S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సంగీత సద్గురువులు (అమృతవర్షిణి)

సంగీత మూర్తి త్రయమైన త్యాగరాజు, శ్యామశాస్ర్తీ, ముత్తుస్వామి దీక్షితులు సంప్రదాయ సంగీత వికాసానికి మూల పురుషులు. వీరికి ముందూ సంగీతం ఉంది. వాగ్గేయకారులున్నారు. కానీ ఈ ముగ్గురికీ ఒక ప్రత్యేకత ఉంది.
ఈ ముగ్గురూ తంజావూరు ప్రాంతానికి చెందినవారే.
సంప్రదాయ సంగీతం ఇలా ఉండాలి - అని లోకానికి చెప్పేందుకే వీరు పుట్టారేమో అనిపిస్తుంది.
వీరిలో త్యాగయ్యగారికి శిష్యకోటి ఎక్కువ. స్వచ్ఛమైన, అచ్చ తెలుగు భాషలో కీర్తనలు పాడుకుంటూ ఎక్కడో తంజావూరు సమీపంలోని తిరువయ్యారులో కూర్చుని ‘రామధ్యాన తత్పరుడై’ కడుపు నిండా నాదామృతాన్ని ఆస్వాదిస్తూ సాగిన ఆయన గానానికి పరవశులైన వారు ఆయనకు శిష్యులైపోయారు. తెలుగు భాష నేర్చుకున్నారు. పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ లాంటి వారు ఆయనతో సమానమైన ప్రతిభా విశేషాలతో కీర్తనలు రాశారు. అఖండ కీర్తినార్జించారు.
ఈ ముగ్గురూ వారికంటే ముందున్న వాగ్గేయకారుల రచనలు వినకుండా ఉంటారా?
విన్న దానికంటే భిన్నంగా ఉండాలనే ఆలోచన వచ్చి ఉందనటంలో ఆశ్చర్యపడనక్కర్లేదు.
అందుకే వీరి కీర్తనలకు ఇంత ప్రాచుర్యం వచ్చింది.
అన్నమాచార్యుల వారి ఒరవడిలో, ఆయన తర్వాత దైవపరంగా వర్గీకరించుకుంటే దివ్య నామ కీర్తనలు, ఉత్సవ సంప్రదాయ కీర్తనలు, విష్ణు, శివ కీర్తనలు, అలాగే ఆయా క్షేత్ర కృతులు, లాలలు, జోలలు, మేలుకొలుపులు, మంగళ హారతులు రచించినది త్యాగరాజే. ఆయనకు ఉభయ భాషా పాండిత్యం ఉంది. కానీ, భావ సౌలభ్యం కోసం తెలుగు భాషనే ఎన్నుకున్నాడు.
‘దధి నవనీత క్షీరములు రుచో’
దాశరథీ ధ్యాన భజన సుధారసము రుచో
పలుకు బోటిని సభలోన - పతిత
మానవుల కొసగే ఖలులు’ లాంటి మాటలు నిర్భయంగా చెవుల్లోకి దూసుకొచ్చి నిలబడతాయి. అదే ఆయనకున్న ధైర్యం, సాహసం.
బాహ్యాడంబరం కాదు. అంతశ్శుద్ధి కావాలంటారు, మనసు నిల్ప శక్తి లేకపోతే అనే కీర్తనలో. ఇలా చెప్పుకుంటూ వెళితే ఎన్నో.
మనకు లభ్యమైన ‘త్యాగరాజ కీర్తనలన్నిటిలోనూ ఆయన, పంచరత్న కీర్తనలు చాలా గొప్పవి. అటువంటి ప్రయోగం ఆయనకు ముందూ, తర్వాత ఎవరూ చేయలేదు. సాధ్యం కాదు కూడా. ఒక్కో కీర్తనా ఒక్కొక్క ఆణిముత్యం.
త్యాగయ్య బాగా పాడేవారని, ఆయన శిష్యుల వల్ల మనకు తెలిసింది. లేకపోతే అంతమంది శిష్యులు ఎందుకు పోగవుతారు?
సంగీత మూర్తి త్రయం వారి కృతులన్నీ చెక్కుచెదరకుండా, విస్తృతంగా ప్రచారం కావటానికి కారణం ఒక్కటే.
ఆ మహానుభావుల రచనలను ఆస్వాదించి, పాడగల శిష్యులు దొరకటం, వాటి స్వరలిపి భద్రపరుస్తూ మరో పదిమంది శిష్యులను తయారుచేయటం.
అన్నిటికంటే ప్రధానంగా ఒకే మూసలో ఇరుక్కుపోకుండా మనోధర్మానికి అవకాశం కల్పిస్తూ సాగటమే వీరి కీర్తనల్లో కన్పించే గొప్ప సుగుణం.
