇలా నా ఆలోచనలు కలగాపులగంగా పిచ్చెక్కినట్లుగా నా బుర్రలోకి రౌండ్స్ కొడుతున్నాయి.
మొత్తానికి క్లాస్ అయిన తర్వాత బైటకొచ్చాను. కాలేజ్ అంతా కలర్‌ఫుల్‌గా ఉంది. అందరూ హ్యాపీగా మొబైల్‌లో మాట్లాడుకుంటూ, నెట్‌బ్రౌజ్ చేసుకుంటూ ఖుషీగా ఉంటే నేనొక్కడినే తుఫాను బాధితుడు పులిహోర పొట్లం కోసం ఎదురుచూస్తున్నట్లుగా మొబైల్ కోసం పరితపించిపోతూ వున్న సమయంలో...
‘రేయ్ వెధవా...’
నేను తలతిప్పి చూశాను. నా గర్ల్‌ఫ్రెండ్ సముద్రంలో సొరచేపలాగా స్టూడెంట్స్‌ని తప్పించుకుంటూ వచ్చి నా ముందు ఆగింది. ‘ఏరా... ఎన్నిసార్లు ఫోన్లు చేయాలిరా నీకు?’ అంది సీరియస్‌గా.
సిన్మాలు చూసి అందులోని హీరోయిన్లను ఇమిటేట్ చేయటం బాగా నేర్చుకున్నారు అమ్మాయిలు. సిన్మాల్లో హీరోయిన్లు ‘ఏందిబే’ ‘తోలుతీస్తా’ ‘నాటకాలాడుతున్నావా?’ ఇలా తిడుతూ ఉంటారు కాబట్టి బైట కాలేజీ పోరీలు కూడా హీరోయిన్ల ఫ్యాషన్లు, బాడీలాంగ్వేజ్‌లతో పాటుగా ఈ టైప్ లాంగ్వేజ్ కూడా ఫాలో అయిపోతూ ఉన్నారీ మధ్య.
‘ఏందిరా అడుగుతుంటే వెధవ ముఖం వేసుకుని చూస్తావ్?’ నా గర్ల్‌ఫ్రెండ్ దబాయిస్తూ కోపంగా అంది.
నేను ఏం చెప్పాలో తెలీక ‘మొబైల్‌కి చిన్న ప్రాబ్లమ్...’ అంటూ నసిగాను.
‘ఏం ప్రాబ్లమ్‌రా వేస్ట్‌గాడా? రింగ్ అవుతుంది కదా నా ఫోన్ ఎత్తనంత బిజీగా ఏం చేస్తున్నావురా నువ్వు? కొంపదీసి కొత్త గర్ల్‌ఫ్రెండ్ తగిలిందా ఏమిటి?’ చచ్చింది గొర్రె... ఇప్పుడిక నా బ్రైన్ ఫ్రై చేసుకుని తినేస్తుంది. దీన్ని కన్విన్స్ చేయటం కంటే ఎవరెస్ట్ ఎక్కటం... అట్లాంటిక్ సముద్రం ఈదటం చాలా తేలిక.
‘క్లాసుకి టైమయ్యింది తర్వాత చెప్తా నీ పని...’ అని వార్నింగ్ ఇచ్చేసి నా గర్ల్‌ఫ్రెండ్ తన క్లాస్‌రూమ్ వైపు వెళ్లిపోయాక కొంచెం రిలీఫ్‌గా ఫీలయ్యాను.
