S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గైడ్

‘రండి. కిందకి దారి ఇటువైపు. తలుపు దగ్గర మీ తలలు జాగ్రత్త. మెట్లని కూడా చూసుకోండి. బాగా అరిగి జారుతున్నాయి. మనం మళ్లీ ప్రాంగణంలోకి చేరుకున్నాం’
‘లేడీస్ అండ్ జెంటిల్‌మెన్. ఇంతటితో మన టూర్ ముగుస్తుంది. మీ సమయానికి, సహనానికి థాంక్స్. గేటు దగ్గరికి ఇటు వైపు నించి వెళ్లాలి.
‘ఎస్ మేడం? అవును. ఇది చాలా చిన్న కోట. నిజం చెప్పాలంటే ఇది ఒకప్పటి రాజప్రాసాదంలోని ఆయుధశాల మాత్రమే. కాని వాటిలో శిథిలమవకుండా చక్కగా ఉన్నది ఇదొకటే. అందుకు కారణం దీనికి ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయడం. ఆరు వందల ఏళ్ల నించి ఇది ఒకే కుటుంబం ఆధీనంలో ఉండటంతో అది సాధ్యమైంది... అవును మేడం. ఛేస్ట్‌లీ కుటుంబం ఇక్కడ అనే్నళ్ల నించి ఉంటోంది. నూట ఏభై ఏళ్ల క్రితం ఈ గోడల మధ్య గ్రేస్ హౌస్ నిర్మాణం జరిగే దాకా ఇది ఆయుధాగారంగా ఉండేది. ఏంటి సర్ బావి? అది అటు వైపుంది సార్... ఏమిటి సర్? నాకు సరిగ్గా వినపడలేదు. ఆ బావి కాదా సార్? ఇంకొక బావా?
‘కాని తక్కువ మంది కుటుంబ సభ్యులు గల ఈ ఇంట్లో ఇంకో బావి ఎందుకు ఉంటుంది సార్? ఏమిటి? ఏం పేరన్నారు? మేరీ పర్సెల్ మరణించిన బావా సర్?’
‘ష్... దయచేసి గట్టిగా మాట్లాడకండి సార్. అవును. దాని గురించి నాకు తెలుసు. కాని దాన్ని సందర్శకులకి చూపించను సర్. మిస్టర్ ఛేస్ట్‌లీకి ఆ వ్యవహారం జ్ఞాపకం రావడం ఇష్టం లేదు సర్. దాన్ని అంతా మర్చిపోవాలని ఆయన అనుకుంటున్నాడు. లేదు సర్. మీకా మినహాయింపుని ఇస్తే నా ఉద్యోగం పోవచ్చు. మీరు గ్రూప్‌లో వచ్చారు కదా? మీరు కారులో వచ్చారా సర్? కాని బస్ ఇంకో ఐదు నిమిషాల్లో బయలుదేరుతుంది కదా సర్? మీ కోసం ఎదురుచూసే వారు ఇక్కడికి రావచ్చు కదా. ఓ! ఎవరికీ చెప్పి రాలేదా సర్?
‘అది పెద్ద మొత్తం సర్. మీకా బావి మీద గల ఆసక్తిని నేను అర్థం చేసుకోగలను. మీరు ఆ కేసు గురించి రాసిన రిపోర్టర్లలో ఒకరా సర్? ఓ... పేరేమన్నారు? మేరి పర్సెల్?
‘లేదు సర్. అప్పట్లో నేనీ ఉద్యోగం చేయడం లేదు. కాని అందరిలా నేనూ దినపత్రికల్లో ఆ కేసు గురించి చదివాను. ఒక్క నిమిషం సర్. ఈ టూర్లోని వారందరినీ పంపించేదాకా మీరు వేచి ఉంటే...