అందుకే ఎందరు పాడినా ఎన్నిసార్లు విన్నా, ఎప్పుడు విన్నా, ఏదో ఓ నూతన తేజం కనిపిస్తూంటుంది, వారి కీర్తనల్లో. ఎప్పుడో జరిగిన సంఘటన-
మహావైద్యనాథ శివన్ (1844-1893) అత్యద్భుతమైన ప్రతిభా విశేషాలు కలిగిన విద్వాంసుడు. తంజావూరు జిల్లా ‘వైయ్యాచెరి’ ఆయన స్వగ్రామం. అక్కడ ‘సప్తస్థాన’ సంగీత మహోత్సవాలు, ప్రతి ఏటా జరిగేవి. ఓ రోజు ఆయన పాటకు హాజరైన సంగీత రసికులు ఇంచుమించు - ఇరవై వేల మంది ఉండి ఉంటారు. మైకుల్లేని ఆ రోజుల్లో ఆయన పాటకున్న క్రేజ్ ఎంతో ఊహించండి.
ఆకాశం నిండా, దట్టమైన మేఘాలావరించి, ఒక్కసారి కుంభవృష్టి వర్షం పడితే ఎలా ఉంటుందో, అలా జరిగిందట ఆయన పాట కచేరీ.
తెనాలిలో నారుమంచి సుబ్బారావుగారనే సంగీత పిపాసి ఒకాయనను నేను ఎరుగుదును. ఆయన త్యాగరాజ భక్తుడు.
నిలకడగా, చిక్కగా వున్న చక్కని కీర్తన పాఠాలను తయారుచేసిమ్మని మా గురువుగారైన వోలేటి గారి నడిగారు.
ప్రసిద్ధమై, ప్రచారంలో వున్న సుమారు 80, 90 కీర్తనలు తయారుచేసిచ్చాం. గ్రంథం వేశారు. ‘ఆంధ్ర సంగీత విద్వాంసులు’ అనే పుస్తకంలో రాస్తూ, ‘నారుమంచి సీతారామయ్య లేదా జానకి రామయ్య గారలు మన ప్రాంతంలో శిష్యులను తయారుచేసి ఉంటే, మన దేశంలో సంగీతం మరింత పెరిగి ఉండేది కదా!’ అన్నారు.
ప్రఖ్యాత విద్వాంసుడు కోనేరి రాజపురం వైద్యనాథ భాగవతార్ బాణీ అంటే పిచ్చిగా అభిమానించే సీతారామయ్య ‘అచ్చం సరిగ్గా ఆయనలాగే’ పాడేవారట. ఆయన కొడుకే బలిజేపల్లి రామకృష్ణ శాస్ర్తీ (ప్రసిద్ధ విద్వాంసులు) విజయవాడ రేడియో కేంద్రంలో పని చేశారు.
మన ప్రాంతంలో ప్రసిద్ధుడైన తాడిగడప శేషయ్య కూడా కోనేరి రాజపురం అభిమానియే. కానీ ఎవరికీ సంగీతం చెప్పలేదు. శిష్యులెవ్వరూ లేరు.
అలా అద్భుతమైన సంగీత ప్రజ్ఞాపాటవాలు కలిగిన తెలుగు వారితో పిరాట్ల శంకర శాస్ర్తీ, మహావాది వెంకటప్పయ్య శాస్ర్తీ, మొదలైన వారంతా వారు పాడుకుని వెళ్లిపోయారు వీరందర్నీ ప్రభావితం చేసిన మహనీయులు ‘ఈ సంగీత మూర్తి త్రయమే’ - గత రెండు మూడు తరాల్లో, రామసుబ్బయ్య, సుసర్ల దక్షిణామూర్తి శాస్ర్తీ, పారుపల్లి రామకృష్ణయ్య పంతులు వంటి సద్గురువులు దక్షిణాది బాణీని తెలుగుదేశంలో ప్రచారం చేశారు.
త్యాగరాజ కీర్తనలు బహుళ ప్రచారమవటానికి కారణం.. స్వర సహితంగా ఆయన శిష్యుప్రశిష్యులు పాడుకుంటూ పది మందికీ చెప్పటమే అనుకున్నాం గదా. ఈ అదృష్టం వాగ్గేయకారులందరికీ లభించలేదు. జయదేవుడు, అన్నమయ్య, పురందరదాసు ఈ కోవలోనివారే.
త్యాగరాజుని శిష్యులలో ముఖ్యులు ఇద్దరున్నారు. వారే ‘ఉమయాల్పురం కృష్ణ్భాగవతార్’ ‘ఉమయాళ్‌పురం సుందర భాగవతార్’లు. వారి బాల్యంలోనే త్యాగరాజు దగ్గర చేరిపోయారు. త్యాగరాజస్వామి ఉంఛ వృత్తి చేసుకుని శిష్యులకు అన్నం పెట్టి విద్య నేర్పాడు. అదీ! ఆయన గొప్పతనం. ఈ వేళ ‘కీర్తనకింత/ వర్ణానికింత/ స్వరజతికింత’ అనే రోజుల్లో వున్నాం. ఆశ్చర్యం కలుగుతుంది మరి.