మొబైల్ ఫోన్ ఆన్సర్ చేయకపోతే ఈ రేంజ్‌లో బూతులు తిట్టాలా? ఫోన్‌లో మాట్లాడలేదని తిట్టటం ఎందుకు? ఎదురుగా వున్నప్పుడు నాలుగు మాటలు ప్రేమగా మాట్లాడచ్చు కదా? క్లాసులు ఎగ్గొట్టి కాలేజీ అంతా తిరగటం మొదలుపెట్టాను. కాసేపు లైబ్రరీలో కూర్చున్నాను. కళ్లముందయితే పుస్తకం వుంది కానీ మెదడు ఎక్కడెక్కడో సంచారం చేస్తుంది. పిచ్చెక్కినట్లుగా, వెర్రివెర్రిగా, కోపంగా, ఇరిటేషన్‌గా ఉంది. అసలు నా మానసిక పరిస్థితి ఏమిటో నాకే అర్థం కాకుండా ఉంది.
‘హల్లో సుభాష్...’ నా క్లాస్‌మేట్ గాంధీ లైబ్రరీలో నుంచి బైటకు నడుస్తున్న నన్ను పలకరించేసరికి సన్నగా నవ్వాను. గాంధీతో నాకు పెద్దగా పరిచయం, ఫ్రెండ్‌షిప్ రెండూ లేవు. ‘ఏంటీ రోజు డల్‌గా కనపడుతున్నావు’ అని అడిగాడు.
నాకు చాలా ఆశ్చర్యంగా అన్పించింది. నా బెస్ట్‌ఫ్రెండ్స్ అనుకున్నవాళ్లు, నా గర్ల్‌ఫ్రెండ్ ఎవ్వరూ అడగలేదు కానీ నేను పెద్దగా పట్టించుకోని గాంధీ నా గురించి అడుగుతున్నాడు. ఏం సమాధానం చెప్పాలో తెలీక ‘జస్ట్ హెడేక్ అంతే..’ అని కవర్ చేశాను.
‘క్లాసులకు అటెండ్ అయ్యే మూడ్ లేకపోతే ఇంటికెళ్లి రెస్ట్ తీసుకోవచ్చు కదా టేక్‌కేర్ రేపు కలుద్దాం...’ అంటూ గాంధీ ఆప్యాయంగా నా భుజం తట్టి లైబ్రరీ లోపలకు వెళ్లిపోయాడు.
కాలేజీలో తిరుగుతూ టార్చర్ పడేకంటే అదే బెస్ట్ ఐడియాగా అన్పించి కాళ్లీడ్చుకుంటూ ఇంటికి తిరిగొచ్చాను.
నా వాలకం చూసి అమ్మ కంగారుపడింది. ‘ఏంట్రా జ్వరం కానీ వచ్చిందా?’ అంటూ నుదుటి మీద చేయి వేసి చూసింది. ‘చల్లగానే ఉందే కానీ ముఖం ఏంటీ అలా పీక్కుపోయింది? దిష్టి తగిలినట్టుంది కొంచెం అన్నం తిని కాసేపు పడుకో...’ అంది.
‘వద్దు...’ అని చెప్పి వచ్చి నా రూమ్‌లోకి దూరాను. బెడ్‌మీద పడుకున్నాను. కానీ ఆలోచనలు మాత్రం తెగటంలేదు. ఈలోగా మొబైల్ మోగుతున్న సౌండ్ విన్పించింది. ‘ఎవరు కాల్ చేస్తున్నారో చూద్దామా?’ అన్పించింది.
నా మనసు మొబైల్, ఇంటర్నెట్‌ల మధ్య లోలకంలా ఊగిసలాడుతోంది. కాలుకాలిన పిల్లిలా ఇల్లంతా తిరగటం మొదలుపెట్టాను. టీవీ పెట్టుకుని మ్యూజిక్ ఛానెల్ వాళ్లకు ఫోన్ చేసి టైంపాస్ చేయటానికి లేదు... ఇంటర్నెట్‌లో ఫేస్‌బుక్ చూసుకోవటానికి కుదరదు కాసేపు సరదాగా గర్ల్‌ఫ్రెండ్‌తో ఛాటింగ్ చేయడం వీలుపడదు.
‘బుద్ధిలేక ఛాలెంజ్ చేసి బాగా ఇరుక్కున్నావురా..’ అంటూ నన్ను నేనే వందోసారి మనస్సులో తిట్టుకున్నాను.
