S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘ఆకాశవాణి’లో మన కవుల బాణి

1960 ప్రాంతంలో ‘ఆకాశవాణి’లో మన వాణి వినబడడమే మహాభాగ్యంగా, అరుదైన అవకాశంగా ఉండేది. సినిమాల తర్వాత ‘గ్లామర్’ మీడియా అంటే ఎవరైనా ఏకకంఠంగా రేడియో అని చెప్పాల్సిందే. అలాంటి రేడియో ‘లలిత సంగీతం’ కై అనేక గీతాల్ని రచించి రాణించడమే గాక అదే ‘ఆకాశవాణి’లో ప్రవృత్తికి అనుకూలంగా వృత్తిని కూడ ఏర్పరచుకున్న మహాకవులు శ్రీయుతులు దేవులపల్లి కృష్ణశాస్ర్తీ, దాశరథి కృష్ణమాచార్యులు కావడం విశేషం. వారి గూర్చి ఆకాశవాణి ‘లలిత సంగీతం’ గూర్చి పాఠకులకు తగిన పరిచయం చేయడమే ఈ వ్యాసం ముఖ్యోద్దేశం.
16.6.1938లో మద్రాస్ ఆకాశవాణి కేంద్రం ఏర్పాటు కాగా, ఆచంట జానకిరామ్ రూపొందించిన ‘అనార్కలి’ సంగీత రూపకం ప్రసారమైంది. మొదట్లో లలిత గీతాలు - యక్షగానాలు - రూపకాలు ద్వారానే ప్రసారమయ్యేవి. కావున ‘అనార్కలి’ సంగీత రూపకంకై ఆచంట జానకిరామ్ ఆరుగురు ప్రముఖ కవులచే (దేవులపల్లి, విశ్వనాథ సత్యనారాయణ, ఊటుకూరి సత్యనారాయణ, వింజమూరి లక్ష్మీనరసింహారావు, పిలకా గణపతి శాస్ర్తీ, ముద్దుకృష్ణ) పాటల్ని రాయించి ప్రసారం చేశారు. అందులో ప్రథమంగా ప్రసారమైన (వింజమూరి సీత - అనసూయ స్వరాలు కూర్చిన)
‘రారమ్మ రారమ్మ మందారమా! రక్త కరవీరమా!
మాలతీ, మల్లికా, మాధవీ కన్యకా! శేఫాలికా!
తోట తోటల నేలు మేటి కాదే పిలుపు
పాటించునోయేమొ ప్రభువు లోకపు మాట
తోటలన్నీ మించు మేటి కాదే వలపు
దాటగలడే ప్రియుడు దానిమ్మ పూపాట?..’
అనే అనార్కలి గీతాన్ని దేవులపల్లి చేత రాయించారు. కావున రేడియో ‘లలిత సంగీత’ ప్రథమ గీతకర్తగా కృష్ణశాస్ర్తీ నిలిచారు. అంతేగాక అనేక లలిత గీతాల్ని తర్వాత కూడా అపూర్వంగా రచించి ప్రకాశించారు. అసలు లలిత గీతం అన్న పదం ‘లలిత సంగీతం’ ద్వారా ‘లలిత సంగీతం’ ‘ఆకాశవాణి’ ద్వారా ప్రచారంలోకి వచ్చింది. మొదట్లో ‘సుగమ్ సంగీత్’ ‘గీతావళి’ ఆ తర్వాత ‘లలిత సంగీతం’గా ప్రజాదరణ గాంచింది. 1954లో తెలుగు శ్రోతల్ని ‘సిలోన్’ నుంచి ప్రసారమయ్యే సినీ గీతాల నుంచి ఆకర్షించడానికై ‘లలిత సంగీతం’ కార్యక్రమాల్ని విస్తృత స్థాయిలో రూపొందించడం జరిగింది. మద్రాస్ కేంద్రానికి రజనీకాంతరావు, విజయవాడ కేంద్రానికి మంగళంపల్లి బాలమురళీకృష్ణ, హైదరాబాద్ కేంద్రానికి పాలగుమ్మి విశ్వనాథంగార్లు లలిత సంగీత ప్రయోక్తలుగా నియమించబడినట్లుగా బాలాంత్రపు రజనీకాంతరావుగారు నేను ‘లలిత గీతాల’ పరిశోధన చేస్తూ, ఇంటర్వ్యూ చేయగా వివరించారు. తెలుగులోని ‘లలిత సంగీతం’ కన్నడంలో ‘్భవగీతె’ తమిళంలో ‘మెల్‌ఇశై’, మలయాళంలో ‘లలిత గానంగళ్’ పేరుతో ఇప్పటికీ ఆకాశవాణి ప్రసారం చేయడం అభినందనీయం!
