S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పేగుబంధం

కథలపోటీలో
ఎంపికైన రచన
***

‘నాన్నా! ఈత పోటీలో నాకు బంగారు పతకం వచ్చింది. ఇక ముందు నా జీవితమే మారిపోతుంది. అందరూ నన్ను బహుమతులతోను, పొగడ్తలతోను ముంచెత్తుతున్నారు’
ఇంట్లోకి వచ్చీ రాగానే తండ్రి పటేల్‌ని ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని చెప్పాడు సంజీవి.
ఆ మాటలకి పౌర్ణమినాటి సాగరంలా ఉప్పొంగిపోయాడు పటేల్. ఒలింపిక్స్‌లో కొడుకు పతకం సాధించడం టీవీలో చూశాడు. పేపర్లలో చదివాడు. ఊళ్లో అందరూ వచ్చి చెప్పగానే నిజమేననుకున్నాడు.
అయినా కొడుకు నోటి నుండి ఆ మాటలు వినగానే అతని మనసు నీటి మీద పడవలా సయ్యాటలాడినట్లనిపించింది.
గుండెల్లో గోదావరి సవ్వడి వినిపించసాగింది.
అంతలోనే ఏదో గుర్తొచ్చి గుండె బరువెక్కింది.
గతం తాలూకు జ్ఞాపకాలు మనసుని కుదిపేశాయి.
ఈ కొడుకు కోసం మొన్న మొన్నటి వరకు ఎంతలా కష్టపడ్డాడో!
తన గురించి ఆలోచించడమే మానుకున్నాడు.
ఎన్ని గాలి వానలు భరించాడో! ఎన్ని తుపానులెదుర్కొన్నాడో!
ప్రాణాలకు తెగించి సముద్రం మీదకు వెళ్లి చేపలు పట్టేవాడు.
ఆ చేపలమ్మడానికి మళ్లా సిటీకి పోయేవాడు.
కష్టపడి తెచ్చిన సరకు కొనేవాళ్లకి నచ్చకపోతే చేతిలో పైసలు ఉండేవి కావు. తన పరిస్థితి గమనించిన దళారులకి తక్కువ ధరకి చేపలమ్మి ఇంట్లో వాళ్ల కడుపు నింపేవాడు.
సముద్రాన్ని నమ్మిన వాళ్ల బతుకులు గాల్లో పెట్టిన దీపాల్లాంటివి ఎప్పుడు వెలుగుతాయో... ఎప్పుడు ఆరిపోతాయో తెలీదు.
అయినా సరే ధైర్యానే్న నమ్ముకున్నాడు. సాహసంతో ముందడుగు వేసేవాడు. ఆటుపోట్లున్న సముద్రం తన నాదుకుంటుందని ఎప్పటికప్పుడు విశ్వసిస్తూ.. జీవితంలో ఎదురయ్యే కష్టాల్ని ఎదుర్కొన్నాడు.
ఒక్కగానొక్క కొడుకు సంజీవిని పెంచి పెద్ద చేశాడు. తన కష్టం వృధా పోలేదు. తన శ్రమకి తగిన ఫలితం లభించింది.
కొడుకు తరంగంలా ఎగసిపడి తన కీర్తిని లోకానికి చాటాడు.
ఈ జన్మకీ తృప్తి చాలదా..! అనుకొంటూ వంటింటి వైపు దృష్టి సారించాడు పటేల్.
భార్య మంగమ్మ పాలు కాస్తోందని గమనించి అక్కడికి రెండంగల్లో వెళ్లాడు.
‘మంగా! మన సంజీవొచ్చాడు. ఉన్నపళంగా రా..’ భార్య చేయి పట్టుకు లాగాడు.
గదిలో జరుగుతున్న హడావిడిని ఓరకంట గమనిస్తున్న మంగమ్మ పాలగినె్న జాగ్రత్తగా పొయ్యి మీద నుండి దింపింది. వెంటనే పరుగులాంటి నడకతో గదిలోకొచ్చింది.
తల్లిని చూడగానే సంజీవి వదనం పౌర్ణమినాటి చంద్రుడిలా విప్పారింది. వినయంగా తల్లి కాళ్లకి దండం పెట్టాడు.
తర్వాత తనకి వచ్చిన బంగారు పతకం తల్లికి చూపించి ‘అమ్మా! ఇక ముందు నా జీవితమే మారిపోయింది. కోరుకున్న ఉద్యోగం వస్తుంది. డబ్బు కూడా ఇస్తారు. ఇక ముందు మన జీవితాలు మారిపోతాయి. మనం ఈ పాత పెంకుటింట్లో ఉండక్కర్లేదు’ అన్నాడు.
