S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రాక్షస ప్రేమ (కథ)

కథల పోటీలో ఎంపికైన రచన
...........................................
‘నీకు గుర్తుందా? మనమప్పుడు అనంతపురంలో వుండేవాళ్లం. మీ నాయన తాడిపత్రి నుంచి వచ్చినాడు. ‘ఏందిట్లా వచ్చుంటిరి. పట్నంలో పని బడెనా?’ అని అడిగుంటి! ఏమనె మీ నాయన? ‘బిడ్డను చూసిపోదామని వచ్చుంటినప్పా!’ అన్నడు. ‘మీరెట్లుండిరో చూసిపోదామని వచ్చుంటిన’నొచ్చు గదా? అట్లనలె. అంటే కూతురంటె ఇష్టము, అల్లుడంటె ద్వేషము. ఒక కంట్ల బెల్లము, మరొ కంట్ల అల్లము! అమ్మో, గుండెలు తీసిన బంటు కాదూ మీ నాయన! వచ్చిన మనిషి రెండు రోజులు తిష్ఠవేశినాడు. అల్లుడి తిండి తింటూ, కూతురితో కబుర్లు చెప్పుకుంటూ, మా ఇండ్లలో నయితే, కూతురింటో కుడవనే కుడవరు. తప్పు అది, నిషిద్ధం! ఏండ్లొచ్చాయి, ఎందుకు...?’
‘ఇప్పుడేంది తీరుబడిగా కూర్చుని ఏనాడో చచ్చిన ముసలాయన్ని సాధిస్తా ఉండావు! ఆయన బతికున్నప్పుడు మనశ్శాంతిగ బతకనివ్వలేదు నువ్వు. ఆయన పోయి పాతికేళ్లయినాది. నీ కూతుళ్లకూ పెళ్లయినాదిగా.. ఆ అల్లుళ్లు నీ కూతుర్లనిట్టా సాధిస్తే ఆళ్ల కెట్టా ఉంటది? ఇవ్వాళ నీకు మనసు బాగుండలేదు. మనసు ముసలాయన మీద పోయినాది. నీ యాపారానికి మా నాయన మదుపు పెట్టబట్టే నువీ నాడు కడుపు చల్ల కదలకుండ సుకంగ ఉన్నవు. ఆయనే్నమనక, బాగుండదు...’
ఇలా మూడు చెడిపోయి ఉన్న మొగుడిని తులసమ్మ సముదాయించ ప్రయత్నిస్తున్న సమయంలో రంగనాయకులు రంగ ప్రవేశం చేశాడు. తమ్ముణ్ణి చూసి ఆనందపడిపోయింది తులసమ్మ. కానీ, ఆ సమయంలో వచ్చినందుకు ఇరుకున పడిపోయింది. రంగనాయకుల్ని చూసి, ‘ఏందిట్లా వచ్చుంటివి?’ అని అడిగనే అడిగాడు దాసప్ప.
‘పత్తి విత్తనాలు తీసుకెళ్దామని వచ్చినా? ఈడ మంచివి దొరుకుతాయంట!’
‘అట్లనా, పనిలేకుంటే, మీలాంటోళ్లు ఎందుకు వస్తరు? హోటలు తిండికి కర్చులేకుండా అక్క ఇంటికి వస్తే సరిపాయె! ఇయ్యాళ ఆదివారం దుకాణాలేం ఉంటయి? ఉంటవా, నాలుగు రోజులు? లాయరుగా సంపాదించేదంతా ఏం జేస్తునావ్?’
‘సంసారం నడుస్తున్నది దాంతోనే. వ్యవసాయం వల్ల ఆదాయం పేరుకు మాత్రమే. కౌలుకిచ్చి చేయిస్తున్నాను. రైతు సరిగ్గా పండిందంటడు. పండలేదంటడు. ఎరువుల్లేవంటాడు, మంచి విత్తనాలు దొరకలేదంటడు. నీ పనే బావుంది. వర్షాలొచ్చినా, రాకున్నా నీకు ఇబ్బంది లేదు. సరుకుల ధర పెరిగితే, అది కొనుగోలుదారులకు బదిలీ చేస్తావు’
‘మీ అందరికీ ఇదే మాయరోగం! ఇంకోడి మీద పడి ఏడుస్తుంటరు. తినేడువు, మీ అక్క వండి వార్చినాది’ అని దాసప్ప స్నానానికి బయలుదేరాడు.
