S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రేమా పిచ్చీ ఒకటే... (కథల పోటీలో ఎంపికైన రచన)

‘పిచ్చిదాన్ని కాపరానికి తీసుకొస్తానంటావేంట్రా... దాని పిచ్చి నీక్కూడా అంటుకుందేంటీ?’
గొంతెత్తి గట్టిగా అరుస్తున్న జానకిని చూసి ఆమెని ఎప్పుడూ అలా చూడని కొడుకు వినయ్, భర్త శేఖర్ తెల్లబోయారు.
వాళ్లని అలా చూసి అపర శాంతమూర్తిగా పేరు తెచ్చుకున్న జానకి తనని తాను సంబాళించుకుంది. గొంతు తగ్గించి నెమ్మదిగా అంది. ‘మొన్ననే కదా మనం వినూని చూసి వచ్చాం. భద్రకాళిలా మీద పడిపోతుంటే ఎంత భయపడ్డామో అప్పుడే మర్చిపోయావా? దాన్నింటికి తెస్తే ఎప్పుడొచ్చి మీద పడుతుందో ననుకుంటూ గదిలో పెట్టి తాళం వెయ్యాలి. వేళకి దాని తిండీ తిప్పలూ చూడాలి. అవన్నీ ఒక ఎతె్తైతే రోజుల పసిగుడ్డు ఆ చంటిదాన్ని క్షణక్షణం చూసుకోవాలి. ఇవన్నీ మనం చెయ్యగలవనే అంటున్నావా?’
యధార్థాన్ని అంత స్పష్టంగా వివరించిన జానకి మాటలకి తండ్రీ కొడుకులిద్దరూ కాసేపు ఏమీ మాట్లాడలేకపోయేరు. పదిహేనురోజుల క్రితం పాప పుట్టిందనే సంబరంతో వినీతని చూడటానికి వియ్యాల వారింటికి వెళ్లినప్పటి సంగతి ఒక్కసారి గుర్తొచ్చింది ముగ్గురికీ.
జానకి, శేఖర్‌లకి వినయ్ ఒక్కడే కొడుకు. తల్లిదండ్రుల దగ్గరి నుంచి చదువు, సంస్కారం చక్కగా అందుకున్నాడు. మంచి ఉద్యోగంలో ఉన్నాడు. సంప్రదాయంగా తల్లిదండ్రులు యెంచి, మెచ్చిన వినీతని సుముహూర్తంలో తన జీవితంలోకి ఆహ్వానించాడు. ఏవో చిన్నచిన్న తేడాలు తప్పితే రెండు కుటుంబాల మధ్యా ఏ విధమైన గొడవలూ లేవు. అలాగ చక్కగా సాగుతున్న సంసారంలోకి ఓ చిన్న ప్రాణి అడుగిడబోతోందనే వార్త వారందరినీ ఎనలేని ఆనందంలో ముంచెత్తింది. రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ ఇంట్లో చంటి పాప పారాడబోతోంది. రెండిళ్లలోనూ ఎంతో ఉత్సాహం. వేడుకలు, విందులతోబాటు ప్రతీ నెలా మెడికల్ చెకప్‌కి కచ్చితంగా తీసుకెళ్లేవాడు వినయ్. ఏడో నెలలో పురిటికి పుట్టింటికి హైద్రాబాద్ వెళ్లింది వినీత. అప్పటి నుంచి పురుడొచ్చేవరకూ ప్రతిరోజు ఫోన్‌లో మాట్లాడుకునేవారు వినయ్, వినీతా కూడా. అంతా బాగుందన్నారు డాక్టర్లూ, పెద్దలూ కూడా.
ఒకరోజు ఉదయానే్న పాప పుట్టిందన్న శుభవార్త వినగానే ఏనుగెక్కినంత ఆనందపడిపోయాడు వినయ్. జానకీ, శేఖర్ల ఆనందానికింక అవధులే లేవు. పదకొండో రోజు బారసాల చేసుకుంటామంటే, సిజేరియన్ ఆపరేషన్ అయింది కనుక వినీత పీటల మీద కూర్చోవడం కష్టం కనుక, బారసాల మూడో నెలలో చేసుకుందామన్న వియ్యాలవారి మాటను కాదనలేకపోయారు. కానీ, మనవరాలిని చూడడానికి మూణ్నెల్లు ఆగలేక పురుడొచ్చిన పదిహేను రోజులకి నక్షత్రం మంచిదే కనుక పాపని చూస్తామంటూ చెన్నై నుంచి ముగ్గురూ హైదరాబాద్ వియ్యాల వారింటికి వచ్చారు. వీళ్లని చూసి కాస్త ఇబ్బంది పడుతూనే ఆహ్వానించారు వినీత తల్లిదండ్రులు భాస్కర్, సుగుణ.
‘ఏదీ మా మనవరాలూ?’ అంటూ ఇంట్లో అడుగుపెడుతూనే చొరవగా బెడ్‌రూం వైపు వెళ్లబోతున్న జానకిని వినీత వున్న రూమ్ వైపు తీసుకెళ్లింది సుగుణ. చంటి పిల్ల పడుకుందేమో అనుకుంటూ చప్పుడు చెయ్యకుండా నెమ్మదిగా తలుపులు తోసింది జానకి.
