S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పెళ్లికి పోదాం..!

సినిమా పాట నిజానికి పల్లెకు పోదామని ఉంది కదూ! ఆ తరువాత పారును చూద్దాం అని కూడా ఉంది. దేవదాసు సినిమాలో హీరోయిన్ పేరు పార్వతి. అప్పట్లో సినిమా పాటలు సినిమాలో అతికినట్టు రాయించుకునే వారన్నమాట. మరి లోకాభిరామంలో వ్యాసాలు కూడా అతికినట్టే రాయాలి కదా! కనుక పక్క కొమ్మల మీదికి ఎక్కకుండా అనుకున్న పద్ధతిలో పెళ్లిళ్ల గురించే చెప్పుకుందాం.
పెళ్లికి ముందు రోజు ఉదయం నాందీ వ్రతాలు. ఆ తరువాత పెళ్లి వారు తరలి ముహూర్తం జరిగే చోటుకి వెళతారు. ఎందుకో తెలియదు గానీ తరలి అన్న మాటను ఒక్క ఈ సందర్భంలోనే చిన్ననాటి నుంచి వింటున్నాను. మరో ప్రయాణానికి వెళుతూ ఉంటే తయారయి అనో, బయలుదేరి అనో అంటారు తప్ప, తరలి వెళ్లరు. చిన్నప్పటి పెళ్లిళ్లలో ఈ తరలి వెళ్లడం పెద్ద తతంగంగా ఉండేది. మరీ దూరాభారం దేశాలకు పిల్లలను ఇవ్వడం, తెచ్చుకోవడం అంతగా ఉండేది కాదు. గుడుగుడు గుంచెం పద్ధతిలో బంధువర్గంలోనే పెళ్లిళ్లు నిర్ణయమయ్యేవి. కనుక ఆ ఊరేదో దగ్గరలోనే ఉంటుంది. కనుక ఎద్దులబండిలో బయలుదేరి పెళ్లికి వెళ్లడం అప్పట్లో అలవాటు.
మా అన్నయ్య, అక్కయ్య పెళ్లిళ్లు కుండమార్పిడి పద్ధతిలో జరిగినయి. ఈ కుండమార్పిడి అన్న మాట మాకు అప్పుడూ లేదు, ఇప్పుడూ లేదు. అదలుబదలు సంబంధము అని ఆ పెండ్లిని వర్ణించడం అప్పట్లో జరిగిందని నాకు గుర్తున్నది. అక్కయ్య పెళ్లి ఇంట్లోనే జరుగుతుంది. కనుక తరలడము, తయారవడము లాంటివి లేవు. అన్నయ్య పెళ్లి మాత్రం 30, 40 కిలోమీటర్ల దూరం ఉండే ఊరు. అక్కడికి ఎద్దులబండిలో బయలుదేరి వెళ్లడం ఏ రకంగాను సౌకర్యంగా ఉండదు. మరేమిటి దారి? వెళ్లవలసిన వాళ్లేమో చాలామందే ఉన్నట్టు ఆరేళ్ల వయసులో ఉన్న నాకే అర్థమయింది. ఇక నాన్నకు అర్థం కాకుండా ఉంటుందా? ఏం జరుగుతుందో చూద్దామని నేను అనుకుంటూ ఉన్నానో లేదో నాకివాళ గుర్తులేదు. పెళ్లి అంటే బోలెడంత మంది బంధువులు వచ్చి వారాలపాటు మనతోనే ఉండిపోతారు. తినడానికి ఇప్పటి పద్ధతిలో కాక నిలువ తినుబండారాలు బోలెడన్ని తయారుచేస్తారు. వాటన్నిటిలో పడి నాకు ప్రయాణాల గురించిన ఆలోచన ఎంత మాత్రమూ వచ్చి ఉండదని అప్పుడు అనుమానం వస్తున్నది. అందరూ ఏ దారిన వెళితే మనమూ అదే దారిన వెళతాము. ఇంతలో సాయంత్రం కావచ్చింది, ఎప్పుడూ లేనిది ఒక ఆర్‌టిసి బస్సు ఊళ్లోకి వచ్చేసింది. అది ఏ కష్టాలు పడ్డదో తెలియదు గానీ వచ్చి మా ఇంటి ముందు ఆగింది. అప్పుడు అర్థమయింది, తరలి వెళ్లే కార్యక్రమానికి ఆ బస్సు సాయం చేస్తుందని. నాన్న నిజానికి కలిగిన వాడేమీ కాదు. కానీ ఆయన ఏ పని చేసినా అలాగే ఉండేది.