‘నిన్ను చూట్టానికని వస్తుంటిని కానీ, మీ ఆయన ప్రవర్తన చూస్తే నాకు మీ ఇంటికే రాబుద్ధి కాదే! నీ బిడ్డలే ఆయనకు బుద్ధి చెప్పాలి. ఎప్పుడో ఆ రోజు వస్తుంది’ అన్నాడు రంగనాయకులు అక్క వంక కోపంగా చూస్తూ.
‘అప్పటిదాకా నేను బతికి ఉంటనో లేదో!’
అది మామూలే. పాతకాలంలో అయితే, తనకు కోపమొచ్చినప్పుడల్లా విరుచుకు పడేవాడు దాసప్ప. వయసు యాభై దాటాక ముందటి ప్రవర్తన లేదు. అయినా వారం పది రోజులకోసారి మూడు చెడిపోతూ ఉంటుంది. తను అనుకున్నది కాకపోతేనో, తను అనుకున్న విధంగా ఎదుటి వ్యక్తి ప్రవర్తించకపోతేనో, అంతకు ముందు సదరు వ్యక్తి తన పట్ల ఆచరించినట్లు తను భావించే దుర్మార్గాలు, దురాగతాలు గుర్తుకు వచ్చేస్తాయి అతనికి. ఇంక ఆ మూడు పోయిందాకా సదరు వ్యక్తే కాక అతని సంపర్కంలోకి వచ్చే ప్రతి వ్యక్తీ అతడి కినుకకు గురికావల్సిందే. ‘నువ్వు అప్పుడట్లా చేశావు, ఇప్పుడిట్టా చేశావు! అన్నం తినే మనిషి చేసే పని అదేనా? అసలు మీ వంశమే అంత!’ ఇలా ఎక్కడెక్కడ విషయాలో తీసుకొచ్చి దెప్పుతాడు, నోటికొచ్చినట్టు కూస్తాడు. ఎదుటి వ్యక్తి ఎదురు సమాధానం చెప్పకపోయినట్లయితే, కాస్తంత సేపు నోటి దూల తీర్చుకున్నాక మానుకుంటాడు. అలాకాక ఎదుటి వ్యక్తికి అతని మాటలు తప్పుగా కన్పించి, ఎదురాడితే, ఒకోసారి పెద్ద కొట్లాటే అయేది. ఇలా మూడు బావుండనప్పుడు తను సాధించే వ్యక్తుల పట్ల అతనికి వివక్షత ఉండేది కాదు. తన స్వంత పిల్లల్ని కూడ వదిలేవాడు కాదు అతను.
తులసమ్మకు యాభైయేండ్లు వచ్చాయి. పెండ్లయి ముప్ఫయ్యయిదేళ్లయింది. పెళ్లయిన మూడో రోజు నుండి ఆ ఇద్దరకు పొసగలేదు. ఆమె ఏమన్నా కరవవచ్చినట్లు మాట్లాడతాడు. కొత్తల్లో పని అలవాటుకాక, తొందర్లో పాల పొంగబెట్తే, ‘నీయమ్మ కడుపుకాల! ఇట్లనేనా మీయమ్మ నేర్పినాది? పాలు కాగబెట్ట చేతకాని దానివి నువ్వు కాపరమేం చేసి ఏడుస్తవే?’ అంటూ కొట్టటానికి మీదమీదకు వచ్చాడు.
అప్పటికి ఆమె అత్త బతికే ఉంది. ‘పోరా, వంటగదిలో నీకేం పని? నేం జూసుకుంటాలే పో. నిన్నగాక మొన్న కాపురానికొచ్చిన పిల్లకు ఏం తెలిసేడుస్తాది? మెల్లగా అదే నేర్చుకుంటాది. ఇదేం బ్రహ్మ విద్యనా?’ అంది.
‘ఇట్లా దాన్ని నెత్తికెక్కించుకో. అది నీనెత్తి అడుస్తాది. అప్పుడుగానీ నీకు తెల్సి చావదు. అయినా, నువ్వే దుబారా మనిషివి! నాయన నెత్తిన కొట్టుకుని చెప్పేవాడు. ‘కొంప గుండం చేయకే. పొదుపుగా వాడుకోవాలని చెప్పినా నువ్వు విని చావవు’ అని. నువ్వు నాయన మాట వినుంటే, మన బతుకులిట్లా ఉండేవి కావు’ అని తల్లినీ సాధించేవాడు దాసప్ప.