చీకటిగా వున్న గదిలోకి సన్నగా పడిన వెలుతురు గీతని చూసిన వినీత పక్క మీంచి ఒక్క ఉదుటున లేచింది. నెమ్మదిగా తలుపు తోసుకు తొంగి చూస్తున్న అత్తగారిని చూసింది. అంతే... ఒక్కసారిగా పక్కనే పడుకోబెట్టుకున్న చంటిపాపని అమాంతం గుండెలకి హత్తుకుంది. ‘్ఫఫో... నేను నా పాపని ఇవ్వను.. ఫో బైటకి’ అంటూ గట్టిగా అరవడం మొదలెట్టింది. స్థాణువయ్యింది జానకి. గట్టిగా అరుపులు వినిపించి వెనకనే వున్న శేఖర్, వినయ్ కాస్త తొంగి చూశారు. చెదిరిపోయిన జుట్టుతో, బెదురుతున్న కళ్లతో, తెచ్చిపెట్టుకున్న కోపంతో గట్టిగా అరుస్తున్న వినీతని చూసి తెల్లబోయారు. హడలిపోయిన జానకి వెంటనే తలుపులు మూసేసి వెనక్కి తిరిగింది. పాలిపోయిన మొహాలతో భాస్కర్, సుగుణలు క్షమించమన్నట్టు చూశారు వీళ్లని. అప్పుడే అక్కడికొచ్చిన ఫామిలీ డాక్టర్ మహేష్ జరిగింది గ్రహించి అందరినీ ఉద్దేశిస్తూ ‘రండి, కూర్చుందాం’ అంటూ వాళ్లని హాల్లో సోఫాలవైపు నడిపించాడు.
‘డాక్టర్‌గారూ, ఇప్పుడే ప్రయాణం చేసొచ్చారు. కాస్త కాఫీలు తాగాక అంతా చెపుదురుగాని...’ అంది వినీత తల్లి సుగుణ.
‘అవునండీ, ముందు కాస్త రిలాక్స్ అవండి. అప్పుడు మాట్లాడుకుందాం’ అంటున్న డాక్టర్ మాటలు అర్థంకాక ఒకరి మొహాలొకరు చూసుకున్నారు జానకి, శేఖర్, వినయ్. వరాల మొలక చంటిపాపని చూడడానికి ఉప్పొంగుతున్న ఉత్సాహంతో వచ్చిన ఆ ముగ్గురూ రాక్షసిలా అరుస్తూ మీద పడుతున్న వినీతని చూసి స్థాణువులయ్యారు. వారికసలు నోటమ్మట మాటనేదే రాలేదు.
భాస్కర్, సుగుణల బలవంతం మీద స్నానాలు చేసి, కాఫీ, టిఫిన్లు ముగించి అందరూ హాల్లో కూర్చుని స్థిమితపడ్డాక భాస్కర్ వాళ్ల ఫ్యామిలీ డాక్టర్ మహేష్ నెమ్మదిగా మాట్లాడడం ప్రారంభించాడు. ముందుగా జానకిని చూసి,
‘అమ్మా, మీరు కంగారుపడకండి. అంతా వివరంగా చెప్తాను’ అంటూ అందరినీ ఉద్దేశించి చెప్పసాగాడు.
‘మొదటి నుంచీ జరిగిందంతా చెప్తాను. చదువు, సంస్కారం ఉన్నవారు, అర్థం చేసుకుంటారనే అనుకుంటున్నాను.
మామూలుగా తొమ్మిది నెలలూ నిండాక మీ కోడలు వినీతని చెకప్‌కి తీసుకెళ్లినప్పుడు బేబీ బాగా తయారయిందనీ, ఎప్పుడైనా పురుడు రావచ్చనీ గైనకాలజిస్ట్ చెప్పింది. అలా చెప్పాక కూడా వారం గడిచినా నెప్పులు రాక అనీజీగా అన్పిస్తే హాస్పిటల్‌లో జాయిన్ చేసుకుంది. మామూలుగా నొప్పులొస్తే ఫరవాలేదు. లేకపోతే పరిస్థితిని బట్టి సిజేరియన్ చేస్తాను అంది. అదంతా మీకు తెలిసిందే కదా.. కానీ అప్పుడే వినీత మనసులో ఒక సందేహానికి బీజం పడింది. అదేవిటంటే సిజేరియన్ చేసినప్పుడు తనకి మత్తుమందు ఇస్తారనీ, అలా ఇచ్చినప్పుడు తనకి తెలీకుండా తన పాపని తీసికెళ్లి పోతారనీ ఒక విధమైన భయోద్వేగానికి లోనయింది. మరి అలా ఎందుకనుకుందో మాకు తెలీలేదు కానీ అలా జరగదని మేమెంత నచ్చజెప్పినా వినలేదు. ఆపరేషన్‌కి కానీ, మత్తుమందు ఇవ్వడానికి కానీ ఒప్పుకోలేదు. ఇంక సిజేరియన్ చెయ్యక తప్పని పరిస్థితుల్లో ఒక విధంగా బలవంతంగానే వినీతకి అనస్తీషియా ఇవ్వవలసి వచ్చింది. ఆపరేషన్ అంతా బాగానే అయిందీ, పాప కూడా హెల్దీగానే ఉందీ అని అందరం సంతోషిస్తున్న టైమ్‌లో తెలివిలోకి వచ్చిన వినీత ప్రవర్తన విచిత్రంగా మారిపోయింది. పాపని ఒక్క క్షణం వదిలిపెట్టడం లేదు. ఒక్క క్షణం వదిలినా ఎవరో తీసికెళ్లిపోతారేమోననే భయం ఎందుకో తనలో ప్రవేశించింది. తన దగ్గరికి ఎవరైనా వస్తే చాలు తన పాపని తీసికెళ్లిపోతారనే భయంతో చంటి పిల్లని మరింత దగ్గరికి తీసుకుని గట్టిగట్టిగా అరిచేస్తోంది. ఎందుకిలా చేస్తోందో మాకేమీ అర్థం కావటంలేదు. ఆపరేషనంతా బాగా అయి, తల్లీ, బిడ్డా క్షేమంగా ఉన్నారని సంతోషపడుతుండగానే ఏవిటో వినీత ప్రవర్తన ఇలా మారిపోయింది’
వింటున్న శ్రోతలు నిశే్చష్టులయ్యారు. డాక్టర్ చెప్పడం ఆపగానే కళ్లనీళ్ల పర్యంతవౌతూ.