దేవులపల్లి కృష్ణశాస్ర్తీ నవంబర్ 1, 1897లో రావుచంద్రపాలెంలో పిఠాపుర సంస్థాన ఆస్థాన కవుల వంశంలో తూర్పుగోదావరి జిల్లాలో జన్మించారు. చిరపరిచితాలైన సెలయేళ్లు, మామిడి తోటలు, కోయిల పాటల ప్రభావంతో ప్రకృతి - ప్రణయ గీతాలు రసరమ్యంగా రచించి ‘ఆంధ్రా షెల్లీ’గా ఖ్యాతి గాంచారు. 1920లో రైలు ప్రయాణం చేస్తూ, బళ్లారి దారిలో నల్లమల అడవుల్ని గాంచుతూ పరవశించి
‘ఆకులో ఆకునై - పూవులో పూవునై
కొమ్మలో కొమ్మనై - నునులేత రెమ్మనై
ఈ అడవి దాగిపోనా? ఎటులైన యిచటనే ఆగిపోనా?’
అనే లలిత గీతాన్ని రచించారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ గీతానే్న ప్రథమ వికసిత లలిత గీతంగా పేర్కొనాలి. ఈ గీతం మొదట్లో ‘లలిత సంగీతం’లో అటు పిమ్మట ‘మేఘ సందేశం’లో చేరి విశేష ప్రచారం గాంచింది.
తొలినాళ్లలో కృష్ణశాస్ర్తీ రవీంద్రుని ప్రభావంతో బ్రహ్మసమాజ గీతాలు, దేశభక్తి గీతాలు రచించారు.
జయము జ్ఞాన ప్రభాకరా!
జయము శాంతి సుధాకరా!
జయము మోహ తమోహరా!
జయ జయ కరుణాకరా! - అనే పల్లవితో రచించిన వీరి గీతం ఆనాటి బ్రహ్మ సమాజ ఉపాసనలో విశిష్ట మంగళ హారతిగా అందరి మనసు కెక్కింది (చలంగారితో సహా) ఆ తర్వాత 1933లో కాకినాడ పి.ఆర్. కళాశాలలో ఉపాధ్యాయ వృత్తి కొనసాగిస్తూ, విద్యార్థులకు ప్రార్థనా గీతంగా - స్వాతంత్య్ర ఉద్యమ గీతంగా పనికివచ్చేలా
‘జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ - దివ్యధాత్రి
జయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయనేత్రి! - అనే గీతాన్ని రసరమ్యంగా రచించారు. ఈ గీతం కూడా లలిత గీతంగానే గాక ఓ చిత్రంలో సినీ గీతంగానూ అందర్నీ విశేషంగా ఆకర్షించింది. అంతేగాక ‘కార్తీక రాత్రుళ్లో కరి మబ్బుంటుందా?
కాల మేఘమాకాశం విడచి నేల నడుస్తుందా?- అంటూ నీలమేఘ శ్యాముని గూర్చి,
‘తోట పిలిచె - తోపు పిలిచె
ఏటి తరగల పాట పిలిచె- అంటూ ప్రేమికుల గూర్చి కృష్ణశాస్ర్తీ అల్లిన అనేక లలిత గీతాలు కూడ వెండితెర కెక్కి అలరించాయి.