‘వెళ్లారు. ఇప్పుడు మనం మాట్లాడుకోవచ్చు సర్. నా వెంట రండి. ఆఖరి టూర్లోని వారంతా బయటకి వెళ్లాక, ఈ పాత తలుపుని మూసి బయట గడియ పెట్టాక నాకు శాంతి కలుగుతుంది సర్. రోజూ కార్ పార్క్ నించి కార్లు దూరం అయ్యే శబ్దం నాకు ఆనందాన్ని కలిగిస్తుంది. కాంపౌండ్ వాల్ మొదలయ్యే చోటికి అవి చేరుకోగానే వాటి శబ్దాలు వినపడటం ఆగిపోతుందని గమనించారా? ఇప్పుడు ఇక్కడంతా నిశ్శబ్దంగా లేదూ సర్? త్వరలోనే మనం గుడ్లగూబల అరుపులు వింటాం.
‘మీరు ఆ బావినే చూడాలని అనుకుంటున్నారా సర్? లేక ఇంకో బావినా..? ఓ... ఆ విషాదం సంభవించిన బావినేనా? నిజానికి నేను దాన్ని చూపించకూడదు. మిస్టర్ ఛేస్ట్‌లీకి అది తెలిస్తే బాగా కోపం వస్తుంది.. అది నిజమే సర్. మీరు చెప్పకపోతే సరి. ఎప్పటికీ ఆయనకి తెలీదు.
‘సర్. ఆ పెద్ద హాల్‌లోంచి పదండి సర్. మీ వెనకే నేనూ వస్తాను. నేను చెప్పకుండానే మీరు సరైన వైపు తిరిగారు సర్. నేలలో గతుకులు చాలా ఉన్నాయి. కాస్త చూసి నడవండి సర్.
‘ఆ పాత విషయం మళ్లీ బయటకి రావడం మిస్టర్ ఛేస్ట్‌లీకి ఎందుకు ఇష్టం లేదో మీరు ఊహించగలరు సర్. అది అతని జీవితాన్ని ఎంతో నాశనం చేసింది. ఆమెని చంపిన ప్రేమికుడు ఆయనే అని అంతా భావించారు. ఆమె అతని ఉద్యోగస్థుల్లో ఒకరు సర్. ఛేస్ట్‌లీ చూసీ చూడగానే ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఆమె కూడా. ఈ వదంతిని ఎవరు సృష్టించారో అతనికి తెలిసి ఉంటే, తప్పక వారి మీద నష్టపరిహారం కేసుని కోర్టులో ఫైల్ చేసేవాడు. కాని వారెవరో ఆయన తెలుసుకోలేక పోయాడు సర్. ఓ ఏడాది తర్వాత ఆయన భార్య ఆయనకి విడాకులు ఇచ్చేసింది. అది జరిగి పదేళ్లు దాటింది సర్. మళ్లీ ఆ పాత విషయాలు అంతా మాట్లాడటం ఆయనకి ఇష్టంలేదు.. లేదు సర్. మీరు బయట ఈ విషయాలు మాట్లాడుతారని నేను అనుకోవడం లేదు. లేదా నేను మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్లేవాడిని కాను.
‘నిజమే. ఆమె చాలా అందగత్తె అని అంతా చెప్తారు సర్. మిసెస్ పర్సెల్ చిన్నది. ఇరవై ఒక్క ఏళ్లే. ఆమె ఫొటోలు ఆమె చర్మం రంగుకి న్యాయం చేయలేదని ఆమెని చూసిన చాలామంది చెప్పగా విన్నాను సర్. అద్భుతమైన నీలం రంగు కళ్లు... ఓ! ఆకుపచ్చ రంగు కళ్లా సర్? లేదు. మీతో వాదించను సర్. మీరు పత్రికా విలేకరిగా ఆ వ్యవహారాన్ని రాసాను అంటున్నారు కాబట్టి మీకే ఎక్కువ తెలిసి ఉండాలి. ఈ కింది ఆఖరి మెట్టు దగ్గర జాగ్రత్త సర్. అది చాలా అరిగి గుంట పడింది.