‘తనకి తెలీకుండా మత్తుమందు ఇచ్చేసామని మా మీద కూడా నమ్మకం పోయి, పాపని మా చేతికి కూడా ఇవ్వటం లేదు. ఎవరొచ్చి తన పాపని తీసేసుకుంటారో అన్నట్టు గాలి కూడా రాకుండా తలుపులు, కిటికీలు మూసేసుకుని ఆ చంటిదాన్ని ఒళ్లో పెట్టుకు కూర్చుంటుంది. అందుకే ఇప్పుడు మీరు వెళ్లగానే పాపని తీసేసుకుంటారేమోనని అంత గట్టిగా అరిచేసింది’ అంది సుగుణ.
వింటున్న శేఖర్ కుటుంబం తెల్లబోయింది. వినయ్, వినీతల వివాహం జరిగి అప్పటికి నాలుగేళ్లయింది. అత్తగారిని తల్లి స్థానంలో నిలబెట్టుకుని, ఆవిడ చెప్పినట్టే వినయ్ వాళ్ల కుటుంబ పద్ధతులకీ, సంప్రదాయాలకీ చలా తొందరగా అలవాటు పడిపోయింది వినీత. ఇప్పటి రోజుల్లోని ఆడపిల్లల్లా విరగబాటు లేకుండా, ఇంట్లో అందరితో చక్కగా కలిసిపోయిన వినీత అంటే అత్త జానకికి చాలా అభిమానం. మామూలుగానే ఆడపిల్లలంటే కొంచెం ఇష్టపడే జానకి వినీత కోడలయ్యాక తనకి కూతురు లేని లోటు తీరినట్టే అనుకుంది. గర్భవతి అయ్యి ఏడో నెల వెళ్లిపోతుందనగా ఇంక తప్పదన్నట్టు పురిటికి పుట్టింటికి వచ్చింది. అలా వచ్చిందన్న మాటేకానీ, రోజూ ఉదయం, సాయంత్రం చెన్నై ఫోన్ చేసి, వినయ్‌తోనూ, జానకితోనూ మాట్లాడి, అక్కడి ఇంట్లో ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకుంటూనే ఉండేది వినీత. అంతగా తమ ఇంట్లో కలిసిపోయిన వినీత ఇలా రాక్షసిలా అరుస్తూ మీద పడిపోవడమేమిటో అస్సలు అర్థం కాలేదు వాళ్ల ముగ్గురికీ. అందులోనూ ఇప్పుడు డాక్టర్ చెప్తున్నది వింటుంటే పాపని వాళ్ల అమ్మానాన్నలకి కూడా ఇవ్వట్లేదనీ, ఎవ్వరినీ దగ్గరకి కూడా రానివ్వటం లేదనీ తెలిసి ఇంకా ఆశ్చర్యపోయారు.
జరిగినదంతా శ్రద్ధగా వింటున్న శేఖర్ కాస్త తేరుకుని ‘మరి స్పెషలిస్ట్ ఎవరికి చూపించలేదా? ఇదంతా మాకెందుకు చెప్పలేదూ?’ అనడిగాడు.
సుగుణ నెమ్మదిగా చెప్పింది. ‘రెండు రోజులు మధ్యమధ్యలో తెలివొచ్చి అలా అంటున్నా మేమేవీ పట్టించుకోలేదు. మూడో రోజు నుంచీ ఈ ప్రవర్తన ఏదో వింతగా అనిపించి డాక్టర్‌ని అడిగాము. వాళ్లన్నారూ... కొంతమంది ఆడవాళ్లకి డెలివరీ అయ్యాక నరాల బలహీనత వల్ల, శరీరంలో జరిగే విపరీతమైన హార్మోన్ల మార్పుల వల్ల ఇలాగ ప్రవర్తిస్తుంటారనీ, నాలుగు రోజుల్లో సరైపోతుందనీ చెప్పారు’
‘నాలుగు రోజులేవిటి? అప్పుడే పదిహేను రోజులై పోయింది కదా...’ అడిగింది జానకి.