దేవులపల్లి కృష్ణశాస్ర్తీ
‘నదీ సుందరి సుధాస్యందిని
నగాధీశ్వర నందినీ!
నడుమ కోనా - నడచి కానా
కడచి వచ్చిన నవఝరీ!’ - అంటూ కొండకోనల్లో పరుగెత్తే - తరగెత్తే నదీ సుందరిని వర్ణిస్తూ అల్లిన గీతం అనేకసార్లు ‘లలిత సంగీతం’లో ప్రసారమై రేడియో శ్రోతల్ని అమితంగా ఆకర్షించింది. ఆయన రచించిన
‘నారాయణ నారాయణ అల్లా అల్లా!
మా పాలిటి తండ్రీ! - నీ పిల్లలమేమెల్లా!’
అనే గీతం సమతా - మమతా భావంతో ‘లలిత సంగీతం’లోనేగాక మత కలహాల సందర్భంగా కూడా రేడియోలో మారుమోగింది. 1945లో ‘ఆకాశవాణి’ ఉద్యోగిగా చేరిన కృష్ణశాస్ర్తీగారు 1951లో ‘మల్లీశ్వరి’ చిత్రంకై సినీ గీతాల్ని కూడ లలిత గీతాల్లా రచించి మెప్పించారు. అంతేగాక ‘్భగ్యరేఖ’ ‘కార్తీకదీపం’ ‘సుఖదుఃఖాలు’ ‘గోరింటాకు’ ‘్భక్త తుకారాం’ ‘ఏకవీర’ మొదలగు చలనచిత్రాలకు రచించిన అనేక సినీ గీతాల్ని కూడా లలిత గీతాల్లా మలచి మైమరపించారు. భావ కవిత్వ యుగకర్తగా ఖ్యాతి గాంచారు.
కృష్ణశాస్ర్తీగారిలాగే దాశరథి కృష్ణమాచార్య గారు కూడా ఇటు లలిత గీతాల్ని అటు సినీ గీతాల్ని రచించడమే గాక ‘ఆకాశవాణి’ ఉద్యోగిగా చేరడం విశేషం.
దాశరథిగారు 22.7.1925లో వరంగల్ జిల్లాలో మధ్యతరగతి వైష్ణవ కుటుంబంలో జన్మించారు. అభ్యుదయ భావావేశంతో నిజాం నిరంకుశత్వాన్ని నిరసిస్తూ ‘ఓ నిజాము పిశాచమా!’ అంటూ కలాన్ని ఖడ్గంలా ఝళిపించి జైలుపాలైన ఉద్యమ కవి - తెలంగాణ విముక్తికై ఎలుగెత్తిన అభ్యుదయ కవి! చివరి దశలో జలగం వెంగళరావు ఆదరణతో వెలుగొందిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్థాన కవి! రేడియో ఉద్యోగ కవిగా దాశరథిగారు అనేక లలిత గీతాల్ని రచిస్తూ అక్కినేని నాగేశ్వరరావుగారి ప్రోత్సాహం తోడవటంతో 1962లో ‘ఇద్దరు మిత్రులు’ చిత్రం ద్వారా సినీ రంగప్రవేశం కూడా చేసి, సినీ కవిగా రాణించారు. ‘అంగారం - శృంగారం’ తన ఐచ్ఛిక అంశాలంటూ అనేకసార్లు ప్రకటించారు.
‘తలనిండ పూదండ దాల్చిన రాణి
మొలక నవ్వులతోడ మురిపించబోకే
నీ మేనిలో పచ్చ చేమంతి అందాలు
నీ నీలవేణిలో నిలిచె ఆకాశాలు!- అంటూ దాశరథిగారు రచించిన ప్రణయ గీతం ఘంటసాల మధుర గాత్రంలో లలిత గీతంగా అనేకసార్లు ‘ఆకాశవాణి’లో మారుమోగింది. గ్రామఫోను రికార్డుగానూ రూపుదాల్చింది. ఆయన రచించిన
‘్భధరమో - సాగరమో?