ప్రతి చిన్న విషయానికీ కోపమొచ్చేది అతనికి. ఒకసారి పుట్టింటికి వెళ్లిన తులసమ్మను బస్సులో నుండి దించుకుని ఇంటికి వెళ్తూంటే, పక్కన పొయ్యేవాడి సైకిలు హాండిల్ బారు అతని మోచేతికి తగిలింది. ఇంక అంతే అగ్గిమీద గుగ్గిలమయ్యాడు దాసప్ప. పరుగెత్తికెళ్లి అతడిని పట్టుకుని సైకిలు మీద నుండి కిందకు లాగి ఆ చెంపా ఈ చెంపా వాయించాడు. వాడు బలహీనంగా ఉన్నాడు. బలమైనవాడయితే, దాసప్పకే తన్నులు తగిలేవేమో! ‘తప్పయినాది, మన్నించన్నా! చూసుకోలేదు’ అన్నాడు ఆ యువకుడు.
‘ఇప్పుడు కాదు. ఆ మాట ముందే చెప్పాలి. అంత పొగరా నా కొడక! రోడ్డు నీ అబ్బ సొత్తా?’ అని తిట్లను లంకించుకున్నాడు.
మొగుడు నడిబజారులో అలా గలాభా చెయ్యడం చూసి సిగ్గుపడిపోయింది తులసమ్మ. మొగుణ్ణి పట్టుకు లాగుతూ ‘పదవయ్యా! జనం నవ్వుతుండరు. మొగాడివి, చెయ్యి తగిల్తేనే అట్లా ఆ మనిషిని కొట్టాలా?’ అంది ఆమె.
‘చంపుతా, రడీకె! ఆడు నన్నుకాక నిన్ను తగలాలని ఉందే నీకు! కుర్రాడు అందంగా ఉన్నాడు కదా. మనసు ఆడి మీద పోయినాదా?’ అని పక్కన ఎవరున్నారని కూడ చూడకుండా భార్య నడుం వంచి ఒక్క గుద్దు గుద్దాడు దాసప్ప.
రోడ్డున పోతున్న ఒక పెద్దాయన, ‘పోవయ్యా, ఇంటికి! ఆడదాన్ని పట్టుకుని నడిరోడ్డున కొట్టటానికి సిగ్గుండాలి!’ అన్నాడు.
‘నా ఇష్టం! అది నా పెళ్లాం. కొడతాను, చంపుతాను. అడగటానికి నువ్వెవడివి?’
‘పద. పోలీసుస్టేషన్‌కు. ఆడదాని మీద దౌర్జన్యం చేస్తే ఎందుకడగకూడదో పోలీసులు చెప్తారు’
‘పద. నేనేం దడిసేవాణ్ణి కాదు’
‘అయ్యా, మీకో నమస్కారం! మమ్మల్ని వదిలెయ్యండి. మా దారిన మేం పోతాం’ అని ఆ పెద్దమనిషికి చెప్పి మొగుణ్ణి లాక్కెళ్లింది తులసమ్మ. ఈ లోపల సైకిలువాడు పలాయనం చిత్తగించేశాడు. ఇంటికొచ్చిన దాసప్ప ఆ రోజు పెళ్లాన్ని సతాయించి చంపాడు.
అతడికి సమాజంలో మంచి పేరు లేదు. ఇరుగు పొరుగులతో పడదు. ప్రతి వాళ్లతో తగవుకు సై అంటాడు. ఒకసారి పక్కింటి గరుడయ్యతో తగవు వచ్చింది దాసప్పకు. దాసప్ప ఇంటిలో ఉన్న మామిడిచెట్టు కొమ్మల ఆకులు ప్రహరీగోడ దాటి గరుడయ్య ఇంటిలో పడేవి. గరుడయ్యకు దాసప్ప మనస్తత్వం తెలుసు కనుక తమ ఇంటివైపు వచ్చిన కొమ్మలు కొట్టించమనీ, తాము రోజూ పడిన ఆకులు చిమ్మలేక పోతున్నామనీ తన పాలేరు చేత కబురు పెట్టాడు. అంతే, ఆ పాలేరు ఆ మాట చెప్పాడో లేదో అతణ్ని కొట్టటం మొదలెట్టాడు, చొక్కా పట్టుకుని. పెద్దింటి ఆయన కదా అని పాలేరు క్షణం సేపు పస్తాయించాడు కానీ, అతనికీ ఆవేశమొచ్చింది. దాసప్పను పట్టుకుని ఉతికేశాడు. ఆ అవమానం భరించలేని దాసప్ప వెళ్లి పోలీసుస్టేషన్‌లో గరుడయ్య మీదా, పాలేరు మీదా ఫిర్యాదు రాసిచ్చాడు. గరుడయ్య పెద్దమనిషి, డబ్బున్నవాడు, లోకం తెలిసినవాడు. అతడు విషయం వివరించి, ‘ఈ దాసప్ప అందరితో ఇలా కజ్జాలకు దిగుతనే ఉంటడు’ అని చెప్పాడు.