భాస్కర్ అందుకున్నాడు ‘అవునండీ... వారం దాకా ఓపిక పట్టాము. తర్వాత మాకు భయం వేసి స్పెషలిస్ట్స్‌ని కలిసాము. వాళ్లు టెస్ట్‌లు చేసి, హార్మోన్ల మార్పు ప్రభావం చాలా ఎక్కువగా ఉందని చెప్పి, దానికి తగ్గ మందులు ఇచ్చారు. ఈ వారమంతా వాడాము. రోజురోజుకీ వినూ ధోరణి విపరీతమై పోవడం తప్పితే ఎక్కడా ఆ మందుల ప్రభావం కనిపించలేదు’
‘మరిప్పుడెలా?’ ఆతృతగా అడిగాడు వినయ్. డాక్టర్ మహేష్ వినయ్ వైపు తిరిగి చెప్పాడు. ‘కంగారుపడకండి. ఇది ముందు నరాల బలహీనత అనుకున్నాం. తర్వాత హార్మోన్ల ప్రభావం అనుకున్నాం. ఏదీ ఇతమిత్థంగా తేలలేదు. రేపు ఇంకో స్పెషలిస్ట్ దగ్గర అపాయింట్‌మెంట్ తీసుకున్నాం. మీరెలాగూ వచ్చారు కనుక ఆ స్పెషలిస్ట్ దగ్గరికి మీరూ రండి. ఈ రోజుల్లో వైద్యం బాగా అభివృద్ధి చెందింది. అసలు రోగవేమిటో తెలియాలి తప్పితే అన్నింటికి చక్కటి మందులున్నాయి. వినీత మామూలుగా ఆరోగ్యవంతురాలే కనుక ఇదేదో తాత్కాలిక సమస్యే అయుంటుంది. రేపు ఆ డాక్టర్‌ని అందరి సందేహాలూ అడుగుదాం’
డాక్టర్ మాటలు విన్న శేఖర్, జానకి, వినయ్‌లకి ఏం మాట్లాడాలో తోచలేదు. భాస్కర్ కల్పించుకుని, ‘బావగారూ, దయచేసి రేపు మీరు కూడా మాతో రండి.

మాకసలే ఈ పిల్ల ఇలా అయిందేమిటా అని బెంగగా ఉంది. మీరు పక్కనుంటే కాస్త ధైర్యంగా ఉంటుంది’ అన్నాడు.
‘అంతకన్నానా... అసలు రేపు విషయమేమిటో కనుక్కుందాం’ ఏం మాట్లాడాలో తెలీని పరిస్థితిలో ఉన్న శేఖర్ భాస్కర్‌కి మాటిచ్చేసేడు.
వినయ్ కయితే అంతా అయోమయంగా అనిపించింది. ఈ వినీత తన వినీతేనా అన్న అనుమానం వచ్చింది. ఎప్పుడూ చక్కగా తయారయి, నెమ్మదిగా మాట్లాడుతూ, నవ్వుతూ చలాకీగా ఉండే ఆ వినీతెక్కడ? ఇలా చిందర వందరగా ఉన్న జుట్టుతో, ఎర్రబడ్డ కళ్లతో, గట్టిగా అరుస్తూ, రాక్షసిలా మీద పడిపోతున్న ఈ వినీత ఎక్కడ? అసలెక్కడైనా పోలికంటూ ఉందా? మొన్నటి దాకా తనూ, వినీతా పుట్టబోయే పాప గురించి ఎన్ని కలలు కన్నారు? ఎన్ని కబుర్లు చెప్పుకున్నారు.. ఇప్పుడా పాపని చూడడానికే కుదరటం లేదే... ఎందుకిలా జరిగింది? తల పట్టుకుని కూర్చున్నాడు. జానకి నెమ్మదిగా కొడుకు దగ్గరికి చేరింది. ‘కంగారుపడకు నాన్నా... రేపు డాక్టర్ దగ్గరికి వెడతారుగా.. ఆయనకంతా తెలుస్తుంది..’ అంటూ కొడుకుని ఓదార్చింది కానీ, ఆమెకి మటుకు ఇదంతా ఏదో సీరియస్ విషయమే అయ్యుండాలనిపించింది. ఎంతమంది పురుళ్లు పోసుకోవటం లేదూ... అందరికీ హార్మోన్ల మార్పులు ఇంత విపరీతంగా ఉంటాయా... ముఖ్యంగా పాప దగ్గరికి ఎవర్నీ రానీకపోవడమేంటి? ఎంత సర్దుకుందామనుకున్నా సర్దుకోలేక పోతోంది జానకి.
మర్నాడు స్పెషలిస్ట్ దగ్గరికి వినీత రిపోర్టులు తీసుకుని అందరూ వెళ్లారు. ఆయన కేసునంతా క్షుణ్ణంగా పరిశీలించారు. వీళ్లందరినీ కూచోబెట్టి వివరించారు.
‘చూడండీ... మీరందరూ చదువుకున్న వారు. ప్రపంచ జ్ఞానం ఉన్నవారు. ఇప్పుడు మీకందరికీ తెలిసున్నదైనా ఒక విషయం వివరించాలి. మన పెద్దవాళ్లు కూడా అంటుంటారు. ఆడదానికి ప్రసవమన్నది మరో జన్మలాంటిదనీ.. ఆ సమయంలో స్ర్తి శారీరకంగానూ, మానసికంగానూ చాలా రకాల మార్పులకి, ఒత్తిడులకి లోనవుతుంది. కొత్తగా తల్లి అయ్యే స్ర్తి గురించి మన దేశంలోకన్నా విదేశాల్లో చాలా పరిశోధనలు చేశారు. శరీరం, మనసూ కూడా ఎనె్నన్ని రకాల మార్పులకీ, ఉద్వేగాలకీ లోనవుతుందో చెప్పారు. అందుకే మనవాళ్లు కూడా తల్లి అయ్యే ప్రతి స్ర్తి మనస్సు ప్రశాంతంగా, సంతోషంగా ఉంచాలని కుటుంబ సభ్యులందరికీ చెపుతుంటారు. మెడికల్ సైన్స్ ఇంతగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో నెల తప్పినప్పట్నుంచీ గర్భవతి అయిన మహిళ - డాక్టర్ల పర్యవేక్షణలోనే ఉంటోంది. వినీత విషయంలో మీరంతా ఏమీ తక్కువ చెయ్యలేదు. అమ్మా నాన్నలకన్నా ఎక్కువగా అత్తమామలూ, భర్తా ఆమెని చూసుకున్నారు. మానసికంగానూ, శారీరకంగానూ కూడా ఆమెకి ఏ లోటూ లేదు. కానీ ప్రసవంత తర్వాతే వినీత ఇలా ప్రవర్తిస్తోందంటే ఎందుకని మనం ఆలోచించాలి’
ఆసక్తిగా వింటున్న శ్రోతలు కుర్చీలో కాస్త ముందుకి జరిగారు.
