S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అమృతవర్షిణి

కడుపునిండా కమ్మగా తింటే ఆనందం...
కష్టపడి చేసిన కూలీకి చేతికి డబ్బులందితే ఆనందం...
ఎదిగిన పిల్లలు చేతికి అందివస్తే అదో గొప్ప ఆనందం...
పచ్చని పొలాల్లో విరగబూసిన పైరులు రైతుకానందం...
ఈ ఆనందాన్ని కొలిచి మాటల్లో చెప్పలేం. అనుభవించేదే. ఆనందం, ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది.
సంగీతానందం కూడా అంతే. రణగొణ ధ్వనుల రొదలతో, ఏం పాడుతున్నారో తెలియని పాటలు కొందరికి ఇష్టం. చల్లగా, హాయిగా, రాగమాధుర్యాన్ని నింపుకున్న పాటలంటే మరికొందరికిష్టం.
ఈ ఆనందాన్ని గురించి పెద్దలోమాటంటారు. కీటకాల ఆనందం కంటే వెయ్యిరెట్లు పశుపక్ష్యాదుల ఆనందం. అంతకంటే వెయ్యిరెట్లు మనిషి ఆనందం. దీనికన్నా, వెయ్యి రెట్లు అధికమైనది దేవానందం. దానికంటే వెయ్యి రెట్లు ఎక్కువైనది బ్రహ్మానందం.
త్యాగరాజాది వాగ్గేయకారులందరికీ లభ్యమైనది.. ఈ బ్రహ్మానందమే.
బ్రహ్మానంద సాగరంలో మునిగితేలారు. ఒకదానికొకటి రుచి కలిగిన ‘నామాలను, స్వర, రాగ, లయాదులతో కలిపి, పాడుకుంటూ, శుద్ధ, నిత్య, సత్య చైతన్య రూపమైన ఆనందాన్ని అనుభవించారు’ - మాటలు అందుకోలేని ఆర్తినీ, ఆవేదననూ, నాదం ద్వారా వ్యక్తపరచుకొని, నాదయోగులయ్యారు.
నమ్ముకున్న దైవాన్ని, అంతరంగంలో ప్రతిష్టించుకుని అద్వైత స్థితిలో మనసును సిద్ధం చేసుకుని, శ్రుతి మాధుర్యంతో భగవంతుడి గుణగానాన్ని పాడుకున్న సంగీత ఋషి త్యాగయ్య.
బెల్లం చుట్టూ ఈగలు మూగినట్లు ఆయన సంగీతానికి పరవశులైన వారందరూ ఆయన శిష్యులయ్యారు.
వీరిలో ఎక్కువమంది తమిళులే. తెలుగు భాష నేర్చుకుని త్యాగరాజ కీర్తనలు పాడుకున్నారు. పరమానందాన్ని పొందారు. ఆ నాదామృతాన్ని పదిమందికీ పంచారు.
అలా శిష్య, ప్రశిష్య గణం పెరిగింది. మహా సంగీత వృక్షంగా, శాఖోపశాఖలై విస్తరిల్లింది.
ఎందరికో నీడనిస్తోంది - మరెందరికో ‘జీవనోపాధి’ నిస్తోంది.
లౌకిక వ్యవహారాలను మనసులో రానీయకుండా, సంగీతమే పరమావధిగా జీవించిన త్యాగయ్యకు సరితూగే బిరుదులున్నాయా?
ఎవరి మెప్పు కోసమో, ధనార్జన కోసమో, ఆయన సంగీతాన్ని ఆశ్రయించలేదు. పరమాత్మను స్తుతిస్తూ, నామకుసుమాలతో సంగీతార్చన చేసిన త్యాగయ్య పరమానంద పరిపూర్ణ, నిత్య తృప్తుడు - సామాన్య శోతం కోసం దిగిపోయి చప్పట్ల కోసం పాడే సంగీతం పెరగదు. పెరగనివ్వదు. అందుకే సంగీతాన్ని మకరందంతో పోలుస్తూ, ‘పరమానందమనే’ కమలముపై ఒక భేకములు చెలగే అంటారు. కొలనులో తామరపువ్వులుంటాయి. చుట్టూ కొంగలూ, కప్పలూ, ఎన్నో క్రిమికీటకాలు తిరుగుతూనే ఉంటాయి. ఎక్కడి నుంచో తుమ్మెదలు తామర పువ్వుల్లోని మకరందాన్ని తాగేసి వెళ్లిపోతాయి. మకరంద మాధుర్యం ఒక్క తుమ్మెదకే తెలుస్తుంది. అలాగే సిసలైన సంగీత మాధుర్యం కూడా రసికులకు మాత్రమే తెలుస్తుంది.
