S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

విశ్వాసం (కథ)

రాజయ్యకి కుక్కలంటే ఉన్న ఇష్టం కొద్దీ తమ ఇంట్లో ఒక కుక్కను పెంచుకోసాగాడు. దాని పేరు రాజి. అది చాలా తెలివైనది. పైగా దానికి ఆ వీధిలో ఏ ఇంట్లో దొంగలు పడ్డా పసిగట్టే శక్తి ఉంది. దాంతో దొంగ ఆ వీధిలోకి చొరబడగానే కనిపెట్టి గట్టిగా అరిచేది. అది విని భయపడి పారిపోయేవాడు దొంగ.
అలా ఆ వీధిలో దొంగతనాలు జరిగేవి కాదు. ఈ విషయం ఆ వీధిలో వాళ్లకు తెలియదు. పైగా రాజి మొరిగినప్పుడల్లా నిద్ర పట్టక విసుక్కునేవారు. దాన్ని ఎక్కడైనా వదిలెయ్యమని రాజయ్యకి ఎన్నోసార్లు చెప్పారు. వినేవాడు కాదు రాజయ్య.
దాంతో విసుగెత్తిపోయిన వాళ్లంతా కుట్ర పన్ని రాజయ్య ఇంట్లో లేని సమయం చూసి రాజయ్య ఇంటికి వెళ్లి, తోక ఊపుతూ ప్రేమగా దగ్గరికి వచ్చిన రాజికి మత్తు మందు వాసనతో స్పృహ పోగొట్టి, దానిని గోనెసంచిలో కుక్కి ఊరికి దూరంగా తీసుకుపోయి పాడుపడిన ఇంట్లో కట్టేసి ఏమీ ఎరగనట్టు ఇంటికి వచ్చేశారు.
ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చిన రాజయ్య రాజి కనపడక ఎన్నో చోట్ల దాని కోసం వెతికాడు. ఎంత వెతికినా ఎక్కడా కనపడలేదు. చాలా బాధపడ్డాడు రాజయ్య. ఏమీ తినబుద్ధి కూడా కాలేదు. ఆ వీధిలో వాళ్లు మాత్రం కుక్క పీడ విరగడయ్యిందని భావించి హాయిగా తిని, ప్రశాంతంగా నిద్రపోయారు. రాజయ్యికి రాజి మీద బెంగతో ఆ రోజే కాదు ఆ మర్నాడు కూడా నిద్ర పట్టలేదు.
అయితే ఆ వీధిలో కుక్కలేని సంగతి దొంగలకు తెలిసి దొంగతనానికి వచ్చారు. అప్పటికే కుక్క మొరుగులు లేక హాయిగా గుర్రుపెట్టి నిద్రపోతున్న ఆ వీధిలోని వాళ్లు నిద్రమత్తులో దొంగల జాడను కనిపెట్టలేక పోయారు. దొరికినదంతా దోచుకుని సంతోషంగా తిరుగు ముఖం పట్టారు దొంగలు. అలా వెళుతూ, వెళుతూ,
‘హమ్మయ్య!.. ఇంతకాలానికి ఈ వీధిలో దొంగతనం చెయ్యగలిగాను’ అన్నాడు ఆ ఇద్దరిలో ఒక దొంగ.
‘అవును!... నాక్కూడా ఈ వీధిలో దొంగతనం చెయ్యాలని ఉండేది. కానీ కుక్కంటే భయం. ఒక దొంగగా ఈ వీధిలో దొంగతనం చెయ్యలేకపోతున్నానే అనే అసంతృప్తి ఉండేది. వాళ్లకి తెలియకుండానే ఆ కుక్కని దూరంగా పాడుపడ్డ ఇంట్లో వదిలిపెట్టి ఈ వీధిలోని వాళ్లు మనకు మేలు చేశారు...’ అన్నాడు రెండో దొంగ.
‘ఈ విషయం నీకెలా తెలిసింది?’ అన్నాడు మొదటి దొంగ తెగ సంతోషపడిపోతూ.