‘మెడికల్ సైన్స్ ప్రకారం చెప్పాలంటే ప్రసవమయిన స్ర్తిలలో తొంభై శాతం మంది ఆ తర్వాత జరిగే ప్రసవానంతర రక్తస్రావానికి ఒక విధమైన మానసిక బలహీనతలకి గురవుతారు. కానీ అందులో యాభై శాతం మంది ఆ తర్వాత నాలుగు రోజుల్లోనే మానసికంగా దానిలోంచి బైటపడతారు. మరో ఇరవై శాతం మంది ప్రసవమయిన రెండు వారాల్లో మామూలు మనుషులవుతారు. కానీ ఇరవై శాతం మందిలో మటుకు ఈ మానసిక రుగ్మత అన్నది రెండు వారాలయినా పోదు. ఆ కోవలోకే వచ్చింది ఇప్పుడీ వినీత’
‘ఎందుకంటారండీ?’ ఆతృతగా అడిగింది సుగుణ. అడగడమయితే సుగుణే అడిగింది కానీ జవాబు వినడానికి అక్కడున్న అందరూ అంతే ఆతృతతో చూస్తున్నారు.
‘దానికి చాలా కారణాలుంటాయి. ప్రసవానికి ముందు వినీత చాలా సంతోషంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ కూడా అంతా బాగానే అయింది. ఆ తర్వాతే ఆమెలో ఈ వింత ప్రవృత్తి కనపడుతోందంటే దాని వెనక ఏదైనా బలమైన కారణం వుండుండాలి. ఆమె మనసు మూలల్లో ఎక్కడో ఆమెకే తెలీని ఒక భయం, భీతి ఉండుండాలి. స్వంత తల్లిదండ్రులకి కూడా పాపని ఇవ్వటం లేదంటే ఆమె మనసులో ఉన్న భయమేమిటో మనకి తెలియాలి. అప్పుడు కానీ మనం దాని గురించి ఏమీ చెయ్యలేం’
డాక్టర్ మాటలు వింటున్న వాళ్లకి విషయం మరింత అయోమయంగా అనిపించింది.
డాక్టర్ మళ్లీ అన్నాడు. ‘దీనికి మెడికల్ భాషలో చాలా పెద్ద పదమే ఉంది. ఇటువంటి దానిని మా వైద్య పరిభాషలో ‘పోస్ట్పార్టమ్ డిసార్డర్’ అంటాం. మామూలు భాషలో చెప్పాలంటే ‘ది బేబీ బ్లూస్’. పది శాతం కేసుల్లో ప్రసవమయిన తర్వాత కలిగే శారీరక, మానసిక అస్థిరత్వం వల్ల, శరీరంలో విపరీతంగా జరిగే హార్మోన్ల మార్పుల వల్ల మనసు మూలల్లో ఎప్పుడో దాగున్న భయాలన్నీ బయటపడతాయి. ఇప్పుడు వినీత పది శాతం మహిళల్లో వచ్చే మానసిక రుగ్మతలో ఉంది. దానికి కారణాలేమిటో కనుక్కోవాలి’
‘ఎలా తెలుస్తుంది డాక్టర్?’ భాస్కర్ వెంటనే అడిగాడు.
‘మీరు కంగారుపడకండి. నాకు తెలిసిన సైకియాట్రిస్ట్ ఉన్నాడు. నేను స్పెషల్ కేస్‌గా చెప్తాను. మీరు వెళ్లి ఆయన్ని కలవండి. కంగారేం లేదు. అంతా సరైపోతుంది’ అంటూ ఆ సైకియాట్రిస్ట్ పేరూ, నంబరూ రాసి భాస్కర్‌కి ఇచ్చాడు. సైకియాట్రిస్ట్ అన్న మాట వింటూండగానే అందరి మొహాల్లోనూ మార్పులొచ్చేసాయి. సుగుణ మొహంలో కంగారు కనపడితే, శేఖర్ మొహంలో ఆశ్చర్యం కనపడింది. వినయ్ మొహం పాలిపోయింది. జానకికి నోట మాట రాలేదు. యాంత్రికంగా నమస్కారం చేస్తూ డాక్టర్ దగ్గర సెలవు తీసుకున్నారందరూ.
ఆ రాత్రే బయల్దేరి వెనక్కి చెన్నై వచ్చేశారు శేఖరం కుటుంబ సభ్యులు. అప్పటికప్పుడే అది జరిగి పదిహేను రోజులయింది. అదంతా గుర్తొచ్చింది జానకికి. ఆ తర్వాత వియ్యాల వారిద్దరి మధ్యా రోజూ వినీత విషయమై ఫోన్‌లో సంభాషణలు జరుగుతూనే ఉన్నాయి. శేఖరూ, వినయ్ రోజూ భాస్కర్ నుంచి వివరాలు తెలుసుకుంటున్నారు. జానకి మటుకు స్తబ్దుగా ఉండిపోయింది. కోడలికి ఈ పిచ్చేమిటో... ఆ చంటిది ఎలా పెరిగి పెద్దవుతుందో, నిండా ముప్పై ఏళ్లు కూడా లేని వినయ్ భవిష్యత్తేమిటో ఆమెకి అస్సలు అర్థం కావటంలేదు.