ఆనందంగా చెప్పుకుపోతున్న కొడుకుని చూడసాగింది మంగమ్మ. తర్వాత ఆశ్చర్యపోతూ చుట్టూ చూసింది.
అప్పటికే ఊల్లో సగం మంది తమింటిని చుట్టుముట్టారు. అందరూ సంజీవి కేసి అభిమానంగా.. ఆత్మీయంగా చూస్తున్నారు.
సంజీవి మళ్లా మొదలుపెట్టాడు.
‘ఈత పోటీలో బంగారు పతకం ఎలాగైనా సాధించాలనే సంకల్పంతోనే పోటీకి సిద్ధమయ్యాను. సాహసంతో నీళ్లల్లోకి దిగగానే ఎంత ఉత్సాహం వచ్చిందో చెప్పలేను.
పోటీలో విజయం సాధించగానే.. సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యాను. నాలాంటి గజ ఈతగాడు మరెక్కడా ఉండడని.. అందరూ అభినందిస్తుంటే నన్ను నేను మర్చిపోయాను..’ అని చేతిలో ఉన్న పతకం వైపు గర్వంగా చూశాడు సంజీవి.
మంగమ్మకి సంతోషం, దుఃఖం ఏకకాలంలో కలిగాయి.
కొడుకు చేతిలో పతకం వైపు యధాలాపంగా చూసింది.
తర్వాత ఏదో సంఘటన గుర్తొచ్చినట్లుగా భర్త వైపు వాలుగా చూసింది.
ఈ గెలుపు ఓటమిలకి, ఆనంద విషాదాలకి అతీతంగా నిశ్చలంగా నిర్వికారంగా ఉన్నాడతను.
ఆమె కళ్లల్లో సన్నటి నీటి తెర. ఆలోచన్ల వెల్లువ ఎగసెగసి పడుతూంటే బరువుగా నిట్టూర్చింది.
తల్లి నుండి తనాశించిన అభినందనలు, పొగడ్తలు రాకపోయేసరికి సంజవీ మనసులోనే ఆశ్చర్యపోయాడు!
తను సాధించిన విజయం సామాన్యమైనది కాదు.
అయినా తల్లెందుకు గంభీరంగా ఉండిపోయింది?
ఆ క్షణంలో తల్లిని ప్రశ్నించడం సబబుగా అనిపించలేదు.
ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు ఈ విషయం గురించి తెలుసుకోవచ్చు అనుకొంటూ తను తెచ్చిన స్వీట్లు అక్కడున్న అందరికీ పంచిపెట్టాడు. అందరూ అడిగిన ప్రశ్నలకి ఓపిగ్గా సమాధానం చెప్పి వాళ్లందరితో ఫొటోలు తీయించుకున్నాడు.
పావుగంట తర్వాత ఇల్లంతా ఖాళీ అయింది.
తల్లీ, తండ్రి తన వైపు ఆత్మీయంగా చూస్తూంటే సంజీవి మనసు ఆనంద డోలికల్లో తేలియాడింది.
‘బాబూ! పాయసం చేద్దామనుకుంటున్నాను. ఇంకా నీకేం కావాలో చెప్పు! అన్నీ చేసి పెడతాను’ అక్కణ్ణుంచి లేవబోతూ అంది మంగమ్మ.
సంజీవి తల అడ్డంగా ఊపాడు. ‘అమ్మా! నాకేం వద్దు. నువ్వు ప్రేమగా నాలుగు మాటలు చెబితే వినాలని ఉంది’ అన్నాడు తల్లివైపు సూటిగా చూస్తూ.
‘అదేవిట్రా?’ ఆశ్చర్యపోయింది మంగమ్మ.
‘ఔనమ్మా! అందరూ నన్ను ఆకాశాని కెత్తేస్తూంటే నువ్వు మాత్రం వౌనంగా ఉండిపోయావు. ఒలంపిక్స్‌లో బంగారు పతకం సాధించడం మాటలు కాదు. చిన్నప్పుడు స్కూల్లో ఏ చిన్న బహుమతి నాకొచ్చినా ఊరల్లా చాటేదానివి. కాని.. బంగారు పతకం సాధించినప్పుడు ఒక్క పొగడ్త కూడా నీ నుండి రాలేదు. ఎందుకు ముభావంగా ఉండిపోవు? చెప్పమ్మా?’ సంజీవి ఆసక్తిగా తల్లికేసి చూశాడు.