ఈ మధ్యన ఒకటేమిటి, చాలా పెళ్లిళ్లకే వెళ్లాము. ఇప్పుడు కూడా పెళ్లి వారిని బస్సుల్లో, కార్లలో తరలిస్తున్నారు. కానీ ఆ పార్టీలో ఒకరుగా ప్రయాణించే అవకాశం మాత్రం నాకు రావడం లేదు. ఒకానొక పెళ్లి జరుపుతున్న తండ్రి నాకు సన్నిహితుడు. ముందు రోజు రావాలి, అందరితో కలిసి బస్సులో పెళ్లికి హైదరాబాదు రావాలి, పెళ్లి జరిగిన తరువాత మళ్లీ అందరితో కలిసి మరునాడు జరిగే పూజా కార్యక్రమం కొరకు మళ్లీ ఊరు వెళ్లాలి అని పిలిచాడు. మొత్తం మూడు రోజులా అని లెక్క తీశాను. కాదు నాలుగు రోజులన్నాడు. అదెట్లాగ అంటే అసలు నీవు ఒక రోజు ముందే రావాలి అన్నాడు. అభిమానం ముందు నా తల వంగింది కానీ శరీరం మాత్రం అందుకు ఒప్పుకున్నట్టు లేదు. నిజం చెబుతున్నాను, అసలు సిసలయిన ఈ కాలం పద్ధతిలో ముహూర్తానికి ముందు వెళ్లి భోజనాలు అవగానే తిరిగి ఇంటికి వచ్చినట్టున్నాను. అంటేగింటే తరలి వెళ్లే అవకాశాన్ని చేజేతులా పోగొట్టుకున్నానని కదా అర్థం. ఈ కాలంలో ఎవరికీ ఏ పని చేయడానికీ టైమ్ ఉండడం లేదు. నాకు ఉండేదంతా తీరికే. అయినా నేను కూడా టైమ్ లేదని ఫోజు పెట్టి తలుపు పెట్టుకుని ఒంటరిగా ఇంట్లో కూచోవాలి. లేదంటే మనకు గౌరవం దక్కదు.
పెళ్లిళ్లు ప్రయోజనాలు ఎందుకంత హంగామాగా చేస్తారని నాకు ఒక పెద్ద ప్రశ్న మనసులో ఉండనే ఉంటుంది. కానీ ఒకటి, రెండు సందర్భాలలో ఇది కూడా అవసరమేనేమో అనిపించినట్టు అనుమానం. మరీ ఈ మధ్యన మరొక పెళ్లికి వెళ్లి వచ్చాము. ఊరిలో, కాదంటే నగరంలోనే ఏదో మారుమూలన ఒక పెళ్లి హాలును ఎంచుకుంటారు. ఉదయాన బయలుదేరి వెళితే అక్కడ ఎవరూ కనిపించరు. ఉన్న కొద్దిమంది గదులలో దాక్కుని ఉంటారు. అంతలేసి దూరాలకు వెతుకుతూ వెళ్లడం నాకు ఈ మధ్యన కుదరడం లేదు. కానీ చెపుతున్న ఈ పెళ్లికి వెళ్లడానికి మా తమ్ముడు తోడుగా వచ్చాడు. పెళ్లికొడుకు తల్లి మా చిన్నప్పటి నేస్తం అనవచ్చు. నిజానికి ఆ కుటుంబమంతా చాలా సన్నిహితులు. నేస్తం అంటున్న ఆ తల్లి మరీ మోమాటం గల మనిషి. అప్పట్లో అంతగా మాట్లాడేది కాదని నాకు బాగా గుర్తుంది. అయినా పనిగట్టుకుని ఇంటికి వచ్చి పిలిచింది. నేను వాళ్ల కుటుంబంలో జరిగిన ఒకటి, రెండు పెళ్లిళ్లకు వెళ్లనే లేదు. కనుక ఈసారి వెళ్లాలని నిశ్చయించుకున్నాను. తగినట్టే తోడు కూడా దొరికింది. వెళ్లిన తరువాత పెళ్లిళ్ల, పేరంటాల ప్రయోజనం ఏమిటో నాకు అర్థమయింది. అక్కడ ఎదురయిన ఆదరణ బహుశా బతుకులో అరుదుగా మాత్రమే అందుతుంది. చిన్ననాట అందరమూ పిల్లలుగా ఉన్నప్పుడు సంబంధాలు ఉన్న తీరు మరో రకంగా ఉండవచ్చు. కానీ ఇప్పుడు అందరమూ పెద్దవాళ్లం అయ్యాము. కుటుంబీకులం