S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వేరు కాపురం

పెళ్లి తరువాత కూడా పిల్లలు తమ దగ్గరే ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. అది సహజం. కొడుకులు కూడా ఆ విధంగా ఆలోచించడం సహజం. కాని ఈ ఆధునిక సమాజంలోని పరిస్థితులు వేరు. కోడళ్లు వేరుగా, స్వతంత్రంగా ఉండాలని అనుకుంటున్నారు. ఇలాంటి భావనలకి ఎవరినీ తప్పు పట్టాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రుల నుంచి వేరుగా ఉంటూ తల్లిదండ్రుల యోగక్షేమాలు చూస్తున్న పిల్లలు ఎంతోమంది కన్పిస్తున్నారు. అదే విధంగా తల్లిదండ్రుల దగ్గర ఉంటూ వాళ్లని బాధిస్తున్న వ్యక్తులు కూడా చాలామంది మనకు కన్పిస్తున్నారు.
తల్లిదండ్రుల నుంచి వేరుగా నివసిస్తున్న జంటని తప్పుపట్టాల్సిన పని లేదు. కానీ సుప్రీంకోర్టు ఈ మధ్య వెలువరించిన తీర్పులో ఈ అంశాన్ని తప్పు పట్టింది. నరేంద్ర వర్సెస్ కె.మీనా కేసులో సుప్రీంకోర్టు ఈ విధంగా అభిప్రాయపడింది. ‘తల్లిదండ్రుల నుంచి వేరుగా ఉండాలని తరచుగా భర్త మీద వత్తిడి చేస్తే అది అతని పట్ల క్రూరత్వం అవుతుందనీ, దాని ఆధారంగా విడాకులు తీసుకోవచ్చని ప్రకటించింది’. కానీ తల్లిదండ్రుల నుంచి వేరుగా వున్నంత మాత్రాన వాళ్లు చెడ్డవాళ్లు కాదు.
భార్యల మీద నెగెటివ్‌గా వచ్చిన కార్టూన్లు లెక్కలేనన్ని ఉన్నాయి. సాంఘిక మాధ్యమాలు వచ్చిన తరువాత ఇలాంటి కార్టూన్లూ, జోకులు రోజూ లెక్కలేనన్ని కన్పిస్తున్నాయి. సరదాగా వాటిని చూసి నవ్వుకోవచ్చు కానీ, అవి వాస్తవం కాదు.
నాకు తెలిసిన చాలా సంఘటనల్లోని ఓ రెండు దృష్ట్యాంతాలు మీకు చెబుతాను.
ఓ మిత్రుడికి కిడ్నీ సమస్య వచ్చింది. రెండు కిడ్నీలు పాడైపోయినాయి. చాలా రోజులు డయాలసిస్ మీద బతుకు కొనసాగించాడు. కిడ్నీ దాతల కోసం ప్రయత్నం చేశాడు. కానీ ఫలితం లేకుండా పోయింది. రక్తసంబంధీకులు ఎవరూ కిడ్నీ ఇవ్వడానికి ముందుకు రాలేదు. చివరికి అతని భార్య ముందుకు వచ్చింది. రకరకాల పరీక్షల తరువాత ఆమె కిడ్నీ అతనికి సరిపోయిందని డాక్టర్లు అభిప్రాయం వెలిబుచ్చారు. చివరికి ఆపరేషన్ జరిగింది. అది విజయవంతమైంది. అతను మళ్లీ మామూలు జీవితం కొనసాగిస్తున్నాడు.
ఇలాంటిదే మరో సంఘటన. మరో మిత్రుడికి కాలేయం పాడైంది. విపరీతంగా తాగడం వల్ల అలా జరిగింది. కాలేయ మార్పిడి చేస్తే తప్ప అతను బతికే పరిస్థితి లేదు. రక్త సంబంధీకులు ఎవరూ ముందుకు రాలేదు. చివరికి అతని భార్య తన కాలేయాన్ని ఇవ్వడానికి ముందుకు వచ్చింది. పరీక్షల తరువాత ఆమె కాలేయంలోని కొంత భాగాన్ని అతనికి సర్జరీ ద్వారా అమర్చారు. అతను ఎప్పటిలా మామూలు జీవితానికి దగ్గరయ్యాడు.
ఇలాంటి సంఘటనలు మన జీవితంలో ఎన్నో కన్పిస్తాయి. ఈ ఇద్దరు మిత్రుల భార్యలు తమ పెళ్లైన తరువాత భర్తలతో వేరు కాపురం పెట్టించారు. అయితే వాళ్లు తమ భర్తలని అమితంగా ప్రేమించడం వల్ల రక్త సంబంధీకులకన్నా ఎక్కువ త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు. అట్లా అని రక్తసంబంధీకులని నిందించడానికి వీల్లేదు. వాళ్ల కారణాలు వాళ్లకి ఉండవచ్చు. చెప్పొచ్చేది ఏమిటంటే భార్యలు భర్తలని విపరీతంగా ప్రేమిస్తారు. వేరుగా ఉండాలని అనడం సుప్రీంకోర్టు చెప్పినట్టు క్రూరత్వం అవుతుందేమో కానీ ప్రేమలేదని అనలేం. ఈ రెండు ఉదాహరణలే కాదు, పరిశీలించి చూస్తే ఇలాంటి సంఘటనలు లెక్కలేనన్ని కన్పిస్తాయి.
భర్తలని భార్యలు ప్రేమించినంతగా, భర్తలు భార్యలని ప్రేమించడం లేదని అంటే అతిశయోక్తి కాదు.

-జింబో 94404 83001