ఇంక దాసప్ప బూతులు లంకించుకున్నాడు. ‘దొంగనాకొడక! అసలు విషయం చెప్పక, ఏందేందో వాగుతావెందుకురా? ఆకుల పడుతున్నవన్నావు! మరి కాయలు పడినాయనీ, పండ్లు పడినాయనీ చెప్పవెందుకు? మామిడిపండ్లయితే రసం జుర్రుకుంటూ తింటవా? దొంగతనంగా కాయలు కోసుకుని పప్పులో వేసుకుంటవా? మరి ఆకులు పడినాయని ఏడుపెందుకు? పండ్లు, కాయలు అనుభవించినప్పుడు ఆకులు ఎత్తివేసే కష్టంకూడ పడాలి’ అని తన వాదన విన్పించటంతో ఆగకుండా, తన వదరుబోతుతానాన్నంతా ప్రదర్శించాడు.
అతని వాదనలో పస లేకపోలేదు. మామిడికాయలు, మామిడిపళ్లు దొరికినప్పుడు గరుడయ్య ఆరగిస్తూనే ఉన్నాడు. అతను తిన్నాడని దాసప్ప ఫిర్యాదు చేసింది లేదు. రోజూ తన దుకాణానికి వెళ్లాల్సిన అతనికి అంత తీరిక కూడ లేదు. అయితే, ఈ ప్రపంచం హేతువు ప్రకారం నడవదు కదా! ‘సర్లే. నువ్వు గరుడయ్యగారి పాలేరును కొట్టావుట కదా! అతడిని మెడికల్ ఎగ్జామినేషన్‌కు పంపిస్తున్నాం. రేపు కోర్టులో ప్రవేశపెడ్తాం. జడ్జిగారికి నీ వాదన విన్పించు’ అని అతన్ని ఆ రోజు లాకప్‌లో పెట్టాడు, పోలీస్ ఇన్‌స్పెక్టర్. మర్నాడు ఈ పెట్టీకేసును విన్న జడ్జీగారు దాసప్ప వదరుబోతు తనానికి నవ్వుకుని, ‘కోర్టు ముగిసే వరకు నువ్విక్కడే ఉండాలి’ అని శిక్ష విధించి వదిలేశాడు.
అయినా దాసప్ప నోటికి ఝాడించి కోపాన్ని ప్రదర్శించటం మానుకోలేదు కానీ, చెయ్యత్త భయపడ్డాడు. పెళ్లి చేసుకున్నప్పటి నుండి తనకు దినదిన గండం, నూరేళ్ల ఆయుష్షులా బతుకు వెళ్లదీస్తూన్న తులసమ్మ, ఒకరోజు తన్ను చూడాలని వచ్చిన తండ్రికి తన కష్టాన్ని, నరకాన్ని విన్పించింది. బయటి వాళ్లపై చెయ్యెత్తటం మానుకున్నాడు కానీ, పెళ్లాం మీద స్వైర విహారం చెయ్యడం మానుకోలేదు దాసప్ప. తను రోజూ ఆ తన్నులు భరించలేదు, ఆ కోపాన్ని తట్టుకోలేదు, తనకా బందిఖానా నుండి విముక్తి కలిగించాలని ఆమె తండ్రికి మొర పెట్టుకుంది. అందువల్ల ప్రయోజనం లేకపోయింది.
‘తప్పమ్మా! అట్లా అనకూడదు. మొగుణ్ని విడిచి వచ్చి ఎక్కడ బతుకుతావు? నువ్వే అతణ్ని దిద్దుకోవాలి, మార్చుకోవాలి. నీ కూతుర్నేం చేస్తవు? నీతోపాటు దాన్నీ చంపుతవా? నేను నిన్ను తీసుకెళ్లి ఏం చెయ్యాలి? నేనూ, మీ అమ్మా శాశ్వతమా? నీ తమ్ముడు నిన్ను చూస్తడా? అన్నీ సమస్యలే. తల్లీ! నాకేం చేయాలో పాలుబోవటం లేదు. అల్లుడికి చెప్పి చూస్తాను. నా మాట వింటాడని నాకు నమ్మకంలేదు. నువ్వు తన్ను గురించి నాకు చెప్పావని అతను నిన్ను మరింత హింసించటం తప్ప మరో ప్రయోజనమేం నాకు కన్పించటంలేదు’ అన్నాడాయన.