ఈలోగా ఆఫీస్ నుంచి మా డాడీ ఇంటికొచ్చాడు. కాసేపు ఫైల్స్ చూసుకున్నాక నావైపు చూస్తూ ‘డల్‌గా కనపడుతున్నావు వొంట్లో బాలేదా?’ అని అడిగాడు. నేను మనస్సులోనే పళ్లు కొరుక్కుని పైకి మాత్రం ముఖంలోకి వీలయినంత అమాయకత్వం చొప్పించి అదేం లేదన్నట్లుగా తలాడించాను.
హాల్లో సోఫాలో బుద్ధిగా కూర్చుని మా డాడీతోపాటు రాత్రి తొమ్మిది గంటలదాకా టీవీలో వార్తలు మధ్యమధ్యలో సీరియల్స్ చూస్తూ ఉండిపోయాను. కళ్లు టీవీ చూస్తున్నా మనసులో మాత్రం మొబైల్ దగ్గరే చక్కర్లు కొడుతోంది. సరిగ్గా అప్పుడే నా పక్కనే వున్న లాండ్‌లైన్ ఫోన్ మోగింది.
‘ఏందిరా ఎన్నిసార్లు కాల్ చేయాలి నీ మొబైల్‌కి?’ అవతల నించి నా గర్ల్‌ఫ్రెండ్ గొంతు సీరియస్‌గా విన్పించేసరికి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థంకాలేదు. ఇటుచూస్తే మమీ డాడీ టీవీ చూస్తున్నారు. అవతల గర్ల్‌ఫ్రెండ్ వాళ్లు వింటుండగా ఏం సమాధానం చెప్పాలి దీనికి. అందుకే ఏదో కవర్ చేస్తూ ‘సర్లే రేపు కాలేజ్‌కు నీ రికార్డు తెచ్చిస్తాలే..’ అంటూ ఫోన్ పెట్టేసి ‘మా ఫ్రెండ్ వాసుగాడు’ అంటూ అడగకపోయినా వాళ్లకు చెప్పాను. ముఖంలో వెర్రి నవ్వుతో మా డాడీ ముఖంలో ఎక్కడో ఏదో చిన్న సందేహం లాంటిది కనపడింది కానీ ఆయన బైటపడలేదు.
పది గంటల తర్వాత టార్చర్ మరింతగా పెరిగింది. లాండ్‌లైన్ మోగుతోంది. మా డాడీ ఫోన్ ఎత్తితే ఎవ్వరూ మాట్లాడరు. ఫోన్ చేసేది ఎవరో నాకు తెలుసు కానీ పైకి చెప్పలేదు. మమీ డాడీ నిద్రకు ఉపక్రమించిన తర్వాత మళ్లీ లాండ్‌లైన్ మోగితే ఈసారి నేనే ఫోన్ చేశాను. ‘రేయ్ మర్యాదగా మొబైల్ ఎత్తుతావా లేక నైట్ అంతా టార్చర్ పెట్టమంటావా?’ అంది నా గర్ల్‌ఫ్రెండ్ వార్నింగ్ ఇస్తున్నట్లుగా.
నేను నా బెడ్‌రూమ్‌లోకి వచ్చి గత్యంతరం లేక రింగవుతున్న మొబైల్ లిఫ్ట్ చేశాను లేకపోతే ఏం జరుగుతుందో నాకు తెలుసు... ‘ఏరా బాగా కటింగ్‌లిస్తున్నావ్... నా దగ్గర బిల్డప్పా?’ అంటూ ఉక్రోషంతో అడ్డమైన తిట్లన్నీ తిట్టడం మొదలుపెట్టింది.