‘ఆకుపచ్చ రంగు కళ్లు! లేదు. లేదు. నేను మీరు చెప్పింది నిజమనే నమ్ముతున్నాను. మీ జ్ఞాపకశక్తికి మీరు శిక్షణ ఇచ్చారని కూడా నేను నమ్ముతున్నాను. ఏది ఏమైనా గ్రామీణ వాతావరణంలో పెంచబడ్డ ఆమె చిన్నది, అందమైంది. అమాయకురాలు. ఆమె తోటమాలుల్లోని ఒకరి కూతురు. మీరు ఆమె తండ్రిని కలవలేదా సర్? లేదా? నిజమే. ఆయన పత్రికలకి చెప్పడానికి ఏమీ ఉండదు. తర్వాత పాపం ఆయనకి ఆ విషాదానికి గుండెపోటు వచ్చింది. మిస్టర్ ఛేస్ట్‌లీ ఆయనకి పెన్షన్ ఇవ్వడం ఆరంభించి, శారీరక శ్రమలేని వేరే ఉద్యోగం ఇచ్చాడు. అదీ ఇక్కడ కాదు. అక్కడ కాదు. అన్నిచోట్లా... ఇది స్టోన్ గేలరీ సార్. అడుగులు జాగ్రత్తండి... లైట్ వెలిగిస్తాను ఉండండి... అవును సర్. ఇక్కడదంతా భయంకరంగా ఉంది. అక్కడ తమాషాగా వంకర తిరిగిన కత్తిని, పక్కనే గొడ్డలిని చూశారా? వాటన్నింటినీ నేను నిత్యం తుడుస్తూంటాను. సందర్శకులంతా వెళ్లిపోయారని రూఢీ చేసుకోడానికి రాత్రిళ్లు నేను ఇక్కడ నడుస్తూంటాను. తలుపులకి తాళాలు వేసేప్పుడు ఆ గొడ్డలిని నా వెంట ఉంచుకుంటాను. అందువల్ల నాకు వొంటరితనం పోయినట్లు అనిపిస్తుంది. నవ్వకండి. నాకు నిజంగా అలా అనిపిస్తుంది. చీకటి పడ్డాక ఇక్కడ చాలా భయం వేస్తుంది. నేను దెయ్యాల్లో ఒక్కణ్ణా అనిపిస్తూంటుంది. గొడ్డలిని మనతో తీసుకెళ్దాం. ఎందుకా? ఆ ఘోరం జరిగాక ఆ బావి మీద బరువైన మూతని మూశారు. దాని మీద ఓ కొక్కెం ఉంది. ఈ గొడ్డలి హేండల్‌ని దాంట్లోకి చొప్పించి మూతని ఎత్తడానికి సర్.
‘బావిలోకి చూడటానికి మీరు భయపడచ్చు. ఆ బావిలోకి ఇనప రింగులతో చేసిన మెట్లున్నాయి. ఆమె భర్త వాటి మీంచే లోపలకి దిగి ఆమె శవాన్ని బయటకి తెచ్చాడు సర్. మనం ఎవరం ఆ పని చేయడానికి ఇష్టపడం. భర్తగా పాపం అది అతని బాధ్యత కదా మరి.
‘ఆమె భర్త ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంటారా? మీరది ఎప్పుడూ వినలేదా? అతనికి పిచ్చెక్కింది. అతను ఇంకా పిచ్చాసుపత్రిలో ఓ సెల్‌లో ఉన్నాడు. నేను వినడం ఆ అక్రమ సంబంధం కొంతకాలం సాగింది. తను గర్భవతని తెలుసుకోగానే ఆమె కృంగిపోయింది. ఇహలోకంలోకి వచ్చి తనని ఆ వ్యక్తి ఎలా లొంగదీసుకున్నాడా అని ఆలోచించింది. ప్రియుడితో పరిచయం వల్ల ఆమె తాత్కాలిక హుషారులో ఉండి ఉంటుంది. ఆమె అతని దగ్గరికి వెళ్లి ఆ విషయం చెప్పి, ‘ఏం చేద్దాం?’ అని అడిగింది.