భూతలమో - ఆకసమో?
భరత ధరణి నా గృహం
భరత జాతి నా అహం’ - అనే గీతం దేశభక్తి గీతంగా ‘లలిత సంగీతం’లోనే గాక ‘ఈ పాట నేర్చుకుందాం’లో అత్యంత ఆదరణ పొందింది.
‘నీలో దీపం వెలిగించు
నీవే వెలుగై వ్యాపించు’ - అనే ప్రబోధ గీతం రేడియో లలిత గీతంగా ప్రసారమై ఎందర్నో ఉత్తేజితుల్ని గావించింది.
‘మెరుపులు పూవుల దండగా
మబ్బులు మెత్తని దాడుగా
గగనము వెచ్చని శయ్యగా
హాయిగ నుందువె తారకా! - అనే గీతం మరియు
‘మ్రోయింపుము నవవేణువు - తీయని మోహన వేణువు
నవ జీవన రాగముతో నాట్యమాడ ప్రతి రేణువు’ అనే శ్రీకృష్ణ మురళి గీతం ‘లలిత సంగీతం’లో అనేకసార్లు మారుమ్రోగాయి.
‘మామిడికొమ్మా - మల్లియ రెమ్మా
మంతన మాడెనదే!
కోయిల కొమ్మా - మన చిలుకమ్మా
పాటలు పాడెనదే!..’
అనే గీతం మొదట్లో లలిత గీతంగా, ఆ తర్వాత ‘రాము’ చిత్రంలో సినీ గీతంగా అందర్నీ ఆకర్షించింది. సినీ గీతాల్ని రాయడానికై, ఆకాశవాణి ఉద్యోగానికి (బదిలీ వల్ల) రాజీనామా చేసి, మద్రాసులోనే ఉండిపోయారు. ఆ తర్వాత హైద్రాబాద్‌కు వచ్చి కొన్నాళ్లు ‘సెన్సార్ బోర్డు మెంబర్’గా పని చేశారు. ఆ సమయంలోనే ‘యుగకర్తలు’ చిత్రంలో ‘సంఘంలోని కుళ్లంతా చాటి చెప్పినవేమన్నా! మేడిపండు లోకాన్ని మెరుగుజేయవేమన్నా!- అనే పాటను నేను రాయగా మెచ్చి ప్రశంసిస్తూ నాకు ఉత్తరం రాశారు. అది నాకు మధురస్మృతిగా నిలిచింది. అనేక ‘ఎగ్జిబిషన్’ కవి సమ్మేళనాల్లో (సంక్రాంతి సందర్భంగా) 1981 నుండి 1986 వరకు ఆయన అధ్యక్షతన నేను పాల్గొని, అభినందన లందుకోవడం నా అదృష్టంగా భావిస్తూంటాను.
దేవులపల్లి కృష్ణశాస్ర్తీ గారిని కూడ 1975లో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా రవీంద్రభారతిలో పాలగుమ్మి గారితోపాటు ఆకాశవాణి ఆవరణలో కలుసుకునే అవకాశం లభించినందుకు ఆనందిస్తూంటాను.
ఈ విధంగా కృష్ణశాస్ర్తీ - దాశరథిగార్లు ఆకాశవాణి కవులుగా అలరారినందుకు లలిత గీత - సినీ గీత రచయితలుగా ప్రకాశించినందుకు గల అవినాభావ సంబంధాన్ని నెమరువేసుకుంటుంటే సంభ్రమాశ్చర్యం కలుగుతూ ఉంటుంది!

-వడ్డేపల్లి కృష్ణ -9246541699