తండ్రి చెప్పింది నిజమే. ఆయనకు చెప్పి ప్రయోజనం లేదు. తనకు విముక్తి లేదు. తండ్రి ఆ రోజు విచారంగా వెళ్లిపోవటానికి తను కారణమయిందని ఆమె వెక్కివెక్కి ఏడ్చింది. అయితే, తులసమ్మ అంతటితో ఊర్కోలేదు. ఒకసారి తమ్ముడు వచ్చినప్పుడు అతడు లాయరు కనుక, తనకు మొగుడి నుండి విడాకులు ఇప్పించమని కోరింది, తన కష్టాన్నంతా ఏకరువు పెట్టి.
‘నీకు ఇదేం బుద్ధి పుట్టిందే? నీకు ఏ కోర్టులోనూ విడాకులు ఇవ్వరు. మీ ఆయన తాగుబోతా? ముండల ముఠాకోరా? నీకు తిండిబెట్టకుండా నిన్ను మాడ్చి చంపుతున్నడా? ఏ కారణం వల్ల నీకు కోర్టులో విడాకులు ఇస్తరు. ‘నన్ను చంపుతుండె, హింసిస్తుండె’ అని చెప్పినా అది నువ్వు ఋజువు పర్చాల్సి ఉంటుంది. అది సాధ్యమయ్యే పనేనా? రెట్టమతం ముండాకొడుకు! కానీ మనిషి మంచివాడే. తన బాధ్యతనెప్పుడూ మరవని మనిషి! తన చేతనయినంతలో సంసారాన్ని ఈదుతున్నాడు. తప్పదు ఈ జీవితానికి ఈ మొగుడని సరిపెట్టుకో’ అని రంగనాయకులు కూడ ఆమెకు బుద్ధులు చెప్పాడు.
వేరే దారిలేక, తులసమ్మకు దాసప్పతో సంసారం చెయ్యక తప్పలేదు. పిల్లల్నీ కనక తప్పలేదు. రెండో పిల్లను కనటానికి పుట్టింటికి వెళ్లిన తనకు తల్లి కూడ ఇలాంటి హితబోధే చేసింది. రెండోసారీ తనకు పుట్టింది ఆడపిల్లలయినందుకూ ఏడ్చింది ఆమె. మొగపిల్లవాడయితే, వాడు పెద్దవాడయాక, తనీ మొగుణ్ని వదిలేసి ఆ కొడుకు దగ్గరైనా బతకవచ్చని ఆశపడింది.
దాసప్ప నలభయ్యేళ్ల క్రితం ఓ చిన్న వాచ్ రిపేరింగ్ షాపు పెట్టుకుని జీవితం ప్రారంభించాడు. తండ్రికి ఆ కాలంలో అతన్ని ఎస్‌ఎస్‌ఎల్‌సి వరకు చదివించటమే కష్టమయింది. అతనికి అది గట్టెక్కటమే గగనమయింది. నాలుగుసార్లు పరీక్ష రాసి పాసుకాలేక, విసుగొచ్చి మానేశాడు. వస్తువుల మెకానిజం పట్ల ఆసక్తి ఉండేది. రికామీగా తిరుగుతూనే, వాచ్ రిపేరింగ్ నేర్చుకున్నాడు. తండ్రి పోరు పడలేక, తమ ఇంటి మొగదలలో ఓ చిన్న బడ్డీషాపు తెరిచాడు. డబ్బు సంపాదన లక్ష్యం కాక, పనిలో అతనికున్న ఆసక్తి వల్ల అతని వ్యాపారం వృద్ధి పొందింది. అతనిది చిరుబురులాడే తత్వమని జనానికి తెల్సినా, చెయ్యాల్సిన పని సక్రమంగా చేస్తాడనీ, మోసం చెయ్యడనీ అతనికి పేరు వచ్చింది.
సరిగ్గా అలాంటి సమయంలోనే సంగమయ్య పిల్ల నిస్తానంటూ వచ్చాడు. దాసప్ప తండ్రి, కొడుకు వ్యాపారానికి మదుపు పెట్టగలిగితేనే తులసమ్మను కోడల్ని చేసుకుంటా నన్నాడు. తప్పలేదు పిల్ల తండ్రికి. సంప్రదాయమైన కుటుంబం. తనకెప్పటి నుండో దాసయ్య తెలుసు. ఆ రోజుల్లో చదువుకంత ప్రాధాన్యత లేదు. పిల్లవాడు తెలివిగలవాడే. పిల్లకింత తిండి పెట్టకపోడు! అంతకంటే కావల్సిందేముంది? ఐదు వేలు కట్నం చదివించుకోక తప్పలేదు. అయితే, దాసప్ప ఆ డబ్బు దుబారా చెయ్యలేదు. అనంతపూరు బస్టాండుకు దగ్గర్లోనే ఓ ఫాన్సీ షాపు తెరిచాడు. తన వాచ్ రిపేరింగ్ మాత్రం వదలలేదు.