‘అతను ఆమెని మూర్ఖంగా ఉండద్దని, చెయ్యడానికి ఏం ఉందని ప్రశ్నించాడు. ఆమెకి ఓ భర్త ఉన్నాడు కదండి. అందుకని ఆమె నోరు మూసుకుని నిశ్శబ్దంగా ఉంటే అంతా సవ్యంగా ఉంటుందని చెప్పాడు. కాని ఆమె అతనిలా ఆలోచించలేక పోయింది. బహుశా ఆమె తన భర్తని ప్రేమిస్తూండటం ఆగిపోయి ఉండదు. తన భర్త కళ్లని చూసి ఇంకొకరి బిడ్డని అతని బిడ్డలా భావిస్తూ పెంచే ద్రోహాన్ని చేయలేనని అనుకుంది. నిజాయితీగా ఉండాలని ప్రయత్నించే ఆమె తనని తను అసహ్యించుకోసాగింది. ఆ విషయంలో తన ప్రియుడి సహకారాన్ని ఆశించింది. ఆ విషయం తర్వాత మాట్లాడదామని ఆమె ప్రియుడు ఆ సంభాషణని వాయిదా వేశాడు.
‘అతను మర్నాడు మాయం అయ్యాడు సర్. ఎక్కడికి వెళ్లాడో నాకైతే తెలీదు సర్. కాని పారిపోయాడు. లేదు సర్. అప్పుడు నేనీ ఉద్యోగంలో లేనని చెప్పాగా? ఎక్కడికి వెళ్లాడో నాకెలా తెలుస్తుంది సర్? జరిగింది ఊహించి చెప్పానంతే. నేను చెప్పినట్లుగా జరిగి ఉండకపోవచ్చు కూడా. ఒకవేళ అది మిస్టర్ ఛేస్ట్‌లీ పనై ఉంటే, ఇక్కడే ఉండి బురద చల్లించుకున్నాడు. కాని ఇప్పుడు చాలామంది అది ఆయన పని కాదని నమ్ముతున్నారు. ఆమె నిజాయితీపరురాలని చెప్పాగా. ఏది ఏమైనా ఆమె వెళ్లి తన భర్తకి జరిగిందంతా చెప్పింది తప్ప తన ప్రియుడి పేరు మాత్రం ఎన్నిసార్లు అడిగినా చెప్పలేదు. అది దాచడం ఆ భర్తని దాదాపు చంపిందనే చెప్పాలి.
‘అతను కోపంతో మండిపడటం, ఆమెని హింసించడం లాంటివి ఏం చేయలేదు. వౌనంగా వెనక్కి తిరిగి వెళ్లిపోయాడు. ఆమె ఏడుస్తూ అతని వెనకే వస్తే అతను భరించలేక ఆమెని కొట్టాడు.
‘నిజమే సర్. నాలో ఊహాశక్తి అధికం. నేను కాదనను. మీరు కూడా ఈ ప్రదేశంలో ఒంటరిగా గడుపుతూంటే మీలో కూడా ఊహా శక్తి పెరుగుతుంది సర్. రాత్రిళ్లు ఒకోసారి వాళ్లిద్దరూ కలిసి నడవడాన్ని నేను చూస్తూంటాను. భయపడకండి. నా ఊహల్లోనే సుమా. నేను అనుకోవడం ఆమె జీవితానుభవం లేని అమాయకురాలు. తనని అంత ప్రేమగా చూసుకునే తన భర్త కొట్టడంతో ఆమె మనసు చెదిరింది. తన భర్తకి, తనకి సంబంధం తెగిపోయిందని, ఇక తనతో కాపురం చేయడని భావించి ఉంటుంది. అతను లేకపోతే తనకి ఇంక ఏమీ ఉండదు. భర్త ప్రవర్తనని చూడాలని, తన భర్త తనని నిజంగా వదిలేస్తాడో లేదో ఆమెకి వేచి చూడాలని స్ఫురించలేదు సర్. ఆమెలో ఆశలేదు. తక్షణం ఏడుస్తూ పరిగెత్తుకెళ్లి ఆ బావిలో దూకింది.
