S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

చావు తెలివి (విలన్స్, స్కౌన్‌డ్రల్స్ అండ్ రాస్కెల్స్)

ఆ వేసవి శనివారం రాత్రి ఎనిమిదికి ‘స్టీవ్స్ పీజా’ దుకాణంలో పీజాలు తృప్తికరంగా అమ్ముడు అవుతున్నాయి. ఆ వ్యాపారం ఓ శుభ్రమైన కారు గేరేజ్ నించి జరుగుతోంది. వంట గది, ఆఫీస్ గది కూడా ఆ గేరేజ్‌లోనే. స్టీవ్స్ పీజా ఫార్చూన్ 500 కంపెనీల జాబితాలోకి ఎప్పుడైనా ఎక్కినా ఆశ్చర్యం లేదని స్టీవ్ నమ్మకం. అతను పరిపూర్ణ ఆశావాది. అతనిది హోం డెలివరీ సర్వీస్ తప్ప రెస్ట్‌రెంట్ కాదు కాబట్టే గేరేజ్ నించి దాన్ని నడుపుతున్నాడు. ఇటలీలోని అతని అమ్మమ్మ అమ్మమ్మ చేసిన పీజా రెసిపీ తరతరాలుగా వస్తోంది. దాన్ని ఉపయోగించే స్టీవ్ వాటిని తయారుచేస్తున్నాడు. దాంతో రుచికరమైన పీజాలకి వీకెండ్‌లో డిమాండ్ బానే ఉంటోంది. పని దినాల్లో రద్దీ తగ్గుతుంది.
బయట ముగ్గురు డ్రైవర్లు డెలివరీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారి కార్లన్నీ ఫిఫ్త్ హేండ్‌లో కొన్నవి, స్టీవ్ ట్రాపికల్ స్ట్రాం పీజాకి ఆ చుట్టుపక్కల వాళ్లే ఆర్డర్ ఇస్తూంటారు. కాబట్టి ముగ్గురు సరిపోతారు. అరుదుగా దూర ప్రాంతాన్నించి ఆర్డర్ వస్తూంటుంది.
గేరేజ్ బయట బజరు మోగింది. ఒకే పీజాని పంచుకుని తినే ఆ ముగ్గురిలోని జిమ్ వంతు రావడంతో అతను లేచి లోపలకి వెళ్లాడు.
‘లెకీ అవెన్యూ, నార్త్‌కి రెండు చిరునామాలకి పీజాలని తీసుకెళ్లాలి. వారు కోరినట్లుగా ఎక్స్‌ట్రా ఛీజ్ వేశాను’ స్టీవ్ చెప్పాడు.
సిద్ధంగా ఉన్న రెండు పీజా పెట్టెలని చూపించాడు. లెకీ అవెన్యూ అప్పుడప్పుడే అభివృద్ధి చెందే కాలనీ. ఎక్కువగా అక్కడ బీదలే నివసిస్తారు. టిప్ బాగా తక్కువ ఇస్తారు. ఓసారి మాత్రమే వీకెండ్‌కి భార్య బయటకి వెళ్లి, ఇంట్లో తాగిన భర్త తృప్తికరమైన టిప్‌ని ఇచ్చాడు. జిమ్ మనసులోనే మూలిగాడు. కాని ఏం మాట్లాడకుండా గుండ్రటి పీజాలు గల ఆ రెండు నలుచదరపు పీజా పెట్టెలతో బయటకి వచ్చి వాటిని కారు వెనక సీట్లో ఉంచి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు.
కారు స్టార్ట్ చేసి రేడియో పలుకుతుందనే ఆశతో దాన్ని ఆన్ చేశాడు. గత నలభై ట్రిప్పుల్లో మూడు సార్లే అది పలికింది. కారులోని అనేక భాగాలు చేసే శబ్దాన్ని రేడియో లోంచి వచ్చే శబ్దం మరుగు పరుస్తుందని తప్ప జిమ్ సంగీతమో, రేడియో డ్రామానో వినాలని కాదు. కాబట్టి ఏ స్టేషన్ పలికినా అతనికి సంతోషమే.
ఎప్పటిలాగే రేడియో పని చేయలేదు. ఆ కారు ప్రయాణిస్తూండగా తలుపులు పడిపోతాయేమో అనిపించేంత భయంకరమైన శబ్దాలు చేస్తూంటాయి.