షాపులోనే అద్దాలతో చిన్న కియోస్క్ కట్టించుకుని, మధ్యాహ్నం పూట బేరాలు మందంగా జరిగే సమయంలో, వాచ్ రిపేరింగ్ చేసేవాడు. అలా సంసారం పెరిగేకొద్దీ అతనికి సంపాదనలో పడక తప్పలేదు.
అలా కష్టపడి పైకి వచ్చాడు దాసప్ప. కొడుకు పుట్టగానే భార్యకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించేశాడు. అతడు మనిషి ఎలాంటి వాడయినా, ఒక సత్యం మాత్రం చక్కగా గ్రహించాడు. డబ్బు ఎవరూ ఊర్కే ఇవ్వరు. దాన్ని కష్టపడి సంపాదించుకోక తప్పదు. సంపాదించుకుంది పొదుపుగా ఖర్చు పెట్టుకోవాలి. మెల్లగా తన వ్యాపారం కేంద్రం బెంగళూరుకు బదిలీ చేశాడు. ఇప్పుడు బెంగళూరు కివీస్ రోడ్డులో అతనికి ఓ పెద్ద ఎలక్ట్రానిక్ షాపు ఉంది. పొద్దున పది గంటలకు ఇంట్లో బయలుదేరితే, మళ్లా రాత్రి పదింటికే అతను ఇంటికి చేరటం. జీవితం గానుగెద్దు రీతి సాగిపోయేది. అతనికి సెలవులు లేవు, తప్పని ఆదివారాలు తప్ప. ఓ గుడికి వెళ్లేవాడు కాదు. పూజా పునస్కారాలు అతనికి పట్టేవి కావు. అతనికి తరచు మూడు ఖరాబవుతూండేది. ఆ సమయంలో తను ఇతరులను కష్టపెడుతున్నానని అతనికి తెలియకపోలేదు. కానీ, అతను వివశుడు.
కూతుళ్లిద్దరికు పదో తరగతి వరకు చదువు చెప్పించి, వాళ్లకు ఇరవై యేండ్లు వచ్చే లోపలనే వివాహం చేశాడు. కొడుక్కు ఇంజనీరింగ్ చెప్పించాడు దాసప్ప. అతడు ఇంజనీరింగ్ పాసయాడు కానీ, ఇంకా ఉద్యోగం దొరకలేదు. ఉద్యోగం సంపాదించుకోలేని చవటగా కన్పించేవాడు కొడుకు సుధీర్ తండ్రికి. అలా కన్పించటమే కాదు, ఆ మాట పైకే అనేవాడు. తండ్రి స్వభావం తెల్సినవాడు కనుక సుధీర్ ఎదురు జవాబు చెప్పేవాడు కాదు. ఒకరోజు తండ్రి మాటలను సహించలేక పోయాడతను. తండ్రికీ, కొడుక్కూ పెద్ద పోట్లాటే అయింది. ‘ఇంకా ఎన్నాళ్లు నిన్ను మేపాలిరా? నీకు నౌకరీ వచ్చేడవదు. నాకు సాయపడతావేమోనన్న ఆశ నాకు లేదు. కనీసం నీ బతుకయినా నువ్వు బతుకుతావని ఆశపడినాను. నీకింద ఎంత ఖర్చు పెట్టినాను? అంతా బూడిదలో పోసిన పన్నీరయినాది. నిన్నని ఏం ప్రయోజనం? ఆ వాజమ్మ కడుపున పుట్టిన వెధవ్వి అంతకంటే ఏం పొడిచేడుస్తావు..’
దాంతో సుధీర్‌కు మండిపోయింది. ‘అమ్మను ఒక్కమాట అనకు. నాకు ఉద్యోగం రాకపోవటానికి ఆమేం చేస్తది? తిండి పెడ్తున్నావనేగా నువ్విన్ని మాటలంటున్నావు! నీ తిండి నాకక్కర్లేదు. నేను ఇవ్వాళే బయటికెళ్లిపోతున్నాను. నువ్వు పెట్టే ఈ మాత్రం తిండి ఎక్కడైనా దొరక్కపోదు’ అని విసురుగా ఇంట్లో నుంచి వెళ్లిపోయాడతను.
భార్య ఏడవటం చూసి, ‘కొంపకు అరిష్టంగా ఏడిచ్చావకు. తేరగా వాడికి తిండెవడు పెడ్తాడు. డొక్క మాడితే రేపటికల్లా వాడే ‘అమ్మా ఆకలి’ అంటూ దేబిరించుకుని వస్తాడు. మీ వంశం అసలే దేబిరి ముఖం వంశం! వాడికి మరి ఆ బుద్ధులే వచ్చినాయి...’ అని అతడు పంటి బిగువున నిశ్చింతగా ఉన్నట్టు కన్పిస్తూ షాపునకు వెళ్లిపోయాడు.
