S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

విలువ (సిసింద్రి కథ)

పాటలు, అంత్యాక్షరి, జోకులు, నవ్వులు, కేరింతలు, కబుర్ల మధ్య అకారణంగా బస్సెందుకు ఆగిందో అర్థం కాలేదు మల్లేశ్వర్రావ్‌కి. డ్రైవర్ బస్సు దిగటం, ఎక్కటం చూశాక బస్సులో ఏదో అర్థంకాని సమస్య వచ్చిందని అర్థమైంది. మధ్యాహ్నం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు చేసిన ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయే కానీ బస్సు మాత్రం బాగవలేదు. చుట్టూ కొండలు, పచ్చని చెట్లు, చల్లని గాలులు, కీచుకీచుమన్న శబ్దాలు, చీకటి, వొంట్లో చికాకు, ఆకలి, భయం. తినటానికి దగ్గరేమీ లేవు. తిండి పెట్టేవారెవరూ లేరు. జన, వాహన సంచారం అస్సల్లేదు.
మల్లేశ్వరరావుకి మధ్యాహ్నం భోజనం విషయం గుర్తుకు వచ్చింది. మధ్యాహ్నం ఒంటి గంటకు ఊరి చివర మర్రిచెట్టు కింద విహారయాత్ర బస్సుని భోజనాలు చెయ్యడం కోసం ఆపాడు డ్రైవర్. చల్లని గాలుల మధ్య 7 గంటల ప్రయాణ బడలికను మర్చిపోయారు. మల్లేశ్వర్రావ్ భార్య ఉదయం చేసిన చపాతీలు, కూర, పులిహోర పొట్లాలను విప్పారు. తను, భార్య, ఇద్దరు పిల్లలూ తలో రెండు చపాతీలు తిని, సగం పులిహోర తిన్నారు. ఇద్దరూ పిల్లలూ అక్కడికి వచ్చిన కుక్కలకు మిగిలిన చపాతీలను పెట్టేశారు. మిగతా సగం పులిహోరను భార్య అక్కడే వదిలేసింది నిర్లక్ష్యంగా.
* * *
ఇప్పటి ఆకలి బాధ మాత్రం మధ్యాహ్నం వృథా చేసిన చపాతీలు, పులిహోరలను పదేపదే జ్ఞప్తికి తెస్తున్నాయి. ఈ రాత్రికి పెద్ద హోటల్‌లో రకరకాల వంటకాల్ని తినెయ్యొచ్చని వేసుకున్న ముందస్తు పథకం వెనక్కి వెళ్లిపోయింది. డబ్బులు, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు ఇవన్నీ ఉండి ఏం ప్రయోజనం? సమయానికి ఇవేవీ ఆకలిని తీర్చలేక పోయాయి. ఏం కొందామన్నా, తిందామన్నా అక్కడ అసలు ఊరే లేదు. తెల్లవార్లూ బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేత పెట్టుకొని, పిల్లలిద్దరినీ వొడిలో కూర్చోబెట్టుకుని మల్లేశ్వర్రావ్ దంపతులు ఆకలితో అలమటిస్తూ అలాగే నిద్రపోయారు. ఉదయం లేచేసరికి 8 గంటలైంది. అటు మీదుగా ఒక ఖాళీ లారీ వెళ్తుండగా దాన్ని ఆపి, ఆ డ్రైవర్ సాయంతో బస్సుని బాగుచేసేసరికి 11 గంటలైంది. ఇంకో మూడు గంటలు ప్రాణం చేస్తేగానీ చిన్న ఊరు రాదు.
ఎట్టకేలకు మధ్యాహ్నం సరిగ్గా 2 గంటలకు ఒక భోజనశాల ముందు ఆగింది బస్సు. అక్కడి భోజనాలు సగం మందికే సరిపోయాయి. మల్లేశ్వర్రావ్ కుటుంబ సభ్యులు ముఖాలు కడుక్కొని వెళ్లేసరికి భోజనాలు అయిపోయాయి. బాగా ఆకలితో ఉన్నారేమో నీరసం వచ్చేసింది. హోటల్ వాడు మళ్లీ అన్నం, కూరలు గంటలో వండేసి వేడివేడిగా వడ్డించాడు. అప్పటికి గానీ వీళ్ల క్షుద్బాధ తగ్గలేదు. విహార యాత్ర ముగిసిన నాలుగు రోజులకి క్షేమంగా ఇంటికి చేరింది మల్లేశ్వర్రావ్ కుటుంబం.
గతంలో శ్రీశైలంలో ఉచిత సత్రంలో భోజన శాలకు వెళితే అక్కడి గోడలపై ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ దానిని వృథా చెయ్యరాదు’ ‘అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్ప’ సూక్తులు మల్లేశ్వర్రావ్‌కి గుర్తుకొచ్చాయి. ఆ రోజు నుండి అతను, అతని కుటుంబ సభ్యులు అన్నం వృథాని ఆపి ఉండి ఉంటే బాగుండేది.
ఇప్పుడు ఎవరైనా ఎక్కడైనా పొరపాటున అన్నాన్ని వృథా చేస్తే తమ గత యాత్రానుభవాల్ని కళ్లకు కట్టినట్టు చెప్పి మరీ కళ్లు తెరిపించి అన్నం ‘విలువ’ను చాటి చెబుతున్నారు మల్లేశ్వర్రావు కుటుంబ సభ్యులు.

-ఎ.ఎన్.ఎస్.శంకరరావు