‘రేపు కాలేజీలో అంతా డిటైల్డ్‌గా చెబుతాను...’ అంటూ ఫోన్ కట్ చేసి మొబైల్ స్విచ్చ్ఫా చేశానో లేదో మళ్లీ లాండ్‌లైన్ మోగటం మొదలెట్టింది. రిసీవర్ తీసి పక్కన పెట్టాను. రేపు కాలేజీలో తను ఎంత భయంకరంగా తిడుతుందో ఊహించుకుంటేనే భయం వేస్తోంది.
మొత్తానికి కలత నిద్రతో తెల్లారింది. నేను రూమ్‌లోంచి బైటకొచ్చేసరికి మా డాడీ ఆఫీస్‌కు బయలుదేరుతున్నారు. ‘వెరీగుడ్ పందెంలో నువ్వే గెలిచావు కదా. ఇంకెప్పుడూ నీకు క్లాసులు పీకను సరేనా?’ అన్నారు డాడీ.
మనస్సు విపరీతంగా ఊగిసలాడటం మొదలుపెట్టింది. చెప్పాలా? వద్దా? చివరకు ధైర్యం చేసి చెప్పాను ‘లేదు డాడీ నేను పందెంలో ఓడిపోయాను. రాత్రి మొబైల్ మాట్లాడాను. మీరే గెలిచారు...’ అన్నాను ఏడుపు ముఖంపెట్టి.
అకస్మాత్తుగా మా డాడీ ముఖంలో ముందు ఆశ్చర్యం ఆ తర్వాత దిగ్భ్రాంతి లాంటి ఫీలింగ్ కన్పించింది. ఆయన నా దగ్గరకొచ్చి గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. ‘ఐయామ్ రియల్లీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మై బోయ్...’ అన్నారు ఆనందంగా.
‘ఎందుకు డాడీ నేను పందెంలో ఓడిపోయినందుకా?’ ఉక్రోషంగా అన్నాను.
‘కాదు.. చేసిన తప్పు ధైర్యంగా అంగీకరించినందుకు... అబద్ధాలు చెప్పటం కంటే తప్పుని అంగీకరించేవాడే నిజమైన మొనగాడు ఆ విధంగా చూస్తే నువ్వే ఈ పందెంలో గెల్చినట్టు...’ నేను మా డాడీ మాటలకు షాక్‌లో వుండగానే ఆయన కొనసాగించేడు. ‘టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవటంలో తప్పు లేదు కానీ ఎడిక్ట్ కావటమే బాధాకరం... ఇప్పుడు నాకు నమ్మకం కలుగుతోంది ఏ క్షణం అయితే ధైర్యంగా నీ తప్పుని అంగీకరించావో ఇక నీకు నా క్లాసులతో అవసరం లేదని అర్థమైంది... ఓ చిన్న కథ చెబుతా విను. బ్రిటన్‌లో ఒకాయన మరణిస్తే ఆయన ప్యునరల్‌కి కేవలం నలుగురు మాత్రమే అటెండ్ అయ్యారు. ఇరవై నాలుగు గంటలూ కంప్యూటర్ ముందే గడిపే ఆయన ఫేస్‌బుక్‌లో ఐదువేల మంది ఫ్రెండ్స్ ఉన్నారు.. ఒరేయ్ నాన్నా! సమాజంలో తిరుగు... ఇరుగుపొరుగుతో సఖ్యంగా, స్నేహంగా ఉండు.. నిజమైన స్నేహితులను సంపాదించుకో నిజమైన స్నేహితుడిగా ఉండు.. జీవితాన్ని, ప్రపంచాన్ని కంప్యూటర్‌లో నుంచి కాకుండా వాస్తవంలోంచి చూడు ఆల్ ది బెస్ట్...’ అని నా భుజం తట్టి డాడీ ఆఫీస్‌కి వెళ్లిపోయారు.
ఒక్కసారిగా నా భ్రమలూ, భ్రాంతులూ ఫెటేల్మని ప్రేలిపోయినట్లుగా అనిపించింది.