ఆ డొక్కు కారు రోడ్ ఎక్కిన ఐదు నిమిషాలకి జిమ్‌కి అకస్మాత్తుగా లోపలి గాలి వత్తిడి బయటికన్నా ఎక్కువగా ఉన్నట్లుగా అనిపించింది. కారులో తనే కాక ఇంకొకరు కూడా ఉన్నారని అనిపించింది. తలతిప్పి చూస్తే పక్క సీట్లో ఎవరూ లేరు. రియర్ వ్యూ మిర్రర్‌లోంచి వెనక సీట్లో కూర్చున్న వ్యక్తి మొహం కనిపిచింది. తల వెనక్కి తిప్పి కొన్ని క్షణాలు అతన్ని చూసి మళ్లీ తలని ముందుకి తిప్పాడు. ఆ కారుకి ఇన్సూరెన్స్ లేదు. దానికి ప్రమాదం జరిగితే నష్టపరిహారం రాదు. కారు లేకపోతే అతని సంపాదన ఆగిపోతుంది. ఇంకో కారు టెంత్ హేండ్‌దైనా సరే కొనడానికి అతనికి అప్పు దొరకదు.
‘నా దగ్గర ఇరవై డాలర్లలోపే ఉన్నాయి. తీసుకో. నీ పక్క సీట్లోని పీజా మొత్తాన్ని తిన్నా నాకు అభ్యంతరం లేదు. కాని నన్ను మాత్రం ఏం చేయక’ జిమ్ అభ్యర్థించాడు.
‘నాకు కావాల్సింది ఈ రెండూ కాదు’ వెనక సీట్లోంచి వినిపించిన కంఠం భయంకరంగా ఉంది.
‘ఇంకేం కావాలి?’
‘నువ్వు ఎవరు అన్నది సరైన ప్రశ్న. అందువల్ల నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను అన్నది నీకు తెలుస్తుంది’ భయంకరమైన నవ్వు వినిపించింది.
‘సరే. నువ్వు ఎవరు?’
‘నన్ను మృత్యువు అని పిలు. చాలు’
జిమ్‌కి అందులో ఎలాంటి అపనమ్మకం కలగలేదు. అతని కంఠం, అతను ధరించిన కారు నలుపు సూట్, అదే రంగు టై. అతని మొహంలోని క్రూరత్వాన్ని చూసి ఇందాక భయపడ్డాడు. అతని కళ్లల్లో మానవత్వం లేదు.
మృత్యువు తన కారులోకి ఎందుకు ఎక్కిందా అని ఆలోచిస్తే జవాబు తట్టడానికి జిమ్‌కి కొద్దిసేపు పట్టింది. మృత్యువు తారసిల్లినప్పుడు ఎవరిలోనైనా కలిగే స్పందనే అతనిలో కూడా కలిగింది.
‘ననే్న ఎందుకు? ఇవాళే ఎందుకు?’ తడబడుతూ అడిగాడు.
‘అది నేను జవాబు చెప్పాల్సిన ప్రశ్న కాదు’
అతను తన చేతిలోని అరఠావు కాగితం ఉన్న క్లిప్ అట్టని చూస్తూ అడిగాడు.
‘జిమ్ కదా?’
‘అవును’
‘నీ కారు నంబర్?’ అందులో టిక్ చేసుకుని మళ్లీ అడిగాడు.
జిమ్ చెప్పాక అందులో ఇంకోసారి టిక్ చేసుకుని మృత్యువు చెప్పాడు.
‘నువ్వు షెడ్యూల్ ప్రకారమే ఉన్నావు. కాబట్టి నీతో రాక తప్పదు’
‘ఎప్పుడు? ఎలా?’ భయంగా అడిగాడు.
అతను ఆ అట్టల్లోని కాగితాలని తిప్పి చదివి చెప్పాడు.
‘నువ్వు కలెన్ బుల్‌వార్డ్‌కి చేరుకున్నాక ఓ పెద్ద తెల్ల లారీ నీ కారుని గుద్దడంతో మరణిస్తావు. లేదా టౌనర్ వీధిలో..’
‘అంటే నేను ఈ రెండు మార్గాల్లో నా గమ్యానికి ఎటెళ్లినా మరణిస్తానన్న మాట?’
‘బహుశ అవును. అందుకు రెండు లారీలు ఇప్పటికే బయలుదేరాయి’
‘బహుశ అన్నారు. అంటే అది రూఢీగా జరిగే అవకాశం లేదా?’
మృత్యువు జవాబు చెప్పలేదు. అతను నాలిక కొరుక్కోవడం రియర్ వ్యూ మిర్రర్‌లోంచి చూసిన జిమ్ అడిగాడు.