సంగీత విద్య మనస్ఫూర్తిగా చెప్పవలసిన విద్య, మనసు పెట్టి నేర్చే విద్య - నేర్పే విద్య. దగ్గర దారులంటూ ఏమీ లేవు. బోర్డు మీద రాసి చెప్పేది కాదు. నేర్చుకునే వాడికి శృతి జ్ఞానం, లయ జ్ఞానం జన్మతః వస్తేనే పట్టుపడే అపురూపమైన విద్య.
‘సీతావర! సంగీత జ్ఞానము
ధాత వ్రాయవలెరా’ అని త్యాగయ్య అన్నదిందుకే. పాడగలిగే ఉత్సాహం కలిగిన విద్యార్థికి, సరైన గురువును ఎన్నుకోవటంలోనే అతని సంగీత భవిష్యత్ తేలిపోతుంది. కొన్ని సందర్భాల్లో గురువుకంటే శిష్యుడే ప్రతిభ కలిగి ఉంటాడు. చెప్పలేం. గురువు దగ్గర ‘విద్య’ సాంద్రంగా ఉంటే, ఆ సంగీతం నిలబడుతుంది. పలుచగా పొడి పొడి స్వరాలతో నిండి ఉంటే, ప్రయోజనం ఉండదు.
విద్వాంసులందరూ గురువులు కాలేరు. గురువులంతా మహా విద్వాంసులు కాకపోవచ్చు. మంచి పాఠాంతరం కలిగిన సంగీత గురువులనే ఆశ్రయించాలి - స్వరశుద్ధంగా గమకాలు పాడే విధానం తెలిసిన గురువునే పట్టుకోవాలి.
పుస్తకాల్లో కనిపించే స్వరం పాడబడదు. పాడే స్వరం పుస్తకాల్లో కన్పించదు. తనకు తెలిసిన విద్యను ఎలా చెప్పాలో తెలిసిన గురువే అసలైన గురువు.
త్యాగరాజు శిష్యులలో మానాంబు చావిడి వెంకట సుబ్బయ్యర్ ముఖ్యుడు. ఆయన శిష్యుల్లో ప్రముఖులెవరో చూడండి! మహా వైద్యనాథయ్యర్, శరభశాస్ర్తీ, ఫిడేల్ వెంకోబారావు, త్యాగరాజు మనవడు (త్యాగరాజు) నామక్కల్ నరసింహయ్యంగార్.
త్యాగయ్య శిష్య పరంపరలోని పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్‌కు శిష్యుడు పూచి శ్రీనివాసయ్యంగార్. కల్యాణి రాగంలో ప్రసిద్ధమైన ‘వనజాక్షిరో’ అనే వర్ణం, ‘నిన్ను కోరి.. మోహనరాగ వర్ణం, కానడలో ‘నెరనమ్మితి’ వర్ణాలు ఆయనవే. అద్భుతమైన కృతులు కూడా అందించారు. ఆయన శిష్యుడే అరియక్కుడి రామానుజయ్యంగార్. ఆధునిక సంగీత కచేరీ రూపశిల్పి ఆయన.
ఇలా ఒక గురువు నుండి శిష్యునికి అనూచానంగా సంప్రదాయసిద్ధంగా వస్తూ, మన కర్ణాటక సంగీత వట వృక్షం, శాఖోపశాఖలై వర్థిల్లుతూ వస్తోంది.
ప్రముఖ వాగ్గేయకారుల రచనలు పాడటం వల్ల, అటు విద్వాంసులూ, విద్వాంసుల వల్ల వాగ్గేయకారులూ పరస్పరాశ్రీతులై, సంప్రదాయ సంగీతాన్ని గౌరవిస్తూ వస్తున్నారు.
గొంతులో పలుకగలిగినంత వరకూ పాడగలిగే సౌలభ్యం కలిగినవారు, కష్టపడైనా సరే ఈ సంగీత జ్ఞాన గంగను ఆస్వాదించే ప్రయత్నం చేయాలి.
శ్రోతల స్థాయికి సంగీతం పడిపోకూడదు. శ్రోతల సంగీతాభిరుచిని పెంచగలిగే సంగీతం పెరగాలి.
చప్పట్ల కోసం చౌకబారు సంగీతం పాడేవారికి లభించే ఆనందం తాత్కాలికమే. అప్పటికప్పుడు వినగానే బాగుంటుంది. ఆ తర్వాత గుర్తుంచుకునే అవకాశం ఉండదు.

-మల్లాది సూరిబాబు 9052765490