‘ఐదు నిమిషాల దాకా ఆమె జీవించి ఉంటే అతను ఆమెని కొట్టినందుకు క్షమాపణ చెప్పేవాడు. కాని అప్పటికే బాగా ఆలస్యం ఐపోయింది. శవాన్ని బయటకి తీసేసరికి ఆమె జుట్టు నిండా, అందమైన ఆమె ఆకుపచ్చ కళ్ల నిండా పాచి అంటుకుని ఉంది.
‘సరిగ్గా ఇక్కడే సర్. మీరు నించున్న చోటు నించి ఆమె దూకింది సర్. అదే సర్ ఆ బావి మీది మూత. అప్పటి నించి ఈ బావిని మూసి ఉంచారు. ఎవరూ మళ్లీ తెరవకుండా మూతని బరువుగా చేయించారు. మీరు కొద్దిగా వెనక నిలబడితే గొడ్డలి హేండిల్‌ని ఆ హుక్‌లోకి పోనించి దీన్ని లేపుతాను. బహుశ ఆ తర్వాత ఈ మూత తెరచుకోవడం ఇదే మొదటిసారై ఉంటుంది సర్. నిజానికి ఇక్కడికి అప్పటి నించి ఎవరూ అసలు వచ్చి ఉండరు సర్.
‘లోపలకి చూడండి సర్. ఊహూ... బావి ఎంత లోతో ఎవరికీ తెలీదు సర్. వత్తి ఇంకొంచెం పెద్దది చేస్తాను. అప్పుడు ఇంకాస్త స్పష్టంగా చూడచ్చు. ఇలాంటి బావిలోకి దూకాలంటే ఆ అమ్మాయి మనసు పగ్గాలు ఆమె స్వాధీనం తప్పి ఉంటాయి కదా సర్?
‘మూడేళ్లల్లో ఈ రాత్రి దాకా ఇక్కడికి నేను తప్ప ఎవరూ రాలేదు సర్. బహుశా తర్వాతి మూడేళ్ల దాకా కూడా ఎవరూ రారు సర్. మళ్లీ ఎవరైనా చూడాలంటారని అనుకోను సర్. వచ్చిన వారు బావి మీది మూతన తెరవరు... అవును సర్. నేనే ఇక్కడంతా శుభ్రం చేసేది. నాకు అశుభ్రత అంటే ఇష్టం ఉండదు సర్. ఈ గొడ్డలిని చూడండి సర్. దుమ్ముకాని, బూజు కాని లేదు. పదును కూడా పోలేదు. ఓ సారీ సర్. మీ చెయ్యి కోసుకుందా?
‘పిచ్చి నాకా సర్. లేదు. ఆమె భర్తకి. అతన్ని మెంటల్ హాస్పిటల్‌లో బంధించారు. నాకు వచ్చిన అనారోగ్యం కేవలం గుండెపోటే. అది నా శక్తిని హరించలేదు సర్. నాకు పెన్షన్ ఇచ్చి బరువులు ఎత్తని ఈ గైడ్ ఉద్యోగం ఇచ్చారు సర్. ఐనా నేను బలహీనుడ్ని కాను సర్. తొందరపడకండి సర్. ఇంకా చెప్పాల్సింది ఉంది.
‘లేదా? ఉంది సర్. ఐనా లేదని మీకెలా తెలుసు? ఎక్కువ తెలుసుకుని ఉండటం పొరపాటు సర్. ఒక్కోసారి ప్రమాదకరం కూడా. సాధారణంగా నేరస్థులకే అందరికన్నా ఓ నేరం గురించి అధికంగా తెలుస్తుంది సర్.
‘మీరు మేరీ పర్సెల్ అన్నారా? ఆమె మొదటి పేరు ఏలిస్. దినపత్రికల్లో ఆ పేరునే ఉపయోగించారు సర్. ఆమె కుటుంబ సభ్యులు, దగ్గరి వారే ఆమెని మేరీ అని పిలిచేవారు. ఆమె కళ్లు ఆకుపచ్చ రంగని మీకెలా తెలుసు సర్? పత్రికా విలేకరులు ఆమె శవం దగ్గరికి చేరుకునేసరికి అవి మూసేయబడ్డాయి. కాని ఆమె ప్రియుడికి ఆ రంగు తెలుసు సర్.