‘నేను మృత్యువుని తప్పించుకునే దారి ఉందా?’
‘ప్రతీ సందర్భంలోను మృత్యువుని తప్పించుకునే అవకాశం ఒకటి ఉంటూనే ఉంటుంది. కాని అది సగటున పది కోట్లమందిలో ఒక్కరికే జరుగుతూంటుంది. నువ్వు అది కనుక్కోగలిగితే నీ బదులు మరో ఆరుగుర్ని నేను తీసుకెళ్లాల్సి ఉంటుంది. అది నాకు చాలా అదనపు పని. కాబట్టి ఈ కారు తెల్ల లారీని గుద్ది నువ్వు చచ్చిపోవడమే మంచిది’
జిమ్ కలెన్‌లోకి వెళ్లే మొదటి ఎగ్జిట్‌ని తిరక్కుండా హైవేలో ముందుకి పోనిస్తూ అడిగాడు.
‘దయచేసి నేను తప్పించుకునే మార్గం ఏమిటో చూచాయగానైనా నాకు చెప్పరా?’
‘అది నీకు చెప్తే నాకు చివాట్లు తప్పవు. ప్రతీ పది కోట్లసార్లలో ఓసారి అలా జరిగినప్పుడల్లా నేను పైవాడికి తృప్తికరమైన వివరణని ఇవ్వాల్సి ఉంటుంది’
జిమ్ కొద్దిసేపు ఆలోచించి అడిగాడు.
‘ఆ తెల్ల లారీని నా కారు గుద్దుకోకపోతే నేను జీవించే ఉంటానా?’
‘శాశ్వతంగా కాదు. డెబ్బై ఐదు ఏళ్లు ఎక్కువలో ఎక్కువ’
‘అనే్నళ్లేనా?’ నిరుత్సాహంగా అడిగాడు.
‘సరే. తొంభై ఏళ్లు. కాని నువ్వు అంతకాలం బతికే అవకాశం లేదు. నీకా తప్పించుకునే ఏకైక మార్గం తట్టదు’
ఆ పాత కారు టౌనర్ వీధి ఎగ్జిట్‌కి చేరుకుంది. జిమ్ ట్రాఫిక్‌ని శ్రద్ధగా పరిశీలించి చూశాడు. తర్వాత కారుని యుటర్న్‌లో వెనక్కి తిప్పే ప్రయత్నం చేశాడు. కాని స్టీరింగ్ వీల్ తిరగలేదు.
‘ఇది అంతా ఊహించే తప్పించుకునే మార్గమే. కారుని వెనక్కి తిప్పలేవు’ మృత్యువు నవ్వి చెప్పాడు.
జిమ్ కారుని ఆపి రివర్స్ గేర్ వేసి వెనక్కి పోనిస్తూ చెప్పాడు.
‘వెనక నించి నా కారుని ఎవరైనా గుద్దినా నా కారు చస్తుంది తప్ప నేను చావను. నేను చావాల్సింది ఇప్పటికే బయలుదేరిన రెండు తెల్ల లారీల్లో ఒకటి ఈ డొక్కుని గుద్దితేనే. అవునా?’
మృత్యువు చిన్నగా నిట్టూర్చి చెప్పాడు.
‘ఇప్పుడు నేను ఇంకో ఆరుగుర్ని తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. పది కోట్ల సార్లలో మళ్లీ ఇలా జరిగింది’
‘అది నా సమస్యకాదు. నేను తొంభై ఏళ్లు జీవించడం నిజమేనా?’ జిమ్ ప్రశ్నించాడు.
‘మృత్యువు అబద్ధం ఆడదు. గుడ్‌లక్ జిమ్’
రియర్ వ్యూ మిర్రర్ లోంచి చూస్తే వెనక సీట్ ఖాళీగా ఉంది. అకస్మాత్తుగా లోపలి గాలి వత్తిడి తగ్గిన భావన కలిగింది.
జిమ్ రియర్ వ్యూ మిర్రర్‌లోంచి, సైడ్ మిర్రర్లలోంచి వెనక్కి చూస్తూ జాగ్రత్తగా కారుని రివర్స్‌లో పోనివ్వసాగాడు.
చాలా వాహనాలు వెనక్కి వచ్చే జిమ్ కారుని చూసి హారన్స్ కొట్టసాగాయి. అదృష్టవశాత్తు ఆ పది నిమిషాల సేపు హైవే పెట్రోల్ కార్లు అటువైపు రాలేదు. లేదా జిమ్ కారుని ఆపి చలాన్ చేసేవారు.