అంత టెన్షన్‌లో వున్న జానకి దగ్గరికి వినయ్ వచ్చి ‘అమ్మా, మనం వినూని ఇంటికి తెచ్చేసుకుందాం...’ అనగానే.. అందుకే అంత గట్టిగా అడిగింది.
‘పిచ్చిదాన్ని కాపరానికి తీసుకొస్తానంటావేంట్రా... దాని పిచ్చి నీక్కూడా అంటుకుందేంటీ?’ అంటూ.
వినయ్ ఏమీ మాట్లాడలేక అలా నిలబడిపోయాడు.
శేఖర్ గబగబా జానకి దగ్గరికి వచ్చాడు. ‘ముందు నువ్వు కూర్చో...’ అంటూ డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చోబెట్టాడు.
‘చూడు, జానకి వినూ పిచ్చిదేమీ కాదు. నువ్వు ముందా మాట మానెయ్యి’ అన్నాడు.
‘పిచ్చిది కాకపోవడం ఏంటండీ... మనం కళ్లారా చూశాం.. డాక్టరే అన్నాడు కదా సైకియాట్రిస్ట్‌ని కలవమని. సైకియాట్రిస్ట్ దగ్గరికి ఎవరెడతారో నాకు తెలీదంటారా?’ ఎదురు ప్రశ్నించింది జానకి.
వినయ్ ముందుకొచ్చాడు. ‘అమ్మా, ముందు నువ్వు విషయమంతా విను. ఈ పదిహేను రోజుల్లో మావయ్యగారూ వాళ్లూ ఎంత మందిని కలిసారో, వాళ్లేం చెప్పారో అన్నీ చెప్తాను’ అంటూ తల్లి పక్కన కుర్చీలో కూర్చుని వినయ్ నెమ్మదిగా వివరించాడు. ‘మావయ్యగారికి లక్ష్మి అని ఒక చెల్లెలు ఉండేదిట. అంటే వినూకి మేనత్తన్నమాట. ఆవిడ పెద్దింట్లో మెట్టి సుఖపడాలని వాళ్ల అమ్మా, నాన్న బోలెడు కట్నమిచ్చి సంపన్నుల ఇంటి కోడలిని చేశారట. కట్న కానుకలతో సరిపెట్టుకోకుండా వాళ్లు అస్తమానం ఆవిడని ఇంకా ఇంకా డబ్బు తెమ్మని పుట్టింటికి పంపుతుండేవారుట. ఆ సమయంలోనే మావయ్యగారి తండ్రికి వ్యాపారంలో నష్టం వచ్చిందట. అందుకని వియ్యాల వారు అడిగినవి ఇవ్వలేకపోయారుట. అప్పుడే ఆ వినూ మేనత్త లక్ష్మికి మగపిల్లాడు పుట్టాడుట. లక్ష్మి అత్తవారొచ్చి, పాలు తాగుతున్న పురిటికందుని లక్ష్మి వద్దని వేడుకుంటున్నా వినకుండా, ‘వీడు మా వంశాంకురం. నువ్వు డబ్బు తీసుకుని మా ఇంటికొచ్చాకే వీణ్ణి చూసేదీ’ అంటూ బలవంతంగా లాక్కుపోయారుట. ఆ బాధ భరించలేక పచ్చి బాలెంతరాలు లక్ష్మి అస్తమానం పిల్లవాడి కోసం ఏడుస్తూ వుండేదిట. ఆ ఏడుపే ఆ పచ్చిబాలింతరాలిని ఉన్మాదంలోకి దింపిందిట. ఒక గుడ్డల మూట పట్టుకుని ‘నా బాబుని నేనివ్వను.. నేనివ్వను...’ అంటూ తిండీ తిప్పలూ లేకుండా హృదయ విదారకంగా ఏడ్చేదిట. ఎవ్వరినీ ఆఖరికి వాళ్ల అమ్మానాన్నల్ని కూడా ఆ గుడ్డల మూటని పట్టుకోను కూడా పట్టుకోనిచ్చేది కాదుట. ఆ గుడ్డల మూటే తన బిడ్డ అన్న భ్రమలోనే ఉండేదిట. డబ్బు సమకూర్చలేక ఆమెని అత్తింటికి పంపలేక పోయారుట తల్లిదండ్రులు. తను కన్నబిడ్డని మళ్లీ చూడలేకపోయిందిట వినూ మేనత్త లక్ష్మి. ఆ భ్రమలోనే ఆవిడ చనిపోయిందిట. ఇదంతా సరిగ్గా వినూకి ఎనిమిదేళ్లప్పుడు జరిగింది. తెలిసీ తెలియని వయసులో ఇంట్లో మేనత్త పిల్లవాడి కోసం ఏడిచే ఏడుపు వినూ మనస్సులో ముద్రపడిపోయింది. ఆ విషయం ఆమె మనసు పొరల్లో ఎక్కడ ఉందో కానీ మళ్లీ వినూకి డెలివరీ కోసం మత్తుమందు ఇస్తారన్నప్పుడు గుర్తొచ్చింది. తనకి మత్తుమందిచ్చేసి తన పాపని తీసికెళ్లిపోతారనే దృఢమైన అభిప్రాయం కలిగింది వినూకి. సాధారణంగా డెలివరీ అయ్యాక ఆడవారిలో కలిగే హార్మోన్ల మార్పు వల్ల, నరాల బలహీనతవల్ల, ఎక్కువగా మానసిక ఆందోళనకు గురవ్వడం వల్లా వినూ తనని తాను సంబాళించుకోలేక పోయింది. అందుకని అలా ప్రవర్తించింది. అంతేకానీ, వినూ పిచ్చిది కాదమ్మా...’ వినూ గురించి అంత వివరంగా చెపుతున్న వినయ్‌ని విచిత్రంగా చూసింది జానకి.