నిజమే.. నేను టెక్నాలజీకి ఎడిక్ట్ అయిపోయి బానిసగా మారిపోయాను. ఆఫ్ట్రాల్ ఇరవై నాలుగు గంటలు మొబైల్ లేకుండా బతకలేనంత చపలచిత్తుడనై పోయాను. నాకంటూ ఓ ‘్ఫల్స్ ప్యారడైజ్’ సృష్టించుకుని అందులోనే బతుకుతూ వాస్తవ ప్రపంచానికి దూరం అయిపోయాను. మా నాన్న చెప్పింది నిజమే. ఒకప్పుడు నేను బెస్ట్ క్రికెట్ ప్లేయర్ని, ఇంటర్నెట్, మొబైల్, టీవీలకు ఎడిక్ట్ అయిపోయిన తర్వాత గేమ్స్ మీద ఆసక్తి పోయింది. దాంతో స్మార్ట్‌గా ఉండేవాడిని ఇప్పుడు బోండాంలాగా తయారయ్యాను. కంటి సైట్ పెరిగింది. మనస్సు కుదురుగా ఉండదు. ఎప్పుడూ ఏదో ఆందోళన, అలజడి, అసంతృప్తి...
గాడ్జెస్‌కు బానిసగా మారటమే నా మానసిక పరిస్థితికి కారణమని అర్థమైంది.
కంప్యూటర్, మొబైల్‌లో మనతో ఛాటింగ్ చేసే వాళ్లంతా కేవలం మనకోసమే ఉండరని అర్థమైంది. మనం కాకపోతే ఇంకొకళ్ళతో ఛాటింగ్ చేస్తూ టైమ్‌పాస్ చేస్తారు. ఆ మాత్రం దానికి అదంతా నిజమైన స్నేహంగా భ్రమిస్తూ టైం, జీవితాన్ని తగలబెట్టుకుంటూ అనారోగ్యాలను మూట కట్టుకుంటున్నానని అర్థమైంది. ఏదయినా సరే లిమిట్‌లో ఉంటేనే ఆరోగ్యం, ఆనందం అనే సత్యాన్ని తెల్సుకున్నాను.
ఇప్పుడు నా జీవితంలో చాలా మార్పులొచ్చాయి.
ఏ మాత్రం ఖాళీ దొరికినా కాలనీలో కుర్రాళ్లతో క్రికెట్ ఆడుతున్నాను. దాంతో మళ్లీ స్మార్ట్‌గా, ఫిట్‌గా తయారయ్యాను. తర్వాత జరిగిన సెమిస్టర్‌లో నాకే ఆశ్చర్యం వేసేంత అద్భుతమైన మార్కులొచ్చాయి. బుక్ రీడింగ్ అలవాటు చేసుకున్నాను. మహనీయులు రాసిన పుస్తకాలు చదువుకుంటే ‘ఇంతకాలం టైం అనవసరంగా వ్యర్థం చేశానా?’ అని బాధ కలుగుతుంది.
మా డాడీతో చేసిన ఓ ఛాలెంజ్ నా జీవితాన్ని మార్చేసింది. ఛాలెంజ్‌లో ఓడిపోయినా జీవితంలో గెలుస్తానన్న ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
పందొమ్మిదేళ్ల నాలాంటి కుర్రాడికి తల్లిదండ్రులు కాకుండా భయభక్తులు ఎవరు నేర్పుతారు? మీరు కూడా మీ అమ్మాయికో, అబ్బాయికో క్లాసులు పీకినట్లుగా కాకుండా ఆప్యాయంగా దగ్గర కూర్చోబెట్టుకుని మా డాడీ చెప్పినట్లుగా బుర్రలోకి దూరేలాగా చెబితే మీ పిల్లలు తప్పకుండా వింటారనీ నాలా మారతారనీ నాకు నమ్మకముంది ఎందుకు చెబుతున్నానో పోనీ ఓసారి ట్రై చేసి చూడండి. ఆల్ ది బెస్ట్.

ఆదెళ్ళ శివకుమార్ 9154073342