కొడుకు ప్రశ్నకి మంగమ్మ గుండె బరువెక్కింది.
ఆమె కళ్ల ముందు గతం తాలూకు చేదు జ్ఞాపకం పదేపదే తారసపడింది.
కొడుకుని, భర్తని మార్చిమార్చి చూస్తూ ‘మీ నాన్నకన్నా గజ ఈతగాడు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు బాబూ!’ అంది.
‘నిజమా...!’ ఆశ్చర్యపోతూ అన్నాడు సంజీవి.
మంగమ్మ తలాడించి ‘నీకొచ్చిన పతకంకన్నా గొప్ప పతకం ఏదైనా ఉంటే మీ నాన్నకివ్వాలి! ఎందుకంటే మీ నాన్న సాహసాన్ని నేనే ప్రత్యక్షంగా చూశాను. ప్రాణాలకు తెగించి ఆయన నిన్ను కాపాడాడు. ఏ తండ్రీ ఇలాంటి సాహసాన్ని చేయడేమో..!’ కన్నీళ్లు జలజలమని కంట్లోంచి జాలువారుతూంటే అందామె.
ఆ మాటలకి సంజీవి కదిలిపోయాడు.
‘నాన్న చేసిన సాహసకార్యం గురించి నాకింతవరకు నువ్వు చెప్పలేదు. ఇప్పుడు మాత్రం చెప్పక తప్పదు! నువ్వు చెబితే ఎవరు గొప్ప గజ ఈతగాడో నేను తీర్పునిస్తాను’ అన్నాడు సంజీవి.
మంగమ్మ భర్త వైపు చిరునవ్వుతో చూసింది. అతడు చెప్పమన్నట్లు సైగ చేయగానే మెల్లగా గొంతు సవరించుకుంది.
* * *
రాత్రి ఏడు గంటలైంది.
పటేల్ ఇంటికి చేరుకునేసరికి గుడ్డి దీపం ముందు జబ్బు పడిన సంవత్సరం కొడుకుని ఒళ్లో ఉంచుకుని కూర్చుంది మంగమ్మ.
‘ఏమయింది మంగా? పిల్లాడికి శాస్ర్తీగారిచ్చిన కషాయం పట్టావా? పని చేయలేదా?’ గాభరా పడుతూ అన్నాడు.
మంగమ్మ తల అడ్డంగా ఊపింది.
‘ఏమయిందని అడగడం ఎందుకు? అంతా ఎదురుగా కనిపిస్తోందిగా. ఈ రాత్రి పెద్ద డాక్టర్ దగ్గరికి పిల్లాడ్ని తీసుకెళ్లకపోతే రేపటికి మనిద్దరమే మిగులుతాం’ బొంగురు గొంతుతో అందామె.
పటేల్ పిల్లాడి నుదురు తాకి చూశాడు. శ్వాస తప్ప ఇతర చేష్టలేవీ కుర్రాడిలో లేవు.
పటేల్ గుండె గుభేలుమంది. ఏ క్షణంలోనైనా ప్రాణాలు వదిలేటట్లున్నాడు పిల్లాడు.
బయట వాతావరణం బీభత్సంగా ఉంది. వారం రోజుల నుండి వర్షాలే.
ఈ రోజు పరిస్థితి మరీ దారుణం. నింగీ నేలా ఏకమైనట్లు కురుస్తోంది కుంభవృష్టి.
గవర్నమెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్లాలంటే రేవు దాటాలి. మరో ఊరు వెళ్లాలి.
పొంగుతున్న గోదావరి మీద నావలో ప్రయాణించి డాక్టర్‌ని చేరుకోవాలి. ఈ పరిస్థితులలో అది సాధ్యమా...? తప్పదు. ఏదో సాహసం చేయాలి.
‘మంగా! ఇంక ఆలోచన్లు అనవసరం. పిల్లాణ్ణి ఎత్తుకో. ఒడ్డుకి వెళ్లి అక్కడ నావలున్నాయో చూద్దాం’ అన్నాడు పటేల్.
మంగమ్మ పిల్లాణ్ణి ఎత్తుకుని భర్త వెంట బయలుదేరింది. బయట వర్షం ఏకధాటిగా కురుస్తోంది.
పరుగు లాంటి నడకలతో ఇద్దరూ ఒడ్డుకు చేరుకున్నారు.
ఆ ప్రదేశం మొత్తం నిర్మానుష్యంగా ఉంది. నావ ఉంది తప్ప నావవాడి జాడెక్కడా లేదు.