శేఖర్ ముందుకొచ్చాడు. ‘అవును జానకి. ఈ పదిహేను రోజుల్లోనూ రోజూ బావగారితో మాట్లాడుతున్నాను కదా... ఆయన చెప్పారు. సైకియాట్రిస్ట్ వినూని బాగా పరీక్షించి కారణం ఇదీ అని చెప్పగానే స్పెషలిస్ట్ వినూ తొందరగా కోలుకోడానికి మంచి మందులు ఇచ్చాడుట. కానీ మందులతో మాత్రమే పని జరగదనీ, దానితోపాటు ఇంట్లో వారి సహకారం వినూకి చాలా కావాలనీ చెప్పాడుట. వాళ్లు కౌన్సిలింగ్‌లో ఎలా చెప్పారో అలాగే జాగ్రత్తగా వినూ మనసు కుదుటపడేటట్టు చూసుకున్నారుట ఇన్నాళ్లూ. నెమ్మది నెమ్మదిగా మార్పు కనపడుతోందిట. ఇప్పుడు పాపని వాళ్ల అమ్మా నాన్నలకి అందిస్తోందిట వినూ. వాళ్లతోపాటే మన సహకారం కూడా ఉంటే తొందరగా మనుషుల్లో పడుతుందని డాక్టర్లు చెప్పారుట. అందుకనే వినూని ఇక్కడికి తీసుకొస్తున్నామని చెప్పారు బావగారు’ అన్న శేఖర్ మాటలకి తలెత్తి చూసింది జానకి.
వినయ్ తల్లి కాళ్ల దగ్గర కూర్చున్నాడు. ‘అమ్మా... భార్యని ఎలా చూసుకోవాలో నువ్వే ఇదివరకు ఎన్నోసార్లు చెప్పావు. ఏ తండ్రీ కూడా కూతురికి తింటి పెట్టుకోలేక పెళ్లి చేసి పంపించడూ, మన వంశం నిలబెట్టడానికి ప్రాణంలా పెంచుకున్న కూతుర్ని మన ఇంటికి పంపుతాడూ, మన ఇంటికొచ్చిన లక్ష్మిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి అని నాతో ఎన్నిసార్లు చెప్పలేదమ్మా నువ్వూ. మన ఇంటి లక్ష్మికి ఇప్పుడు నిజంగా మన సహకారం కావాలమ్మా. ఇలాంటి పరిస్థితుల్లో వున్న భార్యని రావద్దనడం ధర్మమేనంటావా.. నువ్వే చెప్పు?’ అనడిగాడు.
‘కానీ...’ అనబోతున్న జానకిని మరి మాట్లాడనివ్వకుండా ‘వాళ్లు రేపొస్తున్నారు. అత్తవారింట్లో వారు కూడా వినూ కోలుకోవడానికి సహకరించాలని డాక్టర్ చెప్పారుట. మనింటికొచ్చిన పిల్లని మనం చూసుకోవాలి కదా జానకీ’ అన్నాడు శేఖర్. ‘కానీ.. నాకు తెలీదే.. భయమేస్తుంది..’ అంది కంగారుగా జానకి ఆ రోజు వినూని చూసిన దృశ్యం మర్చిపోలేక పోతోందామె.
‘ఏం ఫరవాలేదు. వినూ అమ్మా నాన్నా కూడా వస్తున్నారు. అంతా వున్నాం కదా...’ అన్నాడు శేఖర్. జానకి మనసుకి సర్ది చెప్పుకుందుకు ప్రయత్నిస్తోంది.
మర్నాడు సాయంకాలం ఫ్లైట్‌కి చంటిపిల్లని, వినూని తీసుకుని వచ్చారు భాస్కర్, సుగుణలు. భయంభయంగా కోడలిని పరిశీలించింది జానకి. పదిహేను రోజుల క్రితం కన్న కాస్త మార్పు కనపడుతోంది కానీ వినూ కళ్లల్లో ఆ బెదురూ, భయం పోలేదు. తల్లి భుజాల చుట్టూ చెయ్యి వేసి నెమ్మదిగా నడిపిస్తూ లోపలికి తీసుకువస్తే అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చింది. నాలుగేళ్లపాటు మసిలిన ఇంటిని కూడా కొత్త ఇంటిని చూస్తున్నట్టు గోడలూ, కప్పూ చూడడం మొదలుపెట్టింది. క్షణక్షణం చంటిపిల్లని తనకి మరీ దగ్గరగా పొదువుకుంటోంది.
డాక్టర్లు హారతివ్వడం, దిష్టి తియ్యడం లాంటివి చెయ్యొద్దనీ, దానివల్ల అనుమానాలు తలెత్తవచ్చు అన్నారని భాస్కర్ దగ్గర విని ముందే శేఖరం చెప్పడం వల్ల జానకి అలాంటివేమీ చెయ్యలేదు. సుగుణ నెమ్మదిగా వినూని ఆమె గదిలోకి తీసికెళ్లింది. ఒక్క సుగుణకి తప్పితే మరింకెవ్వరి చేతికి పాపనివ్వటం లేదు వినూ.