నాద సౌరభాన్ని పీల్చుకుని మామూలుగా కనిపించే మాటలు త్యాగయ్య కీర్తనల్లో జీవాన్ని నింపుకొని, నిండుగా పరిమళించాయి. ఆయన సాహిత్యమంతా, నాద ప్రవాహంలో మునిగి ఉంటుంది. కొట్టొచ్చినట్టు, సాహిత్యం తన ప్రాధాన్యం చూపించుకుంటూ ముందుకు వచ్చి నిలబడదు. శాస్ర్తియ సంగీత రచనల్లో కనిపించే ప్రధాన లక్షణమే ఇది.
నాదమయ జగత్తులో విహరించిన త్యాగయ్యకు, సాహిత్యం ఒక చిన్నపాటి ఆలంబన - తనని తాను వ్యక్తపరచుకోవటానికి అదొక మార్గం. నాదం ద్వారా తన భావాలను వ్యక్తం చేయగలగటమే ఆయన పరమావధి.
శబ్దానికి (అంటే మాటకు) ఎంత శక్తి ఉందో, నాదానికీ అంతటి శక్తి వుందని త్యాగరాజ కీర్తనలు చెబుతాయి.
అందుకే తీవ్రమైన ఉద్వేగాలు, ఉద్రేకాలు ‘నాదం’ ద్వారా వ్యక్తం చేసినంత శక్తివంతంగా శబ్దం ద్వారా కావేమో అనిపిస్తుంది.
నాదోపాసనతో బ్రహ్మని చేరుకున్న మహనీయులే మనకు సంగీత త్రిమూర్తులై భాసిల్లారు. వారే సంగీతానికి ఆదర్శ పురుషులు.
పాటలోని మాటలన్నీ నాదాన్ని మోసుకుంటూ, చెవికి చేరితేనే అసలైన సంగీతానందం.
స్వరానికి రంగూ రుచీ వాసన ఉన్నాయి.
స్వర వర్ణాలతో అలంకరించబడిన రాగసౌధాన్ని ఆశ్రయించుకున్న రచనలే తిన్నగ హృదయానికి చేరుతాయి.
సంగీతం చాలామంది పాడతారు. కానీ, మాటల్లో చెప్పలేని నాదానుభూతి మాత్రం కొందరికే లభిస్తుంది.
మన దృష్టిని బట్టి, సంస్కారాన్నిబట్టి ఈ ఆనందం ఉంటుంది.
ప్రజ్ఞ ఉంది కదా యని చేతికొచ్చిన నాలుగు మాటలతో పాటలు రాసేస్తే, సరిపోదు. రాగాలు తెలుసని, ఇష్టమొచ్చినట్లు ఏవేవో పొడి స్వరాలతో అల్లరి చేస్తే అప్పటికప్పుడు బాగుందనిపిస్తుందేమో. అంతా ఎప్పటికైనా కాలగర్భంలో కలిసిపోవలసిందే. కానీ, శాశ్వతానందం మాత్రం ఉండదు. సంగీతానే్వషణలో సాగే ప్రతి గాయకుడూ వాదకుడూ ఈ శాశ్వతానందం కోసమే ప్రయత్నం చేస్తూ వెళ్లాలి.
సంగీతానికి లౌకికమైన అవసరాలు వేరు. పారలౌకికమైన పరమార్థం వేరు. దీని కోసం మనస్సును సిద్ధం చేసుకోవాలి. అంతెందుకు? చక్కని రాజమార్గం వదిలేసి, సంగీతాన్ని వక్రమార్గంలో పక్కదారులు పట్టిస్తూ, సందుల్లోనూ, గొందుల్లోనూ తిరిగితే వచ్చే ప్రయోజనం శూన్యం.
త్యాగయ్య సంగీతానికి పరవశుడైన ప్రథమ శ్రోత ఎవరు? సాక్షాత్ శ్రీరామచంద్రుడు.
మిగిలిన శ్రోతలంతా విద్వాంసులను తయారుచేయగల సత్తా వున్న శిష్యులు. అందుకే త్యాగరాజు సంగీత లోకానికి ప్రాతఃస్మరణీయుడు.

-మల్లాది సూరిబాబు 9052765490