‘ఏముంది..! నిన్న రాత్రి దోచుకున్న సొత్తుతో పారిపోయి ఊరి చివర పాడుబడ్డ ఇంటిలో దాక్కున్నాను. అక్కడ నన్ను చూసి కుక్క మొరిగింది. దాని అరుపులను గుర్తుపట్టి ఇది ఇక్కడెందుకు ఉందా అని వాకబు చేస్తే విషయం తెలిసింది. వెంటనే నీకు చెప్పాను...’ అన్నాడు పట్టలేని సంతోషంతో దోచిన సొత్తును ఆ భుజం మీద నుంచి ఈ భుజం మీదకు మార్చుకుంటూ. అయితే నిద్రపట్టక అటూ ఇటూ దొర్లుతున్న రాజయ్య చెవిలో పడ్డాయి ఈ మాటలు.
దాంతో గబుక్కున లేచి ‘దొంగ.. దొంగ’ అని అరవబోయి ‘నాకెంతో ఇష్టమైన నా కుక్కను ద్వేషించి, నాకు దూరం చేసిన వాళ్ల సొత్తును కాపాడాలా? లేక అపకారికి ఉపకారము చెయ్యాలని పెద్దలు చెప్పిన దాని ప్రకారము వాళ్లు చేసిన ద్రోహాన్ని మరచి దొంగల్ని పట్టిచ్చి ఉపకారం చెయ్యాలా?’ అని ఆలోచించి చివరికి ఉపకారం చెయ్యాలనే నిర్ణయానికొచ్చి ‘దొంగ దొంగ..’ అని గట్టిగా అరిచాడు. అతని అరుపులు విన్న ఆ వీధిలోని వాళ్లంతా నిద్రమత్తు వదిలి వీధుల్లోకి పరుగెత్తుకుని వచ్చి దొంగల్ని పట్టుకున్నారు.
జరిగిందంతా రాజయ్య నోటి వెంట విన్న వాళ్లు తాము చేసిన పనికి సిగ్గుతో తలవంచుకున్నారు.
‘మేము నీకంత హాని చేసినా నువ్వు మాకెంతో మేలు చేసావు. అరుస్తుందనే అనుకున్నాం తప్ప రాజి మంచితనాన్ని కనిపెట్టలేక పోయాము. మేము చేసింది చాలా తప్పు’ అని రాజయ్యను క్షమాపణ అడిగారు.
దానికి రాజయ్య ‘మనము ఎవరినైనా ప్రేమిస్తే మనలను వారు ప్రేమిస్తారు. అయితే మీరు ద్వేషించినా మిమ్మల్ని ప్రేమించి కాపాడింది రాజి. అది దాని గొప్పతనం. ఇకనైనా మీరు తప్పు తెలుసుకున్నారు. అదే చాలు’ అన్నాడు రాజయ్య రాజి కోసం బయలుదేరుతూ...
‘వద్దు రాజయ్యా!... నువ్వు వెళ్లద్దు. ఈ రోజు నుంచీ రాజి మనందరిదీ. మేమే రాజిని తీసుకొస్తాం’ అని ఊరి చివర పాడుబడ్డ ఇంటికేసి పరుగెత్తారు. అప్పటికే అరిస్తే యజమానికి వినిపించి రక్షిస్తాడని అరవడమే కాక, రెండు రోజుల్నుంచీ తిండిలేక నీరసించి కిందపడిపోయి ఆకలితో మూలుగుతున్న రాజిని ప్రేమగా ఎత్తుకుని ఇంటికి తీసుకువచ్చి ఆహారం పెట్టి రాజయ్యకు అప్పగించారు. రాజిని ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు రాజయ్య.
ఆనాటి నుంచీ ఆ వీధిలోని వాళ్లందరికీ ప్రేమపాత్రురాలయ్యింది రాజి.

-కనె్నగంటి అనసూయ