శేఖర్ కుటుంబ సభ్యులందరికీ భాస్కర్ డాక్టర్ చెప్పినవన్నీ వివరించాడు. వినీతతో ఏం మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో అన్నీ విపులంగా చర్చించాడు. అవన్నీ విన్న జానకి భయపడింది.
అది చూసిన సుగుణ ‘వదినగారూ, వినూకి పూర్తిగా నయమయ్యేదాకా మేం కూడా ఇక్కడే ఉంటామండీ. డాక్టర్లు అమ్మానాన్నలతోపాటూ, భర్తా, అత్తమామల సహకారం కూడా ఉంటే తొందరగా కోలుకుంటుందని అన్నారని ఇలా తీసుకొచ్చాం. అసలు ఇలా వస్తామని అడగడానికి మేం చాలా భయపడ్డాం. చాలామంది ఈ పిల్ల పిచ్చిదై పోయిందీ, మాకొద్దూ అని మీరు అంటారని చెప్పారు. కానీ మీరు పెద్ద మనసు చేసుకుని మాకు ఈ అవకాశం ఇచ్చారు. మీకు ఎన్ని దండాలు పెట్టినా తక్కువే...’ అంటూ కళ్లనీళ్లతో రెండు చేతులూ ఎత్తి దండం పెట్టింది.
జానకి కంగారుగా, ‘అయ్యయ్యో... అలా అనకండి. వినూ ఈ ఇంటి కోడలు. మా వినయ్ మనసులో వున్న వినూ కోసం ఏదైనా చేస్తాను. కానీ, ఏం చెయ్యాలో ఏమిటో కాస్త మీరు చెపుతుండండి.. అంతే..’ అంది.
జానకి మాటలకి సుగుణ మనసు నిండిపోయింది. ఇంత మంచి అత్తగారు వినూకి దొరికినందుకు పొంగిపోయింది. ‘ఏమీ లేదండీ... ఎవరైనా పాపని తన దగ్గరి నుంచి తీసికెళ్లిపోతారనే భయం వినూలో పోవాలంటే ఇంట్లో వున్న వాళ్ల మీద వినూకి నమ్మకం కలగాలని డాక్టర్ చెప్పాడు. ఈ వారం రోజుల్లోనూ మా మీద నమ్మకం కలిగింది వినూకి. ప్రసవానంతరం ఇలా నరాల బలహీనతలకీ, హార్మోన్ల మార్పుల్లో వచ్చే మానసిక రుగ్మతలకీ మందులు వాడుతున్నప్పుడే, చుట్టూ వున్న వాళ్లు కూడా వినూకి మానసిక ధైర్యం అందిస్తే తొందరగా కోలుకుంటుందని డాక్టర్ చెప్పారు. వినూకి కన్నబిడ్డ పాపమీదున్న మమకారం శారీరక, మానసిక బలహీనతల వల్ల ఇలా పిచ్చిలా మారిందని అన్నారు’
సుగుణ మాటలు వింటున్న జానకి ఆమె మాటలని మధ్యలోనే ఆపింది. ‘పిచ్చి అనకండి వదినగారూ. అది కన్న కడుపు మీద ప్రేమ. ఆ ప్రేమ వ్యక్తపరిచే తీరు మనకి పిచ్చిలా కనిపిస్తోందంతే. మీరు వినీతని తీసుకుని వస్తున్నారన్న విషయం తెలిసి శ్రేయోభిలాషుల మనుకునే కొంతమంది మమ్మల్ని కూడా హెచ్చరించారు. సైకియాట్రిస్ట్ దగ్గర వైద్యం చేయించుకుంటున్న పిల్లని మీరు ఇంటికి తెచ్చేకోక్కర్లేదూ, పిచ్చిదంటే ఏ కోర్టైనా సులభంగా విడాకులు ఇచ్చేస్తుందీ, ఆ పిచ్చిదాన్ని వదిలించుకుని మరో అమ్మాయిని తెచ్చుకోండీ అంటూ ఉచిత సలహాలు కూడా ఇచ్చారు. అలా కుదరదన్నామని మమ్మల్నీ పిచ్చివాళ్లనే అన్నారు. లోకం తీరు అంతేనండీ.. పిచ్చికీ, ప్రేమకీ తేడా తెలుసుకోలేరు. నాకేదో గొప్ప మనసుందని మీరు అంటున్నారు కానీ.. కాదండీ... నేనూ అమ్మనే.. నా కొడుకు మీద నాకూ పిచ్చి ప్రేమే. అందుకనే ఆ కొడుకు కోసమే వినూని దగ్గరికి రానిచ్చాను. ఆ కొడుకు సంతోషం కోసం ఏవైనా చేస్తాను. ఆ ప్రేమకి మీరు మరో పేరు పెట్టుకుంటే పిచ్చి అనే అనుకోండి. ప్రేమ పిచ్చీ ఒకటే...’ అంటున్న జానకికి చేతులెత్తి దండం పెట్టింది సుగుణ.

జి.ఎస్.లక్ష్మి
2-2-23/7/1, బాగ్‌అంబర్‌పేట్
హైదరాబాద్-500 013
040-27425306
9908648068

-జి.ఎస్.లక్ష్మి 040P27425306 9908648068