మొగుడు ఇల్లు వదిలివెళ్లిపోయాక తులసమ్మ కొడుకు స్నేహితుల ఇళ్లన్నీ వెతికి, ఒక మిత్రుడి ఇంట్లో ఉన్న కొడుకును బతిమాలి, బామాలి, ఇంటికి తీసుకువచ్చింది. అప్పటి నుండి సుధీర్ తండ్రి ఎదుట పడటం మానేశాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కొడుకు తన మాట దురుసుతనం వల్ల మళ్లా వెళ్లిపోతాడేమోనని అతనికి భయం వేసింది. గుర్రుగా భార్య వంక చూసేవాడు కానీ, మరేం మాట్లాడేవాడు కాదు.
ఇలా ఉండగా కొడుక్కు మద్రాసులో ఏదో ప్రైవేటు కంపెనీలో ఉద్యోగమొచ్చింది. అతడు మద్రాసు వెళ్లి ఆ ఉద్యోగంలో జాయినయ్యాడు. నెల రోజుల తర్వాత అతడు తండ్రికి ఉత్తరం రాశాడు. తను మూడు గదుల ఇల్లు తీసుకున్నాననీ, తనకూ అమ్మకు అది సరిపోతుంది కనుక, ఒక వారం రోజుల లోపల వచ్చి తల్లిని తీసుకువెళ్తాననీ రాశాడు. సుధీర్‌కు తెల్సు తల్లి ఇచ్ఛ. ఆమె ఎప్పటినుండో తన తండ్రి నుండి పారిపోవాలని చూస్తున్నదని అతనికి తెల్సు. కనీసం తన చేతిలో ఉన్న పనయినా చేద్దామన్న అభిప్రాయంతో అతడా ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం వచ్చిన రోజున దాసప్ప పెద్ద గోలే చేశాడు.
‘వాడెవడే నిన్ను తీసుకు వెళ్లటానికి? నువ్వు వెళ్తే నాకిక్కడ ఎట్లా గడుస్తుంది?’ అని గంతులేశాడు.
‘నీ సంగతి నాకు తెలవదు. ఇప్పటికి ముప్పయి ఐదేళ్లుగా నీ చిరుబురులు, కోపతాపాలు భరించలేక చస్తుంటిని. నేను ఎదురుచూసిన రోజు వచ్చినాది. నా కొడుకు నాకు ఈ జైలు నుండి విముక్తి కలిగిస్తానంటున్నడు. ఆ దేవుడికి మొక్కులు తీర్చుకుంటాను, నా కోరిక ఈడేర వచ్చినందుకు’ అంది మొగుడి ముఖం వంక చూడకుండా.
‘నిన్ను చంపేస్తా. నేనుండగా నువ్వెక్కడి కెళ్తావే?’
‘చంపు. పీడా పోతుంది. ఈ చెర వదిలిపోతుంది’
ఆమె అలా అనంగానే అతడు మాన్పడిపోయాడు. ఓ క్షణం ఆమె వంక చూసి, ‘నిజంగా చెరలాగా ఉందా, నా దగ్గర ఉండటం?’ అని అతను ఆమెను అడిగాడు. అతని గొంతు విని ఆమె ఒక్క క్షణం ఆశ్చర్యంగా అతని వంక చూసింది.
అయినా ఆమె పట్టు విడవలేదు. కొడుకుతో మద్రాసు వెళ్లటానికి ఉత్సాహంగా ఏర్పాట్లు చేసుకోసాగింది తులసమ్మ. ఇలాంటి సమయంలో రంగనాయకులు విత్తనాల కోసం బెంగుళూరు రావటం తటస్థించింది. భార్య వెళ్లిపోతానని అన్నాక, మూడు చెడిపోయి ఉన్న దాసప్ప రంగనాయకులు తన భార్యకు తమ్ముడు కనుక, ఈ కుట్రలో అతనికీ భాగముందని భావించాడు. అందుకే అతనితో విరసంగా మాట్లాడాడు. అయితే, ‘చూశావుటయ్యా! మీ అక్క కొడుకుతో మద్రాసు వెళ్తానంటున్నాది. సరైన పనేనా? నేనిక్కడ ఏమేడ్వాలి? నాకు తిండి ఎవరు వండి పెడ్తరు?’ అన్నాడు భార్య మీద ఫిర్యాదు చేస్తూ.