‘అవును సర్. నాకు ఇప్పుడు మీరు ఎవరో తెలుసు సర్. ఆ వేసవిలో లోవెల్స్‌లో నివసించిన యువకుడు మీరు. మనం మేరీ గురించి మాట్లాడాలి సర్... సారీ.. ఆమె భర్త టిమ్ పర్సెల్‌లో ఈ పార్టీలో పాలుపంచుకోనందుకు నాకు విచారంగా ఉంది సర్. అతను ఇక్కడి ఉండి ఉంటే బహుశ అతనికి మంచి జరిగేది. కాని ఉండాల్సిన వాళ్లు ఉన్నాక ఇక్కడ లేని వాడి గురించి మాట్లాడటం అనవసరం సర్.
‘బయట నేనేం చేస్తున్నానా? ఈ గది తాళం ఇంకా పని చేస్తోందో లేదో పరీక్షిస్తాను సర్. దీనికి ఆయిల్ వేసి ఎంత కాలమైందో సర్. ఈ కోటలో ఎన్నో తాళాలు, ఎన్నో తాళం చెవులు సర్. మిస్టర్ ఛేస్ట్‌లీ ఈ గదికి ఎప్పుడూ తాళం వేసే ఉంచాలని నాకు చెప్పారు సర్. తాళం పడింది సర్
‘మీరు ఈ కోటకి వొంటరిగా రావడం విధి కాక ఇంకేమిటి సర్? మీరు కారులో కూడా రాలేదు. ఇక్కడికి రాబోయే ముందు గ్రామం నించి టూరిస్ట్ బస్సులో వచ్చారు. వాళ్లు ఐదు నిమిషాలు మించి వేచి ఉండరు. మీరు ఏమయ్యారా అని పట్టించుకోరు కూడా. వాళ్లు వ్యక్తులు కాదు సర్. వ్యాపారస్థులు. ఇప్పుడు వాళ్లు తమ పౌండ్లని లెక్క పెట్టుకుంటూండచ్చు. మీరు ఇక్కడికి వస్తున్నట్లు ఎవరికీ చెప్పలేదన్నారు. కాబట్టి మీ కోసం ఎవరూ ఇక్కడికి రారు. కాని మీరు మళ్లీ ఇక్కడికి రాకుండా ఉండలేకపోయారు కదా? మీరు ఎందుకు వచ్చారో కూడా బహుశ మీకే స్పష్టంగా తెలీకపోవచ్చు. మీరు ఇక్కడ మేరీ తండ్రిని కలుస్తారని కల్లో కూడా ఊహించి ఉండకపోవచ్చు. నేను మాత్రం మళ్లీ మిమ్మల్ని చూడాలని కలలు కంటున్నాను సర్. నా దీర్ఘమైన కల ఈ రోజు నిజం అయింది సర్.
‘ఆగండి సార్... మీరే నేనైతే అరవను సార్. అరిచినా ఆ అరుపులు ఎవరికీ వినపడవు సర్. అరమైలు దూరంలో మీరు, నేను తప్ప ఇంకెవరూ లేరు సర్. ఈ గోడలు చాలా దళసరివి సర్. చాలా దళసరివి. నేను వెళ్తున్నాను సర్. మీరు మేరీని మీ జీవితపు ఆఖరి రోజుల్లో కలుసుకోవడం మీకు ఆనందంగా లేదా సర్. ఆమె వియోగాన్ని మీరు భరించలేకపోతే గొడ్డలి ఉంది సర్. దాన్ని లోపలే వదిలాను. మీకు దాహం ఐతే ఆ బావిలోకి దిగకండి. అది ఎండిపోయిన బావి. మీరు మీ జీవితంలో ఆఖరిగా వినేది దూరంగా వెళ్లే నా బూట్ల చప్పుడే సర్.’

ఎల్లీ పీటర్స్ కథకి స్వేచ్ఛానువాదం

మల్లాది వెంకట కృష్ణమూర్తి