పటేల్ గట్టిగా కేక వేసినా ఎవరూ రాలేదు. ఆగకుండా పటేల్ కేకలు వేస్తున్నాడు. అయినా చుట్టుపక్కల నుండి ఎలాంటి స్పందన లేదు.
మంగమ్మ పటేల్ చేతిని పట్టుకుని ‘ఇంటికి పోదాం పద! ఇలాంటి పరిస్థితులలో డాక్టర్ దగ్గరికి వెళ్లలేం. మన రాత ఎలా ఉందో!’ అంది భయంగా.
పటేల్ భార్యకెలాంటి సమాధానం చెప్పలేదు. ఏదో నిర్ణయానికి వచ్చినట్లుగా నావ దగ్గరికి నడిచి ఆమెని ఎక్కమన్నట్లుగా సైగ చేశాడు.
అంతే! పిచ్చిదానిలా భర్త వైపు చూసింది మంగమ్మ ‘మీకేమైనా దయ్యం పట్టిందా? మీకు పడవ నడపడం వచ్చా? ఇలాంటి పిచ్చి పన్లు చేస్తే ముగ్గురం మునిగిపోతాం’ అంది.
మంగమ్మ మాట వినిపించుకోన్నట్లుగా ఆమెని బలవంతంగా నావలో కూర్చోబెట్టాడు పటేల్. చేతిలో బిడ్డని ఆమె ఒళ్లో ఉంచాడు.
భర్త చర్యకి మంగమ్మ వణికిపోయింది. ‘వద్దండీ! కేవలం ఒడ్డున కూర్చుని చేపలు పట్టే మనిషి మీరు. ఈ పడవ నడపడం మీవల్ల కాదు. ఇంటికి పోదాం’ బతిమాలుతున్నట్లుగా అంది.
పటేల్ మొహం గంభీరంగా మారింది. పడవను విప్పి నదిలో కొంతదూరం వరకు తోసుకెళ్లాడు. ప్రవాహంలోకి పడవ వెళ్లాక తెడ్డు అందుకున్నాడు.
నీటి మీద పడవ అటూ ఇటూ ఊగుతోంది. ఒంట్లో సమస్త శక్తినీ ఉపయోగిస్తూ పడవని ముందుకి పోనిస్తున్నాడు పటేల్.
నావవాడు నావని నడుపుతూండగా ఎన్నోసార్లు పరీక్షగా చూసేవాడు. నావలో కూర్చుని షికారు వెళుతూ ఎన్నోసార్లు చేపలు పట్టేవాడు కూడా.
అప్పుడప్పుడు పడవవాడి దగ్గర తెడ్డు పట్టుకుని నావని నడిపేవాడు. చాలా రోజుల క్రిందట సరదాగా నేర్చుకున్న ఆ విద్య ఇప్పుడు ఉపయోగపడుతుందని అతడు కల్లో కూడా ఊహించలేదు.
నది మీద నావ నడపడం ఎంత కష్టమో అతనికి అర్థమవుతోందిప్పుడు! చేతులు వణుకుతున్నాయి. అవతలి రేవుకి వెళ్లగలడా? ఏమో! శక్తికొద్దీ పడవని ముందుకి పోనిస్తున్నాడు.
పడవ బాగా ఊగిపోవడం మొదలుపెట్టింది. ప్రవాహం వేగం ఎక్కువైంది. బాగా లోతుగా ఉన్న ప్రదేశంలోకి పడవ వచ్చిందని అర్థమైంది పటేల్‌కి.
అతి జాగ్రత్తగా పడవని నడపాలనే ఉద్దేశంతో తెడ్డుని మరింత గట్టిగా పట్టుకోవాలనుకున్నాడు. అంతే! పడవ ఒక్కసారిగా అదుపు తప్పింది. అతని చేతిలో తెడ్డు జారిపోయింది.
పడవ ఊపునకు పటేల్ ప్రవాహంలోకి జారిపడ్డాడు.
‘మంగా! మరో తెడ్డు అందుకో! ఆ తెడ్డుని గట్టిగా పట్టుకో! పిల్లాణ్ణి పడవలో పడుకోబెట్టు! నేను ఈదుకొంటూ ఒడ్డుకొస్తాను’ అన్నాడు.
పటేల్ అరుపులకి మంగమ్మ లేచి మరో తెడ్డు అందుకుంది. రాబోతున్న దుఃఖాన్ని పంటి కింద నొక్కిపట్టింది.