అయ్యాము. అందరికీ చిత్రంగా చిన్నతనం పోయి ఉంటుంది. కనుక పలకరింపులలో అరుదయిన ఒక దగ్గరతనం కనిపిస్తుంది. అందునా అక్కడ చేరిన వారిలో చాలామంది కంటే నేను వయసులో పెద్దవాడిని. నాకంటే వయసులో పెద్దవాళ్లు కూడా చిన్నపిల్లలుగా పరుగున ఎదురుగా వచ్చి వాటేసుకుంటే కళ్లల్లో నీళ్లు తిరిగాయి. హైదరాబాదులో పెళ్లికి వెళ్లడం గురించి ఒక పద్ధతి ఉంది. అది జీలకర్ర బెల్లం కానీ, మాంగల్య ధారణం కానీ, ఒక సందు దొరకాలి. వెంటనే ‘చావల్ ఫేకో, లిపాఫా పక్డావో, చల్‌తే ఫిర్‌తే నజర్ ఆవో’ అన్న పద్ధతిని పాటించాలట. అంటే అవకాశం దొరికిన వెంటనే అక్షతలు వెయ్యాలి, ఇవ్వదలుచుకున్నదేదో ఇవ్వాలి. ఆ తరువాత మన దారిన పోవాలి. వీలయితే ఈలోపల ఏదయినా తినాలి. ఈ చివరి మాట గురించి నాకు కొంచెం అనుమానం. అప్పుడు బయలుదేరి ఇంటికి చేరితే ఇంట్లో తిండి ఉంటుందా? కనుక అవకాశం దొరికిన మొదటి చోటనే ఏదో తినడం మంచి పద్ధతి.
అయితే ఇక్కడ నేను చెప్పదలచుకున్న అసలు విషయం పెళ్లి గురించి, భోజనాల గురించి కాదు. మనుషుల మధ్యన కనిపించకుండా ఉన్న అభిమానాల గురించి. బతుకు బండిని లాగుతూ ఎవరి దారిని వారు తిరుగుతూ ఉంటారు. మన వాళ్లు అనే వాళ్లను గుర్తు చేసుకోవాలన్న ఆలోచన కూడా ఉండదు. కనుక పండుగలు, ప్రయోజనాల సందర్భంగా ఆ ఆలోచన వచ్చి తీరాలి. ఇంకా నేను ప్రపంచంలో ఉన్నానని మన వాళ్లందరికీ తెలియడం ఒక ఎత్తయితే మనసులోని భావాలను చెప్పకుండానే తెలియజేయడం మరొక ఎత్తు.
వెనకట ఎంప్లాయిమెంట్ ఎక్స్‌ఛేంజ్ అని ఒకటి ఉండేది. ఉద్యోగం లేని వాళ్లు అందులో తమ పేరు, విద్యార్హతలు మొదలయినవి నమోదు చేయించాలి. వాళ్లు ఒక కార్డు ఇస్తారు. ప్రతి మూడు మాసాలకు ఒకసారి ఆ ఆఫీసుకు వెళ్లి నేనింకా నిరుద్యోగిగానే ఉన్నాను అని తెలియజేయడానికి అన్నట్టు కార్డును రిన్యూ చేయించుకోవాలి. ఉద్యోగావకాశాలు వచ్చినప్పుడు ఆ కార్యాలయం వారు తగిన వారికి ఆహ్వానాలు పంపుతారు. ఇంటర్వ్యూలో నెగ్గి ఉద్యోగం వచ్చిందంటే ఇక కార్డు ఉండదు, రిన్యూ చేసే అవసరమూ ఉండదు. ఇప్పుడు అలాంటి పద్ధతి ఉన్నట్టు కనపడదు. కానీ ఉద్యోగం కోసం కాకుండా మామూలుగానే ఈ నరారణ్యంలో అంటే మనుషులనే చెట్లు పెరిగే అడవిలో మనం ఇంకా ఉన్నామని కొంతమందికి తెలియడం అవసరం. కార్డు రిన్యూ చేయించుకున్నట్టే పెళ్లిళ్లు, ప్రయోజనాలకు వెళ్లి మన ఉనికి గురించి ప్రకటించి బంధుత్వాలను, స్నేహాలను రిన్యూ అంటే మరోసారి సరికొత్తవిగా చేసుకోవడం అవసరం అని నా సిద్ధాంతం. కనుక ఎవరయినా పెళ్లికి పిలిస్తే కనీసం ఒక సందర్భానికయినా తప్పకుండా వెళదాం.

కె.బి. గోపాలం