S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రేమ (సండేగీత)

మా భీమన్న గుడిలో ఓ తోట వుండేది. దాని తోటమాలి పోచెట్టి. గుడిలో పూచిన పూలని తెంపి రాజరాజేశ్వర స్వామికి పంపించడం, ఆ తోటని జాగ్రత్తగా చూడటం అతని విధి. ఆ తోటలో రెండు జామచెట్లు తప్ప అన్నీ పూల చెట్లే.
ఇంట్లో పిల్లలని చూసినంత ప్రేమగా ఆ చెట్లని చూసుకునేవాడు. బాగా పూలు పూచినప్పుడు అతని మనస్సు పొంగిపోయేది.
పోచెట్టి ఎప్పుడన్నా ఓ వారం రోజులు ఏదైనా ఊరికి పోతే ఆ పూల చెట్లు ఎంతగా వికసించాలో అంతగా వికసించేవి కాదు. ఆయన లేనప్పుడు కూడా మరో తోటమాలి చెట్లకి నీళ్లు పట్టేవాడు. కానీ ఎందుకో అలా జరిగేది.
పోచెట్టి వచ్చిన తరువాత ఆ విషయం అతనికి చెబితే నవ్వేవాడు తప్ప మరేమీ మాట్లాడకపొయ్యేవాడు. భీమన్న గుడి ఎదురుగా మా బడి వుండేది. ఈ విషయమే అక్కడ మాట్లాడుకోవడం విని నాకు వింతగా అన్పించేది. పోచెట్టి వున్నప్పుడే పూలు బాగా వికసిస్తాయని అందరూ అనుకోవడం విని ఈ విషయమే మా అమ్మకి చెప్పి అట్లా జరుగుతుందా అని అడిగాను. మా అమ్మ ఎక్కువగా చదువుకోలేదు. కానీ లోకజ్ఞానం ఎక్కువగా వుండేది.
పోచెట్టి వున్నప్పుడు చెట్లు పూలు విరివిగా పూయడం సహజమని, పూర్తిగా విచ్చుకోవడం కూడా సహజమని చెప్పింది. పోచెట్టి నీళ్లనే కాదు ఆ పూల చెట్లకి ప్రేమని పంచుతాడు. అందుకనే అవి విరివిగా పూస్తాయి.. అని చెప్పింది. కాని నాకు అది నిజమని అన్పించలేదు. అదే విషయం మా అమ్మతో అన్నాను. ఆమె ఇలా అంది.
‘ప్రేమను వివరించలేం. కానీ వ్యక్తపరచగలం. ప్రేమ అనే అనుభూతిని అందరూ కోరుకుంటారు. అవి జంతువులు కావొచ్చు. మనుషులు కావొచ్చు. చెట్లూ, వృక్షాలు కావొచ్చు. మనకు భాష ఉంది కాబట్టి మనం మాటల ద్వారా, మన చర్యల ద్వారా వ్యక్తపరుస్తున్నాం. మన కుక్కను చూడు నువ్వు రాగానే ఎగిరి మీద పడి తన సంతోషాన్ని, ప్రేమని వ్యక్తపరుస్తుంది. నువ్వు అట్లాగే నీ ప్రేమను దాన్ని నిమురుతూ, ఆడుతూ నువ్వు ప్రేమను వ్యక్తపరుస్తావు. ప్రేమ అనేది ఓ గొప్ప అనుభూతి. దాన్ని జంతువులు అర్థం చేసుకుంటాయి. వ్యక్తపరుస్తాయి. అదే విధంగా ప్రతిస్పందిస్తాయి. అనుభూతి చెందుతాయి. మనుష్యుల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. మాటల ద్వారా చేతల ద్వారా వ్యక్తపరుస్తారు. మనుషులకున్న సౌలభ్యం జంతువులకి లేదు. జంతువులకి వున్న సౌలభ్యం చెట్లకి లేదు. మీ తాతను చూడు పొలం దగ్గరికి వెళ్లినప్పుడు ప్రతి చెట్టు దగ్గరకు వెళతాడు. అన్నింటినీ చూస్తాడు. పోచెట్టీ అంతే! అతను వాటికి నీటినే కాదు. తన ప్రేమని పంచుతున్నాడు. అందుకే అవి విరగబూస్తున్నాయి’
ప్రేమ అనేది ప్రశాంతతకి మూలధాతువు. ఎవరైతే ఎక్కువగా ప్రేమిస్తారో వాళ్లు ఎక్కువ ప్రశాంతంగా ఉంటారు. కోపంతో వున్న వ్యక్తి ప్రేమపూర్వకంగా మాట్లాడితే ప్రశాంతంగా మారతాడు. బాధలో వున్న వ్యక్తికి ఓ ప్రేమపూర్వకమైన కౌగిలింత ఎంతో ఊరటని కలిగిస్తుంది.