కొంతదూరం వెళ్లాక జిమ్ ఇంకో ఎగ్జిట్ తీసుకుని మరో మార్గంలో లెకీకి చేరుకున్నాడు. వాటిని డెలివరీ తీసుకున్న వారు పది నిమిషాలు ఆలస్యం అయిందని టిప్ ఇవ్వకపోయినా జిమ్ బాధపడలేదు.
‘తిరిగి మనం ఇంటికి క్షేమంగా చేరితే నేను నిన్ను బాగా కడిగిస్తాను’ తిరిగి వెళ్తూ జిమ్ కారుకి చెప్పాడు.
కాని అతను ఆ మాటని నిలబెట్టుకోలేదు. ఆ రాత్రే మర్చిపోయాడు.
* * *
మర్నాడు ఉదయం డోర్ బెల్ విని జిమ్ లేచి వెళ్లి తలుపు తెరిచాడు. ఎదురుగా యూనిఫాంలో ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు కనపడ్డారు.
‘జిమ్?’ ఒకరు ప్రశ్నించారు.
‘అవును’
‘నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు?’
‘స్టీవ్ పీజాలో’
‘ఏం పని చేస్తున్నావు?’
‘డెలివరీ మేన్‌గా. ఏం?’
‘నిన్న రాత్రి నువ్వు డెలివరీ చేసావా?’
‘చేసాను’
‘లెకీలో?’
‘అవును. లెకీలో రెండు ఇళ్లల్లో రెండు పీజాలని. వాళ్లు టిప్ ఇవ్వలేదని ఫిర్యాదు చేస్తున్నాను’ నవ్వుతూ చెప్పాడు.
‘నీ మీద ఓ ఫిర్యాదు ఉండటంతో నీ దగ్గరికి వచ్చాం’ రెండో ఆఫీసర్ చెప్పాడు.
‘నా మీద? ఏం ఫిర్యాదు?’
రాత్రి రివర్స్‌లో వెళ్తూంటే చూసిన ఎవరో తన కార్ నంబర్ రాసుకుని ఫిర్యాదు చేశారని జిమ్ తేలిగ్గా ఊహించాడు.
కాని దానికి మరణశిక్ష పడదు.
‘నిన్న రాత్రి నువ్వు పీజాని డెలివరీ చేసిన ఇళ్లల్లో నలుగురు పోయారు. మరో ఇద్దరికి సీరియస్‌గా ఉంది. వారి లక్షణాలన్నీ ఒకటే. వీరందరికీ కామన్‌గా జరిగింది స్టీవ్ పీజా నించి వచ్చిన పీజాలని తినడమే. వాటిని డెలివరీ చేసింది నువ్వే’
జిమ్ భృకుటి వెంటనే ముడివడింది.
‘వాటిల్లో విషం కలిసిందని తెలిసింది. ఆ బేచ్‌లో స్టీవ్ వండిన మిగిలిన పీజాల్లో విషం లేదు. వాటిని మిగిలిన ఇద్దరు డెలివరీ మెన్ వేరే ఇళ్లల్లో డెలివరీ చేశారు. వాటిని తిన్న ఎవరికీ ఏం కాలేదు. కాబట్టి నువ్వు డెలివరీ చేసిన పీజాల్లోనే విషం కలిసిందని రూఢి అయింది. దీని గురించి నువ్వేం చెప్తావు?’
జిమ్ వెంటనే ప్రశ్నించాడు.
‘నన్ను ఉరి తీస్తారా?’
‘లేదు. ఈ రాష్ట్రంలో మరణశిక్ష లేదు. యావజ్జీవ కారాగార శిక్ష మాత్రమే ఉంది’
జిమ్ వెంటనే గట్టిగా మూలిగి చెప్పాడు.
‘ఐతే తొంభైయవ ఏడు దాకా నేను జైల్లోనే గడపాలా? ఛ! నేను మృత్యువుని ఓడించానని సంతోషపడ్డాను. దీనికన్నా మృత్యువే మంచిది అనిపిస్తోంది’
‘నువ్వు తొంభై ఏళ్లే బతుకుతావో లేక ఇంకా తక్కువ ఏళ్లో బతుకుతావో ఎవరు చెప్పగలరు?’ మొదటి పోలీస్ ఆఫీసర్ నవ్వుతూ ప్రశ్నించాడు.

డేన్ క్రఫోర్డ్ కథకి స్వేచ్ఛానువాదం

మల్లాది వెంకట కృష్ణమూర్తి