S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

యుద్ధం ( సండేగీత)

మా మిత్రునికి సైన్స్ చదువు ఇష్టం లేదు. కానీ వాళ్ల నాన్నకి డాక్టర్ చదివించాలని కోరిక. అందుకని ఇంటర్మీడియెట్ (సైన్స్ గ్రూప్)లో చేర్పించాడు వాళ్ల నాన్న. అత్తెసరు మార్కులతో ఇంటర్మీడియెట్ పాసయ్యాడు. బిఎస్సీ చదివిన తరువాత డాక్టరీ చదివిద్దామని బిఎస్సీలో చేర్పించాడు మళ్లీ వాళ్ల నాన్న. ఇప్పటి పిల్లల్లా తాము ఏమి చదవాలని అనుకుంటున్నారో అలా చెప్పే పరిస్థితి అప్పుడు లేదు. అందుకుని అతను తనకు సైన్స్ చదవడం ఇష్టం లేదని చెప్పలేకపోయాడు. సైన్స్‌లో అతనికి అసలే ఇష్టంలేని సబ్జెక్టు కెమిస్ట్రీ. కెమిస్ట్రీ క్లాసు వున్నప్పుడల్లా లైబ్రరీకి వెళ్లి ఏవో పుస్తకాలు చదువుకునేవాడు. చెస్ ఆడుకుంటూ కూర్చునేవాడు. ఫలితంగా ఫైనల్ పరీక్ష పోయింది.
పరీక్ష పోయిందని చెప్పడానికి రకరకాల కారణాలని వెతకడం మొదలుపెట్టాడు. కానీ సైన్స్ తనకి ఇష్టం లేదని, కష్టంగా చదివానని చెప్పలేకపోయాడు. ఇష్టంలేని కోర్సులో చేరడం వల్ల పరీక్ష పోయిందని చెప్పలేదు. తనని తాను నిందించుకోవడం మొదలుపెట్టాడు. మళ్లీ పరీక్ష రాయాలన్న కోరిక కూడా అతనికి లేకుండా పోయింది. అతని తండ్రి బాగా నిరుత్సాహపడ్డాడు. ఏం చెయ్యాలో తోచలేదు. చివరికి అతన్ని కెమిస్ట్రీ చెప్పే లెక్చరర్ దగ్గరికి పంపించాడు. ఆ లెక్చరర్ మా మిత్రుడిని కాలేజీలో చూశాడు కానీ క్లాసులో చూసిన సందర్భాలు తక్కువే.
ఆ లెక్చరర్ మా మిత్రుడితో మాట్లాడాడు. పరీక్ష పోవడానికి ఏవేవో కారణాలు చెప్పాడు మా మిత్రుడు. కానీ సైన్స్‌ని ఇష్టం లేక చదవలేకపోయానని చెప్పలేదు. పరీక్షలప్పుడు జ్వరం రావడం వల్ల సరిగ్గా రాయలేదని చెప్పాడు. తనని తాను వంచన చేసుకుంటున్నాడన్న విషయాన్ని ఆ లెక్చరర్ గ్రహించాడు.
మా మిత్రుడితో ఇలా చెప్పాడు.
‘మీ నాన్నతో పోట్లాడు. నువ్వు గెలుస్తావు. కానీ నిన్ను నువ్వు వంచన చేసుకుంటే గెలిచే పరిస్థితి వుండదు. నిన్ను నువ్వు వంచన చేసుకున్నా, నీతో నీవు కొట్లాడుకున్నా పరాజయం తప్పదు. మన భవిష్యత్తు చాలా విషయాల మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఎక్కువగా మన మీదనే ఆధారపడి ఉంది. నిన్ను ఎవ్వరూ విశ్వసించకపోయినా నువ్వు విజయం సాధించే అవకాశం ఉంది. కానీ నిన్ను నువ్వు మోసం చేసుకుంటే ఎప్పటికీ విజయం సాధించలేవు. అందుకని నీకు ఇష్టంలేని చదువు మానేసి నీకిష్టమైనది చదువు’
ఆయన అక్కడితో ఊరుకోలేదు. మా మిత్రుడితో మూడు సంవత్సరాల బి.ఏ. డిగ్రీ కోర్సుని సప్లిమెంటరీకి రాయించాడు. మా మిత్రుడు ఇష్టంగా చదివాడు మొదటి శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. ఆ తరువాత యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ చదివి, డాక్టరేట్ చేశాడు. యూనివర్సిటీలో ప్రొఫెసర్ కూడా అయ్యాడు.
చాలామంది జీవితంలో సగం కాలాన్ని తాము ఏం చేయబోతున్నామో చెప్పడానికి ఉపయోగిస్తారు. మిగతా సగం కాలాన్ని ఆ పనులు ఎందుకు చేయలేదో చెప్పడానికి ఉపయోగిస్తారు. అది సరైంది కాదని తెలిసి కూడా చాలామంది ఇలాగే చేస్తూంటారు. మనం జీవితంలోని వైఫల్యాలని అధిగమించాలి. మనం బాధపడిన సందర్భాలని మర్చిపోవాలి. అద్భుతమైన భవిష్యత్తు ముందున్న విషయాన్ని మర్చిపోకూడదు. గత చరిత్రని కొట్టి వేస్తూ కొత్త చరిత్రని రాయాలి. అందుకు ఉదాహరణే మా మిత్రుడు.
మనలని మనం మోసం చేసుకుంటే, ఓడిపోవడమే కాదు. అది యుద్ధం కూడా అవుతుంది.