‘విన్నాను. సుధీర్‌కు మద్రాసులో ఉద్యోగమొచ్చినాదని. వెళ్లి రానీ, రెండు రోజులు. అక్కకూ వాతావరణం మార్పు ఉంటుంది’ అన్నాడు రంగనాయకులు.
‘మీ బావ దగ్గర నేను బతకలేనురా. అక్కడే నా కొడుకు దగ్గర ఉండిపోతాను. నేను ఆయన హింస భరించలేను. రాకరాక వచ్చిన అవకాశం నేను వదలుకోను. వాడిక్కూడ తెల్సు నా బతుకు ఇక్కడ ఎంత నికృష్టంగా గడుస్తున్నదో! అందుకే వచ్చి తీసుకు వెళ్తానని రాశాడు. పిచ్చి సన్నాసి, హోటలు కూడు ఎన్నాళ్లు తింటాడు? ఆయన్ని హోటల్లో తినమను’ అంది తమ్ముడి మాటలకు బదులు చెప్తూ తులసమ్మ.
‘చూసినవా, ఏం తప్పుడు కూతలు కూస్తున్నాదో. మీ వంశమే అంత!’ అన్నాడు దాసప్ప.
‘ఏ మాటలే అక్కా! ఎన్నాళ్లుంటావు అక్కడ బావనొదిలి? ఆయనకెట్లా గడుస్తుంది నువ్వకడే ఉండిపోతే? వాడు నిన్ను ఎన్నాళ్లు ఉంచుకుంటాడే, అక్కా? వాడి పెళ్లాం రాగానే నీకు ఉద్వాసన పల్కుతాది’ అన్నాడు రంగనాయకులు.
‘నాకు తెలవదు. ఎవరి చావు వాళ్లు చావండి. వాడు రాంగానే నేను వెళ్లిపోతాను. ఎన్నాళ్లు భరించను ఈయన తిట్లు!’
‘నా పెళ్లాన్ని కూడ అనక నేనెలా బతకను? నిజంగానే వెళ్లిపోతవా?’
‘నిజంగానే వెళ్లిపోతా’
ఇంక మాటలు జరగలేదు. పాత రోజుల్లో అయితే, ఇలా తనను ఎగర్తించి మాట్లాడినట్లయితే, ఆమెకు దేహశుద్ధి చేసేవాడు దాసప్ప. పిల్లలు పెరిగి పెద్దవుతున్నాక, ఆమెను కొట్టడం మానేశాడు కానీ, నోటికి పని చెప్పకుండా మానలేదు అతడు. ఇవాళ ఆమెను తిట్టటానికి కూడ అతనికి మనస్కరించలేదు.
తులసమ్మ వంట చేసింది. భోజనానికి పిల్చినా, తలుపు వేసుకు పడుతున్న దాసప్ప రాలేదు. ఇటీవల అతను తన కోపాన్ని అలా ప్రదర్శించటం అలవాటయిన తులసమ్మ అతని కోపాన్ని అంతగా పట్టించుకోలేదు. తమ్ముడికి పెట్టి తను తింది.
సాయంత్రం కాఫీ పెట్టి, భర్త తాగుతాడేమో పిలవబోయిన తులసమ్మ అతన్ని చూసి నిర్ఘాంతపోయింది. అతని మూతి వంకర తిరిగిపోయి ఉంది. పిలిస్తే, ‘వె..వ్వె...వ్వె...’ అంటున్నాడు.
‘ఒరే రంగనాయకులూ, మీ బావకేమో అయింది. చూడరా’ అని గాబరాగా పిల్చింది తులసమ్మ తమ్ముడిని.
అతడు వచ్చి చూశాడు. దాసప్పకు పక్షవాతం వచ్చిందని తెలుసుకున్న రంగనాయకులు, ‘ఎవరైనా డాక్టరును పిల్చుకు వస్తాను’ అని వీధిలోకి పరుగెత్తుకు వెళ్లాడు.
బావమరిది వెళ్లినా, భర్త తన వంక చూసి ‘వె..వ్వె...వ్వె...’ అని అనటం గమనించిన తులసమ్మ, ‘వెళ్లనులే. నాకీ జన్మకు నీ ఖైదు తప్పదు. నా ఖర్మ ఇట్లా కాలింది. నీ రాక్షస ప్రేమతో నాకు చచ్చే చావవుతున్నాది’ అంది.

కాకాని చక్రపాణి
6-1-149/10, ఫ్లాట్ నెం.101, విశ్వంభర అపార్ట్‌మెంట్స్, పద్మారావునగర్, సికిందరాబాద్-500 025.. 040-27501409, 9000611409

కాకాని చక్రపాణి