ఒకపక్క ప్రాణాలకు తెగించి భర్త ఈదడం చూస్తోంది. మరోపక్క కొడుకుని కాపాడటం కోసం భర్తలా తెడ్డుని ఆడిస్తూ పడవని ముందుకి పోనిచ్చింది.
ఒకపక్క నదిలో ఈదుతూ... ప్రవాహాన్ని ఎదుర్కొంటూ భార్యకి సూచనలివ్వసాగాడు పటేల్.
మంగమ్మ వదనం భావరహితంగా మారిందిప్పుడు. మునుపటిలా ఆమె ఏడవడం మానుకుంది. నావ పక్కన ఈదుతూ తనకి సూచనలిస్తున్న భర్తని గమనిస్తూ ఒడ్డు వైపు వెళ్లసాగింది.
పడవ తీరం చేరగానే... మంగమ్మ ఊపిరి పీల్చుకుని పక్కకి చూసింది. ఎప్పుడు పటేల్ పడవలోకి ప్రవేశించాడో తెలీదు.
బిడ్డని గుండెలకి పొదువుకున్నాడు. పడవ దిగి భార్యకి చేయి అందించి ‘మంగా! ఈ ఊళ్లోనే డాక్టర్‌గారున్నారు. పద! వేగంగా అక్కడికి వెళదాం’ అన్నాడు.
మంగమ్మ తలూపి భర్త వెనకాలే నడిచింది. ఆమె గుండెలు మాత్రం వేగంగా కొట్టుకోసాగాయి.
ఏం జరిగిందో తెలీదు. ఏం జరగబోతోందో అర్థం కాలేదు. ఇప్పుడు ఏం ఆలోచించకూడదు. ముందు డాక్టర్ దగ్గరికి వెళ్లాలి.
మొగుడు, తను తమ ప్రయత్నం తాము చేశారు. ఇంక తమ పిల్లాణ్ణి రక్షించవలసింది ఆ డాక్టర్.
పావుగంట గడిచాక డాక్టర్ సంజీవి ఇంటికి చేరుకున్నారా దంపతులు. ఆ ఇంట్లో లైట్లు వెలుగుతూండటం చూసి పటేల్ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు.
‘డాక్టర్‌గారూ..!’ అరిచినట్లుగా పిలిచాడు పటేల్.
రెండు నిమిషాల తర్వాత డాక్టర్‌గారు బయటకొచ్చారు.
అలసిపోయి.. నీరసించిపోయి దీనంగా తన ముందు నిలబడ్డ వాళ్ల పరిస్థితిని అర్థం చేసుకున్నాడతను. వెంటనే వాళ్ల చేతుల్లో బాబుని అందుకుని లోపలికి నడిచాడు.
అరగంట తర్వాత సంజీవి ఆ ఇద్దరి వైపు చూసి ‘మీ బాబుకి గండం తప్పింది. ఇంజెక్షన్ చేశాను. ఇక ముందు ఎలాంటి భయం లేదు. మందులిస్తాను. వాడండి. ఈ రాత్రి మీ ఊరు వెళ్లకండి. తెల్లారి వెళ్లండి. ఈ రాత్రి పక్కగదిలో పడుకోండి’ అన్నాడు.
పటేల్, మంగమ్మ ఆనందంతో ఒకరివైపు ఒకరు చూసుకున్నారు.
* * *
ఆనాటి సంఘటన కొడుక్కి విడమర్చి చెప్పిన మంగమ్మ దీర్ఘంగా నిట్టూర్చి-
‘ఇప్పుడు చెప్పు సంజీవి! గజ ఈతగాడు మీ నాన్న. ప్రాణాలకు తెగించి నీ ప్రాణాల్ని కాపాడారు. అంతేకాదు. ఆ అర్ధరాత్రి నీకు వైద్యం చేసిన డాక్టర్ పేరు నీకు పెట్టారు. అతను చేసిన సాహసానికి ఎలాంటి బహుమతి ఇవ్వగలవు?’ అంది.
సంజీవి వెంటనే తన చేతిలో పతకాన్ని తండ్రి మెడలో వేశాడు. ‘నాన్నా! నా విజయం మీకే అంకితం!’ అని రెండు చేతులూ జోడించాడు.
ఆ చర్యకి పటేల్ మనసు గోదావరిలా పొంగింది.
**
విశ్వనాథ రమ
ప్లాట్ నెం.34, షిరిడిసాయి నగర్, బండారుపల్లి గార్డెన్స్
ధర్మపురి రోడ్డు, విజయనగరం -2.. 9160267060

విశ్వనాథ రమ